మయన్మార్ సంక్షోభంపై తీర్మానం
జాతీయం
యోగాపై పుస్తకం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 8 ఏండ్ల కవలలు దేవయాని, శివరంజని ‘సూర్య నమస్కారాలు’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విడుదల చేశారు.
టాయ్‌కథాన్
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కండ్లకోయలో జూన్ 22న ప్రారంభమైన టాయ్‌కథాన్ జూన్ 24న ముగిసింది. ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, విలువలను పరిచయం చేసే గేమ్స్, వినూత్నమైన ఆట వస్తువుల అభివృద్ధి కోసం కేంద్రం ‘టాయ్‌కథాన్-2021’ పేరుతో ఓ కార్యక్రమాన్ని జనవరి 5న ప్రారంభించింది.
భారత్-అమెరికా నేవీ విన్యాసాలు
హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికా జూన్ 23, 24 తేదీల్లో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్నందున ఇరుదేశాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఈ విన్యాసాలు చేపట్టాయి. అమెరికా నుంచి అణ్వాయుధ విమాన వాహక నౌక ‘రొనాల్డ్ రీగన్, ఎఫ్-18 తరహా యుద్ధ విమానాలు, యూఎస్ఏ హస్లే, ఈ-2సీ హకేయే విమానాలు, క్షిపణులను ధ్వంసం చేసే హల్సీ, క్షిపణి నౌక ‘షిలోహ్లు పాల్గొన్నాయి. భారత్ తరఫున ఎయిర్‌క్రాఫ్ట్ యుద్ధవిమానాలు పీ-91, మిగ్-29కే, ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ తేజ్ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.
గ్రీన్ హైడ్రోజన్
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై జూన్ 23, 24 తేదీల్లో రెండురోజుల పాటు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హైడ్రోజన్ అత్యంత ప్రాముఖ్యం, డిమాండ్, శక్తిసామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చర్చించారు. దీనిలో బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆగ్నెస్ ఎం డా కోస్టా (బ్రెజిల్), కోవలెవ్ ఆండ్య్రూ (రష్యా), ప్రకాశ్‌చంద్ర మైథాని (భారత్), ఫు తియాని (చైనా), మక్గాబో హెచ్ సిరి (సౌతాఫ్రికా) పాల్గొన్నారు..
కశ్మీర్ నేతలతో ప్రధాని
జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ ఢిల్లీలో జూన్ 24న సమావేశమయ్యారు. 2019, ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్ముకశ్మీర్ నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన తొలి సమావేశం ఇది. ఈ సమావేశానికి పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, బీజేపీ సహా ఎనిమిది పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న నేతల డిమాండ్‌ను కేంద్రం అంగీకరించింది.
అంతర్జాతీయం
మయన్మార్ సంక్షోభంపై తీర్మానం
మయన్మార్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఓ తీర్మానాన్ని జూన్ 19న ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా మయన్మార్‌తో పాటు 119 దేశాలు మద్దతు తెలిపాయి. మయన్మార్‌కు సమీపంలో ఉన్న భారత్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, లావోస్, నేపాల్, థాయిలాండ్, రష్యాలతో కలిపి 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ సంక్షోభ పరిష్కారానికి అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఏషియాన్) చేస్తున్న కృషికి మద్దతిస్తామని యూఎన్వో దౌత్య కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు.
5.5 కోట్ల టీకాలు
ప్రపంచ దేశాలకు 5.5 కోట్ల డోసుల కరోనా టీకాలను కేటాయించనున్నట్లు అమెరికా జూన్ 21న ప్రకటించింది. ఇందులో భారత్, బంగ్లాదేశ్ లాంటి ఆసియా దేశాలకు 1.6 కోట్ల డోసులను ఇస్తారు. అమెరికా ఇదివరకే 2.5 కోట్ల డోసులను పలు దేశాలకు కేటాయించింది. దీంతో మొత్తం 8 కోట్ల డోసులకు చేరింది.
తోకచుక్క
సౌర కుటుంబంలో కొత్తగా ఓ భారీ తోకచుక్కను సైంటిస్టులు జూన్ 22న కనుగొన్నారు. దీనికి ‘2014 యూఎన్271’ అని పేరు పెట్టారు. దీని వెడల్పు 100 నుంచి 370 కి.మీ. మధ్య ఉంటుంది. ఇది సూర్యుడి దిశగా మరింత చేరువై, 2031 నాటికి శని గ్రహ కక్ష్యలోకి ప్రవేశించవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.
ఎస్సీవో సమావేశం
తజకిస్థాన్ రాజధాని డుషాంబేలో 8 దేశాలతో కూడిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సమావేశం జూన్ 23న నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హాజరయ్యారు. ఉగ్రవాదం, ప్రాంతీయ తీవ్రవాదం నిర్మూలనపై చర్చించారు. ఎస్సీవోలో భారత్, పాకిస్థాన్‌లు 2017లో సభ్యత్వం స్వీకరించాయి. 2001, జూన్ 15న దీనిని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బీజింగ్ (చైనా)లో ఉంది.
బుల్లెట్ రైలు
టిబెట్‌లో చైనా తొలిసారిగా బుల్లెట్ రైలును జూన్ 25న ప్రారంభించింది. రాజధాని లాసా నుంచి నింగ్చి వరకు ఈ రైలు మార్గం ఉంది. దూరం 435.5 కి.మీ.. ఖిన్షూయి-టిబెట్ రైల్వే మార్గం తర్వాత సిచువాన్-టిబెట్ రైల్వే మార్గం రెండోది.
బిల్‌గేట్స్ రాజీనామా
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ‘మిలిండా-గేట్స్’ ఫౌండేషన్ ట్రస్టీ పదవికి వారెన్ బఫెట్ జూన్ 23న రాజీనామా చేశారు. బెర్క్‌షైర్ హాత్ వే షేర్లను సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే లక్ష్యంగా రాజీనామా చేశారని తెలిపారు. ఈ 15 ఏండ్లలో ఈ ట్రస్ట్ ద్వారా 27 బిలియన్ డాలర్లను సేవా కార్యక్రమాల కోసం వినియోగించారు. ఇప్పటివరకు బఫెట్ 5 సేవా సంస్థలకు 41 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు.
వార్తల్లో వ్యక్తులు
సయ్యద్ ఇబ్రహీం రైసీ
ఇరాన్ అధ్యక్షుడిగా సయ్యద్ ఇబ్రహీం రైసీ జూన్ 19న ఎన్నికయ్యారు. ఆ దేశ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖొమేనీ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఎన్నికల్లో రైసీకి 1.78 కోట్ల ఓట్లు వచ్చాయి. అతి సంప్రదాయవాది అయిన రైసీ ఆ దేశ న్యాయవ్యవస్థ అధిపతిగా పనిచేశారు.
కిరణ్ అహూజా
అమెరికాలోని ‘ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (ఓపీఎం)’ అధిపతిగా భారత సంతతి వ్యక్తి కిరణ్ అహూజా జూన్ 23న ఎన్నికయ్యారు. సెనేట్‌లో నిర్వహించిన ఎన్నికల్లో ఇద్దరికి చెరో 50 ఓట్ల చొప్పున వచ్చాయి. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తన నిర్ణాయక ఓటును కిరణ్‌కు వేయడంతో ఆమె ఈ పదవికి ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపడుతున్న తొలి భారతీయ అమెరికన్‌గా కిరణ్ నిలిచారు. ఓపీఎం ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలను చూస్తుంది.
పొన్నమ్మాళ్
ప్రముఖ కర్ణాట క సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ గ్రహీత పరసాల బీ పొన్నమ్మాళ్ జూన్ 22న మరణించారు. ఎనిమిది దశాబ్దాలుగా కొన్ని వందల సంగీత కచేరీలు చేశారు. కేరళలోని వలియశాలలో ఆమె జన్మించారు. 1940లో చారిత్రక స్వాతి తిరునాల్ సంగీత కళాశాలలో చేరిన మొదటి విద్యార్థినిగా ఆమె ఖ్యాతి పొందారు.
మెకాఫీ
‘మెకాఫీ’ యాం టీ వైరస్ సృష్టికర్త జాన్ మెకాఫీ జూన్ 23న మరణించారు. అమెరికా పౌరుడైన అతడు పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ అయి స్పెయిన్ జైలులో ఉన్నారు. ఆయనను అమెరికాకు అప్పగించవచ్చని స్పెయిన్ నేషనల్ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. అతడిపై అభియోగాలు రుజువైతే 30 ఏండ్ల వరకు జైలు శిక్ష పడేది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అధికారులు వెల్లడించారు.
క్రీడలు
ఫ్రెంచ్ గ్రాండ్ ప్రి
ఫ్రెంచ్ గ్రాండ్ ప్రి టోర్నీని రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకున్నాడు. జూన్ 20న జరిగిన రేసులో బ్రిటన్ స్టార్ హామిల్టన్‌ను వెనక్కి నెట్టి వెర్స్టాపెన్ విజయం సాధించాడు.
మల్లీశ్వరి
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ)గా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జూన్ 22న నియమితులయ్యారు. ఈ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత తొలి వీసీగా ఆమె ఎంపికయ్యారు.
మన్‌ప్రీత్ సింగ్
2021 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే హాకీ జట్టు కెప్టెన్‌గా మన్‌ప్రీత్ సింగ్‌ను జూన్ 22న ఎన్నుకున్నారు. మూడోసారి ఒలింపిక్ ఆడనున్న మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత్ 2017లో ఆసియా కప్, 2018లో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
ఫిలాంత్రపిస్ట్స్ ఆఫ్ సెంచరీ
ఎడెల్‌గివ్ హురున్ ఫిలాంత్రపిస్ట్స్ ఆఫ్ సెంచరీ-50 (శతాబ్దపు దాతృత్వశీలురు) సూచీని హురున్ రిసర్స్, ఎడెల్‌గివ్ ఫౌండేషన్ సంయుక్తంగా జూన్ 23న విడుదల చేశాయి. ఈ జాబితాలో భారత పారిశ్రామిక పితామహుడు జెంషెడ్జీ టాటా మొదటిస్థానంలో నిలిచారు. జెంషెడ్జీ 102 బిలియన్ డాలర్ల (ఇప్పటి విలువ ప్రకారం 7.65 లక్షల కోట్లు)ను వితరణ చేశారు. బిల్‌గేట్స్ (74.6 బిలియన్ డాలర్లు) 2, వారెన్ బఫెట్ (37.4 బిలియన్ డాలర్లు) 3, జార్జ్ సోరోస్ (34.8 బి.డా) 4, జాన్ డి రాక్ఫెల్లర్ (26.8 బి.డా) 5వ స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో భారత్ నుంచి జెంషెడ్జీ తర్వాత అజీమ్ ప్రేమ్‌జీ (22 బి.డా) ఒక్కరే ఉన్నారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు