మొబైల్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు
డిగ్రీలో ప్రవేశాలంటే ఇది వరకు ప్రహసనం. దరఖాస్తులు కొనుక్కుని, పూరించి, సర్టిఫికెట్లు జోడించి సమర్పించాలి. మొదటి లిస్ట్, రెండో లిస్ట్, మూడో లిస్ట్, ఆఖరుకు స్పాట్ అడ్మిషన్లు. ఇలా కాలేజీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇలాంటి అవస్థలకు చెక్‌పెడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) విద్యార్థుల సమస్యలన్నింటిని దూరం చేసింది. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేకుండా ఎంచక్కా ఇంట్లో ఉండే డిగ్రీలో ప్రవేశాలు పొందవచ్చు. దోస్త్-2021 నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొదటి విడుత ప్రవేశాల్లో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఇప్పటి వరకు 78,818 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రితో ముఖాముఖి.
ప్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- విద్యార్థి స్వయంగా తాను మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌కార్డు నెంబర్, కుటుంబసభ్యుల మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు దోస్త్ హోం పేజీ https:// dost.cgg.gov.inలో క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. విద్యార్థి, జెండర్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేయాలి. ఆధార్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్లు తప్పనిసరి.
ఐడీని పొందడం ఎలా..
- ప్రీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే దోస్త్ ఐడీని పొందవచ్చు. ఐడీని పొందడానికి ఆధార్‌కార్డుతో అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్‌తో చేసుకోవచ్చు. ఆధార్‌కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానించని పక్షంలో మీసేవా కేంద్రాలు / దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్లను సంప్రదించి బయోమెట్రిక్ ఆథరైజేషన్ ద్వారా దోస్త్ ఐడీని పొందవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీ యాప్ ఫోలియోను (ఇంటర్‌బోర్డు ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులు) ఫేజ్ రికగ్నైజేషన్ ద్వారా ఐడీని జనరేట్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఎలా..
- https:// dost.cgg.gov.inని సంప్రదించి, దోస్త్ ఐడీ రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. తర్వాత దరఖాస్తును పూరించి, సీట్ల కేటాయింపు కోసం వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి.
ఇతర రాష్ర్టాల్లో చదివిన వారు అర్హులేనా..
- ఇతర రాష్ర్టాల్లో చదివినవారు సైతం దోస్త్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. అయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప్లస్2 విద్యనభ్యసించాలి. ఆయా విద్యార్థులు తమ సర్టిఫికెట్లను వెబ్ ఆప్షన్లు ఇవ్వకముందే హెల్ప్‌లైన్ సెంటర్లను సంప్రదించి తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి. కానీ రాష్ట్రంలోని విద్యార్థులకు సీట్లు కేటాయించిన తర్వాతే ఇతర రాష్ర్టాల్లోని వారికి కేటాయిస్తాం. రాష్ర్టానికి చెందిన వారు ఇతర రాష్ర్టాల్లో చదువుకున్నవారిని స్థానికులుగానే గుర్తిస్తాం.
మొబైల్ నెంబర్ లేని వాళ్ల పరిస్థితి ఏంటి..
- మొబైల్ నెంబర్ కలిగి ఉండటం తప్పనిసరి. అదే మొబైల్ నెంబర్‌ను దోస్త్ అడ్మిషన్లు పూర్తయ్యే వరకు కలిగి ఉండాలి. ఒకవేళ లేని పక్షంలో తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సంరక్షకుల మొబైల్ నెంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేయలేనిపక్షంలో..
- UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని ఆధార్ అప్డేషన్ సెంటర్లు, మీసేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, బ్యాంకుల్లో మొబైల్ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధించుకోవచ్చు.
పాలిటెక్నిక్ విద్యార్థులు దోస్త్‌కు అర్హులేనా..
- అర్హులే. తెలంగాణ సాంకేతిక విద్యామండలి ద్వారా పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులందరూ డిగ్రీలో చేరవచ్చు. ఇంటర్లో కంపార్ట్మెంటల్ ద్వారా ఉత్తీర్ణులైన వారు సైతం ప్రవేశాలు పొందవచ్చు.
వివరాలు సక్రమంగా నమోదుచేసినా ఓటీపీ రాకుంటే..
- మొబైల్లో డు నాట్ డిస్టర్బ్ సర్వీస్ నాట్ యాక్టివ్ చేసుకుని ఉండాలి. ఓటీపీ రానిపక్షంలో రీసెంట్ ఓటీపీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా చెల్లించాలి, తిరిగి వాపసు ఇస్తారా..
- ఆన్లైన్లో టీ వ్యాలెట్, యూపీఐ, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించవచ్చు. ఈ ఫీజు వాపసు ఇవ్వరు.
దోస్త్‌లో ఎలా లాగిన్ కావాలి..
- ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించగానే పిన్ నెంబర్ వస్తుంది. దీంతో దోస్త్ ఐడీ, పిన్ నెంబర్‌ను జనరేట్ చేసుకుని దోస్త్‌లో లాగిన్ కావాలి.
సర్టిఫికెట్లు అప్లోడ్ ఎలా..
- సర్టిఫికెట్ల అప్లోడ్ చేయాల్సిన అవసరంలేదు. కులం, ఆదాయం సర్టిఫికెట్ల నెంబర్లను అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా సర్టిఫికెట్ అప్లోడ్ అవుతుంది. అంత సమర్థవంతంగా దోస్త్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేశాం.
సందేహాల నివృత్తికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు
- విద్యార్థుల సందేహాలను నివృత్తిచేసేందుకు వాట్సాప్ చాట్‌బోట్ ఆటో రెస్పాండర్ సౌకర్యాన్ని కల్పించాం. ఇందుకు 79010 02200 నెంబర్‌ను విద్యార్థులు దోస్త్‌తో అనుసంధానించిన మొబైల్ నెంబర్‌తో చాటింగ్ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు. అంతేకాకుండా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో దోస్త్ తెలంగాణ అని టైప్‌చేసి తగు సమాచారాన్ని వీడియోల రూపంలో పొందవచ్చు.
హెల్ప్‌లైన్ సెంటర్ల ఉపయోగాలేంటి
- విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా 105 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రస్థాయిలో ఒకటి, విశ్వవిద్యాలయాల్లో 6, జిల్లాల్లో 33, ప్రాంతీయ సేవాకేంద్రాల్ల్లో 65 హెల్ప్‌లైన్ కేంద్రాలున్నాయి.విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఆధార్ నెంబర్ల అనుసంధానం, సర్టిఫికెట్లను తప్పుగా అప్లోడ్ చేయడం లాంటి సమస్యల కోసం వీటిని సంప్రదించవచ్చు.
బకెట్ సిస్టం ద్వారా ఉపయోగాలేమిటి
- విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరే అవకాశం కల్పించడమే బకెట్ సిస్టం ముఖ్య ఉద్దేశం. కోర్సులను నాలుగు బకెట్లు బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్‌సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్)గా విభజించాం. బీఏ విద్యార్థి ల్యాబ్‌తో సంబంధంలేని గణితం, స్టాటిస్టిక్స్ లాంటి కోర్సులనుసైతం ఒక సబ్జెక్ట్‌గా అభ్యసించడం ఈ విధానం ప్రత్యేకత. దీని ఫలితంగా ఒకప్పుడు పరిమితంగా ఉన్న కోర్సు కాంబినేషన్లు ఇప్పుడు 53 కాంబినేషన్లకు చేరాయి.
విద్యార్థులకు మీరిచ్చే సూచనలు
- విద్యార్థులు గందరగోళానికి గురయ్యి ఇతరులను ఆశ్రయించరాదు. ఏ కళాశాల, ఏ యూనివర్సిటీ, ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో ముందే నిర్ధారణకు రావాలి. ఈ క్రమంలో ఒత్తిడికి గురికావొద్దు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీకు సర్టిఫికెట్లను అప్పగించరాదు. ఇలా చేస్తే మోసపోయే ప్రమాదముంది. సొంతంగా, తల్లిదండ్రుల సహకారాన్ని తీసుకుని నచ్చిన కాలేజీలనే వరుసక్రమంలో వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవాలి. సీటు వచ్చిన తర్వాత మూడు రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఆగస్టు 18 నుంచి 21 తేదీల మధ్యలో కాలేజీలకు వెళ్లి సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేస్తే సీటు దక్కుతుంది. లేదంటే సీటు కోల్పోయే అవకాశాలుంటాయి.
ఎడిట్ చేసుకోవచ్చా..
- లాగిన్ అయిన తర్వాత అభ్యర్థులు సబ్మిట్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్‌లో విద్యార్థి తాలూకు వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలను వెబ్ ఆప్షన్లు ఇచ్చే వరకు ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింట్ తీసుకుని దగ్గరుంచుకోవాలి.
కాలేజీలు, కోర్సుల సమాచారం తెలుసుకునేదెలా..
- దోస్త్ హోం పేజీలో సెర్చ్ బై కాలేజీ/ కోర్సుపై క్లిక్ చేసి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నచ్చిన కోర్సు, కాలేజీలో సీటు రాకపోతే సీటును రిజర్వ్ చేసుకుని, ైస్లెడింగ్కు వెళ్లవచ్చు. ఇందుకు ప్రభుత్వ, విశ్వవిద్యాలయ కాలేజీల్లో సీట్లు పొంది, ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు సెల్ఫ్‌రిపోర్టింగ్ కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. అదే ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందిన వారు రూ.500, అన్ని రకాల కాలేజీల్లో సీట్లు పొంది ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత లేనివారు సెల్ఫ్‌రిపోర్టింగ్ కోసం రూ.1000 చెల్లించాలి.
కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహత్మాగాంధీ,
శాతవాహన విశ్వవిద్యాలయాలు
కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం
1046 కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు (వీటి సంఖ్య మారవచ్చు)
రిజిస్ట్రేషన్లు (జూలై 7 వరకు)
–కొంటు మల్లేశం, నమస్తే తెలంగాణ ప్రతినిధి
- Tags
- Degree courses
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు