బైహెతెన్ జలవిద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లను ప్రారంభించిన చైనా
తెలంగాణ
ఫంక్షనల్ వర్టికల్స్ రిపోర్ట్
రాష్ట్రంలో 2020-21కు గాను 17 రకాల విధులు (ఫంక్షనల్ వర్టికల్స్) అమలు ఫలితాల రిపోర్టును డీజీపీ మహేందర్ రెడ్డి జూన్ 29న విడుదల చేశారు. దీనిప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు పోలీస్‌స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ 2, రామగుండం పోలీస్ స్టేషన్ 3, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ 4వ స్థానాల్లో నిలిచాయి.
పుస్తకావిష్కరణ
‘ఇండియాకు ఉమ్మడి పౌర చట్టం-యూనిఫామ్ సివిల్ కోడ్- ఏకరీతి పౌర చట్టం ఎందుకు అవసరం?’ అనే పుస్తకాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య జూన్ 27న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ న్యాయవాది, సామాజికవేత్త జయ వింధ్యాల రాశారు.
జోనల్ వ్యవస్థ
రాష్ట్రంలో జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదం తెలపగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30న ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం వికారాబాద్ జిల్లా చార్మినార్ జోన్, నారాయణపేట జిల్లా జోగులాంబ జోన్, ములుగు జిల్లా కాళేశ్వరం జోన్లో ఉంటాయి. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ కొత్త జోనల్ విధానాన్ని వర్తింపజేయనుంది.
జాతీయం
పుస్తకావిష్కరణ
‘అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్’ పుస్తకాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జూన్ 26న విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ రాశారు.
అంబేద్కర్ స్మారక కేంద్రం
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నవులో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ స్మారక సాంస్కృతిక కేంద్ర భవనానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూన్ 29న శంకుస్థాపన చేశారు. 1.34 ఎకరాల్లో నిర్మించనున్న ఈ స్మారక కేంద్రంలో 25 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 750 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అత్యాధునిక ఆడిటోరియం, వర్చువల్ మ్యూజియం, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, వసతిగృహం ఏర్పాటు చేయనున్నారు.
బొంబాయ్ సమాచార్ పత్రిక
బొంబాయ్ సమాచార్ పత్రికను ప్రారంభించి జూలై 1 నాటికి 200 ఏండ్లు పూర్తయ్యింది. దీనిని పార్శీ పండితుడు ఫర్దూన్జీ మర్జ్బన్ స్థాపించారు.
బనిహాల్-కాజీగండ్ సొరంగం
జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిపై బనిహాల్-కాజీగండ్ మధ్యలో కొత్తగా నిర్మించిన సొరంగం నుంచి 24 గంటలు ప్రయోగాత్మకంగా ట్రాఫిక్‌ను జూలై 2న అనుమతించారు. 8.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని రూ.21 వేల కోట్లతో నిర్మించారు. దీనివల్ల జమ్ములోని బనిహాల్ నుంచి దక్షిణ కశ్మీర్‌లోని కాజీగండ్ మధ్య రోడ్డు దూరం 16 కి.మీ. తుగ్గుతుంది.
అంతర్జాతీయం
జల విద్యుత్ కేంద్రం
ప్రపంచంలోనే అత్యంత పెద్దవాటిలో రెండోదిగా పేర్కొనే బైహెతెన్ జలవిద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లను చైనా జూన్ 28న ప్రారంభించింది. మొత్తం 16 యూనిట్లకు గాను మిగిలిన 14 యూనిట్లను 2022, జూలై నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనాలోని సిచువాన్, యునాన్ రాష్ర్టాల సరిహద్దుల్లో త్రీగోర్జెస్ డ్యామ్‌ను నిర్మిస్తున్న యాంగ్జే నదిపై దీనిని నిర్మిస్తున్నారు. త్రీగోర్జెస్ తర్వాత ప్రపంచంలో అత్యంత భారీ జలవిద్యుత్ కేంద్రంగా ఇది నిలవనుంది.
బిల్ మెలిండా గేట్స్ విరాళం
ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ రూ.15,607 కోట్ల (2.1 బిలియన్ డాలర్లు) విరాళాన్ని జూన్ 30న ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో ఈ విరాళాన్ని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆర్థిక సాధికారత పథకాలకు వెచ్చిస్తారు.
గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్
ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రూపొందించిన ‘గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ (జీసీఐ)-2020 జూన్ 30 విడుదలైంది. దీనిలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. బ్రిటన్, సౌదీ అరేబియాలు సంయుక్తంగా రెండో స్థానంలో, మూడో స్థానంలో ఎస్తోనియా నిలిచాయి. ఈ జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది.
జీ-20 సమావేశం
జీ-20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జూలై 1న నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై ఆంక్షలు, అవసరానికి మించి వ్యాక్సిన్ ఉంచుకోవడం వంటి చర్యలు వీడి పేద దేశాలకు సహాయం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ సమావేశాన్ని ఇటలీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంస్థను 1999, సెప్టెంబర్ 25న స్థాపించారు.
చైనా శతాబ్ది ఉత్సవాలు
చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) శతాబ్ది ఉత్సవం తియాన్మెన్ స్కేర్‌లో జూలై 1న నిర్వహించారు. ఆ దేశాధ్యక్షుడు, సీపీసీ ప్రధాన కార్యదర్శి, చైనా మిలిటరీ అధినేతగా మూడు పదవుల్లో ఉన్న షీ జిన్‌పింగ్ వీటిని ప్రారంభించారు. 1921లో ఆరంభమైన చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అధికార పగ్గాలు చేపట్టింది.
వార్తల్లో వ్యక్తులు
హిమాన్షు రావు
తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తనయుడు 15 ఏండ్ల హిమాన్షు రావుకు 2021కు గాను అంతర్జాతీయ డయానా పురస్కారం జూన్ 28న లభించింది. ‘శోమ’ అనే పేరుతో గజ్వేల్ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసుఫ్‌ఖాన్‌పల్లి గ్రామాల స్వయం సమృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ అవార్డు దక్కింది. బ్రిటన్‌లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్ రాజకుమారి డయానా పేరిట ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలందించే 9-25 ఏండ్లలోపువారికి ఈ అవార్డును అందజేస్తారు.
సాయినాథ్
ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు జపాన్ దేశానికి చెందిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం ‘ఫుకుఒకా గ్రాండ్ ప్రైజ్-2021’ జూన్ 28న లభించింది. భారతదేశ వ్యవసాయం, గ్రామీణుల సమస్యలు, స్థితిగతులను వెలుగులోకి తెచ్చినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద రూ.30 లక్షలు అందజేస్తారు.
అమితాబ్ కాంత్
నీతి ఆయోగ్ సీఈవోగా 1980 బ్యాచ్ కేరళ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్‌ను మరో ఏడాది కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం జూన్ 29న నిర్ణయించింది. ఆయన 2022, జూన్ 30 వరకు పదవిలో ఉంటారు. ఆయన పదవిని పొడిగించడం ఇది మూడోసారి. 2016, ఫిబ్రవరి 17న రెండేండ్ల కాలానికి ఆయన నియమితులయ్యారు. 2015, జనవరి 1న ఆయన బాధ్యతలు స్వీకరించారు.
వేణుధర్ రెడ్డి
ఆలిండియా రేడియో (ఏఐఆర్) డైరెక్టర్ జనరల్‌గా నూకల వేణుధర్ రెడ్డి ఢిల్లీలో జూన్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా ఎర్జెర్లకు చెందినవారు. ఈయన ఆలిండియా ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ 1988 బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఏఐఆర్ ప్రిన్స్‌పల్ డైరెక్టర్ జనరల్ పదవిలో ఉన్న ఆయనకు డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆలిండియా రేడియోలో అత్యున్నత పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తి ఆయన.
షాలినా డి కుమార్
భారత సంతతి వ్యక్తి షాలినా డి కుమార్ అమెరికా మిచిగాన్‌లోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు జడ్జిగా జూన్ 30న నియమితులయ్యారు. ఈ పదవిని అధిష్టించిన తొలి దక్షిణాసియా సంతతి మహిళగా ఆమె రికార్డులకెక్కారు.
గీతా గోపీనాథ్, కమలేశ్ లుల్లా
అమెరికా అందించే ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్’ అవార్డు భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్, కమలేశ్ లుల్లా అందుకున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ముఖ్య ఆర్థికవేత్తగా గీత, నాసా సైంటిస్ట్‌గా కమలేశ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కార్నెగీ కొర్పొరేషన్ ఆఫ్ న్యాయార్క్ స్వచ్ఛంద సంస్థ 34 మంది వలసదారులను అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజు జూలై 4న ఈ అవార్డును అందించారు.
క్రీడలు
వెర్స్టాపెన్
జూన్ 27న నిర్వహించిన స్టిరియన్ గ్రాండ్ ప్రి రేసు విజేతగా రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ నిలిచాడు. రేసులో లూయీస్ హామిల్టన్ రెండో స్థానంలో, బొటాస్ మూడో స్థానంలో నిలిచారు.
ఎరియన్ నైటన్ రికార్డు
జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పేరిట ఉన్న పదిహేడేండ్ల రికార్డును ఎరియన్ నైటన్ తిరగ రాశాడు. జూన్ 28న నిర్వహించిన అమెరికా ఒలింపిక్ ట్రయల్స్‌లో 200 మీటర్ల పరుగును 19.84 సెకన్లలో ముగించి బోల్ట్ పేరిట ఉన్న అండర్-20 రికార్డును నైటన్ బద్దలుకొట్టాడు. 2004లో ఉసేన్ బోల్ట్ 19.93 సెకన్లలో రేసు ముగించి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
మిథాలీ రికార్డు
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కెరీర్ కలిగిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించిందని అధికారులు జూన్ 29న వెల్లడించారు. 1999, జూన్ 26న ఐర్లాండ్‌తో తొలి వన్డే ఆడిన మిథాలీ జూన్ 27న ఇంగ్లండ్‌తో ఆడిన ఆటతో అంతర్జాతీయ క్రికెట్లో 22 ఏండ్లు పూర్తిచేసుకుంది. 24 ఏండ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సచిన్ మాత్రమే 24 ఏండ్ల మైలురాయిని అధిగమించాడు. సచిన్ వన్డే కెరీర్ 22 ఏండ్ల 91 రోజులు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు