తెలంగాణ రీజినల్ కమిటీ ఏది?
శతాబ్దాల నిరంకుశ రాచరిక పాలనలో ఆర్థికంగా, విద్యాపరంగా ఎంతో వెనుకబడ్డ తెలంగాణను ఆంధ్రప్రాంతంతో కలిపినప్పుడు తెలంగాణకు ఇచ్చిన రక్షణలన్నీ ఆ తర్వాత కాలంలో నీటిమూటలే అయ్యాయి. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించేందుకంటూ ఏర్పాటుచేసిన ప్రాంతీయ మండలిని సైతం క్రమంగా బలహీనపర్చి చివరకు రద్దుచేశారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, దాని కార్యక్రమాలు, రద్దు తదితర అంశాలపై నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం..
జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడ్డ రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు వల్ల ఉత్పన్నమయ్యే లాభనష్టాలను బేరీజువేసి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగించాలని సిఫారసు చేసింది. విశాలాంధ్ర రాష్ర్టాన్ని ఏర్పాటుచేయడం మరీ తప్పనిసరైతే 1961లో జరిగే శాసనసభ ఎన్నికల పిదప తెలంగాణ ఎమ్మెల్యేలు 2/3వ వంతు మెజారిటీతో తెలంగాణను ఆంధ్రా లో విలీనం చేసేందుకు అంగీకరిస్తే విశాలాంధ్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టవచ్చునని సూచించింది.
-అప్పటివరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగించాలని కమిషన్ సిఫారసు చేసింది. దేశంలో రాష్ర్టాల పునర్విభజన జరుగుతున్న సందర్భంలోనే విశాలాంధ్ర ఏర్పడాలని లేకుంటే భవిష్యత్తులో అది ఎప్పుడూ ఏర్పడదని భావించిన ఆంధ్ర నాయకులు విశాలాంధ్ర ఏర్పాటును ఆలస్యం చేయకూడదని భావించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొంతమంది తెలంగాణ నాయకులను వివిధ రకాలుగా ప్రలోభపెట్టి ప్రభావితం చేశారు. ఆంధ్ర నాయకుల ఒత్తిళ్లకు లొంగిన కేంద్రం తెలంగాణను ఆంధ్రతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేయాలంటే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారికి కొన్ని రక్షణలు కల్పించాలని ఆంధ్ర నాయకులకు సూచించింది.
-ఈ ప్రతిపాదనకు ఆంధ్ర నాయకులు అంగీకరించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు విశాలాంధ్ర ఏర్పాటుకోసం తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పించడానికి 1956, ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమై కుదుర్చుకున్న ఒప్పందమే పెద్దమనుషుల ఒప్పందం. ఈ ఒప్పందంలో 14 అంశాలను పొందుపర్చగా అందులో 9వ అంశం తెలంగాణ ప్రాంతీయ మండలికి సంబంధించింది. ఈ పెద్దమనుషుల ఒప్పందానికి చట్టబద్దత కల్పించడానికి ఉద్దేశించినదే ఈ తెలంగాణ ప్రాంతీయ మండలి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను 1958, ఫిబ్రవరి 1న రాష్ట్రపతి ది ఆంధ్రప్రదేశ్ రీజినల్ కమిటీ ఆర్డర్ 1958ని జారీచేశారు. ఈ విధంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీ పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా ఏర్పడ్డది.
-తెలంగాణకు ఏర్పాటుచేసిన ప్రాంతీయ కమిటీలాంటిదాన్ని 1957లో పంజాబ్ రాష్ర్టానికి కూడా ఏర్పాటుచేశారు. 1966లో పంజాబ్ రాష్ట్రం పంజాబ్, హర్యానాలుగా చీలిపోవడంతో అక్కడ ప్రాంతీయ సంఘం రద్దయింది. తెలంగాణకు ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు 1958లోనే జారీ అయినా అవి 1960 వరకు అమలుకాలేదు. పెద్దమనుషుల ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పార్లమెంట్లో హోంశాఖ సహాయ మంత్రి బీఎస్ దాతార్ ప్రవేశపెట్టిన నోట్ ఆన్ సేఫ్గార్డ్స్లో పేర్కొన్న అంశాల మధ్య వ్యత్యాసం ఉంది.
-అదేవిధంగా నోట్ ఆన్ సేఫ్గార్డ్స్లోని అంశాలన్నింటినీ యథావిధిగా తెలంగాణ రీజినల్ కమిటీ పరిధిలోకి తేలేదు. పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి రీజినల్ కౌన్సిల్ ఏర్పాటవుతుందని ఉంటే రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వుల్లో రీజినల్ కౌన్సిల్‌గా ఉండాల్సిన పదాన్ని మార్చి తెలంగాణ రీజినల్ కమిటీగా మార్చారు.
-కమిటీ నిర్మాణంలో, అధికారంలో కౌన్సిల్కన్నా భిన్నమైంది, బలహీనమైంది. ఈ కమిటీకి ప్రాంతీయ మండలికి ఉండే అధికారాలు ఉండవు. ఇది కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసుకునే స్వేచ్ఛగాని, అధికారాలుగాని దీనికి లేవు. ఆర్థిక భారంలేని సూచనలు మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఉండేది.
-పెద్దమనుషుల ఒప్పందంలో ముఖ్యమంత్రిగాని, ఉపముఖ్యమంత్రిగాని ఎవరు తెలంగాణవారు అయితే వారు ప్రాంతీయ మండలి అధ్యక్షులుగా ఉంటారని స్పష్టంగా ఉన్నా ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆ అంశం చేర్చకపోవడంతో ప్రతిసారీ రీజినల్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగేవి.
-ఈ ఉత్తర్వుల్లో తెలంగాణ ఎమ్మెల్యేలంతా రీజినల్ కమిటీ సభ్యులుగా ఉంటారని పేర్కొని ఉంది. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలోని వ్యవసాయభూముల అమ్మకం ప్రాంతీయమండలి ఆధీనంలోనే జరగాలి. కానీ ఆ విధంగా ఏనాడు జరగలేదు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలోని ఉద్యోగుల వ్యవహారాలు ప్రాంతీయ మండలి పరిధిలో ఉండాలి. ఈ అంశం తెలంగాణ రీజినల్ కమిటీకి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేకపోవడంతో తెలంగాణలోని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి.
-రీజినల్ కమిటీకి తెలంగాణలో ముల్కీ నిబంధనల అమలు, ఉద్యోగ నియామకాల్లో పర్యవేక్షణాధికారాలు, ఉన్నత విద్యావ్యవస్థను పర్యవేక్షించే అధికారంగాని లేకపోవడంతో ఆశాజనకంగా పనిచేయలేకపోయింది. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు బదిలీ అయిన భద్రాచలం ప్రాంతాన్ని ప్రాంతీయ సంఘం పరిధిలోకి చేర్చలేదు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు బదిలీ అయిన ఆంధ్రప్రాంత మునగాల ప్రాంతాన్ని కూడా దీని పరిధిలో చేర్చలేదు. ప్రభుత్వం శాసనసభకు సమర్పించే వార్షిక ఆదాయ వ్యయాలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు విడివిడిగా చూపేవారు.
-తెలంగాణ ఆదాయం నుంచి వ్యయంపోగా మిగిలిన నిధులను తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయాలని పెద్దమనుషుల ఒప్పందంలో స్పష్టంగా ఉన్నా దాన్ని ఏ ముఖ్యమంత్రీ పాటించలేదు. ఎలాంటి ఆర్థికపరమైన వ్యయంలేని విషయాల్లో మాత్రమే ఈ కమిటీని ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే సంస్థగా కుదించారు. ఆ సలహాలను ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.
-1960లో తెలంగాణలోని స్కూళ్లలో తీవ్ర ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ప్రాంతీయ కమిటీ తెలంగాణ మిగులు నిధుల నుంచి ఉపాధ్యాయులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీనికి ఆర్థిక, ప్రణాళిక శాఖలు స్పందిస్తూ తెలంగాణకు మిగులు నిధులు లేవని పైగా లోటు ఉందని ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చాయి. అదే ఏడా ది గవర్నర్ తన ప్రసంగంలో తెలంగాణ మిగులు నిధులు రూ. 30.54 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
-తెలంగాణ మిగులు నిధుల విషయంలో ప్రాంతీయ కమిటీకి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. మిగులు నిధుల విషయంలో ప్రభుత్వం నియమించిన లలిత్ కమిటీ 1956-68 మధ్యకాలంలో తెలంగాణ మిగులు నిధులు రూ. 34.09 కోట్లుగా నిర్ధారించింది. అదేకాలానికి రూ. 28.34 కోట్లు తెలంగాణ మిగులు నిధులున్నట్లు జస్టిస్ భార్గవ కమిటీ నిర్ధారించింది. విద్యారంగంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో ప్రాంతీయ కమిటీ సమర్థవంతంగా పనిచేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నియమ, నిబంధనలు రూపొందించి ప్రభుత్వం ద్వారా వాటి అమలుకు కృషిచేసింది. ప్రజారోగ్య విషయంలో కమిటీ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విలువైన సూచనలను ప్రభుత్వానికి ఇచ్చింది.
-జంటనగరంలోని అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్స ఆస్పత్రికి గ్రాంటును మంజూరుచేసింది. పారిశుద్ధ్య పరిరక్షణ కోసం తీసుకోవల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి నివేదికలను సమర్పించింది. స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాల పటిష్టతకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల విషయంలో ప్రభుత్వం ఎంతగా వాదించినప్పటికీ కమిటీ సిఫారసులను ప్రభుత్వం అమలుచేసే విధంగా కృషిచేసింది.
-ప్రాంతీయ కమిటీ 1961-63 మధ్య కాలంలో తెలంగాణ మిగుల నిధుల నుంచి వివిధ పథకాలు రూపొందించి వాటిని అమలుపర్చింది. ఈ పథకాలను తెలంగాణ ప్రాంతీయ కమిటీ పథకాలు అనేవారు. ఈ పథకాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి ఫౌండేషన్ గ్రాంట్ మంజూరు ముఖ్యమైనది. దీని కింద ఓయూకు మూడు కోట్ల నిధులను మంజూరుచేస్తూ ఆ నిధులను తెలంగాణ గ్రామీణప్రాంతంలో విద్యుద్దీకరణ నిమిత్తం విద్యుత్‌బోర్డులో పదేండ్లపాటు అభివృద్ధి బాండ్ల రూపంలో ఉంచాలని నిర్ణయించారు. ఈ బాండ్లపై వచ్చే వడ్డీతో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి పథకాలను చేపట్టాలని రీజినల్ కమిటీ సూచించింది. దీని ద్వారా ఓయూకు కొంత మేలు జరిగింది.
-తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణలను అమలుపర్చడానికి ప్రాంతీయ కమిటీని నెలకొల్పారు. కానీ ఆంధ్రప్రాంత నాయకుల తీవ్ర వివక్షాపూరిత వైఖరి వల్ల కమిటీ ఆశించినవిధంగా పనిచేయలేకపోయింది. అయినప్పటికీ అది ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తూ వచ్చింది. పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణకు కల్పించిన రక్షణలను పూర్తిగా ఉల్లంఘించడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజీమార్గంగా అష్టసూత్ర పథకం ప్రకటించారు. ఈ పథకంలోని ఐదో అంశం తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారాలను ఉద్దేశించింది. 1972లో తెలంగాణలో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు రాజ్యాంగపరంగా చెల్లుబాటవుతాయని సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును జీర్ణించుకోని ఆంధ్ర నాయకులు జై ఆంధ్ర ఉద్యమాన్ని లేపారు. వాళ్ల ఒత్తిళ్లకు లొంగిన కేంద్రం 1973, సెప్టెంబర్ 21న ఆరుసూత్రాల పథకాన్ని ప్రకటించారు. ఇందులోని ఆరో అంశం ప్రకారం అప్పటివరకు తెలంగాణలో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు, ప్రాంతీయ కమిటీ రద్దయ్యాయి.
చారిత్రక నేపథ్యం
వివిధ రాజ్యాల మధ్య లేదా వివిధ ప్రాంతాల మధ్య భిన్నత్వం, అసమానతలు ఉండటం సహజం. ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ అసమానతలుగల రెండు ప్రాంతాలను కలిపి ఒకే పాలనా యంత్రాంగం కిందకు తెచ్చేటప్పుడు అల్పాభివృద్ధి చెందిన ప్రాంతానికి కొన్ని రక్షణలు కల్పించడం చారిత్రకంగా కొనసాగుతూ వస్తుంది. భవిష్యత్తులో రెండుప్రాంతాల మధ్య అభివృద్ధిచెందిన, వెనుకబడిన ప్రాంతాల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడటానికి ఇది దోహదపడుతుంది. భిన్నవర్గాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పడి దేశ స్థిరత్వానికి సమైక్యతకు కూడా ఇది దోహదపడుతుంది.
-దీనిననుసరించే 1707లో స్కాట్లాండ్ ఇంగ్లండ్‌లో విలీనమైంది. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్లను కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు. గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్ కలిసి 1921లో యునైటెడ్ కింగ్డమ్గా అవతరించాయి. ఈ విలీనాల సందర్భంగా స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణలు కల్పించారు. వీటికి చట్టబద్దత కల్పించేందుకు బ్రిటిష్ పార్లమెంట్ స్కాటిష్ స్థాయి సంఘాన్ని నెలకొల్పింది.
-పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ మండలి నిర్మాణంలో తెలంగాణ 9 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే 9 మంది ఎమ్మెల్యేలను ప్రతి జిల్లాకు ఒకరి చొప్పున ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. శాసనసభ నుంచి గాని, పార్లమెంట్ సభ్యులనుంచి గాని మరో ఆరుగురు సభ్యులను తెలంగాణ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. ఈ విధంగా 20 మంది సభ్యులతో తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పడాలని స్పష్టంగా ఉన్నా కేంద్రం వెలువరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఈ అంశాలేవీ లేవు.
-తెలంగాణ ప్రాంతీయ కమిటీ క్రియాశీలంగా పనిచేస్తే ప్రమాదమని భావించిన సీమాంధ్ర నాయకత్వం దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూ వచ్చింది. ఈ రీజినల్ కమిటీకి 1958లోనే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటుకు అవకాశాలు ఉన్నా అప్పటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఏర్పర్చలేదు. 1960లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీజినల్ కమిటీ నిర్మాణం జరిగింది.
-దీని తొలి అధ్యక్షుడు అచ్యుతరెడ్డి. ఈయన తన విధులను సక్రమంగా నిర్వహించే ప్రయత్నం చేస్తే ఆంధ్ర నాయకులు అతడిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కమిటీ రెండో అధ్యక్షుడిగా పనిచేసిన హయగ్రీవాచారి కూడా తెలంగాణకు చట్టబద్దంగా కల్పించిన రక్షణల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడల్లా ఆంధ్ర నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు