కరెంటు అఫైర్స్
తెలంగాణ
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అవార్డు
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు 2020కు గాను ప్రతిష్ఠాత్మక ఏసీఐ (ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్), ఎస్క్యూ (ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ) అవార్డు మార్చి 1న లభించింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లోని 15-25 మిలియన్ ప్యాసింజర్స్ విభాగంలోని ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు 2020 ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.
ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2020
పట్టణంలో అడవులను పెంచడంతోపాటు వాటిని నిబద్ధతతో నిర్వహించినందున హైదరాబాద్‌ను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020గా ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, అర్బోర్ డే ఫౌండేషన్ మార్చి 2న గుర్తించాయి. పట్టణ, పెరి-అర్బన్ ఫారెస్ట్రీ చర్యల అభివృద్ధి, ప్రాజెక్టులు, వ్యూహాత్మక ప్రణాళికతో ఆరోగ్యకరమైన నగరాన్ని నిర్మించడానికి నిబద్ధతతో చెట్లను నాటి, పెంచి పోషించిన కారణంగా ఈ గుర్తింపునిచ్చారు.
సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్
కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ నూతన చైర్మన్‌గా సమీర్ గోయల్ మార్చి 5న ఎన్నికయ్యారు. 2021-22 ఏడాదికి ఆయన ఈ పదవిలో ఉంటారు. వైస్‌చైర్మన్‌గా వగీష్ దీక్షిత్‌ను ఎన్నుకున్నారు.
జాతీయం
తొలి టాయ్ ఫెయిర్
మొట్టమొదటి ఇండియా టాయ్ ఫెయిర్‌ను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఫిబ్రవరి 27న ప్రారంభించారు. బొమ్మల తయారీ రంగంలో ఆత్మనిర్భరతను సాధించడమే కాకుండా ప్రపంచ దేశాలకు బొమ్మలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని ప్రధాని కోరారు.
పీఎస్ఎల్వీ-సి51
ఇస్రో ఫిబ్రవరి 28న ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సి51 ప్రయోగం విజయవంతమైంది. ఇది ఈ ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం. ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1, భారత్‌కు చెందిన ఐదు, అమెరికాకు చెందిన 13 మైక్రో ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సి51 మోసుకెళ్లింది.
ఈఎన్సీ అధిపతిగా అజేంద్ర
ఈస్టర్న్ నేవల్ కమాండ్ (తూర్పు నావికాదళం)కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ఫిబ్రవరి 28న నియమితులయ్యారు. ఆయన 2011లో విశిష్ట సేవాపతకం, 2016లో అతివిశేష సేవాపతకం అందుకున్నారు. తూర్పు నావికాదళాన్ని 1968, మార్చి 1న స్థాపించారు.
ప్రధానికి అవార్డు
ప్రధాని మోదీకి ‘గ్లోబల్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ (ప్రపంచ శక్తి, పర్యావరణ నాయకత్వ)’ అవార్డు లభించింది. అమెరికాలో మార్చి 5న జరిగిన సెరావీక్-2021 వార్షిక సమావేశంలో ఈ అవార్డును ప్రధాని అందుకున్నారు. ఈ అవార్డును కేంబ్రిడ్జ్ ఎనర్జీ రిసెర్చ్ అసోసియేట్స్ (సెరా) ప్రదానం చేసింది.
క్రీడలు
ఏఐఈబీఏ కమిటీ చైర్మన్‌గా మేరీకోమ్
బాక్సింగ్ అసోసియేషన్ (అసోసియేషన్ ఇంటర్నేషనల్ డి బాక్స్ అమెచ్యూర్-ఏఐబీఏ) చాంపియన్స్, వెటరన్స్ కమిటీ చైర్‌పర్సన్‌గా మేరీకోమ్ మార్చి 3న ఎంపికయ్యింది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయాలు సాధించి, ఎంతో గౌరవం పొందుతున్న బాక్సర్లతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఏఐబీఏ అధ్యక్షుడిగా ఉమర్ క్రెమ్లెవ్ ఉన్నారు.
– బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మేరీకోమ్ కాంస్యం గెలుకుంది. మార్చి 5న జరిగిన మహిళల 51 కేజీల విభాగం సెమీస్‌లో వర్జీనియా (అమెరికా) చేతిలో మేరీకోమ్ ఓడిపోయింది.
పొలార్డ్ రికార్డు సిక్సర్లు
వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఒక ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన మూడో ఆటగాడిగా రికార్డు సాధించాడు. మార్చి 4న శ్రీలంకతో జరిగిన టీ20లో స్నిన్నర్ ధనుంజయ వేసిన బౌలింగ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. 2007లో వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్, 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెటర్ యువరాజ్ ఈ ఘనత సాధించి మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
అంతర్జాతీయం
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-202178వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2021 వేడుకలు కాలిఫోర్నియాలో మార్చి 1న నిర్వహించారు. దీనిలో ఉత్తమ సినిమాలుగా నోమాడ్లాండ్, జోర్టాలు అవార్డులు దక్కించుకున్నాయి. నోమాడ్లాండ్ చిత్ర దర్శకురాలు చోలే జావోకు ఉత్తమ దర్శకురాలి అవార్డు లభించింది. గోల్డెన్ గ్లోబ్ చరిత్రలో ఉత్తమ దర్శకత్వ అవార్డును ఓ మహిళ గెలుచుకోవడం ఇది రెండోసారి. 1983లో బార్బరా స్ట్రీశాండ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్
2023ను ఇంటర్నేషనల్ మిల్లెట్స్ (చిరుధాన్యాలు) ఇయర్‌గా పాటించేందుకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ మార్చి 4న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రష్యా, కెన్యా, బంగ్లాదేశ్, నైజీరియా, నేపాల్, సెనెగల్‌లతో కలిపి భారత్ ఈ తీర్మానాన్ని తీసుకురాగా మరో 70 దేశాలు మద్దతు తెలిపాయి. 1945, అక్టోబర్ 24న ఏర్పడిన ఐక్యరాజ్యసమితిలో 193 సభ్యదేశాలు ఉన్నాయి.
శ్రీలంక 70వ వైమానికదళ వేడుక
శ్రీలంక 70వ వైమానికదళ వార్షిక వేడుకలు మార్చి 3న ప్రారంభించారు. ఈ వేడుకల్లో భారత వైమానికదళం కూడా పాల్గొన్నది. ఈ సందర్భంగా నిర్వహించిన విన్యాసాల్లో భారత్‌కు చెందిన తేజస్, సారంగ్, సూర్యకిరణ్‌తోపాటు 23 ఎయిర్‌ఫోర్స్, నేవీ విమానాలు పాల్గొన్నాయి. ఇరుదేశాల సాయుధ దళాల మధ్య సహకారం, స్నేహం పెంపొందాలని భారత్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సేతో చర్చించారు.
హురున్ గ్లోబల్ రిచ్‌లిస్ట్
10వ ఎడిషన్ ‘హురున్ గ్లోబల్ రిచ్‌లిస్ట్-2021 మార్చి 3న విడుదలైంది. దీనిలో 2402 కంపెనీల నుంచి 3228 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ 151 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచారు. జెఫ్ బెజోస్ 2, బెర్నార్డ్ ఆర్నాల్డ్ 3, ముకేష్ అంబానీ 8వ స్థానాల్లో ఉన్నారు.ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లను కలిగిన దేశాల జాబితాలో చైనా (1058 బిలియనీర్లు) మొదటి స్థానంలో నిలువగా.. అమెరికా (696) 2, భారత్ (209) నిలిచాయి.
చైనా రక్షణ బడ్జెట్
చైనా రక్షణ శాఖకు 1.35 ట్రిలియన్ యువాన్లు (రూ.15.28 లక్షల కోట్లు) కేటాయించినట్లు ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్ మార్చి 5న తెలిపారు. చైనా పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. దీంతో ప్రపంచంలో రక్షణ కోసం అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం అమెరికా తర్వాత స్థానంలో చైనా నిలిచింది. చైనా తర్వాత భారత్ ఉంది.
డెజర్ట్ ఫ్లాగ్-VI
యూఏఈలోని అల్ ధఫ్రా ఎయిర్‌బేస్‌లో డెజర్ట్ ఫ్లాగ్-VI పేరుతో వైమానిక దళ విన్యాసాలు మార్చి 3 నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 27 వరకు జరిగే ఈ విన్యాసాల్లో ఫ్రాన్స్, యూఎస్ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, బహ్రెయిన్ దేశాలతో పాటు భారత వైమానిక దళం కూడా పాల్గొన్నది. ఈ విన్యాసాల్లో భారత వైమానిక దళానికి చెందిన ఆరు సుఖోయ్-30, రెండు సీ-17 యుద్ధవిమానాలు, ఐఎల్-78 ట్యాంకర్ పాల్గొన్నాయి.
వార్తల్లో వ్యక్తులు
ఎన్‌జేఏ డైరెక్టర్‌గా సాహి
నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (ఎన్‌జేఏ) డైరెక్టర్‌గా మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అమ్రేశ్వర్ ప్రతాప్ సాహి మార్చి 1న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోడ రఘురాం ఉన్నారు.
ఝావో జోంగ్కీ
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ)గా పిలిచే చైనా పార్లమెంటులో విదేశీ వ్యవహారాల కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా ఆ దేశ సైనిక ఉన్నతాధికారి జనరల్ ఝావో జోంగ్కీ మార్చి 1న నియమితులయ్యారు. 2017 డోక్లామ్, 2020 లద్దాఖ్ వివాద సమయాల్లో చైనా సైన్యానికి నేతృత్వం వహించారు.
సర్కోజీకి జైలుశిక్ష
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి స్థానిక కోర్టు మార్చి 1న అవినీతి కేసులో మూడేండ్ల జైలుశిక్ష విధించింది. సర్కోజీ 2007-12 కాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007లో ఎన్నిక ప్రచారానికి లిబియా నియంత గడాఫీ నుంచి భారీగా ఆర్థిక సాయం పొందారన్న ఆరోపణలు రావడంతో ఈ శిక్ష విధించారు.
మజూ వర్గీస్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పాలనావిభాగంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా, వైట్‌హౌస్ ఆర్మీ ఆఫీస్ డైరెక్టర్‌గా భారత అమెరికన్ మజూ వర్గీస్‌ను మార్చి 2న నియమించారు. వైట్‌హౌస్‌లో జరిగే అధికారిక వేడుకలు, అధ్యక్షుడి రవాణా, వైద్యసదుపాయాలు, అత్యవసర సేవలు వంటి కార్యక్రమాలను ఆర్మీ ఆఫీస్ నిర్వహిస్తుంది.
మిసెస్ ఇండియా-2020
జైపూర్‌లో మార్చి 3న జరిగిన పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన పల్లవి సింగ్ ‘గ్లామన్ మిసెస్ ఇండియా-2020’గా ఎంపికయ్యారు. మొదటి రన్నరప్‌గా పుణేకు చెందిన శెనెల్ల, హైదరాబాద్‌కు చెందిన ఉష, రెండో రన్నరప్‌గా కోల్‌కతాకు చెందిన షీతల్ నిలిచారు. పల్లవి సింగ్‌కు ద మోస్ట్ బ్యూటీఫుల్ స్మైల్ అవార్డు కూడా దక్కింది.
ప్రమీలా జయపాల్
అమెరికా యాంటీట్రస్ట్, కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా సబ్ కమిటీ వైస్‌ప్రెసిడెంట్‌గా మార్చి 4న నియమితులయ్యారు. చెన్నైలో జన్మించిన ప్రమీలా 2020 డిసెంబర్లో యూఎస్ఏ పార్లమెంట్ కాంగ్రెస్ ప్రోగ్రెసివ్ కాకస్ (సీపీసీ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
మన్‌ప్రీత్ వోహ్రా
ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్‌గా మన్‌ప్రీత్ వోహ్రా మార్చి 4న నియమితులయ్యారు. 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అయిన ఆయన గతంలో మెక్సికోలో భారత రాయబారిగా పనిచేశారు.
నౌరీన్ హసన్
అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా భారత-అమెరికన్ నౌరీన్ హసన్ మార్చి 5న నియమితులయ్యారు. ఆమె ఎన్నికను గవర్నర్స్ బోర్డ్ ఆమోదించింది.
ఆప్రాకా చైర్మన్‌గా గోవిందరాజులు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ గ్రామీణ, వ్యవసాయ పరపతి సంఘం (ఆప్రాకా) చైర్మన్‌గా నాబార్డు చైర్మన్ గోవిందరాజులు మార్చి 5న ఎన్నికయ్యారు. ఈ ఆప్రాకాను 1977లో భారత్ సహా 16 దేశాల అత్యున్నత గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి బ్యాంకులు కలిసి ఏర్పాటు చేశాయి. సభ్యదేశాలు 24.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు