గెలిచే వైఖరిని పెంచుకోండి ఇలా..!
ఆలోచనలతో మనిషికి ఒరిగేదేం లేదని ఒకప్పుడు భావించిన మనస్తత్వ శాస్త్రం ఆలోచనలతోనే మనిషి ఉనికి నిర్దేశింపబడుతుందని గుర్తించింది. ఏ మనిషి అయినా ఆలోచనలను మనోవైఖరిని పాజిటివ్ వైపునకు తిప్పుకున్నప్పుడు అనూహ్యమైన విజయాలను కైవసం చేసుకుంటాడు. తాను కోరుకుంటున్న దాన్ని సాధించి తీరుతాడు. గత మానవ చరిత్ర అదే రేపటి మానవ భవిష్యత్తూ అదే!
విద్యార్థి జీవితంలో ఉన్న టీనేజీ పిల్లలపై ఈ సమాజానికి ఎన్నో ఆశలు, ఆశయాలు ఉన్నాయి. కానీ ఆ మేరకు సదాభిప్రాయం మాత్రం లేదు. నాటి సోక్రటీస్ నుంచి నేటి ఆధునిక తల్లిదండ్రుల వరకూ ఈ కాలపు కుర్రాళ్లు మంచి మర్యాద, వినయ విధేయతలు, పెద్దలంటే గౌరవం, చదువంటే శ్రద్ధ లేకుండా పోయిందని వినిపిస్తూ ఉంటుంది. ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త అయిన సోక్రటీస్ కూడా తన నడివయసులో యువత పట్ల ఇటువంటి అభిప్రాయాన్నే కలిగి ఉన్నాడు. ఈనాటి పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఏం చెబితే ఎలా నొచ్చుకుంటారో అసలు అర్థం కాదు. ఒక్కోసారి తిట్టినా, కొట్టినా లెక్కచేయరు. ఒక్కోసారి సరదాకి చిన్నమాటంటే ఉడుక్కుంటారు.
మనో వైఖరి
పదేండ్ల బాలుడు వాళ్ల నాన్నతో కలిసి పార్కుకు వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోసాగాడు. ఆటల్లో కిందపడి నెత్తి మీద బొప్పి కట్టింది. అయినా వాడు ఆటను ఆపలేదు. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి బొడిపను చూసి ఏమైందని అడగ్గానే వాడికి ఏడుపు ముంచుకు వచ్చింది. అంతవరకు లేని ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. లోతుగా ఆలోచిస్తే చేతనాపరంగా పిల్లలు తమ మనోవైఖరిని తామే ఎంచుకుంటారు. తలకు దెబ్బ తగిలినా మనసుకు దెబ్బ తగిలినా వారికి నచ్చిన పని చేయమని ఎవరైనా చెప్పినా వివిధ రకాల బాహ్య పరిస్థితులను ఆధారంగా చేసుకొని అందుకు తగిన మనోవైఖరిని ప్రదర్శిస్తారు.
చిత్రమైన కన్విక్షన్
యువతకు పసితనపు ఛాయలు వీడని, అదే సమయంలో వయోజన మనస్తత్వం, వికసించిన మనోవైఖరి, ఇంకా పూర్తిగా తెచ్చుకోని పద్ధతిని అనుసరిస్తారు. వారి కన్విక్షన్స్ పలు రకాలుగా ఉంటుంది. కొందరు ఇట్టే బాధను పంచేసుకుంటారు. మరికొందరు ఆకలి లేదంటారు. ఎవరిమీదనో కారణం లేకుండా అలుగుతారు. కాలేజీలో ఏదో జరిగితే ఇంట్లో వాళ్ల మీద ప్రదర్శిస్తారు. అస్థిరంగా కనబడతారు. విచారంగా, బాధాకరంగా ఉన్న మనోస్థితిని క్షణంలోనే పోగొట్టుకొని ఉత్సాహంగా పరుగులెడతారు. అటువంటి హెచ్చుతగ్గులు ఉన్న మనోవైఖరి కారణంగా వారి విద్యా జీవితం తీవ్ర ప్రభావానికి గురవుతుంది. అవి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకుపోకుండా వెనక్కి లాగుతాయి. ఈ రకమైన అస్థిర మనోవైఖరికి తలొగ్గితే రెండు నష్టాలు ఏర్పడుతాయి. ప్రతికూల మనోవైఖరే స్వాభావిక లక్షణంగా మారిపోతుంది. లేదా పక్కనే పొంచి ఉన్న వ్యసనాలు చుట్టుముడతాయి. ప్రతికూల మనోవైఖరికి అలవాటు పడిన విద్యార్థి తనకన్నా తక్కువ సామర్థ్యం గల విద్యార్థులతో కలిసి తిరుగుతాడు. చెడు స్నేహాలను ఎంచుకుంటాడు. ఓటమివైపు మొగ్గు చూపిస్తాడు. సగం నీళ్లున్న గ్లాసుని చూసి ఇంకా సగం ఖాళీగానే ఉందని అంటాడే తప్ప, సగమైనా నీళ్లున్నాయని సంతోషించడు.
దృష్టి పెట్టండి
మైండ్ పవర్ని లేపి విజేత కావాలనుకుంటున్న విద్యార్థులు మీ కలలను సాఫల్యం చేసుకోవడానికి ముందుగా మీ మనోవైఖరిపై దృష్టి నిలపాలి. మీలో ఉన్న చెడు ఏమిటో గుర్తించాలి. మీకు షార్ట్ టెంపర్ ఉండవచ్చు. ఇట్టే గాయపడే మనస్తత్వం కలిగి ఉండవచ్చు. నిత్యం నేనెందుకూ పనికిరాననే నెగిటివ్ ఆలోచనలే చేయవచ్చు. ఇవే మిమ్మల్ని ముందడుగు వేయకుండా నిరోధిస్తున్నాయని గుర్తించండి. లోపాలు ఉండటం తప్పు కాదు. వాటిని గుర్తించలేకపోవటమే తప్పు. మీరు టీనేజీలోకి వచ్చిన తర్వాత మీకు ఎదురైన విభిన్న రకాల అనుభవాలను గుర్తు తెచ్చుకోండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు