ఘోల్ చేపలు
జాతీయం
ఘోల్ చేపలు
అరేబియా సముద్రంలో ఆగస్టు 28న చేపల వేటకు వెళ్లిన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ముర్బే గ్రామానికి చెందిన మత్స్యకారుడు చంద్రకాంత్‌కు అరుదైన ఘోల్ చేపలు లభించాయి. చాలా ఔషధ గుణాలున్న ఈ చేపల శాస్త్రీయ నామం ‘ప్రొటోనిబియా డయాకంథస్’. చంద్రకాంత్‌కు దొరికిన 157 చేపలు రూ.1.33 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి. వీటిని ‘బంగారు గుండె చేపలు’ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో జీవిస్తాయి.
మేరా కామ్ మేరా మాన్
పంజాబ్ ప్రభుత్వం ‘మేరా కామ్ మేరా మాన్’ పథకాన్ని ఆగస్టు 31న ప్రారంభించింది. దీని ద్వారా ఆ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. రూ.90 కోట్ల వ్యయంతో 30,000 మంది యువత లక్ష్యంగా దీనిని ప్రారంభించారు.
పార్క్ పేరు మార్పు
అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ నేషనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్క్‌గా ఆగస్టు 31న మార్చింది. ఈ పార్కును తరుణ్‌గొగోయ్ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో నిర్మించారు.
న్యాయమూర్తుల ప్రమాణం
సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమితులైన 9 మంది జస్టిస్‌లు ఆగస్టు 31న ప్రమాణం చేశారు. ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది జస్టిస్‌లు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. జస్టిస్ శ్రీనివాస్ ఓక్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బెంగళూరు వెంకటరామయ్య (బీవీ) నాగరత్న, జస్టిస్ చుడలాయిల్ తేవన్ రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పమిడిఘంటం శ్రీనర్సింహులు, జస్టిస్ బేలా మాధుర్య త్రివేదిలతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు.
ఎత్తయిన రహదారి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారి లద్దాక్‌లో ఆగస్టు 31న ప్రారంభించారు. లేహ్‌ని పాంగాంగ్ సరస్సుని అనుసంధానిస్తూ ఈ రహదారిని నిర్మించారు. దీనిని 18,600 అడుగుల ఎత్తులో కేలా పాస్ గుండా నిర్మించారు.
ప్రభుపాద జయంతి
శ్రీల ప్రభుపాద 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 125 రూపాయల స్మారక నాణేన్ని సెప్టెంబర్ 1న ఆవిష్కరించారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు అయిన శ్రీల ప్రభుపాద 1896, సెప్టెంబర్ 1న కలకత్తాలో జన్మించారు.
మరమిత్ర యాప్
ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కావేరి కాలింగ్ బృందం రూపొందించిన ‘మరమిత్ర’ యాప్‌ను సెప్టెంబర్ 2న ఆవిష్కరించారు. కర్ణాటకలోని కావేరి నదీ పరీవాహక జిల్లాల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. కావేరి పరిసరాల్లోని తొమ్మిది జిల్లాలకు చెందిన రైతుల వ్యవసాయ భూముల్లో మొక్కలు నాటుతారు. ఈ మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా భూసారాన్ని కాపాడుతాయి.
బిమ్స్టెక్ సమావేశాలు
భారత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ప్రారంభమైన 8వ బిమ్స్టెక్ సమావేశాలు సెప్టెంబర్ 3న ముగిశాయి. ఈ సమావేశానికి అగ్రికల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం ఎండీ, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మొహపాత్ర అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ దేశాలు పాల్గొన్నాయి.
అంతర్జాతీయం
దోహాలో దీపక్ మిట్టల్
భారత రాయబారి దీపక్ మిట్టల్ తాలిబన్ నేత షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో ఖతార్ రాజధాని దోహాలో ఆగస్టు 31న సమావేశమయ్యారు. అఫ్గాన్‌లో భారత వ్యతిరేక శక్తులను అడ్డుకోవడం, భారతీయులను స్వదేశానికి తీసుకురావడం తదితర అంశాలపై చర్చించారు. ఇరుపక్షాల మధ్య ఈ స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి.
అమెరికా బలగాల ఉపసంహరణ
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా చివరి విమానం సీ-17 కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆగస్టు 31న వెళ్లింది. దీంతో అఫ్గాన్‌లో 20 ఏండ్ల అమెరికా మిలిటరీ మిషన్ ముగిసింది.
రామన్ మెగసెసె అవార్డు
రామన్ మెగసెసె అవార్డు 2021 విజేతలను అవార్డు కమిటీ ఆగస్ట్ 31న ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన సూక్ష్మరుణ సంస్కర్త ముహమ్మద్ అంజద్ సాఖిబ్, టీకా సైంటిస్ట్ ఫిర్దౌసి ఖాద్రి (బంగ్లాదేశ్), పర్యావరణవేత్త రాబర్టో బాలన్ (ఫిలిప్పీన్స్), ఆగ్నేయాసియాలోని నిర్వాసితులకు తమ జీవితాలను పునర్మించుకోవడానికి సహాయం చేస్తున్న మానవతావాది స్టీవెన్ మున్సీ (అమెరికా), ఇండోనేషియాలోని సమస్యలపై డాక్యుమెంటరీ తీసిన జర్నలిస్ట్ వాచ్డాక్ (ఇండోనేషియా)లకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును 1957, ఆగస్టు 31న ఫిలిప్పీన్స్‌లో స్థాపించారు. ఈ అవార్డు కింద రూ.50 లక్షల నగదు అందజేస్తారు.
జపద్-2021
జపద్ 2021 పేరుతో రష్యా మిలిటరీ ఎక్సర్సైజ్ను నిజ్నియ్లో సెప్టెంబర్ 3న ప్రారంభించింది. ఉగ్రవాదుల కార్యకలాపాల నిర్మూలనపై సాయుధ దళాలు విన్యాసాలు నిర్వహించాయి. ఈ విన్యాసాల్లో భారత్, మయన్మార్, ఇండోనేషియా, శ్రీలంక, ఉజ్బెకిస్థాన్, వియత్నాం, తుర్క్మెనిస్థాన్, తజికిస్థాన్, మంగోలియా, సెర్బియా, కిర్గిజిస్థాన్, అర్మేనియా, బెలారస్, నేపాల్, కజకిస్థాన్లతో పాటు చైనా, పాకిస్థాన్ కూడా పాల్గొన్నాయి.
యూనివర్సిటీల ర్యాంకింగ్
ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏటా ప్రకటించే ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్ సూచీని సెప్టెంబర్ 2న విడుదల చేసింది. ఈ జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ (యూకే) మొదటిస్థానంలో నిలువగా.. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూఎస్ఏ) 2, హార్వర్డ్ యూనివర్సిటీ (యూఎస్ఏ) 2 (3), స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ (యూఎస్ఏ) 4, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (యూకే) 5, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూఎస్ఏ) 5 (6)వ స్థానాల్లో నిలిచాయి. భారత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూర్ (ఐఐఎస్సీ) 301-350 మధ్య ర్యాంకింగ్ దక్కించుకుంది. ఐఐటీ రోపర్, జేఎస్ఎస్ అకడమిక్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ 351-400 మధ్య, ఐఐటీ ఇండోర్ 401-500 మధ్య, అలగప్ప, థాపర్ యూనివర్సిటీలు 501-600 మధ్య ర్యాంకులు సాధించాయి.
వార్తల్లో వ్యక్తులు
రజనీశ్ కుమార్
హాంకాంగ్ కేంద్రంగా ఉన్న ఆసియా విభాగానికి రజనీశ్ కుమార్‌ను నియమించినట్లు హెచ్ఎస్బీసీ (ది హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆగస్టు 30న ప్రకటించింది. గతంలో ఆయన ఎస్బీఐకి చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన ఎస్బీఐలో 40 ఏండ్లు పనిచేసి 2020లో రిటైరయ్యారు.
ఆకాంక్ష కుమారి
దేశంలోనే తొలి అండర్‌గ్రౌండ్ మహిళా మైనింగ్ ఇంజినీర్‌గా ఆకాంక్ష కుమారి నియమితులయ్యారని అధికారులు ఆగస్టు 31న ప్రకటించారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆమె బిర్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిండ్రీ)లో మైనింగ్ ఇంజినీరింగ్ చేశారు.
జేబీ మొహపాత్ర
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ-కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి) చైర్మన్‌గా జగన్నాథ్ బిద్యాధర్ (జేబీ) మొహపాత్ర సెప్టెంబర్ 1న నియమితులయ్యారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన ఇదివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఇన్‌కంట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పనిచేశారు.
క్రీడలు
స్టువర్ట్ బిన్నీ
భారత క్రికెట్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్‌కు ఆగస్టు 31న రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు భారత్ తరఫున 6 టెస్టులు (194 రన్స్, 3 వికెట్లు), 14 వన్డేలు (230 రన్స్, 20 వికెట్లు), 3 టీ20లు (35 రన్స్, 1 వికెట్) ఆడాడు.
డేల్ స్టెయిన్
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచిన డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) ఆగస్టు 31న క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి రెండేండ్ల క్రితమే తప్పుకునన డేల్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 93 టెస్టుల్లో 439, 125 వన్డేల్లో 196, 47 టీ20ల్లో 64 వికెట్లు మొత్తం 699 వికెట్లు తీశాడు. 95 ఐపీఎల్ మ్యాచుల్లో 97 వికెట్లు పడగొట్టాడు.
విరాట్ కోహ్లీ
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్లో 23 వేల పరుగులు పూర్తిచేశాడు. సెప్టెంబర్ 2న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని చేరాడు. ఈ పరుగులు 490 ఇన్నింగ్స్‌లలో సాధించడం విశేషం. 23 వేల పరుగుల మైలురాయిని సచిన్ 522 ఇన్నింగ్స్‌లో, రికీ పాంటింగ్ 544, జాక్వెస్ కలిస్ 551, కుమార్ సంగక్కర 568, రాహుల్ ద్రవిడ్ 576, మహేల జయవర్ధనే 645 ఇన్నింగ్స్‌లలో సాధించారు.
రొనాల్డో రికార్డు గోల్స్
పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. సెప్టెంబర్ 2న నిర్వహించిన ప్రపంచకప్ అర్హత రౌండ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై రెండు గోల్స్ చేశాడు. ఈ గోల్స్‌తో మొత్తం 111 గోల్స్ చేసి ఇరాన్ మాజీ ఆటగాడు అలీ దేయి చేసిన 109 గోల్స్‌ను అధిగమించాడు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు