15వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నితిశ్
జాతీయం
15వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నితిశ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగస్టు 15న 15వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో దేశంలో 15 సార్లు జాతీయ జెండాను ఎగురవేసిన ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఎక్కువ రోజులు సీఎంగా ఉన్న ఆ రాష్ట్ర తొలి సీఎం శ్రీకృష్ణ సిన్హా నెలకొల్పిన రికార్డును నితీశ్ అధిగమించారు.
భారత్-యూకే ఒప్పందం
గగనతలం నుంచి గగనతలంలోని స్వల్ప దూరాలను ఛేదించే అధునాతన క్షిపణుల (అడ్వాన్స్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్-ఏఎస్ఆర్ఏఏఎం) తయారీ, పరీక్షలు, మరమ్మతుల విషయంలో యూకేతో భారత్ ఆగస్టు 16న ఒప్పందం కుదుర్చుకుంది. యూకేకు చెందిన క్షిపణుల డిజైనింగ్, ఉత్పత్తుల సంస్థ ఎంబీడీఏతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లైసెన్సింగ్‌పై ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ శివారులోని భానూరులో నూతనంగా ఏఎస్ఆర్ఏఏఎం ఉత్పత్తి కేంద్రాన్ని బీడీఎల్ ఏర్పాటు చేయనుంది.
కృషి తంత్ర
‘కృషి తంత్ర’ అనే వెబ్‌సైట్‌ను నాబార్డు సీఈవో నీరజ్ కుమార్ ఆగస్టు 17న ప్రారంభించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించడం, భూసార పరీక్షల ప్రయోజనాల్ని వివరించడం వంటి అంశాలను పొందుపరుస్తూ వారి కోసం ఈ వెబ్‌సైట్‌ను నాబార్డు రూపొందించింది.
సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ
దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లను పరీక్షించి, అనుమతులు జారీచేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ (సీడీఎల్)ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 16న వెల్లడించింది. ఇందుకు హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)ని సీడీఎల్‌గా ఎంపిక చేశారు. ఒకటి పుణెకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ (ఎన్‌సీసీఎస్) కాగా మరొకటి హైదరాబాద్‌లోని ఎన్ఐఏబీ. దేశంలో తయారైన ప్రతీ బ్యాచ్ వ్యాక్సిన్‌ను ఈ కేంద్రాల్లో పరీక్షించి, ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధ్రువీకరించుకోవాలి.
బులియన్ ఎక్సేంజ్
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ప్రయోగాత్మక పద్ధతిలో అంతర్జాతీయ బులియన్ ఎక్సేంజీని ఆగస్టు 18న ప్రారంభించారు. ఐఎఫ్ఎస్సీ (ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ) వ్యవస్థాపక రోజు సందర్భంగా అక్టోబర్ 1 నుంచి బులియన్ ఎక్సేంజీ లైవ్ ట్రేడింగ్‌కు వేదిక కానుందని ఐఎఫ్ఎస్సీ చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు.
యుద్ధవిమానాలకు చాఫ్
శత్రు దేశాలు ప్రయోగించే రాడార్ గైడెడ్ క్షిపణుల నుంచి మన యుద్ధ విమానాలను కాపాడుకునేందుకు అధునాతన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు డీఆర్డీవో ఆగస్టు 19న ప్రకటించింది. దీనికి ‘అడ్వాన్స్ చాఫ్ మెటీరియల్ అండ్ చాఫ్ కాట్రిడ్జ్-118/1’ అని పేరుపెట్టింది. దీన్ని జోద్‌పూర్‌లోని డిఫెన్స్ ల్యాబ్, పుణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రిసెర్చ్ ల్యాబ్ (హెచ్ఈఎంఆర్ఎల్)లు అభివృద్ధి చేశాయి.
అంతర్జాతీయం
అఫ్గాన్‌కు సాయం నిలిపివేత
2021లో అఫ్గానిస్థాన్ అభివృద్ధికి కేటాయించిన 25 కోట్ల యూరోల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు జర్మనీ ఆగస్టు 17న వెల్లడించింది. మానవతా సాయం, రక్షణ సేవలకు అందించే సాయాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
అష్రాఫ్ ఘనీకి ఆశ్రయం
అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి ఆశ్రయం కల్పించామని యూఏఈ విదేశాంగ శాఖ ఆగస్టు 18న వెల్లడించింది. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించడంతో అష్రాఫ్ దేశం వదిలిపారిపోయారు. మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించామని యూఏఈ తెలిపింది.
ఐఎంఎఫ్
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి ఎలాంటి రుణాలు ఇవ్వబోమని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఆగస్టు 19న ప్రకటించింది. తాలిబన్ల పట్ల అంతర్జాతీయ సమాజం వైఖరికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. 1919, ఆగస్టు 19న బ్రిటిష్ పాలన నుంచి అఫ్గానిస్థాన్ స్వాతంత్య్రం పొందింది. అదేవిధంగా అఫ్గానిస్థాన్‌కు అన్ని రకాల ఆయుధాల విక్రయంపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది.
వార్తల్లో వ్యక్తులు
పవన్‌దీప్ రాజన్
పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్-12 విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచాడు. ఆగస్టు 15న 12 గంటలపాటు సాగిన ఈ పోటీలో గెలుపొందిన రాజన్‌కు రూ.25 లక్షల నగదు, ట్రోఫీ అందించారు.
ముహియిద్దిన్ యాసిన్
మలేషియా ప్రధాని ముహియిద్దిన్ యాసిన్ ఆగస్టు 16న రాజీనామా చేశారు. పార్లమెంట్ దిగువ సభలో మెజారిటీ కోల్పోవడంతో అధికారంలోకి వచ్చిన 18 నెలలకే వైదొలిగారు. దీంతో మలేషియాకు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా నిలిచారు.
సుల్తాన్ మహమూద్
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అధ్యక్షుడిగా సుల్తాన్ మహమూద్ ఆగస్టు 17న ఎన్నికయ్యాడు. పీవోకేలో గత నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుతో సుల్తాన్ 34 ఓట్లతో అధ్యక్షుడిగా నియమితులయ్యాడు.
అమ్రుల్లా సలేహ్
అఫ్గానిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఆగస్టు 17న ప్రకటించుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయినందున, అఫ్గాన్ రాజ్యాంగం ప్రకారం ఇలా అధ్యక్షుడిగా ప్రకటించుకునే అధికారం తనకుందని వెల్లడించారు.
శాంతి లాల్ జైన్
ఇండియన్ బ్యాంక్‌కు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవోగా శాంతి లాల్ ఆగస్టు 19న ఎన్నికయ్యారు. శాంతి లాల్ జైన్‌ను ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదించగా కేంద్ర మంత్రి వర్గ సంఘం ఆమోదం తెలిపింది. ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఎండీ పద్మజ ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు.
సబ్రీ యాకోబ్
మలేషియా నూతన ప్రధానిగా ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ ఆగస్టు 20న నియమితులయ్యారు. కొన్నిరోజులు క్రితం పడిపోయిన మొహియుద్దీన్ యాసిన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఈయన ఉప ప్రధానిగా పనిచేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం ఏ పార్టీకి లేకపోవడంతో ఆ దేశ రాజు సుల్తాన్ అబ్దుల్లా సబ్రీని ప్రధానిగా ఎంపిక చేశారు.
క్రీడలు
ఒలింపిక్స్ విజేతలకు సన్మానం
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆగస్టు 15న సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ వారిని సన్మానించారు. స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాకు రూ.75 లక్షలు, రజతం నెగ్గిన మీరాబాయి, రవి దహియాలకు రూ.50 లక్షల చొప్పున, కాంస్యాలు సాధించిన పీవీ సింధు, లవీనా, బజరంగ్ పునియాలకు చూ.25 లక్షల చొప్పున అందించారు. ప్రభుత్వం చేపట్టిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం (టాప్స్)’ను విస్తృతపర్చనున్నట్లు మంత్రి తెలిపారు. 2024, 28 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని టాప్స్‌లో మరింత మంది అథ్లెట్లకు చోటు కల్పించనున్నారు.
ఆర్చరీలో స్వర్ణం
ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నీలో రికర్వ్ జూనియర్ బాలుర టీమ్ విభాగం స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆగస్టు 15న నిర్వహించిన ఫైనల్ పోటీలో ధీరజ్, ఆదిత్య చౌదరి, పార్థ్ సాలుంకెతో కూడిన భారత జట్టు సాంజెస్, సొలెరా, సాంటోస్ (స్పెయిన్) జట్టుపై గెలుపొందింది. అంతేకాకుండా రికర్వ్ పురుషుల టీమ్, అండర్-18 మిక్స్డ్ టీం, జూనియర్ మహిళలు, జూనియర్ మిక్స్డ్ టీం విభాగాల్లో కూడా స్వర్ణ పతకాలు లభించాయి.
హాకీకి ఒడిశా స్పాన్సర్షిప్
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్లో ఆగస్టు 17న సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఒక్కో క్రీడాకారునికి రూ.10 లక్షల చొప్పున నగదును సీఎం నవీన్ పట్నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ భారత హాకీ జట్లకు మరో పదేండ్ల పాటు ఒడిశా స్పాన్సర్షిప్ చేస్తుందన్నారు.
రవీందర్‌కు రజతం
ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 61 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవీందర్ రజత పతకం సాధించాడు. రష్యాలోని ఉఫా నగరంలో ఆగస్టు 18న జరిగిన ఫైనల్లో 3-9తో రహ్మాన్ మూసా అమౌజాద్ (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు.
బిపాషాకు రజతం
ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ బిపాషా రజత పతకం సాధించింది. రష్యాలోని వుఫా నగరంలో ఆగస్టు 19న జరిగిన ఫైనల్ పోటీలో కైల్ వాకర్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.
నంబియార్ మృతి
భారత అథ్లెటిక్స్ దిగ్గజ కోచ్ ఓథయోతు మాధవన్ (ఓఎం) నంబియార్ ఆగస్టు 19న మరణించారు. 1932, ఫిబ్రవరి 16న జన్మించిన ఆయన 1985లో తొలి ద్రోణాచార్య అవార్డు పొందారు. ఆయన పీటీ ఉషకు కోచ్‌గా వ్యవహరించారు. 2021లో పద్మశ్రీ అందుకున్నారు.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు