కరెంట్ అఫైర్స్
జాతీయం
పర్యావరణ దినోత్సవం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ‘ఇథనాల్ మిశ్రమ మార్గసూచీ 2020-25’ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను 2022కి, 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించాలన్న లక్ష్యాన్ని 2025కి చేరుకోవాలని ప్రభుత్వం గతేడాది నిర్దేశించింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ వనరును కల్పించినట్లవుతుందని ప్రధాని వెల్లడించారు. ‘పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ’ అనే ఇతివృత్తాన్ని ఈ ఏడాది తీసుకున్నారు.
ఆటోమేటెడ్ వెంటిలేటర్లు
కరోనా చికిత్సకు ఆటోమేటెడ్ కంప్రెషన్ ఆధారంగా వినియోగించే మూడు రకాల వెంటిలేటర్లను రూపొందించినట్లు ఇస్రో జూన్ 7న ప్రకటించింది. ‘ప్రాణ (ప్రోగ్రామబుల్ రెస్పిరేటరీ అసిస్టెన్స్ ఫర్ ది నీడీ ఎయిడ్)’ అనే ఈ వెంటిలేటర్లు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ వెంటిలేటర్లు ఎయిర్ వే ప్రెషర్ సెన్సార్, ఫ్లో సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, సర్వో యాక్చుయేటర్ వంటి వ్యవస్థలతో టచ్‌స్క్రీన్ ద్వారా రోగికి అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి.
భారత్-స్వీడన్
భారత్-స్వీడన్ రక్షణ పరిశ్రమ సహకారంపై జూన్ 8న జరిగిన సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. భారత్‌లో విదేశీ ఆయుధ తయారీ సంస్థలు సొంతంగా గానీ, భారత కంపెనీల భాగస్వామ్యంతో గానీ ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేయాలని స్వీడన్ సంస్థలను ఆయన కోరారు. దేశంలో 41 ఆయుధ కర్మాగారాలు, 9 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయన్నారు.
నేవీ విన్యాసాలు
అండమాన్ నికోబార్ దీవుల్లో 31వ ఎడిషన్ ఇండో-థాయ్ కార్పాట్ నేవీ విన్యాసాలు జూన్ 9 నుంచి 11 వరకు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య నావికా సంబంధాల మెరుగు కోసం ఈ విన్యాసాలు చేపట్టారు.
శిశు సేవా పథకం
అస్సాం ప్రభుత్వం శిశు సేవా పథకాన్ని కరోనా అనాథల కోసం జూన్ 10న ప్రారంభించింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన కొద్దిమంది లబ్ధిదారులకు ఆర్థిక సాయంగా రూ.7,81,200లను బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వీటి నుంచి వారికి నెలకు రూ.3,500 చొప్పున 24 ఏండ్లు వచ్చేవరకు అందజేస్తారు.
అంతర్జాతీయం
ఓఎస్టీ నుంచి వైదొలగిన రష్యా
ఓపెన్ స్కై ట్రీటీ (ఓఎస్టీ-స్వేచ్ఛాయుత గగనతల ఒప్పందం) నుంచి వైదొలగుతున్నట్లు రష్యా జూన్ 7న ప్రకటించింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత పరస్పర విశ్వాస కల్పన చర్యల్లో భాగంగా రష్యా, నాటో దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఒక దేశ నిఘా విమానం ఇంకో దేశంలోకి వెళ్లవచ్చు. ఈ ఒప్పందం నుంచి అమెరికా 2020లో వైదొలగింది. బైడెన్ ప్రభుత్వం తిరిగి ఈ ఒప్పందంలో చేరలేదు. దీంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.
యూఎన్వోలో భారత్
ఐక్యరాజ్యసమితికి చెందిన కీలక విభాగమైన ఆర్థిక, సామాజిక మండలిలో భారత్‌కు జూన్ 8న చోటు లభించింది. 2022-24 కాలానికి సభ్యదేశంగా భారత్ ఎన్నికయ్యింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్, కజకిస్థాన్, ఒమన్ కూడా ఎన్నికయ్యాయి.
చైనా వ్యతిరేక బిల్లు
అమెరికా పరిశోధనల్లో చైనా పెత్తనాన్ని నిరోధించే కీలకమైన బిల్లుకు సెనెట్ జూన్ 9న ఆమోదం తెలిపింది. డెమొక్రటిక్ సెనెటర్ చక్ షుమర్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు రిపబ్లికన్లు కూడా మద్దతివ్వడంతో 68-32 ఓట్లతో ఆమోదం పొందింది. యూఎస్ ఇన్నోవేషన్, కాంపిటేషన్ చట్టంగా పిలిచే ఈ చట్టం వల్ల 100 బిలియన్ డాలర్లను సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలకు వినియోగిస్తారు.
అల్బేనియా అధ్యక్షుడి అభిశంసన
ఐరోపా ఖండంలోని అల్బేనియా దేశాధ్యక్షుడు ఇలిర్ మేటాను అభిశంసిస్తూ ఆ దేశ పార్లమెంట్ జూన్ 9న తీర్మానాన్ని ఆమోదించింది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో అధికార సోషలిస్టులకు వ్యతిరేకంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నది ఆరోపణ. అధ్యక్షునిగా పక్షపాతంతో వ్యవహరించినందుకు పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఈ తీర్మానాన్ని చేసింది.
కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్
ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ ‘ఆర్ఓజీ ఫ్లోఎక్స్ 13’ను అభివృద్ధి చేసినట్లు తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆసుస్ జూన్ 9న ప్రకటించింది. 13 అంగుళాలతో ఏఎండీ రైజెన్ 5900 హెచ్ఎస్, 5900 హెచ్ఎక్స్ ప్రాసెసర్లతో ఆర్ఓజీ ఫ్లోఎక్స్ 13 ల్యాప్‌టాప్‌ను రూపొందించింది.
నివాసయోగ్య నగరాల జాబితా
లండన్‌కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను జూన్ 10న విడుదల చేసింది. ఈ జాబితాలో ఆక్లాండ్ (న్యూజిలాండ్) మొదటిస్థానంలో నిలువగా.. తర్వాతి స్థానాల్లో ఒసాకా (జపాన్), అడిలైడ్ (ఆస్ట్రేలియా), వెల్లింగ్టన్ (న్యూజిలాండ్), టోక్యో (జపాన్), పెర్త్ (ఆస్ట్రేలియా) నిలిచాయి. నివాసయోగ్యంకాని నగరాల్లో మొదటి స్థానంలో డమాస్కస్ (సిరియా) తర్వాత స్థానంలో లోగాస్ (నైజీరియా) నిలిచాయి.
జీ-7 సదస్సు
47వ జీ-7 దేశాల సమావేశం జూన్ 11 నుంచి 13 వరకు ఇంగ్లండ్ కార్న్‌వాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సు థీమ్ ‘గొప్పగా తిరిగి నిర్మిద్దాం’. జీ-7 కూటమి బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, అమెరికా దేశాలు అతిథి దేశాలుగా భారత్ ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను ఆహ్వానించాయి. పర్యావరణం పరిరక్షణ, జీవావరణం, కరోనా నియంత్రణ, సుస్థిరమైన అభివృద్ధిపై చర్చించారు.
వార్తల్లో వ్యక్తులు
అబ్దుల్లా షాహిద్
మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్లా షాహిద్ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్జీఏ) 76వ సమావేశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూన్ 7న నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 191 ఓట్లకు గాను ఆయనకు 143 ఓట్లు వచ్చాయి. ఆయనతో పోటీపడిన ఆఫ్ఘనిస్థాన్ విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి జుల్మాయ్ రసోల్కు 48 ఓట్లు లభించాయి. సెప్టెంబర్‌లో నిర్వహించే సమావేశాలకు షాహిద్ అధ్యక్షత వహిస్తారు.
ఎంఆర్ కుమార్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చైర్మన్‌గా ఉన్న ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ సంస్థ జూన్ 9న నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీకాలం జూన్ 30న పూర్తికానున్న నేపథ్యంలో 2022, మార్చి 13 వరకు పెంచారు. 1956, సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఎల్ఐసీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
బుద్ధదేవ్ దాస్‌గుప్తా
ప్రముఖ బెంగాలీ సినీ దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా జూన్ 10న మరణించారు. ఆయన 1944లో పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో జన్మించారు. 12 జాతీయ అవార్డులు, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో సిల్వర్ లయన్ అవార్డు, లొకర్నో క్రిటిక్స్, లొకర్నో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు.
ఆర్ఎస్ సోఢీ
టోక్యోలో ఆసియా ఉత్పాదకత సంస్థ నుంచి ఆసియా పసిఫిక్ ఉత్పాదకత చాంపియన్ అవార్డు ఆర్ఎస్ సోఢీకి జూన్ 11న స్వీకరించారు. ఆయన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు మేనేజింగ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. గత 20 ఏండ్లలో ఇలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించిన తొలి భారతీయుడు సోఢీ.
నాగరాజు నాయుడు
యూఎన్వో జనరల్ అసెంబ్లీకి క్యాబినెట్ డి చీఫ్‌గా నాగరాజు నాయుడు జూన్ 11న నియమితులయ్యారు. ఈయన ఇండియన్ ఫారిన్ సర్వీసులకు చెందిన అధికారి. కరోనా నియంత్రణలో ప్రపంచ దేశాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఆయన కృషిచేయాలి. యూఎన్వోకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఆయన నియమితులయ్యారు.
జాహిద్ ఖురేషి
అమెరికాలోని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. జూన్ 11న నిర్వహించిన ఎన్నికల్లో ఆయనకు 81-16 ఓట్లతో సెనెట్ ఆమోదం తెలిపింది. అమెరికా చరిత్రలో అమెరికన్ ఫెడరల్ జడ్జిగా నియమితులైన తొలి ముస్లిం జాహిద్. ఈ ఎన్నికలో డెమొక్రాట్లతో రిపబ్లికన్లు చేతులు కలిపారు.
క్రీడలు
సెర్గీ పెరెజ్
రెడ్ బుల్ డ్రైవర్ సెర్గీ పెరెజ్ జూన్ 6న నిర్వహించిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. ఈ పోటీలో వెటెల్ 2, గాస్లీ 2వ స్థానాల్లో నిలిచారు. హామిల్టన్ కారు ట్రాక్ తప్పడంతో 15వ స్థానానికి పడిపోయాడు.
డింకో సింగ్
మణిపురికి చెందిన భారత బాక్సర్ డింకో సింగ్ క్యాన్సర్‌తో జూన్ 10న మరణించాడు. అతడు 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాడు. 1998లో అర్జున, 2013లో పద్మశ్రీ అవార్డులను అందుకున్నాడు.
వినేశ్ ఫోగట్
పోలెండ్‌లో జూన్ 11న నిర్వహించిన 53 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫోగట్ స్వర్ణం సాధించింది. మార్చిలో మాటి యా పెలికాన్ టైటిల్, ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం దక్కింది. ఒలింపిక్స్‌లో టాప్ సీడ్ రెజ్లర్‌గా బరిలోకి దిగనున్నది.
ఫుట్‌బాల్ టోర్నీ
యూరోపియన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను జూన్ 11న ప్రారంభించారు. ఈ టోర్నీని రోమ్ నగరంతో పాటు మొత్తం 11 దేశాల్లో నిర్వహిస్తారు. 24 జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు లండన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు