పారామెడికల్..భవిష్యత్తు సూపర్
ఏదైనా రోగమొస్తే వైద్యుడిని సంప్రదిస్తాం.. వైద్యుడు రోగనిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయించుకోమంటాడు. ఈ పరీక్షలు చేసేవారు, వైద్యుడికి సహాయంగా ఉండేవారే పారామెడికల్ సిబ్బంది. ఇప్పుడున్న పాండమిక్ పరిస్థితిలో వీరి అవసరం చాలా ఏర్పడింది. కరోనా తదితర నిర్ధారణ పరీక్షలు చేయాలంటే ఈ పారామెడికల్ సిబ్బందే కీలకం. అందుకే పారామెడికల్ కోర్సులు చేస్తే ప్రస్తుతానికే కాకుండా ఎప్పటికైనా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ పారామెడికల్ కోర్సుల గురించి ‘నిపుణ’ పాఠకుల కోసం ఈ వ్యాసం.
ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ: ఆపరేషన్ గదిలో రోగి, వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచేందుకు ఈ కోర్సు పూర్తిచేసినవారు అవసరమవుతారు. ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేయడం, ఆపరేషన్‌కు ముందు రోగిని గదిలోకి తీసుకెళ్లడం, సర్జరీ చేసేవారికి, అనస్థీషియా ఇచ్చేవారికి, నర్సులకు సాంకేతికంగా తోడ్పడటం వీరి పని. దీనిలో బీఎస్సీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సుల కాలవ్యవధి మూడేండ్లు కాగా.. డిప్లొమా కోర్సుల కాలవ్యవధి ఏడాది నుంచి రెండేండ్ల వరకు ఉంటుంది. సైన్స్ స్ట్రీమ్‌తో ఇంటర్ పూర్తిచేసినవారు అర్హులు. మెరిట్ ఆధారంగా ప్రవేశాలుంటాయి. నిమ్స్ స్కూల్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, టెక్ మహీంద్ర, స్మార్ట్ అకాడమీ ఫర్ హెల్త్‌కేర్ ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ: మనిషి శరీరంలో రోగ నిర్ధారణలో ఇమేజింగ్ టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారు ఎక్స్‌రే టెక్నీషియన్‌గా, ఎంఆర్ఐ, సీటీ స్కానర్స్‌గా ఆస్పత్రుల్లో ఉద్యోగాలు సంపాదించవచ్చు. సొంతంగా ల్యాబ్‌లు నడుపుకోవచ్చు. డయాగ్నస్టిక్ సెంటర్లలో ఉద్యోగం చేసుకోవచ్చు.
బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ: గుండె లేకపోతే మనిషి బతకలేడు. మనిషి జీవనానికి గుండె కారణం. గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తనాళాల పనితీరు గురించి ఈ కోర్సులో నేర్పుతారు. ఓపెన్ హార్ట్ సర్జరీ, పేస్ మేకర్, స్టంట్స్ అమరిక వంటి వాటిల్లో ఈ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. ఈ కోర్సు పూర్తిచేసినవారు ఆస్పత్రుల్లో ఓటీ అసిస్టెంట్స్‌గా ఉద్యోగం సంపాదించవచ్చు. అనుభవంతో కార్డియాలజీ టెక్నీషియన్‌గా, క్యాథ్‌ల్యాబ్ విభాగంలో ఉద్యోగులుగా కెరీర్ ప్రారంభించవచ్చు.
బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ: ఆపరేషన్ సమయంలో రోగికి నొప్పి తెలియకుండా మత్తుమందు అవసరం. దీనికి ప్రత్యేక నిపుణుల అవసరం ఉంటుంది. రోగికి ఎంత మోతాదులో మత్తుమందు ఇవ్వాలో వీరు నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఆపరేషన్లు అవసరమయ్యే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అనస్థీషియన్లకు డిమాండ్ బాగా ఉంది. కాబట్టి వీరి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. ఈ కోర్సు పూర్తిచేసినవారు ఆస్పత్రుల్లో ఆపరేషన్ టెక్నీషియన్లుగా, వైద్యులకు సహాయకులుగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ: రక్తాన్ని శుద్ధిచేయడం కిడ్నీల విధి. వీటి పనితీరులో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ వ్యక్తికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది కిడ్నీ సమస్యలతో సతమవుతున్నారు. వీరికి అవసరమైన డయాలసిస్ చికిత్సను నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. దీంతో ఈ కోర్సు పూర్తిచేసినవారికి డిమాండ్ బాగా ఉంది. వీరికి డయాలసిస్ సెంటర్లు, ఆస్పత్రుల్లో ఉద్యోగాలు లభిస్తాయి. లేదా సొంతంగా ల్యాబ్‌లు కూడా పెట్టుకోవచ్చు.
బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ: గుండెకు సంబంధించిన వ్యాధులను అరికట్టడం, చికిత్స విధానం వంటివి ఈ కోర్సులో భాగం. గుండె, ఊపిరితిత్తుల పర్యవేక్షణ, చికిత్సలో ఈ నిపుణుల అవసరం చాలా ఉంది. ఈ కోర్సు పూర్తిచేసినవారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సర్జన్ అసిస్టెంట్లు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లుగా ఉపాధి లభిస్తుంది.
బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్టీ): మనిషిలోని వ్యాధులను తెలిపేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే వారిని పరీక్షించే వైద్యులు వీరిదగ్గరకు పంపిస్తారు. వీరు వైద్యుడు సూచించిన టెస్టులు చేసి వ్యాధిని గుర్తిస్తారు. దీంతో డాక్టర్ అందుకు తగిన చికిత్స చేస్తారు. ఆస్పత్రుల్లో వీరు చాలా అవసరం. కాబట్టి ఈ కోర్సును పూర్తిచేసినవారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: నరాలకు సంబంధించిన చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బోధిస్తారు. ఇందులో నరాలు, కండరాల పనితీరు గురించి తెలుసుకుంటారు. ఈ కోర్సు పూర్తిచేసినవారు న్యూరోసర్జన్లు, న్యూరోఫిజీషియన్లు, న్యూరాలజిస్టులకు అసిస్టెంటులుగా ఉపాధి పొందవచ్చు. సొంతంగా క్లినిక్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ: వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా, వృద్ధాప్యంవల్ల శరీర జాయింట్లలో బెణకడం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అప్పుడు వారికి ఫిజియోథెరపీ చికిత్స అందిస్తారు. మనిషి శరీరంలోని భాగాలు, వాటి అమరిక గురించి బోధిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి ఆస్పత్రుల్లో ఉపాధి లభిస్తుంది. సొంతంగా క్లినిక్‌లు కూడా పెట్టుకోవచ్చు.
బీఎస్సీ నర్సింగ్: ఆస్పత్రుల్లో డాక్టర్ రోగికి చికిత్సకు సంబంధించిన వైద్యాన్ని సూచిస్తే వాటిని సకాలంలో రోగికి అందించేవారే నర్సులు. రోగికి చికిత్స అందించడంలో వీరి పాత్రే కీలకం. రోగికి అందించాల్సిన ప్రథమ చికిత్స దగ్గర నుంచి వైద్యానికి సంబంధించిన అన్ని విషయాలు ఈ కోర్సులో వీరికి నేర్పుతారు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి త్వరగా ఉపాధి లభిస్తుంది.
పై కోర్సులు చేయడానికి సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు కావాలి. తెలుగు రాష్ర్టాలు నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చు.
పారామెడికల్ అంటే?
ప్రస్తుతం ఏ హాస్పిటల్ చూసినా రోగులతో కిటకిటలాడుతుంది. ప్రతి హాస్పిటల్లో వైద్యుడు ఎంత ముఖ్యమో.. వీరికి సాయం అందించేవారు కూడా అంతే ముఖ్యం. వారే పారామెడికల్ సిబ్బంది. వైద్యులు రక్త పరీక్షలు, స్కానింగ్, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రేలకు సిఫారసు చేస్తుంటారు. ఇలా ఈ టెస్టులతో పారామెడికల్ సిబ్బంది రోగ నిర్ధారణ చేస్తారు. ఒక్కో వైద్యనిపుణుడికి సంబంధించిన టెక్నికల్ నిపుణుడి సహకారం ఇప్పుడు ఎంతో అవసరం. ఈ టెక్నికల్ నైపుణ్యాన్ని అందించే కోర్సులే ‘పారామెడికల్ కోర్సులు’.
డాక్టర్ పట్టాలేకుండానే వైద్యుల్లాగానే సేవలు అందించాలనుకునేవారికి పారామెడికల్ రాజమార్గం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను రాష్ట్రంలోని పారామెడికల్ బోర్డు నిర్వహిస్తుంది. చాలా సంస్థలు మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని మాత్రం ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.
కోర్సులు
బీవోటీ (బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ): దీన్ని ఫిజికల్ థెరపీ అని కూడా అంటారు. ఇది ప్రధానంగా వైద్యులు సూచించిన నివారణ పద్ధతులను ఆచరించడం, రిహాబిలిటేషన్ ద్వారా జబ్బులను నయం చేయడంపై దృష్టిసారిస్తుంది. శారీరక, భావోద్వేగ, మానసిక సమస్యలను ఎలా అదుపుచేయాలో, నివారించాలో దీనిలో నేర్చుకుంటారు. కోర్సులో భాగంగా రోగి చుట్టుపక్కల వాతావరణంలో మార్పులు చేయడం, రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో బోధించడం వంటి అంశాలను తెలుసుకుంటారు. దీనిలో పీడియాట్రిక్స్, హ్యాండ్ థెరపీ, అడల్ట్ రిహాబిలిటేషన్, విజన్ రిహాబిలిటేషన్, ఎర్గోనామిక్స్, డెవలప్మెంట్ కండిషన్స్, అసిస్టెడ్ లివింగ్, హోమ్హెల్త్, డ్రైవర్ రిహాబిలిటేషన్స్, న్యూరాలజికల్, సైకియాట్రిక్, మస్కులోస్కెలెటల్, ఇండస్ట్రియల్ రిహాబిలిటేషన్ వంటి స్పెషలైజేషన్లు ఉంటాయి.
కాలవ్యవధి నాలుగేండ్లు. ఈ కోర్సు చేయడానికి బైపీసీతో ఇంటర్ పాసైనవారు అర్హులు. కనీసం 55 శాతం మార్కులు వచ్చి ఉండాలి. కొన్ని సంస్థలు మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ, సీఎంసీ వెల్లూర్, మణిపాల్ యూనివర్సిటీ, ఏఐఐపీఎంఆర్, కేఎంసీహెచ్ వంటి కొన్ని సంస్థలు సొంత ప్రవేశపరీక్షలను నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి.
బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ: వినడం, మాట్లాడటంలో ఏవైనా లోపాలు వచ్చినప్పుడు వీటికి సంబంధించిన నిపుణుల అవసరం ఏర్పడుతుంది. కోర్సులో వినడం, మాట్లాడటానికి సంబంధించిన పరికరాల గురించి నేర్పుతారు. ఈ సమస్యలను గుర్తించడం, అంచనావేయడం, సహాయపడటం ద్వారా సాయపడతారు. దీనిలో డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. బీఎస్సీ నాలుగేండ్లు కాగా డిప్లొమా ఏడాది నుంచి రెండేండ్లు ఉంటుంది. సైన్స్ విభాగంలో ఇంటర్ పూర్తిచేసినవారెవరైనా ఎంచుకోవచ్చు. చాలావరకు అన్ని సంస్థలు ప్రవేశపరీక్షను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తాయి.
బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ: ప్రపంచాన్ని చూడాలన్నా, ప్రకృతిని ఆస్వాదించాలన్నా నేత్రాలే ప్రధానం. అటువంటి కండ్లకు ఏదైనా సమస్య వస్తే చికిత్స అందించేందుకు దోహదపడేవారే ఆప్టోమెట్రిక్ టెక్నాలజిస్టులు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి ఆప్టోమెట్రిస్ట్‌గా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అనుభవం పొందిన తర్వాత ఆప్టోమెట్రీ టెక్నీషియన్‌గా స్థిరపడవచ్చు.
తెలంగాణలో..
2006లో ఉమ్మడి రాష్ట్రంలోనే పారామెడికల్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు తెలుగు రాష్ర్టాలకు ప్రత్యేక పారామెడికల్ బోర్డులు ఏర్పడ్డాయి. దాదాపు 22 రకాల పారామెడికల్ డిప్లొమా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఏ స్థాయి కోర్సైనా పూర్తిచేసిన తర్వాత రాష్ట్ర పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోవాలి.
తెలంగాణ పారామెడికల్ బోర్డు అందిస్తున్న డిప్లొమా కోర్సులు
l డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్టీ), డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్ (డీవోటీ), డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ (డీహెచ్ఎఫ్ఎస్ఎం), డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్-పురుషులు (డీఎంపీహెచ్డబ్ల్యూ-ఎం), డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంబ్ (డీవోఏ), డిప్లొమా ఇన్ ఆడియో-మెట్రీ టెక్నీషియన్ (డీఏఎం), డిప్లొమా ఇన్ రేడెయోథెరపీ టెక్నీషియన్ (డీఆర్‌టీటీ), డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నీషియన్ (డీపీఈఆర్ఎఫ్యూ), డిప్లొమా ఇన్ డయాలసిస్ (డీడీఐఏఎల్‌వై), డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (డీఎంఐటీ), డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ (డీఆర్ఈఎస్టీ), డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ & ఆపరేషన్ టెక్నీషియన్ (డీఎంఎస్&వోటీటీ), డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్ థెరపీ టెక్నీషియన్ (డీఎల్హెచ్ఎస్టీ), డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ (డీడీటీ), డిప్లొమా ఇన్ డెంటల్ హైజీనిస్ట్ (డీడీహెచ్‌వై), డిప్లొమా ఇన్ మైక్రో సర్జరీ (డీఎంఎస్), డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ (డీఏఎన్ఎస్), డిప్లొమా ఇన్ క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ (డీసీఎల్‌టీ), డిప్లొమా ఇన్ రేడియోగ్రఫిక్ అసిస్టెంట్ (డీఆర్జీఏ), డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ (డీడీఆర్ఏ), డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ (డీఈసీజీ), డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ (డీసీఏఆర్‌డీఐవో)
ఈ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో జిల్లాలవారీగా వెలువడనున్నది.
జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశ ప్రక్రియ ఉంటుంది.
బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను మాత్రం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు