శిష్యజనాశ్రయమైన సాహితీవటవృక్షం
ప్రాచ్య కళాశాల అంటే పంచెలు, లాల్చీలు, కండువాలు, పిలకలతో బోధకులు, విద్యార్థులు కూడా వుంటారనుకునే కాలంలో, ప్రాచీన సాహిత్యం పేర కేవలం ఛాందసులుగా మసలుతారనే అనుకునే రోజుల్లో, తెలుగు సాహిత్యాభివృద్ధికి ప్రాచీన, అర్వాచీనాలను రెంటినీ సమన్వయం చేస్తూ అభ్యుదయ పథాన విప్లవాత్మకంగా తాను ప్రిన్సిపాల్‌గా వున్న కాలంలో విద్యార్థులపై ప్రభావం చూపి ఒక తరాన్ని తీర్చిదిద్దిన ఆచార్య శ్రేష్ఠులు డాక్టర్ కె.కె.రంగనాథాచార్యులు. హైదరాబాద్ తిలక్‌రోడ్ బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్ వారి ప్రాచ్య కళాశాలకు సరివల్లె విశ్వనాథశాస్త్రి గారి అనంతరం 1967లో ప్రధానాచార్యులుగా నియమితులైన ఆయన రెండు దశాబ్దాలపాటు ఆ కళాశాల కీర్తిప్రతిష్ఠలు పెంచి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. కళాశాల వేదికగా ఆధునిక సాహిత్య ప్రక్రియలపై ప్రముఖులతో ఉపన్యాసాలు చేయించి, దిగంబర, విప్లవోద్యమాలకు అండదండగా నిలిచి, ప్రముఖ గ్రంథాలను ప్రచురించి, తెలుగు సాహిత్యాన్ని గొప్ప విమర్శకునిగా, సాహిత్య చరిత్రకారునిగా, భాషావేత్తగా సుసంపన్నం చేశారు.
వామపక్ష ఉద్యమాల ప్రభావంతో విద్యార్థి దశనుంచీ అభ్యుదయ విప్లవపథగామి అయ్యారు. అయినా తన ఆధ్వర్యంలో ప్రాచ్య కళాశాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. కళాశాల వార్షిక సంచిక ‘నెలవంక’కు విద్యార్థిగా సుధామ రాసిన కవిత ఆనాడే కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన స్వాతంత్య్రానంతర తెలుగు కవితా సంకలనంలో చోటు చేసుకుంది. ఆయన దగ్గర చదువుకున్న శిష్యులెందరో అనేక రంగాల్లో ఉన్నత శ్రేణుల్లో రాణించారు.
కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆచార్య కోవెల్ కందాళై రంగనాథాచార్యులు 1941 జూన్ 14న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించినా బాల్యం నుంచీ హైదరాబాద్ సీతారాంబాగ్ దేవాలయ ఆవరణంలో పెరిగి, అక్కడి సంస్కృత కళాశాలలో డీ.ఓ.ఎల్ కోర్స్ చేశారు. సంస్కృతం, ఆంధ్రం, తమిళం, ఆంగ్ల భాషల్లో అపారజ్ఞానాన్ని ఆర్జించారు. తొలుత నాంపల్లి హైస్కూల్, మదర్సా, ఆలియా పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. తెలుగు, సంస్కృతం మాత్రమే కాక భాషాశాస్త్రంలో కూడా పట్టభద్రులయ్యారు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి ప్రియ శిష్యునిగా లిగ్విస్టిక్ శాఖలో ప్రాచీన తెలుగు శాసన భాష మీద భద్రిరాజు గారి పర్యవేక్షణలోనే పి.హెచ్.డి. చేసి, డాక్టరేట్ పొందారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆయన అందించిన సేవలు తెలుగు సాహిత్యంలో ఒక సువర్ణాధ్యాయమే. కళాశాల వార్షిక సంచిక ‘నెలవంక’ను, పరిషత్ ప్రచురించిన అనేక ప్రముఖ గ్రంథాలను తన సంపాదకత్వంలో ఆయన విలువైనవిగా రూపొందించారు. నేటి ఎమ్మెస్కో ప్రచురణల సంపాదకులు డి.చంద్రశేఖరరెడ్డి, ఆకాశవాణి కార్యక్రమం నిర్వహణాధికారిగా పనిచేసిన ప్రముఖ కవి సుధామ, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, రేడియో వార్త విభాగానికి చెందిన సమ్మెట నాగమల్లేశ్వరరావు, సాహితీ ప్రముఖులు లక్ష్మణరావు పతంగే, నరహరి, రాపోలు సుదర్శన్, మసన చెన్నప్ప ప్రభృతులెందరో ఆయన శిష్యులే.
ప్రాచ్య కళాశాల నుండి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి తరలివెళ్లి తెలుగుశాఖ ఆచార్యునిగా, విభాగాధిపతిగా, హ్యూమానిటీస్ డీన్‌గా పనిచేసి 2003లో పదవీ విరమణ చేశారు. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు కొత్త చూపునిచ్చిన సాంప్రదాయాభిజ్ఞత, మార్క్సిస్ట్ దృక్పథం రెంటి సమన్వయ సాహితీవేత్త కె.కె.ఆర్. ఆయన సంపాదకత్వంలోనూ, ఆయన గ్రంథాలుగానూ తెలుగు సాహిత్యం, చారిత్రక భూమిక, ఆధునిక కవిత్వం భిన్న ధోరణులు, తెలుగు సాహిత్యం మరోచూపు, తెలుగులో తొలి సమాజ కవులు, నూరేళ్ల తెలుగునాడు, తెలుగు సాహిత్యం వచన రచన పరిచయం, తెలుగు కథానిక (మొదటినుంచి 1930 వరకు) పరిశీలన, బహుముఖ వ్యాసాలు, పరిచయాలు-ప్రస్తావనల పేరిట పీఠికలు, ‘సామయిక వ్యాసాలు’ నేటి తెలుగు స్వరూప సంగ్రహం వంటి గ్రంథాలన్నీ వాటికవే సాటి. కేంద్ర సాహిత్య అకాడమీకి భారతీయ సాహిత్య నిర్మాతల పరంపరలో రాచకొండ విశ్వనాథశాస్త్రి గారిపై మోనోగ్రాఫ్ను, చందుమీనన్ అనువాదాన్ని కె.కె.ఆర్.గారే గ్రంథరచన చేశారు. దిగంబర కవులకు స్ఫూర్తిగా ఉన్నది ఆయనే. ప్రముఖ విప్లవ కవి వరవరరావు కె.కె.ఆర్. పర్యవేక్షణలోనే పోస్ట్ డాక్టొరోవ్ కావించారు. ‘మంచు పల్లకి’ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసి, మంచి నటుడిగా పేరొందిన బుచ్చిబాబు కె.కె.ఆర్.గారి తమ్ముడే! యవ్వనదశలోనే బుచ్చిబాబు మృతి చెందాడు. ఊర్మిళను ఆదర్శంగా వివాహం చేసుకున్నారాయన. వారికి కుమారుడు సుమన్, కుమార్తె నవిల ఉన్నారు. కుమార్తె విదేశాల్లో స్థిరపడ్డారు.
వామపక్ష ఉద్యమాల ప్రభావంతో విద్యార్థి దశనుంచీ అభ్యుదయ విప్లవపథగామి అయ్యారు. అయినా తన ఆధ్వర్యంలో ప్రాచ్య కళాశాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. కళాశాల వార్షిక సంచిక ‘నెలవంక’కు విద్యార్థిగా సుధామ రాసిన కవిత ఆనాడే కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన స్వాతంత్య్రానంతర తెలుగు కవితా సంకలనంలో చోటు చేసుకుంది. ఆయన దగ్గర చదువుకున్న శిష్యులెందరో అనేక రంగాల్లో ఉన్నత శ్రేణుల్లో రాణించారు. ఆ మార్గదర్శకత్వం వారిదే. ఆయన తాత్వికగాఢత, విలక్షణ దృష్టి అద్భుతమనీ, విమర్శకులుగా తెలుగు సాహిత్యంలో ఆయన చేసి చూపిన పునర్మూల్యాంకనలు ఎప్పటికీ కొత్త వెలుగులు ప్రసరింపచేసేవేననీ సాహితీలోకం కొనియాడుతూనే ఉంది.
విద్యార్థులను నిజంగా స్నేహవాత్సల్యంతో చూసి మసలిన మహనీయుడాయన. గొప్ప కార్యదక్షత గల నేత. ప్రాచ్య కళాశాల విద్యార్థులకు అజంతా- ఎల్లోరా వంటి ప్రాంతాలకు ఎన్నో విహారయాత్రలు నిర్వహించి, వారి వెంట సతీసమేతంగా విహరించి, ఆ క్షణాలను ఆత్మీయంగా భద్రపరుచుకోదగినవిగా చేసిన సహృదయుడు. అచార్యునిగా ఒక తరాన్ని తీర్చిదిద్దిన గొప్ప మార్గదర్శకుడు. ఆయన వచనం గొప్పది. ఆయన విమర్శనా ధోరణి విలక్షణమైనది. రచన చేయడం తప్ప విమర్శ మీద పెద్ద నమ్మకం లేదన్న రావిశాస్త్రి వంటి వారిని సైతం విమర్శ ప్రాధాన్యత గుర్తెరిగేలా చేయగలిగిన దక్షులు కె.కె.ఆర్. ఆకాశవాణిలో వారిచే పలు ప్రసంగాలు చేయించి ఆ సాహితీ దిగ్గజం శిష్యునిగా చెప్పకోవడం ఈ శిష్యుడు సుధామకు గర్వకారణం. వారి పర్యవేక్షణలో సామయిక కవిత్వంపై పరిశోధన చేయవలసి ఉండింది. కానీ, ఉద్యోగ బాధ్యతలు అవకాశం ఇవ్వలేదు. ‘నీ సామయికత తీసుకుని నా సామయిక వ్యాసాలు వేస్తున్ననోయ్!’ అని వారు చిర్నగవుతో అనడం, ‘కవిత్వంలో అగ్ని’ అని రేడియోకి రాయించిన వ్యాసాన్ని సుధామ అగ్ని సుధ కవితా సంపుటిని కూడా ప్రస్తావిస్తూ రాసిన ఆ రచనను తమ సామయిక వ్యాసాల్లో చేర్చటం ఓ మధుర జ్ఞాపకం. జీవితంలో బహుముఖీనంగా ఎదగడానికి విద్యార్థి దశలోనే ఎంతో స్ఫూర్తిదాయకులుగా నిలిచి, వాత్సల్యంతో సమాదరించిన ఆ సాహితీ దిగ్గజానికి వినమ్ర నివాళి. మే 15, 2021 శనివారం సాయంత్రం దివికేగిన గురువుగారికి అశ్రుతర్పణంతో జోహార్లు!!
- సుధామ, 98492 97958
కె.కె.రంగనాథాచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు