ఇంజినీరింగ్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ కావాలంటే?
ఎంసెట్ ర్యాంకులు విడుదలయ్యాయి. సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి ఎంపిక చేసుకోవాలి? అనుకున్న బ్రాంచీ రాకుంటే ఏం చేయాలి? భవిష్యత్‌లో మంచి ప్లేస్మెంట్ సాధించాలంటే ఏ బ్రాంచీ చదవాలి? ఎలాంటి కాలేజీలో చదవాలి అనే అంశాలపై పలు సందేహాలు. అంతేకాకుండా పలానా వారి అబ్బాయో/అమ్మాయో ఆ కోర్సు చేశారు.. వారికి మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్ వచ్చింది. మన పిల్లలను అదే చదివిద్దాం అని ఆలోచిస్తుంటారు. కానీ వాస్తవానికి ఏం చదివితే మంచిది? మంచి భవిష్యత్‌కు ఏం చేయాలనే అంశాలను ఆయా రంగాల్లో నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
ఇంజినీరింగ్
ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సు. మానవ మనుగడతో ముడిపడిన రంగం. ఏటా కొత్త కొత్త కోర్సులు వస్తున్నాయి. పాత కోర్సుల్లో పలు మార్పులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంజినీరింగ్ విద్యలో ఏటా పలు మార్పులు జరుగుతున్నాయి. కోర్ బ్రాంచీలు అంటే ఎలక్టికల్, సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీలతో పాటు సరికొత్త అంశాలతో అంటే ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి అనేక కోర్సులు వచ్చాయి. అన్ని మంచి కోర్సులే. దీనికి కారణం దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అకడమిక్స్‌లో వీటిని ప్రవేశపెట్టారు. అంటే ఈ కోర్సులకు సంబంధించిన డిమాండ్ ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
విద్యార్థి ఆసక్తితో..
తల్లిదండ్రులు పక్కవారిని చూసి తమ పిల్లలను ఆయా బ్రాంచీలో చేర్చడం సబబు కాదు. పిల్లవాడి ఆసక్తిని గమనించి వారిని ఆయా కోర్సుల్లో చేర్చడం వల్ల తప్పక వారు ఆ రంగంలో రాణిస్తారు. గతంలో లాగా నేడు ఇంజినీరింగ్‌లో చదివిన కోర్సుకు సంబంధించిన జాబ్ చేసే వారి సంఖ్య 20 శాతం లోపే ఉంటుంది. మిగిలిన 80 శాతం మంది వారికి నచ్చిన ఇతర రంగాలలోకి వెళ్తున్నారు. అంటే సాఫ్ట్వేర్, మేనేజ్మెంట్, ఎంట్రప్రెన్యూర్స్‌గా, ఎకనామిస్ట్, అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ తదితర రంగాలలోకి వెళ్తున్నారు. దీనికి ఉదాహరణ.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. ఆయన చదివింది ఇంజినీరింగ్‌లో మెటలర్జీ బ్రాంచీ కానీ తన ఆసక్తితో తర్వాతి కాలంలో ప్రస్తుత స్థాయికి ఎదిగారు. ఇక ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ చదివింది ఎలక్టికల్ ఇంజినీరింగ్ కానీ అయన ఎకనమిస్ట్‌గా ఎదిగారు. చేతన్ భగత్ రచయితగా పేరుగాంచారు. ఇలా చదివిన రంగంలోనే రాణించాలనే నియమమేమీ లేదు. పిల్లల ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారు ఆయా రంగాల్లో నిష్ణాతులుగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయి.
కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే భవిష్యత్తా?
సీఎస్ఈ లేదా దాని అనుబంధ బ్రాంచీలతోనే మంచి జీతభత్యాలు ఉంటాయనే అపోహ నేడు అధిక శాతం తల్లిదండ్రులు, వారి మాట వింటున్న అనేక మంది విద్యార్థుల్లో ఉంది. కానీ ఇది నిజం కాదు. ఒక్కసారి రాష్ట్రంలో లేదా దేశంలో ప్లేస్మెంట్స్ను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అవగతమ వుతుంది.
-ఏ బ్రాంచి తీసుకున్నా మొదటి ఏడాది నుంచే పక్కా ప్లాన్‌తో ముందుకుపోతే తప్పక మంచి జీతభత్యాలతో ప్లేస్‌మెంట్స్ సాధించవచ్చు. అనేక ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈసీఈ, ఎలక్టికల్, సివిల్, మెకానికల్ చదివే పిల్లలు కూడా మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధిస్తున్న ఉదాహరణలు కోకొల్లలు.
అన్ని బ్రాంచీల్లో లేటెస్ట్ టెక్నాలజీ…
సాంకేతికత పెరుగుతున్న కొద్ది అన్ని బ్రాంచీల్లో ఆ సాంకేతికతను అడాప్ట్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు గతంలో సివిల్, మెకానికల్ బ్రాంచీలకు నేటి పరిస్థితికి చాలా భిన్నంగా ఉంది. వారు ఏఐ, ఎంఎల్ వంటి సాంకేతికతతో కంప్యూటర్లలోనే కొత్త కొత్త ప్రాజెక్టులను, మోడల్స్‌ను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక రంగంలో సైతం డేటా సైన్స్ వంటి కొత్త సాంకేతికతో ఆ రంగంలో రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. భూమి మీద నిర్మాణాల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అంటే దాదాపు అన్ని బ్రాంచీల వారు ఏఐ, ఎంఎల్ తదితర టెక్నాలజీలను వాడుకుంటున్నారు. దీనితో ఐటీ రంగం జాబ్స్ అనేవి కేవలం సీఎస్ఈ వారికే కాదు అన్ని బ్రాంచీల వారికి అందుబాటులోకి వస్తున్నాయి అనేది సత్యం.
ప్లేస్‌మెంట్స్ ఎలా
బెస్ట్ ప్లేస్‌మెంట్స్ కేవలం సీఎస్ఈ చదివిన వారికే రావు. చాలా కంపెనీలు అన్ని బ్రాంచీలకు కలిపి ఒకే రకమైన పరీక్ష/ఎంపిక విధానంతో రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. ప్రస్తుత విద్యా విధానంలో ఎలక్టివ్స్ కింద ఆయా కంప్యూటర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకుని చదవడంతోపాటు సీ, సీ++, పైథాన్, జావా, ఊప్స్, డాటా స్ట్రక్చర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే ఎక్కడ చదివినా, ఏ బ్రాంచీ తీసుకున్నా బెస్ట్ ప్లేస్‌మెంట్స్ సాధించవచ్చు.
కాలేజీ ఎంపికే కీలకం
మంచి ప్రమాణాలు అంటే ప్రభుత్వాలు ఇచ్చే ఎన్బీఏ, న్యాక్, యూజీసీ, ఏఐసీటీఈ ఇచ్చే పలు రకాల గ్రేడింగ్‌లు, గుర్తింపులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, ల్యాబ్స్, పీహెచ్డీ చేసిన ఫ్యాకల్టీలు, రిసెర్చ్, అటానమస్ హోదా, ఇండస్ట్రీతో ఒప్పందాలు కలిగిన కాలేజీల్లో చదివితే మంచి భవిష్యత్ ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు