మానవ తప్పిదాలు.. వరదలతో విధ్వంసాలు
వరదలు (FLOODS)
పొడిగా ఉండే భూభాగం మీదకు సాధారణ పరిమితులను దాటి నీరు పొంగి ప్రవహించడాన్ని వరద అంటారు. తుపానులు, భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తాయి. ఈ నేపథ్యంలో వరదలు-రకాలు, వాటికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం..
-నదీ ప్రవాహ మార్గాల హద్దులు అంటే నది గట్లు జల ప్రవాహాన్ని నిలువరించుకోలేనప్పుడు పరీవాహకంలో ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోయే పరిస్థితిని వరద అంటారు.
-ప్రకృతి వైపరీత్యాలన్నింటిలోనూ అతి ఎక్కువగా సంభవించేవి వరదలే. వరదలు సాధారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ సంభవిస్తాయి.
– అడవుల నరికివేత, నగరీకరణ నేలలో ఎక్కువగా నీటిని నిలిపి ఉంచే సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.
– పల్లపు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, ఆనకట్టలకు దిగువన నదీ తీరాల్లో నిర్మించిన నగరాలు మొదలైనవి వరదలకు తేలికగా గురయ్యే ప్రాంతాలు.
వరదల రకాలు
1. నదీ వరదలు
– వర్షాకాలంలో తుపాను వల్ల సంభవించే భారీ వర్షాలు నదుల్లో నీటి ప్రవాహాన్ని భారీగా పెంచుతాయి. ఈ నీటి ప్రవాహం నది నుంచి సముద్రంలో కలిసే నీటి ప్రవాహం కంటే ఎక్కువగా ఉండటం వల్ల నీరు పొంగి నది గట్టును దాటి వరద సంభవిస్తుంది.
– వరద సంభవించే ముందు నది తనలో ఎంత పరిమాణంలో నీరు ఉంచుకోగలదో దాన్నే పారుదల సామర్థ్యం అంటారు.
-నీటి ప్రవాహ ప్రాంతంలో ఒక సెకనులో ప్రవహించే నీటి పరిమాణాన్ని డిశ్చార్జ్ అంటారు.
2. తీర ప్రాంత వరద
పెద్ద అలలు, సముద్రంలో ఉప్పెన, తుపాను, సునామీ కారణంగా తీర ప్రాంతా ల్లో ఏర్పడే వరదను తీర ప్రాంత వరద అంటారు.
3. పట్టణ వరద
పట్ణణ ప్రాంతంలో నీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల భారీ వర్షం సంభవించినప్పుడు వరద ఏర్పడుతుంది.
4. మెరుపు వరద
కుండపోత భారీ వర్షం, హఠాత్తుగా మంచు కరిగి నీరు నదిలో చేరడం, ఆనకట్టలు తెగిపోవడం, కూలిపోవడం వల్ల అకస్మాత్తుగా వచ్చే వరదను మెరుపు వరద అంటారు.
5. నదీ ముఖ వరదలు
ఉప్పెన కారణంగా సముద్రంలోని నీటి ప్రవాహం నదీ నీటి ప్రవాహాన్ని వెనక్కి నెట్టిన కారణంగా వరదలు ఏర్పడతాయి.
6. ప్రమాదం కారణంగా వరదలు
అధిక పరిమాణంలో నీటిని సరఫరా చేసే గొట్టాలు పగిలిపోవడం వల్ల వరద ఏర్పడి చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోయి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది.
ప్రపంచంలో వరదలు సంభవించే ప్రాంతాలు
ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ వరదలు సంభవిస్తాయి. అయితే పల్లపు ప్రాంతాలతో కూడిన నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ మొదలైన దేశాలు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అనేక ద్వీపాలు, సహజంగా వరదల ప్రభావానికి ఎక్కువ లోనవుతాయి.
– తీవ్రమైన హరికేన్లు, చక్రవాతాలు, టైపూన్లను ఎక్కువగా ఎదుర్కొనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, ఇథియోపియా, సోమాలియా, మొజాంబిక్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రతి సంవత్సరం వరదలు సంభవించే అవకాశం ఉంది.
తీవ్ర స్థాయిలో సంభవించిన వరదలు
నెదర్లాండ్స్- 1570
చైనా- 1931
చైనా- 1998
మొజాంబిక్- 2000
గ్వాటెమాలా- 2003
బంగ్లాదేశ్- 2004
భారతదేశం- 2005
యూఎస్ఏ- 2005
భారతదేశం, బంగ్లాదేశ్- 2009
వరదలకు గల కారణాలు
– రుతుపవనాల వల్ల ఎడతెగని, భారీ వర్షాల వంటి సహజ కారణాలే కాకుండా మానవ ఆధారిత అంశాలు కూడా భారతదేశంలో వరదలకు కారణమవుతున్నాయి.
– భారతదేశ భౌగోళిక ప్రాంతం చాలా వరకు వరదలకు గురవుతుంది. అంతేకాక భారతదేశంలో పేలవమైన వరద నిర్మూలన లేదా నిర్వహణ చర్యలు, విపత్తు నిర్వహణలో అసమర్థత మొదలైన అంశాల కారణంగా వరదల నిర్వహణకు సమగ్ర వరదల నిర్వహణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది.
వరదలు పెరగడానికి కారణమయ్యే అంశాలు
1. సహజ కారణాలు
– వరదలు IPCC (Inter Governmental Panel for Climate Change) ప్రకారం వర్షపాత సంభావ్యత, తీవ్రత, పరిధి, భవిష్యత్తులో వాతావరణ మార్పుల వల్ల ఇంకా పెరగవచ్చని తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల తుపానుల తీవ్రత పెరగవచ్చని దీని ఫలితంగా ఫ్లాష్ వరదలు ఇంకా పెరగవచ్చునని వెల్లడించింది.
2. వక్రీకృత వర్షపాత సరళి
-భారతదేశంలో 80 శాతం అవపాతం జూన్ నుంచి సెప్టెంబర్ రుతుపవన సమయంలోనే సంభవిస్తుంది. ఈ సమయంలో నదులు పరీవాహక ప్రాంతాల నుంచి భారీ అవక్షేప భారాన్ని తీసుకువస్తాయి.
3. అంతర్జాతీయ నదులు
– గంగా, బ్రహ్మపుత్ర, అనేక ఉపనదులు పొరుగు దేశాల్లో జన్మించాయి. కాబట్టి ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు రావడంవల్ల స్థలాకృతిలో ఆకస్మిక మార్పు కూడా ఉత్తర భారతదేశంలో వరదలకు కారణమయ్యే అంశం.
4. భూకంపాలు
– జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ND MA) తయారు చేసిన భూకంప విపత్తు ప్రమాద సూచిక (EDRI) భారతదేశంలో సుమారు 56 శాతం విస్తీర్ణం ఒక మోస్తరు నుంచి భారీ భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. భారతదేశంలో చాలా నదీ పరీవాహక ప్రాంతాలు భూకంపం సంభవించే ప్రాంతాల్లో ఉన్నందున భవిష్యత్తులో వరదలు పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది.
5. మానవ కారణాలు
ప్రణాళిక రహిత అభివృద్ధి, నదీ జోన్లలో ఆక్రమణలు, వరద నియంత్రణా నిర్మాణాల వైఫల్యం, ప్రణాళిక లేని జలాశయ కార్యకలాపాలు, పేలవమైన నీటి పారుదల మౌలిక సదుపాయాలు, అటవీ నిర్మూలన, భూ వినియోగ మార్పు, నదీ పరీవాహక ప్రాంతాల్లో అవక్షేపం మొదలైన అంశాలు లేదా కారణాలు భారతదేశంలో వరదలను పెంచుతున్నాయి.
6. పట్టణ వరదలు
– చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం రావడం వల్ల పట్టణాలు, నగరాల్లో ఇటీవలి కాలంలో వరదలు సంభవిస్తున్నాయి.
కారణాలు
-జల మార్గాలు, చిత్తడి నేలలను విచక్షణా రహితంగా ఆక్రమించడం.
– కాలువల సామర్థ్యం సరిపోకపోవడం.
– పారుదల మౌలిక సదుపాయాల నిర్వహణ సరిగా లేకపోవడం.
-కాలువలు, సరస్సుల పారుదలను అడ్డుకోవడం.
-ప్రణాళిక లేని రహదారి ప్రాజెక్టులు.
7. విపత్తు ముందు ప్రణాళిక నిర్లక్ష్యం
-వరద విపత్తు నిర్వహణ దృష్టి ఎక్కువగా వరద అనంతర పునరుద్ధరణ, ఉపశమన చర్యలపైనే కేంద్రీకరించారు. చాలా జలాశయాలు, హైడ్రో ఎలక్టిక్ ప్లాంట్లలో వరద స్థాయిని కొలవడానికి తగినంత గేజింగ్ స్టేషన్లు లేవు. ఇవి వరద అంచనాకు ప్రధాన భాగాలు.
-ఉపరితల ప్రవాహం ఎక్కువగా ఉండే విధంగా స్వల్పకాలంలో (ఒకేరోజులో 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ) భారీ వర్షం.
-తీర ప్రాంతాల మునకకు కారణమయ్యే బలమైన గాలులతో ఉష్ణమండల చక్రవాతాలు.
– నదులు, చెరువులు, కాలువలు మొదలైన వాటి గట్లకు గండ్లు పడటం లేదా అలాంటి గట్ల మీదుగా నీరు ప్రవహించడం.
-పాత నదీ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల నదీ ప్రవాహ మార్గాలు మారిపోవడం.
– పల్లపు ప్రాంతాల్లో తగినన్ని నీటి పారుదల సదుపాయాలు లేకపోవడం.
– నదీ పరీవాహాల జల గ్రహణ ప్రాంతాల్లోనూ, కొండ వాలుల్లోనూ విచక్షణా రహితంగా అడవులను నరికివేయడం వల్ల అధిక జల ప్రవాహమేర్పడటం.
– అసోంలోని బ్రహ్మపుత్ర లోయలోని భాగాలు, బీహార్, పశ్చిమబెంగాల్లోని దిగువ గంగాలోయ, కోసి, దామోదర్ నదుల పరీవాహాలు, గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాలు వరద ప్రభావిత ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.
-దేశంలో వరదల వల్ల జరిగే విధ్వంసంలో దాదాపు 60 శాతానికి నదుల వల్ల వచ్చే వరదలు కారణం కాగా మిగిలిన 40 శాతానికి భారీ వర్షపాతం, చక్రవాతాలు కారణమవుతున్నాయి.
-దేశంలో జరిగే నష్టంలో 60 శాతానికి హిమాలయ నదులే కారణం. ద్వీపకల్ప నదీ పరీవాహకంలో జరిగే నష్టంలో అధిక భాగానికి చక్రవాతాలు కారణం కాగా హిమాలయ నదీ పరీవాహకాల్లో దాదాపు 66 శాతానికి వరదలు, 34 శాతానికి భారీ వర్షాలు కారణమవుతున్నాయి.
-జాతీయ వరద నివారణ కార్యక్రమాన్ని 1954లో ప్రారంభించారు.
– రాష్ట్ర ప్రభుత్వాలు వరద నివారణ బోర్డులను ఏర్పాటు చేశాయి. ఈ బోర్డుల పనిని కేంద్ర వరద నివారణ బోర్డు సమన్వయం చేస్తుంది.
వరద నివారణ కేంద్రాలు
-పంచవర్ష ప్రణాళికల కాలంలో చేపట్టిన బళార్థసాధక ప్రాజెక్టుల లక్ష్యాల్లో వరద నివారణ కూడా ఒకటి.
-తపతి నది మీద సూరత్
– నర్మద నది మీద బ్రోచ్
-గంగా నది మీద వారణాసి, బక్సర్, పాట్నా
– బ్రహ్మపుత్ర నది మీద డిబ్రూగర్, గౌహతి
– సువర్ణరేఖ నది మీద భువనేశ్వర్
-చంబల్ నది మీద గాంధీనగర్ ప్రాంతాల్లో వరద సూచిక, హెచ్చరిక కేంద్రాలున్నాయి.
– ప్రపంచంలోని తీవ్ర వరద ప్రభావిత దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. వరదలకు ప్రధాన కారణం ప్రకృతి స్వభావం.
-భారతదేశ సగటు వర్షపాతం 1150 మిల్లీమీటర్లు అయితే దేశవ్యాప్తంగా వర్షపాతం రకరకాలుగా ఉంది. వార్షిక వర్షపాతం పశ్చిమ తీర, పశ్చిమ కనుమలు, కశ్మీర్ కొండలు, బ్రహ్మపుత్ర లోయలో 2500 మిల్లీమీటర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి.
వరదల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
-వరద సమయాల్లో డయేరియా ప్రబలినప్పుడు టీ, గంజి, లేత కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.
-వరదల సమయంలో నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ బిళ్లలు వాడాలి.
– రేడియో, టీవీల్లో ప్రభుత్వం ఇచ్చే వరద హెచ్చరికలను తెలుసుకోవాలి.
-విద్యుత్ సరఫరా నిలుపుదల చేసుకోవాలి.
-ప్రభుత్వ శిబిరాలకు తరలివెళ్లాలి.
-వరదల్లో నడవవలసి వస్తే పొడవాటి కర సహాయంతో దారి చూసుకుంటూ నడవాలి.
-ఇంటిలో సామగ్రిని ఎత్తైన అటకలపై పెట్టాలి.
– క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలి. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి.
ప్రాక్టీస్ బిట్స్
1. దివిసీమ ఉప్పెన ఎప్పుడు సంభవించింది? (2)
1) 1966 2) 1977
3) 1988 4) 1999
2. తెలుగు రాష్ట్రాల్లో వినాశకరమైన తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? (1)
1) జూన్- డిసెంబర్
2) జనవరి- జూన్
3) డిసెంబర్- జూన్
4) అక్టోబర్- మార్చి
3. కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో తీవ్రమైన వరదలు ఏసంవత్సరంలో సంభవించాయి? (3)
1) 2007 2) 2008
3) 2009 4) 2010
4. జాతీయ వరద నివారణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? (1)
1) 1954 2) 1955
3) 1956 4) 1957
5. ఐపీసీసీ ని విస్తరించండి. (2)
1) ఇండియన్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లెమేట్ చేంజ్
2) ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లెమేట్ చేంజ్
3) ఇంటర్నేషనల్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లెమేట్ చేంజ్
4) పైవేవీ కాదు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






