ఔటర్ బయటే బెస్ట్
- బడ్జెట్లోనే సొంతమవుతున్న ప్లాట్లు
- అందుబాటులో సకల సౌకర్యాలు
భాగ్యనగరంలో భూముల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజల ‘సొంతిల్లు’ ఆశలు అడుగంటుతున్నాయి. ఈ క్రమంలో ‘ఔటర్’ వెలుపల విరివిగా భూములు లభిస్తుండగా, అదే స్థాయిలో వెంచర్లూ వెలుస్తున్నాయి. బడ్జెట్లోనే ఓపెన్ ప్లాట్లను అందిస్తూ, సామాన్యుల ‘సొంతింటి కల’కు బీజం వేస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో భూములను కొనుగోలు చేయడమంటే మాటలుకాదు. కోర్‌సిటీలో ధరలు భారీగా పెరిగిపోతుండగా, ఒక్కో ప్లాటుకోసం కనీసం అరకోటిపైనే వెచ్చించాల్సి వస్తున్నది. ఇంకొంచెం క్లాస్ ఏరియాలో కావాలనుకుంటే ‘కోటి’కిపైగా సమర్పించుకోవాల్సిందే. దీంతో సామాన్య ప్రజలకు మహానగరంలో ‘సొంతిల్లు’ కల.. కలగానే మిగిలిపోతున్నది. అయితే, జీహెచ్ఎంసీ పరిధిని దాటితే తక్కువ ధరల్లోనే ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉంటున్నాయి. ‘ఔటర్ రింగురోడ్డు’కు అవతలివైపున ఉన్న ప్రాంతాల్లో బడ్జెట్లోనే భూములు కొనుక్కొని, సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నగరం నలుమూలలా శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రతిచోటా అభివృద్ధి పనులు చేపడుతుండగా, అన్ని ప్రాంతాల్లోనూ సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారు శివారు ప్రాంతాలవైపు మొగ్గు చూపుతున్నారు.
ఆసక్తి ఎక్కువే
ప్రధాన నగరంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లోనూ అభివృద్ధి రేటు ఎక్కువగానే ఉంటున్నది. అనేక కొత్త కంపెనీలు కూడా వెలుస్తున్నాయి. రద్దీగా ఉండే కోర్ సిటీ కంటే, రింగురోడ్డుకు బయట ఉండటమే మేలని కొత్తతరం భావిస్తున్నది. ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానం భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం కనిపిస్తుండగా, శివారు ప్రాంతాల్లో స్థిరపడేందుకు ఉద్యోగులూ ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడ భూముల లభ్యత కూడా ఎక్కువగా ఉండటంతో రియల్టర్లు భారీ స్థాయిలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య, మధ్య తరగతివర్గాలను దృష్టిలో పెట్టుకొని 125 గజాల నుంచి 150 గజాల స్థలాలను బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉంచుతున్నారు. స్థలాన్ని, ప్రాంతాన్నిబట్టి రూ.25 లక్షలనుంచి ప్లాట్లు అందిస్తున్నారు.
అంతటా అభివృద్ధి
హైదరాబాద్ నలుదిక్కులా విస్తరిస్తున్న కొద్దీ శివారు ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు మెరుగు పడుతున్నాయి. ముఖ్యంగా నగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగురోడ్డుకు చేరుకునేందుకు మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు పలు జాతీయ రహదారులు, మరో 33 వరకూ రేడియల్ రోడ్లు ఉండటంతో రాకపోకలు సాగించడం సులువుగా మారింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ చొరవతో చుట్టుపక్కల మున్సిపాలిటీలూ అభివృద్ధి చెందుతున్నాయి. మహానగరానికి ఏ మాత్రం తీసిపోని విధంగా, శివారు ప్రాంతాల్లోనూ సకల సౌకర్యాలూ అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ విద్యా సంస్థలు, మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లు, భారీ మాల్స్ వెలుస్తున్నాయి. భారీ పరిశ్రమలతోపాటు కొన్ని ఐటీ సంస్థలు కూడా శివార్లకు తరలి వస్తున్నాయి. ఫలితంగా అక్కడే నివాసముంటూ, అక్కడే ఉద్యోగాలు చేసేందుకు అనుకూలంగా శివారు ప్రాంతాలు మారాయి. ఈ క్రమంలో ఔటర్ రింగురోడ్డును, ఇంటర్‌చేంజ్‌లను దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రాజెక్టులను చేపడుతున్నాయి.
-బరిగెల శేఖర్
రూ.15వేల లోపే..
ఓఆర్ఆర్ సమీపంలోని పలు వెంచర్లలో ప్లాట్లు బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితంగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఐటీ కారిడార్ ప్రాంతంలోని ఓఆర్ఆర్ సమీపంలో గజం ధర రూ.40వేల నుంచి రూ.60వేల దాకాఉంటే, శంషాబాద్ చుట్టుపక్కల గజం ధర రూ.15వేల లోపే ఉన్నది. మైలార్‌దేవ్‌పల్లి నుంచి శంషాబాద్ వెళ్లే దారిలోని జల్పల్ మున్సిపాల్టీలో రీసేల్ ప్లాట్లు గజం ధర రూ.12వేల నుంచి రూ.15వేల దాకా పలుకుతున్నాయి. ఇదే ప్రాంతంలో కొత్తగా హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం చేసిన లేఅవుట్లలో గజం ధర రూ.20వేల దాకా ఉన్నది. ఇక బడంగ్‌పేట, మీర్‌పేట, తుక్కుగూడ, తుర్కయాంజాల్, ఆదిభట్ల మున్సిపాల్టీల్లో రూ.15వేలకు అటు ఇటుగా పలుకుతున్నది. ఇలాంటి ప్రాంతాల్లో వ్యక్తిగత ఇండ్లు నిర్మించుకోవడం కోసమే అధికంగా ప్లాట్లు కొంటున్నారని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
సానుకూలతలు
- హైదరాబాద్ శివార్లలో ఖాళీ స్థలాలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. నగరానికి నలు దిక్కులా ఎక్కడ కావాలన్నా ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉన్నది. ప్రాంతాన్ని, బడ్జెట్‌ను బట్టి 100 గజాలనుంచి 150 గజాలు, 200 గజాలు, 250 గజాలు, 300 గజాలలో ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉంటున్నాయి. ఇందులో చాలావరకూ రీసేల్ ప్లాట్లే ఉన్నాయి.
- ఏదైనా ప్రాజెక్టు ప్రారంభంలో ఉంటే తక్కువ ధరకు ప్లాటు రావడంతోపాటు నచ్చిన దిక్కు(తూర్పు, ఉత్తరంఫేసింగ్)లో ఉన్నవాటిని ఎంచుకోవచ్చు.
- జీహెచ్ఎంసీ పరిధిని మినహాయిస్తే ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఉన్న శివారు ప్రాంతాలన్నీ వివిధ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలుగానే ఉన్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ముఖ్యంగా సువిశాలమైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు లాంటివి ఏర్పాటు చేసేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నది.
- స్థలం ఉంటే ఇంటి నిర్మాణం చేసి ఇచ్చేందుకు బిల్డర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. మెటీరియల్తోసహా అన్నిటినీ వారే సమకూర్చుకుంటున్నారు. ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉండేవారికి ఇది ఎంతో అనుకూలం.
సంఖ్య పెరిగింది..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐటీ కారిడార్‌వైపు ఉన్న శివారు ప్రాంతాలు చాలావేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఐటీ కంపెనీల్లో పనిచేసే వారంతా ఎక్కువగా నార్సింగి, మణికొండ మున్సిపాల్టీలతోపాటు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. నార్సింగి, మంచిరేవుల ప్రాంతానికి సమీపంలోనే గంధంగూడలో బడ్జెట్లో వ్యక్తిగత ఇండ్లు కూడా నిర్మితమవుతున్నాయి. ప్రభుత్వపరంగా మౌలిక వసతులను వేగంగా కల్పిస్తున్నారు. దీంతో చాలామంది శివార్లకు తరలి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలుదారులు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది.
బొద్రమోని శ్రీనివాస్,
స్థిరాస్తి వ్యాపారి,
గంధంగూడ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు