‘హిస్టరీ ఆఫ్ గోల్కొండ’ గ్రంథ రచయిత ఎవరు?
గతవారం తరువాయి..
మహ్మద్ కులీకుతుబ్ షా (1580-1612)
- ఇతడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా మూడో కుమారుడు.
- గొప్ప కళాభిమాని, నిర్మాత. ఇతడే నేటి హైదరాబాద్ నగర నిర్మాత.
- ఇతడు గొప్ప సాహిత్యాభిమాని. దక్కనీ, ఉర్దూ భాషల్లో దిట్ట. తెలుగు భాషలో కూడా మంచి పాండిత్యం కలవాడని కొందరు పండితులు పేర్కొన్నారు.
- ఇతని కలం పేరు ‘మానీల్’. ఇతని కవిత్వాలు ‘కులియత్ కులీ’ అనే పుస్తకంలో ఉన్నాయి.
- ఇతని కాలంలో సారంగ తమ్మయ్య ‘వైజయంతి విలాసం’, సబ్బటి కృష్ణమాత్యుడు ‘రత్నాకరం’లను రచించారు.
- ఇతని సేనాపతి ‘ఎక్లాస్ఖాన్’ అమీనాబాద్ తెలుగు శాసనాన్ని వేయించాడు.
- ప్రసిద్ధ చరిత్రకారుడైన హెచ్‌కే షేర్వాణీ తన రచన ‘హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాస్టీ’లో ఇతని కాలాన్ని ‘కల్చరల్ ఆఫ్ లిఫ్ట్’గా వర్ణించాడు.
- ఇతను ‘భాగ్యమతి’ అనే హిందూ స్త్రీని వివాహమాడాడు. ఈమెకు ‘హైదర్ మహల్’ అనే పేరు పెట్టారని ‘పెరిస్టా’ పేర్కొన్నాడు.
- ఇతను 1591లో హైదరాబాద్ (భాగ్యనగర్)ను నిర్మించాడు. ఇది ‘చించెల’ అనే గ్రామం నుంచి అభివృద్ధి చెందింది.
- భాగ్యమతి పేరుమీదగానే ఈ నగరాన్ని నిర్మించినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
- కానీ హైదరాబాద్‌లో ఉద్యానవనాలు (బాగ్) అధికంగా ఉండటమే దీనికి ‘బాగ్‌నగర్’ అనే పేరు వచ్చిందని ‘థెవ్నట్’ పేర్కొన్నాడు.
- హైదరాబాద్‌లో సంభవించిన ప్లేగును పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా ఇతను చార్మినార్‌ను 1591-94లో నిర్మించాడు.
- అంతేకాకుండా ఇతను హైదరాబాద్ నగరంలో దాద్ మహల్, గగన్ మహల్, దార్-ఉల్-షిఫా (ఆస్పత్రి), చార్‌కమాన్ మొదలైన నిర్మాణాలు చేపట్టాడు.
- ఇతని కాలంలోనే 1605లో డచ్‌వారు, 1611లో బ్రిటిష్‌వారు మచిలీపట్నంలో స్థావరాలు నిర్మించారు.
హైదరాబాద్ నగరం
- మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, నూతనంగా నిర్మించిన హైదరాబాద్ నగరం మధ్యయుగ దక్కన్‌లోనే ఒక ప్రఖ్యాత నగరంగా విశిష్ట మిశ్రమ సంస్కృతి (కాంపోజిట్ కల్చర్)కి కేంద్రంగా రూపుదిద్దుకొంది. ముఖ్యంగా దక్కన్‌లోని సమకాలీన షియా రాజ్యాల్లోకెల్లా గోల్కొండ రాజ్యం, దాని పాలకుడు ప్రజాభిమానాన్ని పొందారు.
- మహ్మద్ కులీ కుతుబ్.. మొఘల్, పర్షియా పాలకులతో స్నేహపూర్వక దౌత్య సంబంధాలకు విశేష కృషి చేసి సఫలీకృతుడయ్యాడు.
- ఇరాన్ దేశం నుంచి అనేకమంది కవులు, కళాకారులు, వర్తకులు మేధావులు ‘అఫాకీలు (వలసదార్లు)’గా దక్కన్కు ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు.
- వీరిలో ముఖ్యుడు ‘మీర్ మోమిన్ ఆస్తరబాదీ’. ఇతడు 1581లో మహ్మద్ కులీ కుతుబ్ షా కొలువులో చేరాడు. తన ప్రతిభను, విశ్వసనీయతను ప్రదర్శించి 1585 నాటికి సుల్తాన్ వద్ద పీష్వా పదవిని చేపట్టాడు. ఇతడు బహుముఖ మేధావి, అలీం, ఇంజినీర్, సూఫీ తత్వవేత్త, పరిపాలనవేత్త. హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికను, చార్మినార్ దాని పరిసర కూడళ్ల నిర్మాణ ప్రణాళికను మీర్ మోమిన్ ఆస్తరబాదీ రూపొందించి సుల్తాన్ ప్రశంసలు పొందాడు.
సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా (1612-26)
- ఇతను మహ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు. హైదరాబాద్‌కు ‘సుల్తాన్ నగర్’గా నామకరణం చేశాడు.
- ఇతని కాలంలో ‘మక్కా మసీద్’ నిర్మాణం ప్రారంభమైంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దీన్ని పూర్తిచేశాడు.
- ఇతని కాలంలో ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు హైదరాబాద్‌లో పర్యటించి మక్కా మసీద్ నిర్మాణం గురించి వివరించాడు.
- మక్కా నుంచి కొన్ని రాళ్లు, మట్టి తెప్పించి ఈ మసీదు నిర్మాణం చేపట్టారు. కాబట్టి దీనికి మక్కా మసీద్ అనే పేరు వచ్చింది.
- సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా శాంతిప్రియుడు. భగవద్భక్తి కలవాడు. యుద్ధాలు, వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, దౌత్యనీతిలో అతనికి అనుభవం శూన్యం.
- ఇతని ప్రధానమంత్రి మీర్ మోమిన్ ఆస్తరబాదీ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన ‘అల్లామా ఇబన్ ఇ ఖాతూన్ అమూలీ’ కుతుబ్ షాహీ రాజ్య పరిరక్షణ నిర్వహించాడు.
- ఇతని కాలంలో మొఘల్ రాయబారి ‘మీర్ మక్కి’ గోల్కొండ సుల్తాన్ దర్బార్‌ను సందర్శించాడు. గోల్కొండ సుల్తాన్ మొఘల్ చక్రవర్తి జహంగీర్‌తో స్నేహం కోరి సంధికి అంగీకరించాడు. దీనికి నిదర్శనంగా రూ.15 లక్షల విలువచేసే బహుమతులు మొఘల్ చక్రవర్తికి సమర్పించాడు.
- ఇతను స్వయంగా పర్షియన్ భాషలో గొప్ప పండితుడు. ఇతడు ఆధ్యాత్మిక, ధార్మిక భావాలతో కవిత్వం ‘జిల్లులా’ పేరుతో రాశాడు.
- పర్షియా రాజైన షా అబ్బాస్‌తో స్నేహసంబంధాలు కొనసాగించాడు. పర్షియా రాయబారి ‘హసన్-బేగ్-కిఫాకీ’ గోల్కొండ సుల్తాన్ ఆస్థానంలో రెండేండ్లు గౌరవ అతిథిగా గడిపాడు.
- సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా కాలంలో మీర్ మహ్మద్ ఆస్తరబాదీ ‘రిసాలా మికర్దాయ’ అనే గ్రంథాన్ని తూనికలు, కొలతలపై రచించాడు.
అబ్దుల్లా కుతుబ్ షా (1626-72)
- అబ్దుల్లా కుతుబ్ షా తన తండ్రి మరణానంతరం పన్నెండేండ్ల చిన్నవయస్సులోనే గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు.
- ఇతని తల్లి ‘హయత్బక్ష్ బేగం’ సంరక్షణలో ఇతడి పరిపాలన కొంతకాలం కొనసాగింది.
- ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యంపై మొఘల్ చక్రవర్తులు షాజహాన్, ఔరంగజేబ్ నిరంతర దండయాత్రలు చేశారు. గోల్కొండ రాజ్యం రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా ఇతని కాలంలో బలహీనమైంది.
- అబ్దుల్లా కుతుబ్ షా షాజహాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకొని ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని, లక్షల విలువైన బహుమతులను షాజహాన్‌కు ఇచ్చాడు.
- కోహినూర్ వజ్రం కృష్ణా డెల్టా కల్లూరు అనే ప్రాంతంలో దొరికిందని ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ పేర్కొన్నాడు.
- కానీ కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కోహినూర్ వజ్రం గోల్కొండ వజ్రపు గనుల్లో దొరికింది.
- అబ్దుల్లా కుతుబ్ షా గోల్కొండలో ఆంగ్లేయులు యధేచ్ఛగా వ్యాపారం చేసుకోడానికి బంగారు ఫర్మానా 1636లో జారీచేశాడు.
- ఇతని కాలంలో క్షేత్రయ్య మువ్వపదాలు రచించాడు. క్షేత్రయ్య బిరుదు శృంగార పదకవి.
- ఇతని కాలంలో గోల్కొండ రాజ్యంలోని అధికారులు ముఠాలుగా విడిపోయారు. స్వార్ధబుద్ధితో వ్యవహరించారు. దీనివల్ల రాజ్యం ప్రమాదకర పరిస్థితికి చేరిందని ‘సిద్దిఖీ’ చరిత్రకారుడు తన రచన ‘హిస్టరీ ఆఫ్ గోల్కొండ’లో పేర్కొన్నాడు.
అబుల్ హసన్ తానీషా (1672-87)
- గోల్కొండ కుతుబ్ షాహీ పాలకుల్లో అబుల్ హసన్ తానీషా చివరివాడు. ఇతడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌కు, మరాఠ యోధుడైన శివాజీకి సమకాలికుడు.
- ఇతని కాలంలో గోల్కొండ రాజ్యంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఔరంగజేబ్ దాడులకు గోల్కొండ సుల్తాన్ పరాజితుడై, గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.
- ఇతని గురువు ‘షారాజు కట్టల్’ ఇతనికి తానీషా (భోగి) అనే బిరుదు ఇచ్చాడు.
- ఇతని కాలంలో కంచర్ల గోపన్న (భక్త రామదాసు) పాల్వంచకు తహసీల్దారుగా ఉండేవాడు. కంచర్ల గోపన్న తాను వసూలు చేసిన శిస్తును ఖజానాకు పంపకుండా భద్రాచలంలో శ్రీరాముని దేవాలయం నిర్మించాడు.
- దీంతో కంచర్ల గోపన్న గోల్కొండ కోటలో బందించబడి తర్వాత విడుదలయ్యాడు.
- తానీషా పాల్వంచ, శంకరగిరి గ్రామాలను భద్రాచలం శ్రీరాముని దేవాలయ నిర్వహణకు దానంగా ఇవ్వడమే కాకుండా అధికారికంగా రాజ్యం తరఫున ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పట్టువస్ర్తాలు సమర్పించాడు. ఇదే ఆచారం నేటికీ కొనసాగుతుంది.
- తానీషా కాలంలో రామదాసు దాశరథీ శతకం, రామదాసు కీర్తనలు, సింగనాచార్యుడు నిరోష కావ్యం రచించాడు.
ఔరంగజేబ్ గోల్కొండ రాజ్యం ఆక్రమణ
- తానీషా సమర్థవంతంగా రాజ్యాధికారాన్ని చెలాయించడానికి కృషిచేశాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దండయాత్రలను చివరివరకు ధైర్యంగా ఎదిరించాడు. పరమత సహనం కలవాడు.
- అక్కన్న, మాదన్న, కంచర్ల గోపన్న మొదలైనవారు ఇతని అధికారులుగా పనిచేశారు. తన ప్రజల రక్షణ కోసం చివరివరకు పోరాడాడు. మొఘల్ సేనలను సుమారు 18 నెలల పాటు ధైర్యంగా ఎదిరించిన ధీశాలి ఇతడు.
- ఇతను మరాఠ చక్రవర్తి శివాజీతో స్నేహసంబంధాలు కొనసాగించాడు. ఇతని కాలంలో అక్కన్న, మాదన్నలు గోల్కొండ రాజ్య సుస్థిరతకు కృషిచేశారు.
- అక్కన్న సైన్యాధిపతిగా, మాదన్న ప్రధానిలుగా ఇతని కాలంలో నియమితులయ్యారు. అంతర్గత కుట్రల వల్ల 1686లో అక్కన్న, మాదన్నలు హత్య చేయబడ్డారు.
- అబ్దుల్లా ఫణి అనే కుతుబ్ షాహీ అధికారి నమ్మకద్రోహం చేసి గోల్కొండ దుర్గ ద్వారాన్ని ఔరంగజేబ్ సేనలకు తెరిచాడు. దీంతో కుతుబ్ షాహీ రాజధాని, గోల్కొండ దుర్గాలను మొఘల్ సేనలు ఆక్రమించాయి.
- అబ్దుల్ రజాక్ లౌరీ అనే సేనాపతి తానీషా తరఫున వీరోచిత పోరాటం చేసి మరణించాడు. ఔరంగజేబ్ తానీషాను మొదట బీదర్‌లో అక్కడి నుంచి దౌలతాబాద్‌లో బందీగా ఉంచాడు.
- 12 ఏండ్లు బందీగా జీవించి చివరికి తానీషా దౌలతాబాద్ కోటలోనే 1699లో మరణించాడు. గోల్కొండ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది.
- తెలంగాణ ప్రజానీకం మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. ఔరంగజేబ్ తన వైస్రాయ్‌ల ద్వారా గోల్కొండను పరిపాలించాడు.
కుతుబ్‌షాహీల పరిపాలన
- దక్కన్లో గోల్కొండ కేంద్రంగా 1518 నుంచి 1687 వరకు పరిపాలించిన కుతుబ్‌షాహీలు గతంలో భారతదేశాన్ని ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన ఢిల్లీ సుల్తానుల కంటే గుల్బర్గా కేంద్రంగా పరిపాలించిన బహమనీ సుల్తానుల కంటే సమర్థవంతమైన ప్రజానురంజకమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించి ఆచరణలో పెట్టారు. తెలుగు ప్రజల విశ్వాసాన్ని ప్రేమను గెలిచి నేటి తరానికి చెందిన పాలకులకు మార్గదర్శకంగా నిలిచారు.
- కుతుబ్‌షాహీల పరిపాలన, రాజరిక వ్యవస్థ, స్వరూపం, స్వభావం గురించి సమకాలీన రచనలైన మీర్జా ఇబ్రహీం జుబేరి రచన ‘బసాతిన్-ఉస్-సలాతిన్ (దస్తూర్-ఉల్-అమల్)’ తెలియజేస్తుంది. ఇది కేవలం 13 పేజీల వివరణ. దీని రచయిత మీర్జా ఇబ్రహీం జుబేరి, గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా (1626-72) సమకాలికుడని ప్రసిద్ధ చరిత్రకారుడు హెచ్‌కే షేర్వాణీ తన ప్రసిద్ధ రచన ‘హిస్టరీ ఆఫ్ ది కుతుబ్‌షాహీ డైనాస్టీ’లో పేర్కొన్నాడు.
- కుతుబ్‌షాహీ సుల్తానులు ధర్మ ప్రభువులుగా, ప్రజాసేవకే అంకితమైన సుల్తానులుగా, పరమత సహనం కలవారిగా సుమారు 175 సంవత్సరాలు పరిపాలించారు. వారిని ఈ మార్గంలో నడిపించిన సూత్రాలు బసాతిన్ రచయిత వివరించినవే.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
- Tags
- Education News
Previous article
యూనిట్ పథకం ప్రయోజనం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు