‘కొత్తకోట యుద్ధం’ అని దేనిని అంటారు?
గతవారం తరువాయి..
కుమార (రెండో) సింగమ నాయుడు(1383-99)
అనపోతానాయుడి మరణానంతరం అతడి పెద్ద కుమారుడు రెండో సింగమ నాయుడు రాచకొండ సింహాసనం అధిష్టించాడు.ఇతనికి ‘కుమార సింగమనాయుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు’ అనే పేర్లు ఉన్నాయి.ఇతడు గొప్ప యోధుడు యువరాజుగా ఉన్నప్పుడే కళ్యాణదుర్గం (గుల్బర్గా జిల్లాలోని కళ్యాణి) జయించి అక్కడ విజయస్తంభం నాటి ‘కళ్యాణ భూపతి’ అనే బిరుదు పొందినట్లు ఆయన ఆస్థాన కవి విశ్వేశ్వరుని ‘చమత్కార చంద్రిక’ అనే గ్రంథంలో వివరించబడింది.
ఇతని కాలంలో వెలమలకు, విజయనగర రాజులకు మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధాలు జరిగాయి.
విజయనగర రాజైన రెండో హరిహర రాయల యువరాజైన బుక్కరాయల్ని వెలమలపైకి పంపగా, వెలమలకు సహాయంగా బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యంలోని కొత్తకొండను ముట్టడించి విజయనగర సేనాధిపతి అయిన సాళవరాయ దేవుణ్ని వధించడంతో వెలమలు విజయం సాధించారు. ఈ యుద్ధాన్నే ‘కొత్తకోట’ యుద్ధం అంటారు.తరువాత కుమార సింగమ నాయుడు దేవరకొండ పాలకుడైన ‘పెదవేదగిరి’తో కలిసి కళింగపై దండెత్తి రెడ్డిరాజుల ఆధీనంలో ఉన్న గోదావరి ప్రాంతాన్ని ఆక్రమించినట్లు అతని సింహాచల శాసనం తెలుపుతుంది.
బెండపూడి మొదలైన దుర్గాలను పెదవేదగిరి నాయుడు జయించినట్లు వెలుగోటి వారి వంశావళి వర్ణిస్తుంది.
1397లో మళ్లీ విజయనగర రాజు రెండో కొత్తకోట యుద్ధ పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని కృష్ణా-తుంగభద్ర అంతర్వేదిని సాధించే ఉద్దేశంతో బహమనీ రాజ్యంపైకి దండెత్తగా సుల్తాన్ ఫిరోజ్షాకు సహాయంగా వెలమ సైన్యాలు విజయనగర రాజ్యంపై దండెత్తాయి.ఈ సైన్యాలను వేదగిరి నాయుని కుమారుడైన రామచంద్రుడు నడుపుతూ కందనవోలు (కర్నూలు) రాజ్యాన్ని ప్రవేశించి కొల్లగొట్టాడు.
దీంతో వెలమలను శిక్షించడానికి రెండో హరిహరరాయలు తన కుమారుడు బుక్కరాయల్ని పంపగా, ఇతడు రామచంద్రుని ఓడించి ఓరుగల్లు నుంచి మెదక్ వరకుగల ప్రాంతాన్ని జయించినట్లు తెలుస్తుంది.ఈ ఓరుగల్లు దండయాత్రను బుక్కరాయని ఆస్థాన కవి ‘లక్ష్మణాచార్యుని వైద్యరాజ వల్లభం’ వర్ణిస్తుంది.చివరకు పానగల్లు దుర్గాలను కూడా బుక్కరాయలు ఆక్రమించాడు. ఫిరోజ్ షా సహాయంతో సింగమనాయుడు పానగల్లు దుర్గం రక్షణకు శక్తికొద్దీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
విజయనగర-బహమనీ, వెలమ-రెడ్డి రాజ్యాల మధ్యగల సంబంధాల్లో పానగల్లు దుర్గం కీలకపాత్ర వహించింది.
కుమార సింగమనాయుని సాహిత్య సేవ
ఇతడు గొప్ప కవి, పండిత పోషకుడు. ఇతనికి ‘సర్వజ్ఞ, సర్వజ్ఞ చూడామణి’ అనే బిరుదులున్నాయి. ఇతనే ‘రసార్ణవ సుధాకరం’ అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని, సర్వజ్ఞ దేవుని సంగీత రత్నాకరానికి ‘సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానం, కుమలయావళి అనే నామాంతరం గల రత్నపాంచాలిక అనే నాటకాన్ని రచించాడు. ఇతని ఆస్థాన పండితులైన ‘విశ్వేశ్వర కవి’ చమత్కార చంద్రికను, బొమ్మకంటి అప్పయామాత్యుడు అమరకోశానికి వ్యాఖ్యానం రాశాడు. ఈ రచనలన్నీ సంస్కృత భాషలో రాశారు.
రెండో అనపోతానాయుడు (1399-1421)
కుమార సింగమనాయుని మరణానంతరం అతని పెద్దకుమారుడు రెండో అనపోతానాయుడు రాచకొండ సింహాసనాన్ని అధిష్టించాడు.ఇతడికి ‘కుమార అన్నవోతనాడు, పిన్న అన్నమనాయుడు, ఇమ్మడి అనవోతానాయకుడు’ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి.ఇతడు గొప్ప పరాక్రమవంతుడు. అనేక యుద్ధాల్లో విజయం సాధించిన వీరుడు.ఇతడు విజయనగర సైన్యాలను ఎదిరించి మెదక్ దుర్గాన్ని రక్షించడమే కాకుండా, వారి ఆధీనంలో ఉన్న పానగల్లు దుర్గాన్ని సైతం కొల్లగొట్టాడు.
కర్నూలు పాలకులైన విజయనగర సామంతులైన ‘నంబెట’ వారిని నాశనం చేశాడు.
విజయనగర రాజుల ఆధీనంలో ఉన్న బోయ, తిగుళ రాజ్యాలను చావుదెబ్బ తీశాడు. అనంతరం రాజమహేంద్రవరంపై దాడి నిర్వహించి రెడ్డి రాజ్యాన్ని కొల్లగొట్టడమేగాక, గజపతుల సామంతులైన సర్వేపల్లి తిమ్మారెడ్డిపై ఘనవిజయం సాధించాడు.ఈ విజయాలన్నీ వెలుగోటివారి వంశావళిలో సవివరంగా వివరించి ఉన్నాయి.ఇతని కాలంలోనే కాటయ వేమారెడ్డి రాజమండ్రిలో స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు.ఈ విధంగా రెడ్డి రాజ్యం కొండవీడు, రాజమహేంద్రవరం రాజ్యాలుగా విడిపోయింది.పెదకోమటి వేమారెడ్డి (కొండవీటి) బహమనీల సహాయంతో రెడ్డి రాజ్యాన్ని సమైక్యం చేయడానికి ప్రయత్నించగా దీనికి సుల్తాన్ ఫిరోజ్ షా బహమనీ మద్దతు ప్రకటించాడు.
దీంతో తమ చిరకాల శత్రువులైన రెడ్లతో తమ మిత్రులైన బహమనీలు మైత్రి వహించడం గిట్టక రెండో అనపోతానాయుడు విజయనగర రాజులతో జట్టుకట్టాడు.ఈ విధంగా రెండో అనపోతానాయుని కాలంలో వెలమలు, బహమనీల మధ్య సంబంధాలు చెడిపోయాయి.ఇతను 1417లో పానగల్లు యుద్ధంలో విజయనగర రాజులతో కలిసి బహమనీలను ఓడించాడు.ఇతని కాలంలోనే దేవరకొండ రాజు అయిన పినవేదగిరి నాయుడు ‘ధరణికోట’పై దాడిచేసి పెదకోమటి వేమారెడ్డి సోదరుడైన మాచారెడ్డిని హతమార్చాడు.దీనికి ప్రతీకారంగా పెదకోమటి వేమారెడ్డి దేవరకొండపై దాడిచేసి పినవేదగిరిని హతమార్చాడు.దీంతో రెండో అనపోతానాయుడు పినవేదగిరి సోదరుడైన ‘లింగమనేడు’తో కలిసి కొండవీడుపై దండెత్తి పెదకోమటి వేమారెడ్డిని హతమార్చి అతని శిరస్సును తమ్మాపడగ (గంప)లో భూస్థాపితం చేశాడు.ఈ యుద్ధం తరువాత కొండవీడు రాజ్యం ఆంధ్రదేశ రాజకీయ చరిత్ర నుంచి అదృశ్యమైపోయింది.
రావు మాదానాయుడు (1421-30)
రెండో అనపోతానాయుడి కుమారులు యుక్తవయస్కులు కానందువల్ల అతని తమ్ముడు మాదానాయుడు సింహాసనం అధిష్టించాడు.ఇతని కాలంలో బహమనీలతో శతృత్వం తీవ్రరూపం దాల్చి వెలమ రాజ్యానికి అపారనష్టం సంభవించింది.1424లో రెండో దేవరాయలు, సుల్తాన్ అహ్మద్ షా బహమనీ మధ్య జరిగిన యుద్ధంలో మాదానాయుడు దేవరాయలుకు సహాయం చేశాడు.
దీంతో వెలమనాయకులని శిక్షించే ఉద్దేశంతో బహమనీ సుల్తాన్ ఓరుగల్లుపైకి 1425లో ‘ఆజమ్ఖాన్’ అనే సేనానిని పంపాడు.ఆజమ్ఖాన్ ఓరుగల్లునే కాక వెలమల రాజ్యంలోని కొన్ని దుర్గాలను ఆక్రమించి అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వెలమలకు అపారనష్టం కలిగించాడు.
దీంతో గత్యంతరం లేక మాదానాయుడు అహ్మద్ షాతో 1425లో సంధి చేసుకొని వరంగల్ని తిరిగి పొందాడు.ఈ సంఘర్షణలో రాచకొండ పద్మనాయక రాజ్యం విచ్ఛిన్నం ప్రారంభమై తెలంగాణలో అధికభాగం బహమనీ రాజ్యంలో కలిసిపోయింది.
మాదానాయుని సాహిత్య సేవ
ఇతను కూడా తన తండ్రి కుమార సింగమనాయుని లాగా గొప్ప పండితుడు. ఇతను వైష్ణవ మతాభిమాని. ఇతను రామానుజాచార్యుని కుమారుడైన వెంకటాచార్యుని శిష్యుడు.
మాదానాయుడు రామాయణానికి ‘రాఘవీయం’ అనే వ్యాఖ్యానం రాసి శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఇతను 1421లో తొర్రూరు గ్రామానికి ‘శ్రీరంగాపురం’ అని నామకరణం చేసి ‘శ్రీరంగనాథ స్వామికి’ దానం చేశాడు. 1429లో ఇతని భార్య ‘నాగాంబిక’ రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే చెరువును తవ్వించింది.
సర్వజ్ఞరావు సింగమనాయుడు (1430-75)
మాదానాయుని అనంతరం రెండో అనపోతానాయుని కుమారుడు మూడో సింగమనాయుడు రాచకొండ పాలకుడయ్యాడు.ఇతనికి సర్వజ్ఞ బిరుదు ఉండటంవల్ల సర్వజ్ఞరావు సింగమనాయుడు అని పిలిచేవారు.ఇతను రాచకొండ వంశీయుల్లో చివరి వాడు. ఇతనికి సమకాలికంగా దేవరకొండలో లింగమనేడు పాలన చేసేవాడు. దేవరకొండ పాలకుల్లో ఇతడు కూడా చివరివాడు.
లింగమనేడు 3వ సింగమనాయుడు ఇద్దరు ధైర్య సాహసాలు కలవారైనా బహమనీ దాడులను ఎదర్కోవడంలో విఫలమై తమ రాజ్యాన్ని కోల్పోయి గజపతులకు, విజయనగర రాజులకు సామంతులయ్యారు.బహమనీ సుల్తానులు గుజరాత్, మాళవ ప్రాంతాలపై దాడిచేసినప్పుడు వెలమలు ఆజమ్ఖాన్ను ఓడించి ఓరుగల్లు సహా తెలంగాణలో అన్ని దుర్గాలను వశపర్చుకున్నారు.
1433లో బహమనీ సుల్తాన్ అహ్మద్ షా ఓరుగల్లు, రామగిరి దుర్గాలను ఆక్రమించి భువనగిరి దుర్గం కేంద్రంగా ఒక జాగీరుని ఏర్పాటు చేసి సంజర్ఖాన్ను ప్రతినిధిగా చేశాడు.సుల్తాన్ ఆజ్ఞ మేరకు సంజర్ఖాన్ 1435 నాటికి రాచకొండతో సహా తెలంగాణలోని అధిక భాగాన్ని ఆక్రమించాడు.
బహమనీ రాకుమారుల్లో ఒకరైన దాసూర్ఖాన్ రాచకొండలో రాజప్రతినిధి అయ్యాడు. దీంతో దేవరకొండ మినహా తెలంగాణ అంతా బహమనీల వశం అయ్యింది.తర్వాత వచ్చిన బహమనీ రాజు హుమాయున్ దేవరకొండను కూడా ఆక్రమించాడు. దీంతో తెలంగాణలో వెలమల పాలన అంతమైంది.1475 నాటికి తెలంగాణ బహమనీల ఆధీనంలోకి వచ్చింది.ఆ తర్వాత సర్వజ్ఞ సింగమనాయుడు విజయనగర కొలువులో చేరి చివరకు కంఠమ రాజవంశీయుడైన తమ్మ భూపాలుని చేతిలో హతమయ్యాడు.సర్వజ్ఞ సింగమనాయుని మరణంతో పద్మనాయక చరిత్ర పరిసమాప్తం అయిందనవచ్చు. ఈ విధంగా 1475 నాటి వెలమ రాచకొండ, దేవరకొండ రాజ్యాలు బహమనీ సామ్రాజ్యంలో అంతర్భాగాలయ్యాయి.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు