స్వచ్ఛ గురుకులాలకు బహుమతులు
5 – 11 వరకు స్వచ్ఛ కార్యక్రమాలు
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం
స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ
ఆరోగ్య విద్యాలయాలే లక్ష్యం
ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘స్వచ్ఛ గురుకులం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకులాల్లో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. ఈ నెల 5 నుంచి వారం రోజులపాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది.
ఎడతెరిపి లేని వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీజనల్ వ్యాధు లు ప్రబలడానికి కేవలం స్వీపర్లే అన్న అపోహ నెలకొన్నది. ఎవరిపైనో నెపం మోపి విద్యార్థుల అస్వస్థతకు బాధ్యులను చేయడం కంటే బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వస్తాయని భావించిన గిరిజన సంక్షేమశాఖ ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ‘స్వచ్ఛ గురుకులం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల నుంచి అందరూ భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణ రూపొందించింది. ఇందుకు గురుకులానికో రూ.20 వేలను ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గురుకులాలను ప్రోత్సాహించేందుకు నగదు బతులను ఇవ్వనున్నారు. స్వచ్ఛ గురుకులం కార్యక్రమం పూర్తి అయిన రోజు లేదా మరుసటి రోజు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన అధికారి సంబంధిత గురుకులాన్ని సందర్శించి, పరిసరాలను తనిఖీ చేసి మార్కులు ఇస్తారు. వాటి ఆధారంగానే జిల్లా, రాష్ట్రస్థాయి బమతులను అందజేయనున్నారు.
ఉత్తమ స్వచ్ఛ గురుకులాలకు పురస్కారాలు
ప్రతిభ కనబరిచిన గురుకులాలకు అవార్డుతోపాటు నగదు పురస్కారాలను ప్రభుత్వం అందజేయనున్నది.
రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి
1,00,000 20,000
ప్రథమ ప్రథమ
50,000 15,000
ద్వితీయ ద్వితీయ
25,000 10,000
తృతీయ తృతీయ
స్వచ్ఛ స్ఫూర్తి నిత్యం కొనసాగాలి
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వచ్ఛ గురుకుల ఉద్యమాన్ని నిర్వహించాలని, ఈ స్ఫూర్తి నిత్యం కొనసాగాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. స్వచ్ఛ గురుకుల్ పోస్టర్‌ను మంత్రి శుక్రవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. గురుకులాల్లో చేపట్టే స్వచ్ఛ ఉద్యమంలో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని కోరారు. ఇకపై గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, విద్యార్థుల ప్రవర్తన, చదువు తదితర విషయాలపై ప్రోగ్రెస్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇంటి నుంచి గురుకులానికి వచ్చే ప్రతి విద్యార్థికి హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. గురుకులాల్లో విద్యార్థుల పర్యవేక్షణ కోసం 24 గంటలు ఏఎన్‌ఎంతోపాటు వార్డెన్ అందుబాటులో ఉండాలని చెప్పారు. రాష్ట్రంలోని 160 గురుకులాలు, 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గురుకులంలో ఏ రోజు ఏ కార్యక్రమం..
మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5న) రోజున స్వచ్ఛ గురుకుల ప్రతిజ్ఞతో ప్రారంభమై వారంపాటు నిర్వహించే కార్యక్రమాలివే..
మొదటి రోజు
విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ స్వచ్ఛ గురుకుల ప్రతిజ్ఞ. అనంతరం గురుకుల ఆవరణలో చెత్త తొలగింపు. ప్రతి ఒక్కరూ చేతితొడుగులు (హ్యాండ్ గ్లౌసెస్) ధరించాలి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ పెట్టుకోవా లి.
రెండో రోజు
ప్రధానోపాధ్యాయులు పాఠశాల, వసతిగృహ భవనంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలి. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులు, ప్లంబర్ కమ్ ఎలక్టీషియన్, ప్రిన్సిపాల్‌తోపాటు స్వీపింగ్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనాలి. స్టాఫ్‌రూమ్‌లు, ప్రత్యేక గదులు, ప్రిన్సిపాల్ రూమ్, వెల్నెస్ సెంటర్, స్పోర్ట్స్ రూమ్, స్టోర్ రూమ్, లేబొరేటరీలు మొదలైన వాటిని సంబంధిత సిబ్బంది మాత్రమే శుభ్రం చేయాలి. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, సీసీటీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్ట్రీట్ లైట్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
ముడో రోజు
టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు, హ్యాండ్‌వాష్ ఏరియాలు, వాటర్‌ట్యాంకులు, డ్రైనేజీ బ్లాక్‌లు, డ్రెయిన్ అవుట్లెట్లు, వాటర్ లాగింగ్ ఏరియాలు మొదలైన వాటిని శుభ్రం చేయాలి. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పంపిన స్వీపింగ్ సిబ్బంది పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే ప్రధానోపాధ్యాయుడు బయటి నుంచి వచ్చే కార్మికులను వినియోగించుకోవచ్చు. విద్యార్థులకు పోస్టర్ ప్రదర్శనలు, నినాదాలు రాయడం, వ్యాసరచన, వక్తృత్వం, వాల్ పెయింటింగ్‌లో పోటీలు నిర్వహించాలి.
నాలుగో రోజు
పేరెంట్ అసోసియేషన్ (గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులతో ఉన్న హాస్టల్ కమిటీ) భాగస్వామ్యం కావాలి. బోధనేతర సిబ్బంది, ప్రిన్సిపాల్, స్వీపింగ్, పారిశుద్ధ్య కార్మికులు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ కలిసి వంటగదిని శుభ్రం చేయాలి. నాలుగో రోజు కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయకూడదు.
ఐదో రోజు
గ్రీన్ స్కూల్ డ్రైవ్ డే, ఇన్నోవేటివ్ ప్లాంటేషన్ డ్రైవ్: ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను విభజించి గ్రూపులను ఏర్పాటు చేయాలి. ప్రతి బృందం పాఠశాల ఆవరణలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి వేలాడేతోట, ఔషధ ఉద్యానవనం, సక్యూలెంట్గార్డెన్ వంటి వినూత్న ప్లాంటేషన్ నమూనాను రూపొందించాలి.
ఆరో రోజు
స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులతో నాటకాలు, నృత్యాలు, పాటలు, ఫ్లాష్మాబ్ల వంటి ప్రదర్శనలు నిర్వహించాలి.
ఏడో రోజు
స్వచ్ఛ గురుకుల వారోత్సవాల ముగింపు. ఇందు లోనే బహుమతి ప్రదానోత్సవం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు