ఏ వర్గం జీవులు సమఖండ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి?
జంతు రాజ్యం (Animal Kingdom)
1. అకశేరుకాలు (Ivertebrates)
ప్రొటోజొవా
పొరిఫెరా
సీలెంటిరేటా
టీనోఫొరా
ప్లాటీహెల్మింథిస్
ఆస్క్ హెల్మెంథిస్
అనెలిడా
ఆర్థ్రోపొడా
మొలస్కా
ఇఖైనోడర్మేటా
హెమీకార్డేటా
2. సకశేరుకాలు (Vertebrates)
చేపలు (Pesces)
ఉభయచరాలు (Amphibians)
సరీసృపాలు (Reptiles)
పక్షులు (Aves)
క్షీరదాలు (Mammales)
జంతువులు – వర్గీకరణ
వెన్నెముకను ఆధారంగా చేసుకుని జంతువులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. అకశేరుకాలు (Ivertebrates/Non-chordata)
2. సకశేరుకాలు (Vertebrates/chordata)
– స్థూలంగా అకశేరుకాలను 10 వర్గాలు (Phyla)గా, సకశేరుకాలను 5 తరగతులుగా విభజించవచ్చు.
1. అకశేరుకాలు/నాన్ కార్డేటా
- వెన్నెముకలేని జంతువులను అకశేరుకాలు అంటారు. లేదా పృష్ఠవంశం లేని జంతువులను నాన్కార్డేటా అంటారు.
- స్థూలంగా అకశేరుకాలను/నాన్కార్డేట్లను కింది వర్గాలుగా విభజించవచ్చు.
ప్రొటోజొవా (Protozoa):
- ప్రొటోజొవన్ల అధ్యయనాన్ని ప్రొటోజువాలజీ అంటారు.
- ఇవి జంతురాజ్యంలో మొదటి జంతువులు.
- ఇవి ఏకకణ జీవులు. వీటిలో ఒకటే కణం శ్వాస, విసర్జక, జీర్ణ, ప్రత్యుత్పత్తి మొదలైన విధులను నిర్వర్తిస్తుంది.
- ఉదా: అమీబా, యూగ్లీనా, పారామీషియం, ప్లాస్మోడియం, నాక్టిల్యుకా, సిరాన్షియం, బాలాంటీడియం కోలై, ఎంటమీబా హిస్టాలిటికా, జియార్డియా ఇంటస్టైనాలిస్, హార్మనెల్లా, లీష్మానియా బ్రాసిలియెన్సిస్/డోనోవాని/ట్రోపికా, ప్లాస్మోడియం వైవాక్స్/పాల్సిఫెరమ్/మలేరియే/ఓవెల్, ట్రైకోమోనాస్, ట్రిఫనోసోమా, టాక్సోప్లాస్మా.
- అమీబా అనే ప్రొటోజొవా జీవి ఎల్లప్పుడూ తన ఆకారాన్ని మార్చుకోవడం (నిర్దిష్ట ఆకారం ఉండదు) వల్ల దీన్ని ప్రొటియస్ యానిమల్ క్యూల్ (గ్రీకు దేవత) అంటారు. మిద్యాపాదాలు దీని చలనంలో తోడ్పడుతాయి.
- యూగ్లీనా అనేది వృక్షాలకు, జంతువులకు మధ్య సంధాన సేతువు. దీని చలనానికి కశాభాలు (Flagella) తోడ్పడుతాయి.
- పారామీషియంను స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు. దీని చలనానికి శైలికలు (Cilia) తోడ్పడుతాయి.
- ప్లాస్మోడియం అనేది మలేరియా వ్యాధిని కలిగిస్తుంది. దీనిలో 4 ప్రజాతులు ఉన్నాయి. అవి..
- ప్లాస్మోడియం వైవాక్స్ – బినైన్ టెర్షియన్ మలేరియా
- ప్లాస్మోడియం పాల్సిఫెరం – మాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా
- ప్లాస్మోడియం ఓవెల్ – మైల్డ్ టెర్షియన్ మలేరియా
- ప్లాస్మోడియం మలేరియే – క్వార్టన్ మలేరియా
- పై నాలుగింటిలో ప్లాస్మోడియం వైవాక్స్ సాధారణమైన అధికంగా విస్తరించిన మలేరియా పరాన్నజీవి.
నాక్టిల్యుకా, సిరాన్షియా జీవసందీప్తిని (Bioluminiscence) ప్రదర్శిస్తాయి.
పొరిఫెరా (Porifera)
- వీటి అధ్యయనాన్ని పారాజువాలజీ అంటారు.
- ఇది అతిచిన్న వర్గం.
- వీటిని సాధారణంగా స్పంజికలు అంటారు.
- దేహంపై రంధ్రాలను కలిగి ఉండటం వీటి ప్రధాన లక్షణం. ఈ రంధ్రాలను ఆస్టియా అంటారు.
- ఇవి మొదటి బహుకణ జీవులు.
- వీటిలో కుల్యావ్యవస్థ ఉంటుంది. ఇది ఆహారసేకరణ, శ్వాస, విసర్జన క్రియల్లో తోడ్పడుతుంది.
- వీటి శరీరకుడ్యం ద్విస్తరితంగా ఉంటుంది.
- ఉదా: సైకాన్ – స్కైఫా
- యూస్పాంజియా – స్నానస్పంజిక (Bath Sponge)
- యూప్లెక్టెల్లా – వీనస్ పూలసజ్జ (దీన్ని జపాన్‌లో పెండ్లి జంటలకు కానుకగా ఇస్తారు)
- చలైనా – మృతుని వేలు (Dead man finger)
- క్లయోనా – బోరింగ్ స్పాంజ్ (ముత్యపు చిప్పలకు రంధ్రాలు చేస్తుంది)
- హయలోనీమా – గాజుతాడు స్పంజిక
- డిస్కోడెర్మియా డిసోల్యూటా అనే జీవి నుంచి డిస్కోడెర్మోలైడ్ అనే పదార్థం లభిస్తుంది. దీన్ని క్యాన్సర్ చికిత్సలో వాడుతారు.
సీలెంటిరేటా/నిడేరియా (Coelenterata/Cnidaria)
- వీటి అధ్యయనాన్ని నిడేరియాలజీ అంటారు.
- ఈ జీవుల శరీరంలో కుట్టుకణాలైన దంశకణాలు (Cnidoblasts or Cnidocytes) ఉంటాయి. ఈ కణాలు ఉండటంవల్లనే ఈ వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చింది. ఇవి అంటిపెట్టుకోవడానికి, ఆత్మరక్షణకు, భోజ్యజీవిని పట్టుకోవడానికి ఉపయోగపడుతాయి.
- ఇవి మొదటి కణజాల స్థాయి ఏర్పడిన జీవులు.
- శరీరకుడ్యం కూడా ద్విస్తరితంగా ఉంటుంది.
- నాడీవ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలు మొదటగా ఈ జీవుల్లోనే ఏర్పడ్డాయి.
- జీవుల్లో రెండు రకాల జీవకాలు ఉంటాయి. అవి.. 1. పాలిప్, 2. మెడ్యుసా
- ఉదా:
- హైడ్రా
- ఒబీలియా – సీఫర్
- పైసేలియా – పోర్చుగీస్ మాన్ ఆఫ్ వార్
- అరేలియా – జెల్లీచేప/మూన్ చేప
- రైజోస్టోమా
- ఎడామ్సియా – సీ అనిమోన్
- కొరాలియం రుబ్రమ్ – ఎరుపు శిలాప్రవాళం
- గార్గోనియా – సముద్ర విసనకర్ర
- పెన్నాట్యులా – సముద్రకలం
- సీలెంటిరేటా జీవులు స్రవించే కాల్షియం కార్బోనేట్ నిల్వలను ప్రవాళాలు (Corals) అంటారు. అనేక ప్రవాళాలు కలిసి ఏర్పడిన దిబ్బను ప్రవాళ అవరోధం/పగడపు దీవి (Coral reef) అంటారు.
టీనోఫొరా (Ctemphora)
- వీటిని సాధారణంగా సీవాల్నట్ (Sea walnuts)/కోంబ్ జెల్లీలు (Comb)/సీగూస్ బెర్రీలు (Sea goose berries) అంటారు.
- ఇవి కణజాలస్థాయి కలిగిన ద్విస్తరిత జీవులు.
- వీటి శరీర బాహ్యతలంపై ఎనిమిది వరుసల కోంబ్ప్లేట్స్ ఉంటాయి. ఇవి గమనానికి తోడ్పడుతాయి.
- వీటిలో లాసో కణాలు/కోలోబ్లాస్ట్ కణాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి తోడ్పడుతాయి.
- ఈ జీవులు జీవసందీప్తిని (సజీవులు కాంతిని వెలువరించడం) అత్యున్నతస్థాయిలో కనబరుస్తాయి.
ఉదా: ఫ్లూరో బ్రాకియా, హార్నిఫొరా, టీనోప్లానా, బెరో
ప్లాటీ హెల్మింథిస్ (Platy helmenthes)
- ఈ జీవుల దేహం పృష్టోదరంగా అణిగి ఉండటంవల్ల వీటిని బల్లపరుపు పురుగులు (flat worms) అంటారు.
- ఇవి మొదటి త్రిస్తరిత జీవులు. మొదటి అవయవ స్థాయి కలిగిన జీవులు.
- ఇవి మొదటి ద్విపార్శ సౌష్ఠవం కలిగిన జీవులు.
- వీటిలో జ్వాలాకణాలు (Flame cells) ఉండి, ద్రవాభిసరణ, విసర్జన క్రియలో తోడ్పడుతాయి.
- ఇవి ఎక్కువగా అంతరపరాన్న జీవులు (Endo parasites). వీటిలో కొక్కేలు (Hooks), చూషకాలు (Suckers) ఉంటాయి.
- ఉదా:
- ప్లనేరియా
- టీనియా సోలియం – పోర్క్ టేప్‌వార్మ్
- టీనియా సాజినేటా – బీఫ్ టేప్‌వార్మ్
- పాసియోలా హెపాటికా – లివర్ఫ్లూక్
- సిస్టోసోమా/బిల్హార్జియా – బ్లడ్ఫ్లూక్
- ఇఖైనోకోకస్ గ్రాన్యులోసస్ – డాగ్ టేప్‌వార్మ్
- ప్లనేరియాలో పునరుత్పత్తి అధికస్థాయిలో ఉంటుంది.
- పాసియోలా హెపాటికా (లివర్ ఫ్లూక్) గొర్రెల్లో లివర్ రాట్ వ్యాధిని కలిగిస్తుంది.
ఆస్క్హెల్మింథిస్/నిమాటీ హెల్మెంథిస్
- ఈ వర్గపు జీవులను నిమటోడా అంటారు.
- వీటిని గుండ్రటి పురుగులు, దారపు పురుగులు, నులిపురుగులు, ఏలికపాములు అంటారు.
- ఇవి అవయవస్థాయి కలిగిన జీవులు.
- మొదటగా జీర్ణనాళం ఈ జీవుల్లోనే ఏర్పడింది.
ఉదా: - ఆస్కారిస్ – రౌండ్ వార్మ్
- ఉకరేరియా – ఫైలేరియా వార్మ్
- ఆంఖైలోస్టోమా – హుక్ వార్మ్
- ఎంటిరోబియస్ వర్మిక్యులారిస్ – పిన్ వార్మ్
- ట్రైకీనెల్లా – ట్రైకినా పురుగు
- ట్రైక్యూరిస్ – విప్ పురుగు
- ప్లాటీ, నిమాటీ హెల్మెంథిస్ జీవుల అధ్యయనాన్ని హెల్మెంథాలజీ అంటారు.
అనెలిడా (Annelida):
- ఈ జీవుల శరీరంపై వలయాకార ఖండితాలు (అన్యుల్స్) ఉండటంవల్ల వీటికి అనెలిడా అనే పేరు వచ్చింది.
- ఇవి సమఖండ విన్యాసాన్ని (Metame- rism) ప్రదర్శిస్తాయి.
- ఇవి మొదటి నిజ శరీరకుహర జీవులు.
- మొదటగా రక్తప్రసరణ వ్యవస్థ ఈ జీవులలోనే కనబడింది (సంవృత రక్తప్రసరణ వ్యవస్థ).
- నీరిస్ లాంటి వాటిలో పార్శపాదాలు ఉండి ఈదడంతోపాటు శ్వాసక్రియలో తోడ్పడుతాయి.
ఉదా: - నీరిస్ – ఇసుక పురుగు/రాగ్వార్మ్
- పెరిటిమా – ఎర్త్‌వార్మ్
- హిరుడినేరియా – బ్లడ్ సక్కింగ్ లీచ్
- అరెనికోలా – లగ్వార్మ్
- పాంటోబ్డిల్లా – సముద్ర జలగ
- హిమడిప్పా – భూచర జలగ
- పలాలో పురుగు – పలాలో పురుగు జీవసందీప్తిని ప్రదర్శిస్తుంది.
వానపాము (Earth worm)
- వీటిని కృషీవలుడికి మిత్రులు (Friends of farmers) అని, వీటి పెంపకాన్ని వర్మీకల్చర్ (Vermi Culture) అని, వీటి ఎరువును వర్మికంపోస్ట్ అని అంటారు.
- వానపాములు నేలలో బొరియలు చేయడంవల్ల నేల సారవంతం అవుతుంది. ఈ కారణంగా వీటిని సహజనాగళ్లు అంటారు.
- వీటిని చేపలు పట్టడానికి ఎరలుగానూ, గౌట్ వ్యాధి చికిత్సలోనూ వాడుతారు.
జలగ (Leech)
- దీని శాస్త్రీయ నామం హిరుడినేరియా.
- ఇది కుట్టినప్పుడు లాలాజలం ద్వారా హిరుడిన్ అనే పదార్థం రక్తనాళాల్లోకి పోతుంది. ఫలితంగా కుట్టిన ప్రదేశంలో రక్తం గడ్డకట్టదు.
- వైద్యరంగంలో జలగలను ఉపయోగించి చెడు రక్తాన్ని తీసే ప్రక్రియను ప్లిబోటమి అంటారు.
మాదిరి ప్రశ్నలు
1. కింది ప్రశ్నను పరిశీలించి సమాధానం గుర్తించండి. (1)
నిశ్చితం(A): వానపామును కృషీవలుని మిత్రుడు అంటారు.
కారణం(R): వానపాములు నేలలో బొరియలు చేయడంవల్ల రంధ్రాలు ఏర్పడి నేలలోకి గాలి ప్రవేశిస్తుంది. క్రిమి విసర్జితాల వల్ల నేల సారవంతం అవుతుంది.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు (R) సరైనది
2. కింది ప్రశ్నను పరిశీలించి సమాధానం గుర్తించండి.
(1) నిశ్చితం (A): బద్దెపురుగులను శరీర కుహర రహిత జీవులు అంటారు.
కారణం (R): బద్దె పురుగుల్లో శరీర కుహరం ఉండదు.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు (R) సరైనది
3. కింది ప్రశ్నను పరిశీలించి సమాధానం గుర్తించండి. (3)
నిశ్చితం (A): ప్లాటీ హెల్మెంథిస్ జీవులు మొదటగా ద్విపార్శ సౌష్ఠవాన్ని ప్రదర్శించాయి.
కారణం (R): ప్లాటీహెల్మెంథిస్ జీవుల్లో మెదడు బాగా అభివృద్ధి చెందింది.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు (R) సరైనది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు