‘క్యాట్’ను ఇలా క్యాచ్ చేద్దాం!
దేశంలో ఉన్న ఐఐఎంలతో పాటు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఢిల్లీ యూనివర్సిటీ), ముంబైలోని ఎన్ఐటీఐఈ తదితర అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాలయాలు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ఆధారంగా సీట్లను భర్తీ చేస్తాయి. ఆయా కళాశాలల్లో ఎంబీఏ చేయడం వల్ల పెద్ద సంస్థల్లో నిర్వహణ రంగంలో రాణించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. క్లిష్టంగా ఉండే ఈ పరీక్షను సరైన ప్రణాళికతో చదవడం ద్వారా మంచి స్కోర్ సాధించవచ్చు. క్యాట్‌ను నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి లెక్కిస్తే సుమారు 100 రోజులు పరీక్షకు సమయం ఉంది. పక్కా ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలి.
రెండు దశల్లో
- పరీక్ష ప్రిపరేషన్, ప్రాథమిక అంశాలపై పట్టు, ప్రాక్టీస్ టెస్టులు అనే రెండు కోణాల్లో సాగాలి. 20 నుంచి 30 రోజుల వ్యవధిలో ప్రాథమిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. పాఠశాల స్థాయి పుస్తకాల్లో ఉండే అర్థమెటిక్, బీజగణితం (ఆల్జీబ్రా), క్షేత్రగణితం (మెన్సురేషన్) తదితర అధ్యాయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఆ తర్వాత పరీక్షలు రాయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
పరీక్షలో ఉండే అంశాలు
- వెర్బల్ ఎబిలిటీ- రీడింగ్ కాంప్రహెన్షన్
- డేటా ఇంటర్‌ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
- మూడో అంశం అయిన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సమర్థంగా సిద్ధమైతే డేటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రాథమిక అంశాలు వచ్చినట్లే. పరీక్ష కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. అక్కడే స్క్రీన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. అంటే అభ్యర్థులు నుంచి తార్కిక జ్ఞానం కోరుతున్నారు తప్ప, సూక్ష్మీకరించే వేగాన్ని కోరుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతుంది. పదో తరగతి పరీక్షలో ఉండే అంశాలే క్యాట్‌లోనూ అడుగుతారు. అయితే తార్కికంగా (లాజికల్) ఆలోచన చేసేలా ప్రశ్నలు ఉంటాయి. తక్కువ సమయంలో ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అంటే వేగంగా ఆలోచించగల అభ్యర్థులు ఎక్కువ స్కోర్ సాధించగలుగుతారు.
సాధనే మార్గం
- మంచి స్కోర్ రావాలంటే సాధ్యమైనన్ని మాక్ పరీక్షలు రాయడమే మార్గం. ఒక్కో విభాగం ప్రిపరేషన్ తీరును పరిశీలిస్తే…
రీడింగ్ కాంప్రహెన్షన్
- ఒక ప్యాసేజీ ఇచ్చి దాని తర్వాత ప్రశ్నలు అడుగుతారు. ఆయా ప్యాసేజుల్లో వాక్యాలు పెద్దగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడుతారు. నిజానికి ఆయా వాక్యాలను చిన్నచిన్న వాక్యాలుగా విడదీసి అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఇంగ్లిష్‌లో ‘సబ్జెక్ట్+వెర్బ్+ఆబ్జెక్ట్’ అనే కోణంలో వాక్యాలు ఉంటాయి. వీటికి విశేషణాలు కలుపుతూ వాక్యాలను పెద్దవిగా చేస్తారు. ఈ నేపథ్యంలో వాటిని అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్యాసేజ్ పూర్తిగా అర్థమవుతుంది. ఇందుకు కేవలం ప్రాక్టీసే మార్గం. అంతర్జాతీయ, జాతీయ స్థాయి జర్నల్స్‌లో వచ్చే వ్యాసాలను చదవాలి. అలాగే ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు వెలువరించే వివిధ నివేదికలను చదువుతూ వాటిని అర్థం చేసుకోవాలి. వాటిలో ఏ కోణంలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో పరిశీలించగలగాలి. దీనివల్ల వొకాబులరీ పెరుగుతుంది, వేగంగా పెద్ద వాక్యాలను చిన్నవిగా మలుచుకొని అర్థం చేసుకొనేందుకు వీలుంటుంది. ఇది నిత్యం కొనసాగాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
- డేటా ఇంటర్ప్రిటేషన్కంటే ముందే ఈ అంశం సిద్ధం కావాలి. ఎందుకంటే ఇందులోని కొన్ని అధ్యాయాలు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు ప్రాథమిక అంశాలుగా ఉపయోగపడుతాయి. అర్థమెటిక్‌లోని సింపుల్, కాంపౌండ్ ఇ్రంటస్ట్, సంఖ్యా వ్యవస్థ, యావరేజెస్, పర్సంటేజెస్, టైం అండ్ వర్క్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సూక్ష్మీకరణల ప్రాధాన్యం ఉండే లెక్కలు కాకుండా, తార్కిక ప్రాధాన్యం ఉండే ప్రశ్నలు అడుగుతారు. సాధారణంగా బ్యాంక్ క్లర్క్‌లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో ఎక్కువగా సూక్ష్మీకరణకు ప్రాధాన్యం ఇచ్చే ప్రశ్నలు ఉంటాయి. క్యాట్‌లో పూర్తిగా భిన్నం. ఇక్కడ విశాలమైన ఆలోచన పరిధిని పెంచుకోవాలి. ప్రశ్న కోణాలను సొంతంగా ఆలోచించే తత్వాన్ని అలవరుచుకోవాలి.
ఉదాహరణకు కింది లెక్కను పరిశీలిస్తే…
- సమస్య: 10 మంది కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేయగలిగితే, అదే పనిని 5గురు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు. దీనిని క్యాట్‌కు సిద్ధమయ్యేవారు ఆలోచించాల్సిన తీరు.
- 1. 10 మంది కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు. అయితే 15 రోజుల్లో పూర్తి చేయడానికి అదనంగా ఎంతమంది అవసరం?
- 2. 10 మంది 20 రోజుల్లో పని పూర్తి చేస్తారు. అయితే 4 రోజులు అందరూ పాల్గొని తర్వాత 5 మంది నిష్క్రమించారు. మిగిలిన పనికి అదనంగా ఎంత సమయం అవుతుంది?
- 3. 10 మంది 20 రోజుల్లో పని చేయగలరు, అయితే వారు చేసే పనిలో 2/3వ వంతు సామర్థ్యం తగ్గింది. ఎంత అదనపు సమయం అవసరం?
- ఇలా విభిన్న కోణాల్లో ప్రశ్నలు వేసుకోవాలి. అప్పుడు తార్కిక పరిజ్ఞానం పెరుగుతుంది. క్యాట్‌లో అన్ని ఈ తరహా ప్రశ్నలే అడుగుతారు. ఇది అన్ని అధ్యాయాలకు అనువర్తనం చేయాలి.
లాజికల్ రీజనింగ్
- అరేంజ్మెంట్స్, డైరెక్షన్స్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ ద్వారా తేలికగా చేయవచ్చు. ఇన్ఫరెన్సెస్, కన్‌క్లూజన్స్ తదితర అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. వీటి సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలి.
ఈసారి ఐఐఎం అహ్మదాబాద్
- పరీక్షను నిర్వహిస్తుంది.
- నవంబర్ 28న పరీక్ష ఉంటుంది.
- పరీక్ష ఫీజు- జనరల్ రూ 2200/-, రిజర్వేషన్ అభ్యర్థులు రూ 1100/-
- చెల్లించాలి.
- డిగ్రీలో 50% మార్కులతో పాస్ కావాలి (ఎస్సీ, ఎస్టీలకు 45% ఉంటే చాలు)
- దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 4 నుంచి ప్రారంభమయ్యింది.
- రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ- సెప్టెంబర్ 15
- పరీక్షలో కొన్ని మల్టిపుల్ చాయిస్, మరికొన్ని నాన్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. నాన్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానం కంప్యూటర్‌పైనే టైప్ చేయాలి.
- Tags
- nipuna
Previous article
టీఎస్ డీఈఈసెట్-2021
Next article
నోటిఫికేషన్స్- సాహసికులకు.. త్రివిధ దళాల పిలుపు !
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు