భారత పౌరుడిగా ఏం నేర్చుకోవాలి?
పోటీ పరీక్షల్లో పాలిటీని అతిముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చు. ఇది సివిల్ సర్వీసెస్ నుంచి కానిస్టేబుల్ వరకు కేవలం పరీక్ష రాయడానికే కాకుండా ఉద్యోగం పొందిన తర్వాత వారి వృత్తిపరమైన అంశాల్లో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. పాలిటీలో ముఖ్యంగా రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, ప్రజలు అనే అంశాలను కూలంకషంగా అర్థం చేసుకుని విశ్లేషించవలసి ఉంటుంది. ఇది పరీక్షలకే కాకుండా భారతీయ పౌరుడిగా నేర్చుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది.
- రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది.
- భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసినది- క్యాబినెట్ మిషన్ కమిటీ
- రాజ్యాంగ పరిషత్‌కు 1946 జూలైలో ఎన్నికలు నిర్వహించారు. ఇవి ‘పరిమిత ఓటింగ్’ పద్ధతిలో జరిగాయి.
- రాజ్యాంగ పరిషత్‌కు మొదట్లో ఎన్నికైన సభ్యుల సంఖ్య-39
- దేశ విభజన (ఆగస్టు 14, 1947) అనంతరం రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య- 299
- రాజ్యాంగ పరిషత్‌కు మహళా సభ్యుల సంఖ్య-15
- దళిత సభ్యుల సంఖ్య-26
- రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు కేవలం-10శాతం మాత్రమే.
- రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో మొత్తం 11 సార్లు సమావేశం అయింది.
- మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946లో జరిగింది. దీనికి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హ వ్యవహరించారు.
- రెండో సమావేశం డిసెంబర్ 11, 1946లో జరిగింది. ఈ సమావేశంలోనే డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను శాశ్వత చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
- మూడోది డిసెంబర్ 13, 1946లో జరిగింది. దీనిలో జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఆధారంగానే ప్రవేశికను రూపొందించారు.
- చివరి సమావేశం(11వ) జనవరి 24, 1950లో జరిగింది. ఈ సమావేశంలోనే జాతీయ గీతం, జాతీయ గేయాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
- జాతీయ జెండాను జూలై 22, 1947లో ఆమోదించింది.
- భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949లో ఆమోదించింది.
- 1928వ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ, ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులు కలిసి భారతదేశానికి తొలి రాజ్యాంగ ప్రతి( నమూనా రాజ్యాంగం) తయారు చేశారు.
- దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు కాబట్టి అమల్లోకి రాలేదు.
- 1931లో కరాచీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం ఉండాలో తీర్మానించారు.
- 1928లో నెహ్రూ నివేదికలో, 1931 కరాచీ సమావేశంలో మనకు ప్రస్పుటంగా కనిపించే అంశాలు 3 అవి
1. స్వేచ్ఛ 2. సమానత్వం 3. సార్వజనీన వయోజన ఓటు హక్కు. - 1931లో మహాత్మాగాంధీ young india అనే పత్రికలో భారత రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నారో పేర్కొన్నారు.
2013 వరకు భారత రాజ్యాంగాన్ని 99 సార్లు సవరించారు (2022 వరకు 128 సార్లు).
1951-1960 వరకు 7 సార్లు
1961- 1970 వరకు 15 సార్లు
1971- 1980 వరకు 22 సార్లు
1981- 1990 వరకు 22 సార్లు
1991-2000 వరకు 16 సార్లు
2001- 2013 వరకు 17 సార్లు. మొత్తం 99 సార్లు సవరించారు.
1930లో జనవరి 26న జవహర్ లాల్ నెహ్రూ సంపూర్ణ స్వరాజ్యాన్ని పేర్కొన్నారు.
2015 నుంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
ముసాయిదా కమిటీ
భారత రాజ్యాంగాన్ని తయారు చేయడంలో రాజ్యాంగ పరిషత్‌కు సహాయపడిన కమిటీలు అన్నింటిలో అత్యంత ప్రధానమై నది ముసాయిదా కమిటీ.
ముసాయిదా కమిటీని ఆగస్టు 29, 1947లో ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో సభ్యుల సంఖ్య -7
1. బీఆర్. అంబేద్కర్ (చైర్మన్)
2. కేఎం. మున్షి
3. గోపాలస్వామి అయ్యంగార్
4. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
5. మహమ్మద్ సయ్యద్ సాధుల్లా
6. ఖైతాన్ (కృష్ణమాచారి)
నోట్: ఖైతాన్ మర ణించిన తర్వాత కృష్ణమాచారి ఎన్నికయ్యారు.
7. మిత్తర్ (మాధవరావు)
నోట్: మిత్తర్ అనారోగ్యంతో రాజీనామా చేయడంతో మాధవరావును నియమించారు.
రాజ్యాంగ పరిషత్‌కు, ముసాయిదా కమిటీకి ప్రధాన న్యాయ సలహాదారు బీఎన్. రావు (బినగల్ నర్సింహారావు)
నోట్: బీఎన్ రావు అంతర్జాతీయ న్యాయ స్థానానికి తొలి భారత న్యాయమూర్తి.
ముఖ్య భావనలు
1. ప్రవేశిక
2. లిఖిత, సుదీర్ఘ రాజ్యాంగం
3. దృఢ, అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం
4. పార్లమెంటరీ ప్రభుత్వం
5. ప్రాథమిక హక్కులు
6. ఆదేశిక సూత్రాలు
7. ప్రాథమిక విధులు
8. ఏక పౌరసత్వం
9. సార్వజనీన వయోజన ఓటు హక్కు
10. ద్విసభా విధానం
ప్రవేశిక (preamble)
- ప్రపంచంలో రాజ్యాంగాలన్నీ ప్రవేశికతో ప్రారంభమయ్యాయి కాబట్టి భారత రాజ్యాంగం కూడా ప్రవేశిక అనే పదంతో ప్రారంభమవుతుంది.
- ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతం(introduction) లాంటిది. పరిచయం లేదా ముందుమాట లాంటిది.
- ప్రవేశిక భారత రాజ్యాంగం లక్ష్యాలను, ఆశయాలను, ఉద్దేశాలను తెలియజేస్తుంది.
- ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది.
- నోట్: 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సామ్యవాద, లౌకిక అనే పదాలను ఇందిరాగాంధీ ప్రధాన
- మంత్రిగా ఉన్నప్పుడు చేర్చారు. సమగ్రత (integrity)ని కూడా చేర్చారు.
- సర్వసత్తాక అంటే భారతదేశానికి సంబంధించిన అంతర్గత, బహిర్గత వ్యవహారాలను విదేశీ జోక్యం లేకుండా స్వయం నిర్ణయాధికారాన్ని కలిగించడం.
- సామ్యవాద అంటే ఆర్థిక వ్యత్యాసాలను తొలగించి ఆర్థిక సమానత్వాన్ని సాధించడం.
- లౌకిక అంటే మత ప్రమేయం లేని రాజ్యం. ఈ రాజ్యంలో అధికార మతం ఉండదు. మత వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అదేవిధంగా ఏ మతాన్ని ప్రోత్సహించదు.
- ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పరిపాలించడం.
- గణతంత్ర అంటే ఎన్నికయిన దేశాధినేతను కలిగి ఉండటం.
- నోట్: ఇప్పటి వరకు ప్రవేశికను 1976లో 42వ సవరణ ద్వారా ఒకేఒకసారి సవరించారు.
- ప్రవేశిక ‘భారత ప్రజలమైన మేము’తో ప్రారంభమై ‘మాకు సమర్పించుకుంటున్నాం’ తో ముగుస్తుంది.
జాబితాలు-అంశాలు
1. కేంద్ర జాబితా
2. రాష్ట్ర జాబితా
3. ఉమ్మడి జాబితా
కేంద్ర జాబితా
ఇందులో ముఖ్యమైనవి దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, బ్యాంకింగ్, రైల్వే మొదలైనవి(100 అంశాలు).
కేంద్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
రాష్ట్ర జాబితా
61 అంశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి వ్యవసాయం, నీటి పారుదల, వైద్యం, పారిశుద్ధ్యం, శాంతి భద్రతలు మొదలైనవి.
రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.
ఉమ్మడి జాబితా
52 అంశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి విద్య, విద్యుత్, అడవులు, కార్మిక చట్టాలు, లైసెన్సింగ్ విధానం మొదలైనవి.
ఇందులోని అంశాలపైన చట్టాలు రూపొందించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
నోట్: ఒకవేళ ఒకే అంశంపైన రెండు ప్రభుత్వాలు చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటు అవుతుంది.
ప్రాథమిక హక్కులు
భారత రాజ్యాంగం 3వ భాగంలోని 14 నుంచి 32వరకు గల అధికరణలు వీటిని తెలియజేస్తాయి.
ప్రస్తుత భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల సంఖ్య 6
అవి:
1. సమానత్వపు హక్కు
2. స్వాతంత్య్రపు హక్కు
3. పీడనను నిరోధించే హక్కు
4. మత స్వాతంత్య్రపు హక్కు
5. విద్యా సాంస్కృతిక హక్కు
6. రాజ్యాంగ పరిహారపు హక్కు
నోట్: గతంలో ఆస్తి హక్కు కూడా ఉండేది. భారత రాజ్యాంగంలోని 44వ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు.
ప్రస్తుతం ఆస్తి హక్కు 300ఎ అధికరణం ప్రకారం ‘చట్టబద్ధమైన హక్కు’
పార్లమెంటరీ ప్రభుత్వం
- భారత పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతి పేరుకు మాత్రమే అధికారాలు కలిగి ఉంటారు. కాబట్టి ఆయనను నామమాత్ర కార్యనిర్వహణాధికారి అంటారు.
- ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రి మండలి వాస్తవంగా అధికారాలను చెలాయిస్తుంది. కాబట్టి దీన్ని కార్యనిర్వహణాధికారి అంటారు.
- భారత పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతి దేశాధినేతగా ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా కొనసాగుతారు.
- భారతదేశంలో పార్లమెంటరీ విధానం కేంద్రం, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేశారు.
- భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించేందుకు 324 అధికరణం కింద స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
- భారత ఎన్నికల సంఘాన్ని జనవరి 25, 1950లో ఏర్పాటు చేశారు.
- ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు.(1960 నుంచి)
దృఢ, అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం
- భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు దృఢ రాజ్యాంగ పద్ధతిలో ఉదా: రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, మొదలైన అంశాలు మార్చడం.
- కొన్ని అంశాలను మార్చడం అదృఢ రాజ్యాంగ పద్ధతిలో ఉదా: కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ర్టాల పేర్లను మార్చడం మొదలైనవి.
- నోట్: భారత రాజ్యాగంలోని 368వ అధికరణం రాజ్యాంగాన్ని సవరించే విధానం గురించి తెలియజేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు