వ్యర్థాలను ఒడిసిపట్టి.. మలినాలను వడపోసి!
- విసర్జన- వ్యర్థ పదార్థాల తొలగింపు
కొత్తగా ఏ వస్తువును ఉత్పత్తి చేసినా దానితో పాటు వ్యర్థ పదార్థాలు కూడా ఏర్పడటమనేది సహజం. ఎలాంటి వ్యర్థ పదార్థాలు లేకుండా ఏ కర్మాగారమూ నూతన ఉత్పత్తిని చేపట్టలేదు. మానవ శరీరం ఒక సజీవ కణ కర్మాగారం. జీవుల్లో జీవక్రియలు జరిగేటప్పుడు అవసరమైన పదార్థాల ఉత్పత్తిలో భాగంగా నిర్దిష్ట విరామాల్లో అనేక వ్యర్థ పదార్థాలు తయారవుతాయి.
l వివిధ జీవక్రియల్లో ఏర్పడ్డ నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు, లవణాలు, ఎక్కువగా ఉన్న నీరు, ఇతర వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియను విసర్జన అంటారు. విసర్జన (Excreation) లాటిన్ భాషలో Ex అంటే బయటకు అని Crenere అంటే పంపడం అని అర్థం. విసర్జన సజీవుల్లో జరిగే ఒక జీవక్రియ. అంటే దేహంలో తయారయ్యే వ్యర్థ పదార్థాలను వేరుచేయడం, బయటకు పంపించడం జరగుతుంది.
మానవుల్లో విసర్జన
l వివిధ జీవక్రియల్లో అసంఖ్యాకమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. వీటిలో ఉపయోగకరమైన పదార్థాలు, శక్తి ఉత్పన్నం అవుతాయి. అయితే అదే సమయంలో అనేక మార్పులు సంభవిస్తాయి. హానికరమైన పదార్థాలు ఉత్పన్నం కావడం, నీటి స్థాయి పెరగడం, అయాన్ల సమతుల్యతలో మార్పు రావడం జరుగుతుంటాయి. మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాల్లో కార్బన్ డై ఆక్సైడ్, నీరు, నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా, యూరియా, యూరికామ్లం, పైత్యరస వర్ణకాలు, అదనపు లవణాలు ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాలన్నింటిలో అమ్మోనియా విషతుల్యమైనది.
l మానవుడిలో విసర్జన ముఖ్యంగా మూత్ర లేదా విసర్జక వ్యవస్థ ద్వారా జరుగుతుంది. దీనిలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి.
మూత్ర సంఘటనం
l మూత్రంలో 96 శాతం నీరు 2.5 శాతం కర్బన పదార్థాలు (యూరియా, యూరికామ్లం, క్రియాటిన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు, ఆగ్జలేట్లు), 1.5 శాతం అకర్బన పదార్థాలు (సోడియం, క్లోరైడ్, పాస్ఫేట్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్). మూత్రం మొదట ఆమ్లయుతంగా (PH 6.0) ఉన్నప్పటికీ క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరిగి అమ్మోనియా ఏర్పడుతుంది.
అనుబంధ విసర్జకావయవాలు: ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం, పెద్దపేగు మొదలైన అవయవాలు ప్రాథమికంగా చేయవలసిన ప్రత్యేక విధులున్నప్పటికీ అదనంగా విసర్జన ప్రక్రియను కూడా నెరవేరుస్తాయి.
ఇతర జీవుల్లో విసర్జన
విసర్జన వివిధ రకాలైన జీవుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఏకకణ జీవుల్లో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉండవు. కణంలోని వ్యర్థ పదార్థాలను వ్యాపన పద్ధతిలోబయటకు పంపుతాయి. బహుకణ జీవులు వివిధ రకాలైన విసర్జకాంగాలను కలిగి ఉండి శరీరంలోని వ్యర్థాలను బయటకు విసర్జిస్తాయి. ప్లాటిహెల్మింథిస్లో మొట్టమొదటగా విసర్జకాంగాలు కనిపిస్తాయి. వాటిని జ్వాలా కణాలు అంటారు.
డయాలసిస్
l మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడపోస్తారు. కృత్రిమంగా రక్తాన్ని వడకట్టే ప్రక్రియను హీమోడయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్త స్కందనాన్ని నిరోధించే కారకాలను (హెపారిన్) డయలైజర్ యంత్రంలోకి పంపే ఏర్పాటు చేస్తారు. డయలైజర్ యంత్రంలో రక్తం కొన్ని గదులు లేదా గొట్టాల వంటి సెల్లోఫిన్తో తయారైన నాళికల ద్వారా ప్రవహిస్తుంది. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి. ఒక సన్నని పొర నాళికలోని రక్తాన్ని బయట ఉన్న డయలైజింగ్ ద్రావణాన్ని వేరుచేస్తుంది. డయలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేసిన రక్తాన్ని తిరిగి సిర ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ప్రక్రియకు 3-6 గంటల సమయం పడుతుంది.
మూత్రపిండ మార్పిడి
l మూత్రపిండాలు పనిచేయనివారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియనే మూత్రపిండ మార్పిడి అంటారు. మూత్రపిండాలు పనిచేయని వారికి దగ్గరి బంధువు(దాత) నుంచి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమరుస్తారు. రోగికి అమర్చిన మూత్రపిండం సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి ఉంటుంది.
ముఖ్యాంశాలు
- మూత్రపిండాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు.
- మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రాశయం, మూత్రనాళాలను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని యూరాలజీ అంటారు.
- మూత్రం లేత పసుపు రంగు ద్రవం. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోం అనే పదార్థం ఈ రంగుకు కారణమవుతుంది.
- మూత్రపిండాలు పనిచేయకపోడాన్ని ESRD (End Stage Renal Disease) అంటారు.
- మానవుడు రోజుకు దాదాపు 1.6-1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు.
- మూత్రాశయం నుంచి మూత్రం బయటకు విసర్జించే విధానాన్ని మిక్చురేషన్ అంటారు.
- మూత్రాశయంలో గరిష్ఠంగా 700-800 మి.లీ మూత్రం నిల్వ ఉంటుంది.
- కృత్రిమ మూత్రపిండాలను మొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త విలియం జె.కాఫ్.
- గాలి తగలగానే మూత్రం నల్లగా మారే జన్యు సంబంధిత వ్యాధి ఆల్కాప్టోన్యూరియా.
మూత్రపిండాల నిర్మాణం
l మానవుడిలో చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఇవి ఉదర కుహరంలో పృష్ట శరీర కుడ్యానికి అతుక్కోని, వెన్నెముకకు ఇరువైపులా అమరి ఉంటాయి. కుడివైపు మూత్రపిండం ఎడమ వైపు దాని కన్నా కొద్దిగా కిందికి ఉంటుంది. దీనికి కారణం ఎడమ వైపు కాలేయం అధిక భాగం ఆక్రమిస్తుంది. మూత్రపిండాలు 10 సెం.మీ. పొడవు, 5-6 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందంతో ఉంటాయి. ప్రతి మూత్రపిండం వెలుపలి వైపు కుంభాకారంగాను, లోపలి వైపు పుటాకారంగానూ ఉంటుంది. పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని ‘హైలస్’ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్క ధమని మూత్రపిండంలోకి ప్రవేశిస్తుంది. వృక్కసిర, మూత్రనాళం వెలుపలికి వస్తాయి. శరీరంలోని వివిధ అవయవాల్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్క ధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కసిర మూత్రపిండం నుంచి బయటకు పంపుతుంది. మూత్రపిండంలో రక్తం వడకట్టబడుతుంది. ఫలితంగా వేరైన వ్యర్థాలు మూత్రంగా బయటకు విసర్జితమవుతాయి.
మూత్రపిండం అంతర్నిర్మాణం
l మూత్రపిండం లోపల రెండు భాగాలుగా కనిపిస్తుంది. ముదురు గోధుమ వర్ణంలోనున్న వెలుపలి భాగాన్ని వల్కలం అని, లేత వర్ణంలోనున్న లోపలి భాగాన్ని దవ్వ అని అంటారు. ప్రతి మూత్రపిండంలోనూ సుమారు ఒక మిలియన్ కన్నా ఎక్కువ సూక్ష్మ వృక్కనాళాలు ఉంటాయి. వీటినే వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్లు అంటారు.
నెఫ్రాన్ నిర్మాణం
l ప్రతి నెఫ్రాన్లో రెండు భాగాలుంటాయి.
అవి 1. మాల్ఫీజియన్ దేహం 2. వృక్క నాళిక
మాల్ఫీజియన్ దేహం: నెఫ్రాన్లో చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని భౌమన్ గుళిక అంటారు. దానిలో ఉన్న రక్తకేశ నాళికలతో ఏర్పడినటువంటి నిర్మాణాన్ని రక్త కేశనాళికా గుచ్ఛం అంటారు. అభివాహి ధమని భౌమన్ గుళికలోనికి ప్రవేశిస్తే అపవాహి ధమని భౌమన్ గుళిక నుంచి వెలుపలికి వస్తుంది. భౌమన్ గుళిక గోడల్లోని కణాలు ఉపకళా కణజాలంతో ఏర్పడతాయి. వీటిని పోడోసైట్లు అంటారు. పదార్థాల వడపోతకు వీలు కలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి.
వృక్కనాళిక: దీనిలో 3 భాగాలుంటాయి. 1. సమీపస్థ సంవళిత నాళం 2. హెన్లీశిక్యం 3. దూరస్థ సంవళితనాళం
l దూరస్థ సంవళిత నాళం సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది. సంగ్రహణ నాళాలు పిరమిడ్లు, కెలిసిస్లుగా ఏర్పడి చివరికి ద్రోణిలోకి తెరుచుకుంటుంది. ద్రోణి మూత్రనాళంలోకి తెరుచుకుంటుంది.
మూత్రం ఏర్పడే విధానం
l మూత్రం ఏర్పడే విధానంలో నాలుగు దశలుంటాయి. అవి.. 1. గుచ్ఛగాళనం 2. వరణాత్మక పునఃశోషణం 3. నాళికాస్రావం 4. అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం.
గుచ్ఛగాలనం: వృక్క ధమని ద్వారా రక్తం అభివాహి ధమనిలోకి రక్తకేశనాళికా గుచ్ఛంలోకి ప్రవహించి, అక్కడ అధిక పీడనంతో వడపోయబడుతుంది. దీని ఫలితంగా వ్యర్థ పదార్థాలతో పాటుగా కొంతనీరు, ఉపయోగకరమైన పదార్థాలు వడపోయబడతాయి. అవి భౌమన్స్ గుళికలోకి ప్రవేశిస్తాయి. దీన్నే గుచ్ఛగాలనం అంటారు. గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన వడపోత పదార్థాన్ని ప్రాథమిక మూత్రం అంటారు.
వరణాత్మక పునఃశోషణం: గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన మూత్రం దాదాపు రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది. హెన్లీ శిక్యం చుట్టూ ఉండే బాహ్య రక్తకేశనాళికలు ప్రాథమిక మూత్రంలోని ఆవశ్యక పదార్థాలు, అధిక మొత్తంలో నీటిని పునఃశోషణం చేస్తాయి.
నాళికాస్రావం: ఆవశ్యక పదార్థాలు, నీటి పునఃశోషణం తర్వాత మూత్రం హెన్లీశిక్యం ద్వారా ప్రవహిస్తుంది. హెన్లీశిక్యం చుట్టూ ఉన్న బాహ్య రక్తకేశనాళికల నుంచి రక్తకేశనాళికా గుచ్ఛంలో వడపోయబడిన వ్యర్థ పదార్థాలు హెన్లీ శిక్యంలోకి స్రవించబడతాయి.
అతిగాఢత గల మూత్రం ఏర్పడటం: హెన్లీశిక్యం నుంచి సంగ్రహణ నాళంలోకి చేరిన మూత్రం వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో మరింత గాఢత చెందుతుంది. వాసోప్రెసిన్ లోపం వల్ల తక్కువ గాఢత గల మూత్రం అధికంగా విసర్జితమవుతుంది. ఈ స్థితిని అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు.
మూత్రనాళికలు
l ప్రతి మూత్రపిండం నొక్కు లేదా హైలస్ నుంచి ఒక జత తెల్లని, కండరయుతమైన మూత్రనాళాలు బయటకు వస్తాయి. ఇవి దాదాపు 30 సెం.మీ. పొడవు ఉంటాయి. ప్రతి మూత్రపిండం హైలస్ నుంచి మూత్రనాళాలు బయలుదేరుతాయి. పరభాగానికి ప్రయాణించి మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి.
మూత్రాశయం
l పలుచని గోడలు కలిగి, బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. ఇది ద్రోణి భాగంలో పురీషనాళానికి ఉదర తలాన ఉంటుంది. మూత్రనాళాల ద్వారా దాదాపు 300-800 మి.లీ మూత్రాన్ని ఇది తాత్కాలికంగా నిల్వ చేస్తుంది.
ప్రసేకం
l ప్రసేకం మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు విసర్జించే నాళం. మూత్రాశయం చివర ప్రసేకంలోకి తెరుచుకునే చోట, వర్తుల సంవరణి కండరాల నుంచి మూత్ర కదలికల నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రసేకం స్త్రీలలో 4 సెం.మీ. పొడవుండి అళిందంలోకి తెరుచుకుంటుంది. దీన్ని మూత్రజననేంద్రియనాళంగా పిలుస్తారు.
– ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
sudha.avanchi@gmail.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు