వేళ్లూనుకున్న బ్రిటిష్ పాలన
లార్డ్ వెల్లస్లీ (1798- 1805)
ఇతని కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన విస్తృతంగా విస్తరించింది. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్లు భారతదేశంలో తాము సాధించిన ఫలితాలను సాధన సంపత్తిని సుస్థిర పర్చుకొనే వైఖరిని అవలంబించారు. ప్రధానంగా స్వదేశ రాజ్యాలతో శత్రుత్వం పెట్టుకోకుండా తేలికగా భారత భూభాగాన్ని కలుపుకోగలిగిన మేరకు ఆ ప్రయత్నం సాగించారు. లార్డ్ వెల్లస్లీ ఆ మొహమాటాలేమి లేకుండా సాధ్యమైనంత వరకు వీలైనన్ని ఎక్కువ స్వదేశ రాజ్యాలను బ్రిటిష్ ఆధిపత్యం కిందికి తీసుకురావాలని నిర్ణయించాడు. ఆ విధంగా తేవడానికి సమయం అనుకూలంగా ఉందని గుర్తించాడు. 1797 నాటికి బలీయమైన రాజ్యాలైన మహారాష్ట్ర, మైసూరు బలాలు క్షీణించిపోయాయి. మూడో ఆంగ్ల కర్ణాటక యుద్ధంతో మైసూరు గత వైభవం అవశేషంగా మిగిలిపోయింది. అంతఃకలహాలు, అంతర్యుద్ధాల్లో మునిగి తేలుతూ మహారాష్ర్టులు బలహీనులైపోయారు. మరో మాటలో భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు బ్రిటిష్ విస్తరణ విధానానికి అనుకూలంగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వెల్లస్లీ టిప్పు సుల్తాన్‌పై యుద్ధం చేయదలిచి నిజాం, మహారాష్ర్టులతో సంధి కుదుర్చుకున్నాడు. స్వయంగా మద్రాస్ చేరి మైసూర్‌పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. తూర్పు పడమరల వైపు నుంచి మైసూరు ప్రమాదం ఎదుర్కొన్నది. జనరల్ స్ట్టువర్ట్ నాయకత్వం కింద బొంబాయి నుంచి ఒక సైన్యం, మద్రాస్ నుంచి జనరల్ హారిస్ నాయకత్వంలో మరొక సైన్యం వెల్లస్లీకి సహాయంగా వెళ్లాయి. బ్రిటిష్ సైన్యం 1799లో టిప్పును ఓడించాయి. అయినా అతను సంధిని వేడుకోలేదు. మితం లేని మడ్డి వెధవల మీద ఆధారపడి హీనమైన బతుకు బతుకడం కంటే పౌరుడిగా మరణించడం మేలని భావించాడు. తన రాజధాని శ్రీరంగ పట్టణాన్ని రక్షించుకొనే ప్రయత్నంలో 1799 మే 4న మరణించాడు. టిప్పు రాజ్యాన్ని బ్రిటిష్, నైజాం నవాబు పంచుకున్నారు.
టిప్పు సుల్తాన్ మరణానంతరం మహారాష్ర్టులు ఒక్కరు మాత్రమే బ్రిటిష్ వారికి ప్రధాన శత్రువులుగా మిగిలారు. దాదాపు ఐదుగురు మహారాష్ట్ర నాయకులు సంఘటితంగా నిలిచారు. పీష్వా, బరోడా గైక్వాడ్, గ్వాలియర్ సింధియా, ఇండోర్ హోల్కర్, నాగపూర్ భోంస్లే. ఈ మరాఠా కూటమికి నాయకుడు పీష్వా. కానీ, 18వ శతాబ్దాంతానికి మహారాష్ర్టుల్లో నాయకత్వం విషయమై పోటీ ఏర్పడింది. . పీష్వా రెండో బాజీరావును, యశ్వంత్‌రావు హోల్కర్, దౌలత్రావ్ సింధియాలు ఎదురించారు. బాజీరావు బేసిన్‌కు పారిపోయి బ్రిటిష్ వారి సహాయాన్ని అర్థించాడు. ఈ విధంగా మహారాష్ర్టుల్లో అంతఃకలహాలు ఏర్పడటంతో వెల్లస్లీ వాటిని ఆసరాగా తీసుకొని వారిని ఒక్కొక్కరిని ఓడించాడు.
సింధియా, భోంస్లే సైన్యాలను అస్సామీ యుద్ధంలో 1803లో ఓడించారు. వారు తమ ఆధీనంలోని అనేక ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పజెప్పారు. అహ్మద్‌నగర్, బ్రోచ్, గంగా-యుమనాల మధ్య ప్రాంతం కటక్, బాలసోర్ మొదలైన ప్రాంతాలన్నీ బ్రిటిష్ వారికి దక్కాయి. రెండో మరాఠా యుద్ధం మహారాష్ర్టుల అధికారానికి పెద్ద దెబ్బగా పరిణమించింది. దీంతో వెల్లస్లీ సైన్య సహకార పద్ధతికి అంగీకరించమని హోల్కర్‌ను కోరాడు. దానికి నిరాకరించిన కారణంగా 1804లో హోల్కర్‌పై యుద్ధం ప్రకటించాడు. ఆ విధంగా మూడో మరాఠా యుద్ధం ప్రారంభమైంది. అయితే, 1805లో వెల్లస్లీ స్వదేశానికి వెళ్లడంతో హోల్కర్ అధికారం పూర్తిగా విచ్ఛిన్నం కాలేదు. 1806లో రాజ్‌ఘాట్ సంధి వల్ల హోల్కర్‌తో శాంతి ఒప్పందం కుదిరింది.
సైన్య సహకార పద్ధతి (1798)
గవర్నర్ జనరల్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్యసహకార పద్ధతి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని స్వదేశీ రాజ్యాలను బ్రిటిష్ వారి అధికారానికిలోను చేయడం ఈ పద్ధతి ప్రధాన ఉద్దేశం. సైన్య సహకార పద్ధతి ప్రకారం దానిని అనుసరించిన స్థానిక రాజ్యాలు తమ విదేశీ వ్యవహారాలను బ్రిటిష్ వారికి అప్పజెప్పాలి. యుద్ధాలు ప్రకటించడం నిషేధింబడింది. ఇతర రాజ్యాలతో సంప్రదింపులు జరుపడానికి కంపెనీ అనుమతి పొందాలి. పెద్ద పెద్ద స్వదేశీ రాజ్యాలు కంపెనీ ఏర్పాటు చేసే సైన్యాల ఖర్చు కోసం కొంత భూభాగాన్ని ఇవ్వాలి. చిన్న రాజ్యాలు ఏటా కొంత ధనాన్ని ఇవ్వాలి. సంస్థానాధీశులు బ్రిటిష్ రెసిడెంట్‌ను స్వీకరించాలి. వారు ఏ ఇతర ఐరోపా వారిని తమ రాజ్యంలో నియమించరాదు. అయితే, వారి అంతరంగిక విషయాల్లో జోక్యం కల్పించుకొనదని వారికి తగిన రక్షణ కల్పించేటట్లు కంపెనీ వాగ్దానం చేసింది. ఈ సైన్య సహకార పద్ధతిలో మొట్టమొదట చేరిన స్వదేశీ రాజ్యం హైదరాబాద్ రాజ్యం.
హిందూ దేశంలో బ్రిటిషు వారి అధికార విస్తరణకు సైన్య సహకార పద్ధతి దోహదం చేసింది. స్థానిక రాజ్యాల్లోని సైన్యాలు రద్దయ్యాయి. రాజులపై బ్రిటిష్ అధికారం స్థాపించబడింది. స్వదేశీ రాజుల వ్యయంతో బ్రిటిష్ కంపెనీ పెద్ద సైన్యాన్ని రూపొందించకలిగింది. ఫ్రెంచ్ వారి అధికారం భారతదేశంలో పెరుగకుండా చేయడానికి సైన్య సహకార పద్ధతిని వినియోగించారు. స్వదేశీ రాజుల అంతఃకలహాలకు కంపెనీ ప్రభుత్వం మధ్యవర్తి అయింది. అనేక ప్రాంతాలు సర్వ అధికారాలతో బ్రిటిష్ వారికి సంక్రమించాయి. కానీ, ఈ సైన్య సహకార పద్ధతితో స్థానిక రాజుల స్వాతంత్య్రం పూర్తిగా నశించింది. బ్రిటిష్ రెసిడెంట్లు స్వదేశీ రాజ్యాల అంతరంగిక విషయాలలో జోక్యం కల్పించుకుంటూ పరిపాలనా విషయాల్లో తలదూర్చుతూ స్థానిక రాజులకు కంటక ప్రాయమయ్యారు. స్థానిక సైన్యాలు రద్దయిన కారణంగా సైనిక విద్యలు నేర్చి నిరుద్యోగులైన సైనికులు దొంగతనాలు, దోపిడీలకు దిగి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ అరాచకానికి కారకులయ్యారు. సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన ముఖ్యమైన రాజ్యాలు హైదరాబాద్ నిజాం, తంజావూరు రాజు, అయోధ్య నవాబు, పీష్వా, ఆర్కాట్, సింధియా, బీరార్, రాజపుత్ర రాజ్యాలు జోధ్‌పూర్, జైపూర్, భరత్పూర్ మొదలైనవి.
లార్డ్ హెస్టింగ్స్ (1813-1823)
వెల్లస్లీ తర్వాత 1813 వరకు కంపెనీ ప్రభుత్వం స్థానిక రాజుల విషయాల్లో జోక్యం కల్పించుకోలేదు. ఎప్పుడైతే లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్‌గా నియమించబడ్డాడో కంపెనీ స్థానిక రాజుల విషయాల్లో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టింది. హేస్టింగ్స్ 1816లో నేపాల్‌కు చెందిన గుర్ఖాలను శక్తివంతంగా అణచివేసి సగౌలి సంధిని కుదుర్చుకున్నాడు. 1817లో మహారాష్ర్టులు తాము కోల్పోయిన అధికారాన్ని పొందడానికి ప్రయత్నించారు. పీష్వా మరాఠా నాయకులను సమాఖ్యగా ఏర్పర్చి నవంబర్‌లో పుణెలోని బ్రిటిష్ రెసిడెంట్‌ను ఎదురించాడు. మరాఠా సైన్యాలు ఓడిపోయి అందరు నాయకులు తమ భూప్రాంతాలను పోగొట్టుకున్నారు. పీష్వా పదవి రద్దు అయ్యింది. అప్పటి పీష్వా బాజీరావుకు ఏటా రూ. 8 లక్షలు భరణంగా ఇచ్చారు. హోల్కర్, భోంస్లే బ్రిటిష్ వారి సైన్యాలను స్వీకరించాల్సి వచ్చింది. మహారాష్ర్టుల అధికారం పూర్తిగా అణచబడింది. వారు తిరిగి తలెత్తుకోలేకపోయారు.
డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం
1848-1856 మధ్యకాలంలో గవర్నర్ జనరల్‌గా పనిచేసిన డల్హౌసీ పరిపాలనా కాలం ప్రధానమైంది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవ్యాప్తికి అతడు మిక్కిలి కృషి చేశాడు. స్థానిక రాజ్యాలను ఆక్రమించుకోవడానికి ఆవగింజ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని జారవిడువని వాడు డల్హౌసీ. స్వదేశీ సంస్థానాధీశులను తొలగించి భారతదేశాన్ని పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం కిందకు తేవడానికి కృషి చేశారు. డల్హౌసీ రెండు ప్రధాన యుద్ధాలను కొనసాగించాడు. అవి రెండో శిక్కు యుద్ధం, రెండో బర్మా యుద్ధం. ఈ రెండు యుద్ధాల వల్ల, అధిక ప్రాంతం లభించడమే కాక, వ్యాపారాభివృద్ధికి కూడా సాధ్యమైంది. సిక్కింపై ఒక్క దండయాత్ర గావించి హెచ్చు ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. 1856లో అయోధ్యను ఆక్రమించుకున్నాడు. మొగల్ చక్రవర్తికి భరణాన్ని రద్దు చేశాడు. ఆర్కాట్ నవాబు బిరుదు తొలగించాడు. డార్జిలింగ్ రాజుకు చెల్లిస్తూ వచ్చిన అద్దెను నిలుపుదల చేశాడు. కప్పం సరిగ్గా చెల్లించలేదనే నెపంతో, అతి సారవంతమైన బీరార్ రాష్ర్టాన్ని, హైదరాబాద్ నిజాం నుంచి ఆక్రమించుకున్నాడు.
కానీ డల్హౌసీ ఆక్రమణలు తన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపర్చినందున సాధ్యమైనవి. ఈ సిద్ధాంతం ప్రకారం సంస్థానాధీశులకు పుత్రులు లేని సందర్భాన ఆ రాజ్యాలు దత్త కుమారులకుగాక బ్రిటిష్ కంపెనీకి చెందుతాయి. దీనికి దత్తత స్వీకార రద్దు చట్టమని కూడా పేరు. డల్హౌసీ ఈ సిద్ధాంతం ప్రవేశపెట్టిన ఆ సమయంలో అనేక స్వదేశీ సంస్థానాధీశులు కుమారులు లేకుండా మరణించిన కారణంగా బ్రిటిష్ అధికారం వడిగా వ్యాప్తి చెందింది. 1848లో సతారాను, 1849లో జైపూర్, సంబాల్పూర్, 1850 భగత్స్, 1852లో ఉదయ్‌పూర్, 1853లో ఝాన్సీ, 1854లో నాగ్‌పూర్‌లను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేశాడు. ఈవిధంగా డల్హౌసీ తన సిద్ధాంతాన్ని అమలుపర్చడంలో హిందూమత భావాలను గాయపరుస్తున్నట్లుగా కానీ, భారతీయ సాంప్రదాయాలను అగౌరవపరుస్తున్నట్లు కానీ గుర్తించలేదు. అతని ఈ ఆక్రమణలు, ప్రభువులందు, ప్రజలందు కల్పించిన ఆందోళన అనుమానం తర్వాత 1857లో జరిగిన తిరుగుబాటుకు ఎంతైనా కారణవచ్చు.
1857 వరకు బ్రిటిష్ పరిపాలన, ఆర్థిక విధానం
రెగ్యులేటింగ్ చట్టం, 1773
భారతదేశంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ నిర్వర్తించాల్సిన రాజకీయ బాధ్యతలను నిర్వచించడానికి, దాన్ని ప్రభుత్వ అదుపులో ఉంచడానికి బ్రిటిష్ పార్లమెంట్ 1772లో రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం కంపెనీ పాలకవర్గమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకంలో మార్పులయ్యియి. వారు ప్రభుత్వ ఆధీనానికి తెచ్చారు. బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వ్యవహరించబడ్డాడు. అతని కౌన్సిల్లో నలుగురు సభ్యులు ఉంటారు. మద్రాస్, బొంబాయి రాష్ర్టాలు గవర్నర్ జనరల్ అధికారానికి లోను చేయబడ్డాయి.
కలకత్తాలో ఒక సుప్రీంకోర్టు స్థాపితమైంది. ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు నియమితమయ్యారు. ఉన్నతాధికారులందరి వార్షిక జీతభత్యాలు నిర్ణయించారు. అయితే రెగ్యులేటింగ్ చట్టం అనేక విషయాల్లో అసంపూర్ణమైన చట్టమని చెప్పవచ్చు. భారతదేశంలోని పాలనాధికారాన్ని అటు కంపెనీకానీ, ఇటు బ్రిటిష్ ప్రభుత్వంకానీ పూర్తిగా స్వీకరించలేదు. ఈ చట్టం మూలంగా సమర్థవంతమైన పాలన ఏర్పాటు జరగలేదు. గవర్నర్ జనరల్ అధికారాలు ఇతమిత్థంగా సూచించలేదు. కాబట్టి రెగ్యులేటింగ్ చట్టం కంపెనీ వ్యవహారాలను అనుకున్నవిధంగా క్రమబద్ధం చేయలేకపోయింది. ఈ లోపాలు వెంటనే తెలియవచ్చాయి.
పిట్ ఇండియా చట్టం 1784
బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన విలియంపిట్, రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలు తొలగించడానికి ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాడు. ఇది 1784లో పిట్ ఇండియా చట్టమనే పేరుతో అమలైంది. కొత్త చట్టం కంపెనీ డైరెక్టర్ల అధికారాలన్నింటిని హరించింది. కంపెనీ పరిపాలనా విషయాల్లో బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు సంక్రమించాయి. ఆరుగురు కమిషనర్లతో కూడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ స్థాపించారు. భారతదేశంలో పరిపాలనా విషయాల్లో ఈ బోర్డు అత్యున్నత స్థానాన్ని ఆక్రమించింది.
గవర్నర్ జనరల్‌కు ఇతర గవర్నర్లపై పూర్తి అధికారం ఇచ్చారు. అతని కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్య నాలుగు నుంచి మూడుకు కుదించారు. కంపెనీ వ్యాపారంపై గుత్తాధికారం కొనసాగించిందికానీ పరిపాలనాధికారాలు కోల్పోయింది. 1813లో చార్టర్ చట్టం మూలంగా ఆ వ్యాపారాధికారం కూడా తొలగించబడింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నిజానికి పరిపాలనను పర్యవేక్షించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు