కరెంట్ అఫైర్స్
జాతీయం
ఎం2 ప్రయోగం
- ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అక్టోబర్ 23న ప్రయోగించిన లాంచ్ వెహికిల్ మార్క్ (ఎల్వీఎం)3-ఎం2 రాకెట్ ప్రయోగం విజయవంతమయ్యింది. దీని ద్వారా 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను పోలార్ లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో)లోకి ప్రవేశపెట్టారు. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వినియోగించడం ఇదే తొలిసారి. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ చేస్తున్న మొదటి బిజినెస్ ప్రాజెక్ట్ ఇది. బ్రిటన్‌కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్ (వన్‌వెబ్ లిమిటెడ్)తో న్యూస్పేస్ ఇండియా చేసుకొన్న ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు. ఇప్పటివరకు జీఎస్ఎల్వీ-ఎంకే3గా పిలిచిన రాకెట్ పేరును ఎల్వీఎం3-ఎం2గా పేరుమార్చారు.
బ్లూ ఫ్లాగ్‌లో భారత బీచ్‌లు
- లక్షద్వీప్‌లోని రెండు బీచ్‌లు ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ బ్లూ ఫ్లాగ్ పొందాయని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అక్టోబర్ 26న వెల్లడించారు. లక్షద్వీప్‌లోని మినికాయ్ తుండి, కద్మత్ బీచ్‌లకు ఈ బ్లూ ఫ్లాగ్ లభించింది. దీంతో భారత్ నుంచి బ్లూ ఫ్లాగ్ పొందిన బీచ్‌ల సంఖ్య 12కు చేరింది. పరిశుభ్రమైన, సుందరమైన, టూరిస్టులకు భద్రత, మెరుగైన సేవలందించే బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ ఇస్తారు. డెన్మార్క్‌లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) ఈ బ్లూ ఫ్లాగ్‌ను అందిస్తుంది. ఎఫ్ఈఈ నిర్వహించే ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు దోహదం చేస్తుంది.
జాతికి అంకితం - లడఖ్, జమ్ముకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో వ్యూహాత్మకంగా కీలకప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన సుమారు 75 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింత్ జాతికి అంకితమిచ్చారు. అక్టోబర్ 28న తూర్పు లడఖ్‌లోని దర్బుక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీఎస్-డీబీవో) హైవే వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. 75 ప్రాజెక్టుల్లో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక కార్బన్ న్యూట్రల్ హాబిటాట్ ఉన్నాయి. ఇవి ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్ర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.
కౌంటర్ టెర్రరిజం కమిటీ
- యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) ప్రత్యేక సమావేశం ఢిల్లీలో అక్టోబర్ 28, 29 తేదీల్లో నిర్వహించారు. ‘కౌంటరింగ్ ది యూజ్ ఆఫ్ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ టెర్రరిస్ట్ పర్పసెస్’ అనే థీమ్‌తో ఈ మీటింగ్ చేపట్టారు. క్రిప్టో కరెన్సీ ద్వారా టెర్రర్ ఫైనాన్సింగ్, ఉగ్రవాదంలో డ్రోన్ల వాడకం గురించి చర్చించారు.
తెలంగాణ
అస్కితో రెడ్కో ఒప్పందం
- ఇంధన సంరక్షణ కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (అస్కి)’తో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో-తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అక్టోబర్ 26న ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఐదేండ్ల పాటు రెండు సంస్థలు ఇంధన సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అస్కి డైరెక్టర్ జనరల్ (ఇన్చార్జ్) డాక్టర్ నిర్మల్య బాగ్చి, టీఎస్రెడ్కో వీసీ, ఎండీ ఎన్ జానయ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
వార్తల్లో వ్యక్తులు
అమౌ హాజీ
- ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పిలిచే అమౌ హాజీ అక్టోబర్ 23న మరణించాడు. 94 ఏండ్ల వయస్సున్న ఆయన ఇరాన్‌లోని డెగాహ్ గ్రామంలో నివసించేవాడు. ఈయన అనారోగ్యం బారిన పడతాననే భయంతో స్నానం చేసేవాడు కాదు. ఈ ఏడాది ప్రారంభంలో కొందరు గ్రామస్థుల ప్రోద్బలంతో సుమారు 60 సంవత్సరాల తర్వాత ఒకే ఒక్కసారి స్నానం చేశాడు.
జీ జిన్‌పింగ్
- జీ జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి అక్టోబర్ 23న ఎన్నికయ్యారు. ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)’ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడిగా రికార్డు సృంచించారు. జిన్‌పింగ్ అధ్యక్షతన జరిగిన సీపీసీ 20వ సెంట్రల్ కమిటీ ప్లీనరీ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్‌గానూ ఆయన నియమితులయ్యారు.
మాతా అమృతానందమయి
- జీ-20 కూటమిలో పౌరసమాజం తరఫున ప్రాతినిథ్యం వహించే సివిల్ 20 (సీ20) గ్రూప్ చైర్‌పర్సన్‌గా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయి దేవిని కేంద్రప్రభుత్వం అక్టోబర్ 27న నియమించింది. ఆమె జీ20 నాయకులకు ప్రభుత్వేతర, వ్యాపారేతర అంశాలపై ప్రజల వాణిని ఆమె వినిపించనున్నారు. భారతదేశం డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు జీ20 అధ్యక్ష పదవి చేపట్టనున్నది. 2023, సెప్టెంబర్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో నిర్వహించనున్నారు.
నవజిత్ కౌర్ - భారత సంతతికి చెందిన నవజిత్ కౌర్ బ్రార్ కెనడాలోని బ్రాంప్టన్ నగర కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారని అక్కడి అధికారులు అక్టోబర్ 27న వెల్లడించారు. ఆమె బ్రాంప్టన్ వెస్ట్ మాజీ ఎంపీ (కన్జర్వేటివ్ పార్టీ) జెర్మైన్పై గెలుపొందారు. ఆమె రెస్పిరేటరీ థెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు.
అంతర్జాతీయం
డిజార్మమెంట్ వీక్
- ఐక్యరాజ్యసమితి డిజార్మమెంట్ వీక్ (నిరాయుధీకరణ వారం)ను అక్టోబర్ 24 నుంచి 30 వరకు నిర్వహించింది. ఐక్యరాజ్యసమితిని స్థాపించిన సందర్భంగా ఈ వీక్‌ను నిర్వహిస్తున్నారు. 1978లో ఈ వీక్‌ను నిర్వహించాలని గుర్తించారు. డిజార్మమెంట్ వీక్‌లో పాల్గొని, నిరాయుధీకరణపై ప్రజల్లో అవగాహన పెంచాలని 1995లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ ప్రభుత్వాలను, ఎన్జీవోలను ఆహ్వానించింది. నిరాయుధీకరణతో శాంతి, భద్రతలు పెరగడంతో పాటు మానవాళి రక్షణ, సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు.
ప్లెయిన్ లాంగ్వేజ్ బిల్
- ప్లెయిన్ లాంగ్వేజ్ (తేలికైన భాష) బిల్‌ను న్యూజిలాండ్ ప్రభుత్వం అక్టోబర్ 26న ఆమోదించింది. గవర్నమెంట్ డాక్యుమెంట్స్, వెబ్సైట్లలో సాధారణ ప్రజలకు కూడా సులభంగా అర్థమయ్యే ఇంగ్లిష్ భాషను వినియోగించాలని ఈ బిల్ ఉద్దేశం. ఈ చట్టం వల్ల ఇంగ్లిష్‌ను రెండో భాషగా మాట్లాడేవారికి, వికలాంగులు, తక్కువ విద్యావంతులకు ప్రయోజనం చేకూరుతుంది.
కాప్ 27
- యునెటైడ్ నేషన్స్ ైక్లెమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్ 27) సదస్సును నవంబర్ 6 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు అక్టోబర్ 26న వెల్లడించారు. ఈ సదస్సును ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్‌లో నిర్వహించనున్నారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ ైక్లెమేట్ చేంజ్ (యూఎన్ఎఫ్సీసీసీ) అమలును పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ (కాప్)ను ఏర్పాటుచేశారు. ఈ 27వ సదస్సుకు ఈజిప్ట్ ఆతిథ్యం ఇస్తుంది.
లా అండ్ ఆర్డర్
- ‘గ్లోబల్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్-2022’ను గాలప్ సంస్థ అక్టోబర్ 27న విడుదల చేసింది. ప్రపంచంలో సురక్షితమైన దేశాలను ఈ సూచీలో వెల్లడించింది. 120 దేశాలతో ఈ రిపోర్టును రూపొందించింది. ఈ జాబితాలో 96 పాయింట్లతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. తజికిస్థాన్ (95) 2, నార్వే (93) 3, స్విట్జర్లాండ్ (92) 4, ఇండోనేషియా (92) 5వ స్థానాల్లో నిలిచాయి.
- భారతదేశం (80) 60వ స్థానంలో ఉండగా.. చివరి ఐదు స్థానాల్లో సియెర్రా లియోన్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, వెనెజులా, గబాన్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.
రద్దీ విమానాశ్రయాలు
- ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాలపై రూపొందించిన ఓఏజీ (అఫీషియల్ ఎయిర్‌లైన్ గైడ్) రిపోర్టు అక్టోబర్ 27న విడుదలయ్యింది. ఈ రిపోర్టులో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ 2, టోక్యో హానెడా ఎయిర్పోర్ట్ 3, డల్లార్/ఫోర్ట్ ఎయిర్పోర్ట్ (అమెరికా) 4, డెన్వర్ ఎయిర్పోర్ట్ (అమెరికా) 5, లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ 6, చికాగో ఒహారే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 7, ఇస్తాంబుల్ 8, లాస్ ఏంజెల్స్ ఎయిర్పోర్ట్ 9వ స్థానాల్లో నిలిచాయి.
- దీనిలో భారతదేశంలోని ఢిల్లీ (ఇందిరాగాంధీ) ఎయిర్పోర్ట్ 10వ స్థానంలో ఉంది.
క్రీడలు
ఆకర్షి కశ్యప్
- మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ మహిళల విభాగంలో భారత్‌కు చెందిన ఆకర్షి కశ్యప్ గెలుపొందింది. అక్టోబర్ 23న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ఇరా శర్మను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో లూయిస్ ఎన్రిక్ పెనాల్వర్ (స్పెయిన్) గెలిచాడు.
- మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి (తెలంగాణ)-రోహన్కపూర్ జంట విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-రోహన్ కపూర్ (భారత్) జోడీ గెలిచింది.
షి యూ కి
- డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను చైనా క్రీడాకారుడు షి యూ కి గెలుచుకున్నాడు. అక్టోబర్ 23న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో యూకి ఇండోనేషియాకు చెందిన లీ జి జియాను ఓడించాడు.
- మహిళల సింగిల్స్‌లో చైనాకు చెందిన హి బింగ్జిబావో గెలిచింది. ఆమె ఫైనల్ మ్యాచ్‌లో చైనాకే చెందిన చెన్ యుఫీని ఓడించింది.
- పురుషుల డబుల్స్‌లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్, మహ్మద్ రియాన్ అర్డియాంటో జోడీ గెలిచింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను చైనాకు చెందిన కింగ్‌చెన్, జియా యిఫాన్ జంట గెలుచుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో చైనాకు చెందిన జెంగ్ సివీ, హువాంగ్ యాకియోంగ్ జంట గెలిచింది.
వెర్స్టాపెన్
- మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్ బుల్ డ్రైవర్) యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. అక్టోబర్ 25న యూఎస్ఏలోని టెక్సాస్‌లోని సర్క్యూట్ ఆఫ్ అమెరికాస్‌లో జరిగిన ఈ పోటీలో వెర్స్టాపెన్ మొదటి స్థానంలో నిలువగా.. హామిల్టన్ (మెర్సిడెస్ డ్రైవర్) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది 13వ విజయం.
పురుషులతో సమానంగా మహిళలు
- భారత క్రికెట్ మహిళలకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజును ఇవ్వనున్నట్లు బీసీసీఐ అక్టోబర్ 27న వెల్లడించింది. దీంతో టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇప్పటివరకు వారికి టెస్టు మ్యాచ్‌కు రూ.4 లక్షలు, వన్డే, టీ20లకు రూ.లక్ష చొప్పున ఇచ్చారు. పురుషులతో సమానంగా మహిళల ఫీజు ఉండాలనే నిర్ణయంలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది.
అర్చన కే ఉపాధ్యాయురాలు, విషయ నిపుణులు, నల్లగొండ
Previous article
Recommended Daily Allowance of Salt?
Next article
‘భారతీయ పత్రిక విమోచనకారి’ అని ఎవరిని అన్నారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు