ఆహార కర్మాగారం పత్రం.. ప్రత్యుత్పత్తి నిర్మాణం పుష్పం
జీవ ప్రపంచంలో ప్రతి జీవికి నిర్దిష్టమైన దేహభాగాలుంటాయి. ఒక్కోభాగం ఒక్కో విధిని నిర్వర్తిస్తుంది. ఏ భాగం లోపించినా ఆ జీవిలో జీవక్రియా లోపం ఏర్పడు తుంది. అదేవిధంగా మొక్కల్లోనూ వివిధ భాగాలుండి అవి వాటి విధులను నిర్వర్తి స్తాయి. మొక్కల్లోని భాగాలు, వాటి నిర్మాణం, విధుల గురించి సంక్షిప్తంగా
తెలుసుకుందాం..
పుష్పించే మొక్కల్లో దేహంలోని అన్ని భాగాలు పూర్తి అభివృద్ధి చెంది, నిర్దిష్టమైన విధులను నిర్వర్తిస్తాయి. పుష్పించే మొక్కల్లో రెండు ముఖ్యమైన భాగాలుంటాయి. అవి. 1. వేరు వ్యవస్థ, 2. కాండ వ్యవస్థ.
మొక్కలోని నేలలోకి పాతుకుపోయిన భాగాన్ని వేరు వ్యవస్థ అంటారు. వేరు వ్యవస్థ మొక్కకు ఆధారాన్నిస్తుంది. మొక్కల స్వభావం, అభివృద్ధిని బట్టి వేరు వ్యవస్థను రెండు భాగాలుగా విభజించారు.
తల్లివేర్లు/పీచు వేర్లు: మొక్కలో ఒక వేరు నేలలోకి నిటారుగా పెరుగుతుంది. దీన్ని తల్లి వేరు అంటారు.
గుబురు వేర్లు: గడ్డి వంటి మొక్కల్లో కాండం నేలకు తాకిన ప్రాంతానికి కింద ఒకేచోటు నుంచి అనేక వేర్లు ఏర్పడతాయి. వీటిని గుబురు వేర్లు అంటారు.
అబ్బురపు వేర్లు: మెన్స్టెరా, మర్రి వృక్షాల్లో వేర్లు ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్క ఇతర భాగాల నుంచి ఉద్భవిస్తాయి. వాటిని అబ్బురపు వేర్లు అంటారు.
వేరు నిర్మాణం
వేరులో రెండు భాగాలు ఉంటాయి. అవి ప్రధాన వేరు, పీచు వేర్లు. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి ఉంటుంది. దీన్ని తల్లి వేరు అంటారు. తల్లి వేరు చుట్టూ సన్నని వేర్లను కలిగి ఉంటుంది. వీటిని పార్శవేర్లు అంటారు. కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీఠభాగం నుంచి బయలుదేరుతాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు ఉండదు. అన్నివేర్లు ఒకేలా ఉంటాయి. వేర్లు మట్టి నుంచి నీటిని పీలుస్తాయి. నీటితోపాటు నేలలో ఉన్న ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి.
కొన్ని మొక్కలు ఆహారాన్ని వేర్లలో దాచుకుంటాయి.
ఉదా: ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు ఆహార పదార్థాలను వేర్లలో నిల్వ చేసుకుంటాయి. కాబట్టి వీటిని దుంప వేర్లు అంటారు.
కొన్ని మొక్కల్లో భూమి ఉపరితలం నుంచి పైకి మొక్క ఎంత ఎత్తు ఉంటుందో అంతలోపలికి వేళ్లు విస్తరిస్తాయి.
వేరు విధులు
మొక్కను నేలలో స్థిరంగా ఉంచుతాయి.
నీటిని, నీటిలో కరిగిన లవణాలను నేల నుంచి గ్రహిస్తాయి.
కొన్ని మొక్కల వేర్లు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఉదా: క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప.
కొన్ని మొక్కల్లో శాఖల నుంచి వేర్లు ఏర్పడి ఆధారాన్నిస్తాయి. ఉదా: మర్రి
మొక్కలో శాఖలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలను కలిగి నిటారుగా పెరిగే అక్షాన్ని కాండం అంటారు. మొలకెత్తే విత్తనం పిండంలోని ప్రథమ కాండం నుంచి కాండం వృద్ధి చెందుతుంది. నేలపై నిలువుగా పెరుగుతూ కనబడే మొక్క భాగాన్ని కాండం అంటారు. కాండం నుంచి పత్రాలు ఏర్పడే భాగాన్ని కణుపు అంటారు.
కాండం నిర్మాణం
కాండం మొక్కకు ఆధారాన్నిచ్చే భాగం. మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు వృద్ధి చెందుతాయి. పత్రాలు, పుష్పాలు కాండం నుంచి పెరుగుతాయి. కాండానికి శాఖలు ఉంటాయి. శాఖలు పత్రాలు, పుష్పాలను భరిస్తాయి. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కేలు ఏర్పడతాయి.
ఇది తెలుసా?
బంగాళదుంప, వెల్లుల్లి, అల్లం, చెరకు వంటి మొక్కల కాండాలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల పరిమాణంలో ఉబ్బినట్లు కనబడుతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాం. నిజానికి అవి కాండాలు. కాండంలో ఆహార పదార్థాలను నిల్వచేయడాన్ని కాండ రూపాంతరం అంటారు. అల్లం, వెల్లుల్లి, బంగాళాదుంప మొక్కల్లో కాండం పూర్తిగా భూమిలోపలి ఉంటుంది.
కాండం విధులు
వేర్లు, ఆకులకు మధ్య సం బంధాన్ని ఏర్పరుస్తుంది.
కొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది.
ఉదా: చెరకు, పసుపు, అల్లం, నీరుల్లి, బంగాళాదుంప
ఎడారి మొక్కల్లో కాండం కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది. ఉదా: బ్రహ్మజెముడు, కాక్టస్
పత్రాలు, పుష్పాలు, ఫలాలను కలిగిన శాఖలను విస్తరింపజేయడం కాండం ప్రధాన విధి.
బోన్సాయ్: ఎంత పెద్ద చెట్టునైనా కుండీల్లో ఇమిడిపోయేలా పెంచే పద్ధతిని బోన్సాయ్ అంటారు. బోన్సాయ్ అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. బోన్సాయ్ మొక్కలను వామన వృక్షాలు అని కూడా అంటారు. బోన్సాయ్ జపాన్ దేశపు సంప్రదాయ కళ.
పత్రం మొక్కల్లో ముఖ్యమైన భాగం. పత్రంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. అవి. 1. పత్రపీఠం 2. పత్ర వృంతం 3. పత్రదళం. పత్రంలోని పత్రహరితం వల్ల ఆకుపచ్చగా ఉంటుంది. పత్రంలో జరిగే ముఖ్య పనులన్నీ పత్రదళంలోనే జరుగుతాయి. మన చుట్టూ కనిపించే మొక్కల్లో వివిధ రకాల పత్రాలుంటాయి. పత్ర దళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు.
ఈనెల వ్యాపనం: పత్రంలోని రేఖలను ఈనెలు అంటారు. పత్రదళం మధ్యలో కనిపించే పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను పక్క ఈనెలు అంటారు. ఈనెల వ్యాపనం రెండు రకాలుగా ఉంటుంది. అవి జాలాకార ఈనెల వ్యాపనం, సంమాంతర ఈనెల వ్యాపనం.
పత్రం విధులు
కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం.
పత్రరంధ్రాలు కలిగి వాయు వినిమయానికి తోడ్పతడాయి.
బాష్పోత్సేకం ద్వారా పత్రాల్లోని నీటిని ఆవిరి రూపంలో విడుదల చేయడం.
నీరు ఆవిరి రూపంలో విడుదలవడాన్ని బాష్పోత్సేకం అంటారు.
ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ల వినిమయాన్ని క్రమబద్ధీకరిస్తాయి.
నీరు, లవణాల రవాణాను బాష్పోత్సేకం ద్వారా క్రమబద్ధీకరిస్తాయి.
కొన్ని మొక్కల్లో పత్రాలు శాఖీయోత్పత్తిని జరుపుతాయి. ఉదా: రణపాల
మొక్కల కాండంపై గ్రీవం వద్ద పుష్పం జనిస్తుంది. పుష్పం ఒక కాడ సహాయంతో కాండానికి అతుక్కొని ఉంటుంది. దీన్ని పుష్ప వృంతం అంటారు. పుష్ప వృంతం పైభాగం ఉబ్బి ఉంటుంది. దీనినే పుష్పాసనం అంటారు. పుష్ప భాగాలు పుష్పాసనంపై నాలుగు వలయాల్లో అమరి ఉంటాయి. అవి. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం.
రక్షక పత్రావళి: పుష్పాసనం పై అమరి ఉండే ఆకుపచ్చని నిర్మాణాన్ని రక్షక పత్రావళి అంటారు. ఇది పుష్పానికి రక్షణ కల్పిస్తుంది కాబట్టి దీన్ని రక్షక పత్రావళి అంటారు. మొగ్గ దశలో పుష్పం లోపలి వలయ భాగాలను రక్షిస్తుంది. ఇది పుష్పంలోని మొదటి వలయంలో ఉంటుంది.
ఆకర్షణ ప్రతావళి: వివిధ వర్ణాల్లో ఆకర్షణీయంగా ఉండే పుష్ప భాగాలను ఆకర్షణ పత్రావళి అంటారు. ఆకర్షణ పత్రాలు పర పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. పుష్పాలకు సువాసనను కల్పిస్తాయి. ఇవి పుష్పంలోని రెండో వలయంలో ఉంటాయి.
కేసరావళి: పుష్పంలోని ప్రత్యుత్పత్తి భాగాలను కేసరావళి అంటారు. కేసరావళి అనేది పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం. పుష్పం నిర్మాణం కుటుంబాన్ని బట్టి కేసరాల సంఖ్య ఉంటుంది. కేసరావళిలో కేసర దండం, పరాగ కోశం ఉంటాయి. పరాగ కోశంలో పరాగ రేణువులు ఉంటాయి. వీటిని పురుష బీజకణాలు అంటారు. ఇవి పుష్పం మూడో వలయంలో ఉంటాయి.
అండకోశం: ఇది పుష్పంలోని నాలుగో వలయంలో ఉంటుంది. అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. దీనిలో అండాశయం, కీలం, కీలాగ్రం అనే భాగాలుంటాయి. అండాశయంలో నాలుగు గదులుంటాయి. ఈ గదుల్లో అండాలు ఏర్పడతాయి. వీటిని స్త్రీబీజ కణాలు అంటారు. ఫలదీకరణ తర్వాత అండాలు విత్తనాలుగా మారుతాయి.
మొక్కలోని రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళిని అనావశ్యక భాగాలు అని, కేసరావళి, అండకోశాలను ఆవశ్యక భాగాలంటారు.
పుష్పాల రకాలు
పుష్పంలో కేసరావళి, అండకోశాన్ని ఆధారంగా చేసుకుని పుష్పాలను రెండు రకాలుగా విభజించారు. అవి
ఏకలింగ పుష్పాలు: కేసరావళి గాని, అండకోశం గాని ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగం మాత్రమే కలిగి ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. కేసరావళి మాత్రమే ఉండే పుష్పాలను పురుష పుష్పాలు అంటారు. వీటిలో అండకోశం ఉండదు. అండకోశం మాత్రమే కలిగి ఉండే పుష్పాలను స్త్రీ పుష్పాలు అంటారు. వీటిలో కేసరావళి ఉండదు.
ఉదా: సొరకాయ, బొప్పాయి
ద్విలింగ పుష్పాలు: కేసరావళి, అండకోశం రెండింటిని కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు.
ఉదా: ఉమ్మెత్త, మందార
క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి మొక్కల వేర్లను ఆహారంగా తీసుకుంటాం. వీటిలో విటమిన్-ఎ, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపునకు ఇవి మంచివి.
మరింత సమాచారం
బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి ఎడారి మొక్కల కాండం ఆకుపచ్చగా రసభరితంగా ఉంటుంది. వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఇవి కాండంలో నీటిని నిల్వ చేస్తాయి.
ఫిస్టియా, ఐకార్నియా, ఉల్ఫియా వంటి మొక్కలు నీటిపై తేలియాడుతూ పెరుగుతాయి. వీటి వేర్లు సైతం నీటిలో తేలుతూ ఉంటాయి.
అత్తిపత్తి మొక్కలను తాకితే పత్రాలు ముడుచుకుంటాయి. ఇది శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి ఏర్పరుచుకున్న అనుకూలనం.
చాలా మొక్కల కాండాలు, కొమ్మలు, పత్రాలు ముళ్లను కలిగి ఉంటాయి. ఇది శత్రువుల బారి నుంచి అవి తప్పించుకోవడానికి ఏర్పరుచుకున్న అనుకూలనం.
ఉదా: తుమ్మ, గులాబీ
నెపంథిస్ వంటి మొక్కల్లోని పత్రాల చివరన కూజా వంటి ఆకారం ఉంటుంది. ఇది కీటకాలను ఆకర్షించి చంపుతుంది. ఇటువంటి మొక్కలను కీటకాహారి మొక్కలు అంటారు.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు