అడ్మిషన్ వచ్చిందా.. ప్రయాణానికి సిద్ధం కండి
విజయం అందరికీ చాలా ముఖ్యమైంది. చాలా ఆనందాన్ని తెస్తుంది. మీరు చేరాలనుకుంటున్న విశ్వవిద్యాలయం నుంచి వచ్చే ప్రవేశ అనుమతి లేఖను స్వీకరించడం అటువంటి క్షణం. ఎంతో ఆత్రుతతో ఆ పత్రాన్ని తెరిచి, శుభాకాంక్షలు అని మీ కంటికి కనిపించే ఆ పదం, మీరు నెలల తరబడి చదివిన చదువుకి, రాసిన పరీక్షలకు, అడ్మిషన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం వెచ్చించిన సమయానికి అన్నిటికీ ఒక తీపి ముగింపు అనిపించవచ్చు. ఇది శుభసమయమే కానీ ఇది ఒక నూతన ఆరంభానికి నాంది. దీంతో ప్రయాణానికి సిద్ధం కండి. తరువాత ఏం చెయ్యాలో తెలుసుకుని మొదలుపెట్టండి.
ఆఫర్ లెటర్ లో ఏం ఉండవచ్చు?
ప్రవేశ ఆఫర్‌ను జాగ్రత్తగా చదవండి. ప్రవేశం కల్పించిన ప్రోగ్రామ్ గురించి తెలుసుకోండి. ఈ-మెయిల్ లేదా మరేదైనా ప్రక్రియ ద్వారా ప్రవేశాన్ని అంగీకరించడాన్ని నిర్ధారించాల్సిన గడువు ఏదైనా ఉంటే చూడండి. కోర్సు ఎంపిక కోసం మార్గనిర్దేశం చేసే ఎవరైనా సలహాదారుడిని మీకోసం కేటాయిస్తే వారిని కూడా సంప్రదించవచ్చు. క్యాంపస్‌కు చేరుకోవడానికి ముందు కళాశాల ప్రారంభ తేదీలు, ఇతర అవసరాల గురించి తెలుసుకోండి. దీనిని జాగ్రత్తగా భద్ర పరుచుకోండి.
ఏ కాలేజీలో చేరుతారు?
వివిధ ర్యాంకింగ్స్‌లో ఉన్న కనీసం అయిదు విశ్వవిద్యాలయాలకైనా అప్లికేషన్ పంపించి ఉంటారు. మీకు వచ్చిన ఆఫర్ అన్నిటికన్నా నచ్చినదైతే మంచిది. లేదంటే, మిగిలిన కళాశాలల నుంచి వారి రిజల్ట్స్ ఎప్పటికల్లా పంపిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కాలేజీ వెబ్సైట్ ద్వారా గాని, అడ్మిషన్ ఆఫీస్‌కి ఈ-మెయిల్ ద్వారా గాని ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.
ఫైనాన్షియల్ రెడీనెస్
ప్రతి కాలేజీకి ఒకే ఫీజు ఉండదు. అలాగే, ప్రతి సంవత్సరానికి ఆ ఫీజు పెరిగే అవకాశం ఉంది. అడ్మిషన్ ప్రవేశపత్రంలో సాధారణంగా ట్యూషన్ ఫీజు, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత పడవచ్చో ఇస్తారు. అలాగే ఏవైనా బీమా లేదా ఇతర ఖర్చుల గురించి కూడా సాధారణంగా తెలియ చేస్తారు. అలాగే మీ మార్కుల వల్ల మీ కాలేజీ తరఫు నుంచి ఏదైనా స్కాలర్షిప్ వస్తే ఆ సమాచారాన్ని కూడా అందులోనే కొన్ని కళాశాలలు పెట్టవచ్చు.
ట్యూషన్ ఫీజు, ట్రావెల్ ఖర్చులు, నివాసం ఖర్చులు మొదలైన వాటికి సొమ్ము ఎలా సమకూర్చుకోవాలో ఆలోచించండి.
మీ అకడమిక్ స్కోర్స్ బాగున్నట్లయితే కాలేజీ తరఫు నుంచి కొంత స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర స్కాలర్‌షిప్‌ల సమాచారాన్ని సేకరించండి.
బ్యాంకుల్లో ఫారిన్ ఎడ్యుకేషన్ లోన్స్, స్టడీ ఎడ్యుకేషన్ లోన్స్ వంటి వాటికీ అర్జీ పెట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి అవసరం మీకు ఉంటుందనుకుంటే ముందుగానే ఆలోచించి పెట్టుకున్న బ్యాంకును సంప్రదించండి. లోన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా సరే కొన్నిసార్లు మీకు శాంక్షన్ అవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. కాబట్టి ప్లానింగ్ అవసరం. ముఖ్యమైన తేదీలను ఎప్పుడు కూడా మరిచిపోకండి.
ఆ దేశానికి వెళ్లి బ్యాంకు అకౌంట్ తెరవడానికి కొంత సమయం పడుతుంది. బ్యాంకు అకౌంట్ అనగానే ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటివి సమకూర్చవలసి వస్తుంది. కాబట్టి కొన్ని వారాల వరకు ఖర్చులకు అవసరమైన డబ్బుని దగ్గర పెట్టుకోండి. విమాన ట్రావెల్లో క్యాష్ తీసుకువెళ్లే విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి ట్రావెలర్ చెక్స్ రూపంలో తీసుకోవచ్చు. ఎస్బీఐ బ్యాంక్ యాత్ర కార్డును అందిస్తుంది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఇతరులు కూడా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి సులువుగా ఉండటానికి క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. ఏదేమైనా అటువంటి కార్డు ఆమోదం పొందడం కోసం ఆ బ్యాంకు నియమాలను బట్టి అర్హులై ఉండాలి. కాబట్టి సరిగ్గా ప్లాన్ చేయండి. వెస్ట్రన్ యూనియన్ వంటి ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా మన దేశం నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకు ధనం పంపించవచ్చు.
వీసా అప్రూవల్
అడ్మిషన్ చేతిలోకి రాగానే విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేం. అడ్మిషన్ ఆఫర్ లెటర్ కేవలం ఆ యూనివర్సిటీలో చదవడానికి అవకాశం ఉందని తెలిపే పత్రం. కానీ ఆ దేశంలో చదివే అనుమతి కోసం వీసా అప్రూవల్ కోసం ప్రయత్నించాలి. సాధారణంగా ఆ దేశం కాన్సులేట్ ఆఫీస్ ద్వారా వీసా అప్రూవల్ వస్తుంది.
వీసా అపాయింట్మెంట్ కోసం తగిన వీసా ఫీజు చెల్లించి, తగిన ఫారంలు సబ్మిట్ చేసి, వీసా ఆఫీస్‌లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ దగ్గరలో ఉన్న కాన్సులేట్ ఆఫీస్‌లో తేదీలు దొరకట్లేదంటే, ఇతర పట్టణాలు లేదా రాష్ర్టాల్లో ఉన్న ఆఫీస్‌లకు వెళ్లాల్సి వస్తుంది.
ప్రతి దేశం వివిధ రకాల వీసాలు ఇస్తుంది. విద్యాభ్యాసం కోసం వెళ్తున్నారు కాబట్టి దానికి తగ్గ వీసాకి అర్జీ పెట్టుకోవాలి. ఉదాహరణకి సాధారణంగా అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఎఫ్-1 వీసాకి అప్లయ్ చేస్తారు.
వీసా ప్రయోజనాల కోసం సాధారణంగా అడ్మిషన్ లెటర్, విద్యార్హతలకు సంబంధించిన మార్కులు, పట్టా, విదేశాల్లో ఖర్చులు భరించగలరని ఆర్థిక స్తోమతకు సంబంధించిన రుజువులు, గుర్తింపు, చిరునామా రుజువు, ఫొటోలు, వీసా దరఖాస్తు పత్రం, వీసా దరఖాస్తు రుసుం చెల్లింపు, ఇతర ఫీజులు, ఫారం ఏవైనా ఉంటే అవికూడా ఆయా దేశాలకు అనుగుణంగా అవసరమైన పత్రాలను తీసుకెళ్లండి. అదనపు జిరాక్స్ కాపీలను కూడా తీసుకెళ్లండి. ఒకవేళ మొదటిసారి వీసా అప్రూవల్ రాకపోతే మరొకసారి ప్రయత్నించే అవకాశం ఉందో తెలుసుకొని ప్రయత్నించండి.
ఏదైనా కారణాల వల్ల జాయినింగ్ తేదీ వరకు ఆ యూనివర్సిటీకి వెళ్లలేక పోతే, అడ్మిషన్ ఆఫర్‌ని మరొక సెమిస్టర్లో ప్రవేశం పొందే అవకాశం ఉందేమో ఆ కాలేజీ అడ్మిషన్స్ టీంని అడిగి తెలుసుకోండి.
వీసా ఇంటర్వ్యూ లో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సాధారణంగా అడిగే ప్రశ్నలు.. విదేశాలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? ఏం చదవాలనుకుంటున్నారు? డిగ్రీ స్పెషలైజేషన్ ఏంటి? ఎక్కడ చదివారు? ఎన్ని కాలేజీలకు అప్లయ్ చేశారు? ఈ కాలేజీకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? స్కూల్ ఫీజు? వ్యక్తిగత ఫీజు కట్టడానికి ఎవరు సహాయపడతారు? బ్యాంకు స్టేట్మెంట్లు, చదువు పూర్తయ్యాక ఏం చేద్దామనుకుంటున్నారు?
ఫ్లైట్ టికెట్
వీసా కన్ఫర్మేషన్కి అనుగుణంగా విమానం టికెట్ ప్లాన్ చేసుకోండి. కాలేజీ జాయినింగ్ తేదీకి ఎన్ని రోజుల ముందు వరకు ఆ దేశంలో ప్రవేశించడానికి అనుమతి ఉందో దృష్టిలో పెట్టుకొని టికెట్ కొనుక్కోండి.
ఫ్లైట్‌లో తీసుకెళ్లగలిగే సామాన్ల విషయంలో ఒక పరిమితి ఉంటుంది. అలాగే బరువు విషయంలో ఒక లిమిట్ ఉంటుంది. అవి తెలుసుకోండి.
ఆన్ క్యాంపస్ అవకాశాలు
విద్యార్థులు యూనివర్సిటీల్లో చదువుకుంటూనే వివిధ ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నించవచ్చు. టీచింగ్ అసిస్టెంట్‌షిప్, రిసెర్చ్ అసిస్టెంట్‌షిప్ వంటి అవకాశాల గురించి కాలేజీ వెబ్సైట్లో చూసుకుని ప్రయత్నించండి.
పికప్ అండ్ స్టే
ప్రతి ఒక్కరికి విదేశాల్లో బంధువులు ఉండకపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి కాలేజీకి వెళ్లడానికి, ఉండటానికి చోటు గురించి ఆలోచించుకోవాలి.
పికప్ చేసుకోవడానికి ఎవరైనా రాగలరేమో చూసుకోవాలి లేదా ఎయిర్పోర్ట్ నుంచి కాలేజీకి గల ప్రయాణ మార్గాల గురించి తెలుసుకోవాలి.
కాలేజీకి వసతి అవకాశాలు ఉండి ముందే బుక్ చేసుకునే అవకాశం గురించి తెలుసుకోవాలి. అక్కడ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంటే వారి సహాయం పొందవచ్చు.
వెళ్లగానే కనీసం తాత్కాలికంగా ఉండటానికయినా వసతి అవసరాల గురించి ప్రయాణానికి ముందే తెలుసుకుంటే బాగుంటుంది.
ఇన్సూరెన్స్ , వ్యాక్సినేషన్ వంటి అవసరాల గురించి తెలుసుకోవాలి. వీలైతే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోండి.
డిజిటల్ వరల్డ్ కాలేజీ వెబినార్లు, ఓపెన్ హౌస్ వంటివి నిర్వహిస్తే తప్పక అటెండ్ అవండి. అవకాశం ఉంటే డ్రైవింగ్ నేర్చుకోండి. అక్కడికి వెళ్లిన తరువాత అవసరమయ్యే సాఫ్ట్వేర్ కోర్సులు ఏమైనా ఉంటే నేర్చుకోండి. వీలైతే ఇంటర్నేషనల్ రోమింగ్ ఉన్న ఫోన్ తీసుకువెళ్లండి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు