దారికివచ్చిన ‘మాస్టర్’
అమెరికా కంపెనీ ‘మాస్టర్ కార్డ్ పేమెంట్ సర్వీసెస్’ కు చెందిన కార్డుల జారీని జూలై 22 నుంచి ఆర్బీఐ నిషేధించింది. 2018 ఏప్రిల్‌లో డేటా లోకలైజేషన్‌కు సంబంధించి ఆర్బీఐ జారీచేసిన నియమాలను ఈ కంపెనీ అమలుచేయకపోవడమే దీనికి కారణం. దీంతో దేశంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మాస్టర్ డెబిట్, క్రెడిట్ కార్డులను తమ వినియోగదారులకు ఇవ్వకుండా నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే దీనివల్ల మాస్టర్ కార్డులను వినియోగిస్తున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
దేశంలో ప్రస్తుతం పలు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నాలుగు రకాలైన కార్డులను జారీ చేస్తున్నాయి. అవి.. వీసా, మాస్టర్, మ్యాస్ట్రో, రూపే కార్డులు. ఇటీవల డేటా లోకలైజేషన్ నిబంధనలను పాటించనందున మే 1 నుంచి అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కంపెనీల కార్డులను కూడా ఆర్బీఐ నిషేధించింది. దీనివల్ల దేశ డెబిట్, క్రెడిట్ కార్డుల ఎకో సిస్టంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇది విదేశీ కంపెనీల ప్రభావాన్ని క్రమేణా తగ్గిస్తూ, స్వదేశీ కార్డ్ కంపెనీలను ఆత్మ నిర్భర భారత్ లక్ష్యం వైపు అడుగులు వేయించే ప్రయత్నంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డెబిట్, క్రెడిట్ కార్డులను జారీచేసే విదేశీ కంపెనీలు వినియోగదారులకు సంబంధించిన లావాదేవీల డేటాను నిక్షిప్తం చేయాలని ఆర్బీఐ 2018 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత, వినియోగదారుల సమాచార గోప్యతను కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఆరు నెలల సమయం ఇచ్చినప్పటికీ ఈ నియమాలను విదేశీ కంపెనీలు పాటించలేదు. ప్రస్తుతం అమెరికాకు చెందిన రెండో అతిపెద్ద కంపెనీ అయిన ‘మాస్టర్’ కొంత డేటాను భారత్‌లో, మెజారిటీ డేటాను దేశ సరిహద్దులు దాటి సర్వర్లలో నిక్షిప్తం చేస్తున్నది. దేశ నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీఇన్) ధ్రువీకరించిన స్వదేశీ ఆడిటర్‌ను నియమించకపోవడం, డేటా లోకలైజేషన్ ఫ్రేమ్ వర్క్‌కు సంబంధించి అదనపు వివరాల నివేదికను ఏప్రిల్ 2021 లోపు సమర్పించమని ఆర్బీఐ ఆదేశించినప్పటికీ ఆదేశాలను బేఖాతరు చేయడం నిషేధానికి దారితీశాయి.
బ్యాంకులు నాలుగురకాల డెబిట్, క్రెడిట్ కార్డులను జారీచేస్తాయి. ‘రూపే’ కార్డు మన దేశానికి చెందినది. దీన్ని ఆర్బీఐకి చెందిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2012 మార్చి 26న తీసుకువచ్చింది. అంతకంటే ముందు కార్డుల జారీ విదేశీ కంపెనీల చేతుల్లో ఉండేది. ప్రస్తుతం దేశంలో 90.2, 6.2 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం నవంబర్ 2020 వరకు వివిధ బ్యాంకులు జారీచేసిన మొత్తం రూపే డెబిట్ కార్డుల సంఖ్య 60.3 కోట్లు. దీంతో దేశ డెబిట్ కార్డుల మార్కెట్లో 60 శాతం వాటాతో రూపే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. కేంద్రం ‘జన్‌ధన్ యోజన’లో భాగంగా ప్రారంభించిన బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు దాదాపు 30.6 కోట్ల ‘రూపే’ కార్డులను జారీచేసింది.
ఆర్బీఐ తీసుకున్న చర్యలతో ‘మాస్టర్’ కంపెనీ దారికివచ్చింది. అవసరమైన సమాచారాన్ని ఆర్బీఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో నిషేధానికి గురైన ‘మాస్టర్’తో పాటు ‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్’, ‘డైనర్స్ క్లబ్’ కంపెనీలకు తిరిగి అనుమతిస్తుందా లేకుంటే ‘ఆత్మనిర్భర భారత్’లో భాగంగా మోదీ ప్రభు త్వం స్వదేశీ కార్డు అయిన ‘రూపే’ను ప్రోత్సహిస్తుందా అనేది వేచిచూడాలి..!
డాక్టర్ ఎం.మల్లారెడ్డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు