అగ్రరాజ్యాలకు దీటుగా అంతరిక్ష వేట
ఆధునిక కాలంలో మానవ జీవితాన్ని పూర్తిగా మార్చివేసినది సాంకేతిక పరిజ్ఞానం. టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశమే ప్రపంచంలో ప్రబలశక్తిగా ఎదుగగలదని అమెరికా, చైనా నిరూపించాయి. ఈ జాబితాలోకి భారతదేశం ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నది. ముఖ్యంగా అంతరిక్ష సాంకేతికతలో అగ్రరాజ్యాలకు పోటీ ఇస్తున్నది. అగ్రరాజ్యాలను వెనుకకు నెట్టి అప్రతిహతంగా దూసుకుపోతున్నది. విశ్వవ్యాప్తంగా అతి తక్కువ దేశాలకు సొంతమనుకున్న ఘనతలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సొంతం చేసుకుని మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. దేశంలో అంతరిక్ష సాంకేతికత అభివృద్ధికి ఎక్కడ ఎప్పుడు బీజం పడింది? ఎలా అభివృద్ధి చెందిందనే అంశాలపై నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం..
పీఎస్ఎల్వీ-సీ37
ఇస్రో 2017, ఫిబ్రవరి 15న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (శ్రీహరి కోట)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-సీ37 ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. వాహక నౌక ఎత్తు 44.4 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు, బరువు 320 టన్నులు. ఇది భూమికి 505-524 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్త ధృవకక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో మూడు స్వదేశీ ఉపగ్రహాలు కాగా.. మిగిలినవి విదేశాలకు చెందినవి. ఇస్రోకు ఇది వరుసగా 38వ విజయం.
ఎస్ఎల్వీకి 39వ ప్రయోగం. తాజాగా అంతరిక్షంలోకి పంపిన మొత్తం 104 ఉపగ్రహాల బరువు 1378 కిలోలు. వీటిని వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. 1993, సెప్టెంబర్ 20న పీఎస్ఎల్వీ తొలి ప్రయోగం జరిగింది. పీఎస్ఎల్వీ ద్వారా ఇప్పటివరకు ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య 226. వాటిలో విదేశీ ఉపగ్రహాలు 180. ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డు ఇప్పుడు భారత్ పేరిట ఉంది. రష్యా 2014లో అత్యధికంగా 37 ఉపగ్రహాలను, 2013లో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) 39 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించాయి. పీఎస్ఎల్వీ నాలుగు దశల నౌక. దీని మొదటి, మూడో దశల్లో ఘన ప్రొపెల్లెంట్లను ఉపయోగిస్తారు. రెండో, నాలుగో దశల్లో ద్రవ ప్రొపెల్లెంట్లను ఉపయోగిస్తారు.
ఏయే ఉపగ్రహాలు
-744 కిలోల బరువున్న కార్టోశాట్ 2డీ ఉపగ్రహాన్ని 510 కి.మీ. ఎత్తులో సూర్యనువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం భూమి చుట్టూ పరిభ్రమిస్తూ భూమిపై మార్పుల్ని ఫొటోలు తీస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమాచారంతోపాటు ఐదేండ్లు రిమోట్ సెన్సింగ్ సేవలను అందిస్తుంది.
-ఇస్రో నానో శాటిలైట్స్ అయిన ఐఎన్ఎస్-1ఎ, ఐఎన్ఎస్-1బి స్వదేశీ ఉపగ్రహాల బరువు 30 కిలోలు. ఇవి 6 నెలలు మాత్రమే పనిచేస్తాయి.
-ఈ మూడు స్వదేశీ ఉపగ్రహాలతోపాటు మరో 101 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు. వాటిలో అమెరికాకు చెందినవి 96 (డవ్ శాటిలైట్స్, లేమూర్ శాటిలైట్స్).
-పైన పేర్కొన్న ఉపగ్రహాలతోపాటు ఇజ్రాయెల్, కజకిస్థాన్, నెదర్ల్లాండ్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి.
ఉపగ్రహం బరువు-దేశం
పీయాన్ 3 కిలోలు-ఇజ్రాయెల్
డిడో2 4.2 కిలోలు-కజకిస్థాన్
బీజియూ శాట్ 3కిలోలు-నెదర్ల్లాండ్
ఆల్ పరాబి 1.7 కిలోలు-స్విట్జర్లాండ్
నాయిప్ 1.1 కిలోలు-యూఏఈ
ఇస్రో ఘనతలు
-ఇస్రో 1969లో ఏర్పాటైంది.
-1975 ఏప్రిల్ 19న నాటి సోవియట్ రష్యాకు చెందిన ఇంటర్ కాస్మోస్ రాకెట్ ద్వారా ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు.
-ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా రూపొందించిన కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్‌ను 1981 జూన్ 19న ప్రయోగించారు.
-ప్రసుతం ఇస్రో అమెరికాతోపాటు 19 దేశాలకు సేవలందిస్తుంది.
-చంద్రయాన్-1 పేరిట చంద్రుడిపై అన్వేషణ చేసింది.
-పునర్వినియోగ ప్రయోగవాహక నౌక (ఆర్ఎల్వీ)ను విజయవంతంగా పరీక్షించింది.
-అమెరికా సైన్యం అజమాయిషీలోని జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం)పై ఆధారపడకుండా నావిక పేరుతో సొంత దిక్చూచీ సేవలకు మార్గం సుగమం చేసుకుంది.
-సొంత పీఎస్ఎల్వీ ప్రయోగ వ్యవస్థను అభివృద్ధి చేసింది.
-భూమి స్ట్రాటోస్పియర్ పొరలో సూక్ష్మజీవుల గుర్తింపు.
-2014లో అంగారకుడిపైకి మంగళ్యాన్ పేరుతో మామ్ (మార్స్ ఆర్బిటార్ మిషన్)ను ప్రయోగించింది. ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్రాత్మక విజయం సాధించినట్లయింది.
-తాజాగా ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగంతో రికార్డు సృష్టించింది.
ఇస్రో రాకెట్లు
-ఇస్రో ప్రస్తుతం 3 రకాల పీఎస్ఎల్వీ రాకెట్లను ఉపయోగిస్తుంది. అవి..
1) పీఎస్ఎల్వీ-జీ
2) పీఎస్ఎల్వీ-సీఏ
3) పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్
భారత అంతరిక్ష కార్యక్రమాల్లో మైలురాళ్లు
-1962 – ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ ఏర్పాటు
-1962 – తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్
-1969 – ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)
-1971 – శ్రీహరికోటలో షార్ ఏర్పాటు
-1972 – స్పేస్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్
-1975 – ఏప్రిల్ 19న అంతరిక్షంలోకి ఆర్యభట్ట ఉపగ్రహం. (రష్యాలోని బైకనూర్ నుంచి ప్రయోగం)
-1980 – శ్రీహరికోట నుంచి శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎల్వీ-3) ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
-1981 – జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్‌ను ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించారు. (APPLE అంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమొంట్)
-1984 – రష్యా రాకెట్ సోయజ్టీ-11లో మనదేశానికి చెందిన వ్యోమగామి రాకేష్‌శర్మ అంతరిక్షయానం.
-1999 – మే 26న తొలిసారిగా వాణిజ్య ప్రాతిపదికపై జర్మనీకి చెందిన డీఎల్ఆర్ ట్యూబ్‌శాట్ ఉపగ్రహం ప్రయోగం.
-2008 – అక్టోబర్ 22న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ11 ద్వారా చంద్రయాన్-1 ప్రయోగం.
-2013 – నవంబర్ 5న పీఎస్ఎల్వీ-సీ25 ద్వారా మార్స్‌పై పరిశోధన కోసం మంగళ్యాన్ ప్రయోగం.
-2015 – సెప్టెంబర్ 28న ఖగోళ పరిశోధన కోసం పీఎస్ఎల్వీ-సీ30 ద్వారా ఆస్ట్రోశాట్ ఉపగ్రహ ప్రయోగం.
ఇస్రో చైర్మన్లు
చైర్మన్ పేరు – పదవీకాలం – రాష్ట్రం
విక్రమ్ సారాభాయ్ – 1963-72 – గుజరాత్
ఎంజీకే మీనన్ – 1972 (9నెలలు) – కర్ణాటక
సతీష్ ధావన్ – 1972-1984 – జమ్ముకశ్మీర్
ఉడిపి రామచంద్రరావు (యూఆర్ రావు) –
కస్త్తూరి రంగన్ – 1994-2003 – కేరళ
మాధవన్ నాయర్ – 2003-2009 -తమిళనాడు
కే రాధాకృష్ణన్ – 2009-2014 – కేరళ
శైలేష్ నాయక్ – 2015 (12 రోజులు) -గుజరాత్
ఏఎస్ కిరణ్ కుమార్ – 2015 నుంచి -కర్ణాటక
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు