కరెంట్ అఫైర్స్-15-08-2021
జాతీయం
వందేండ్ల తమిళనాడు అసెంబ్లీ
వందేండ్ల తమిళనాడు అసెంబ్లీ ఉత్సవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 1న ప్రారంభించారు. భారత ప్రభుత్వ చట్టం-1919 ప్రకారం 1921లో ఈ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. దీనిని మొదట మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని, తర్వాత మద్రాస్ ప్రావిన్స్ అని పిలిచారు.
ఈ-రూపీ
కేంద్రం ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్ ఈ-రూపీని ప్రధాని మోదీ ఆగస్టు 2న ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా అందించేందుకు దీనిని రూపొందించారు. ఇది నగదు రహిత, కాంటాక్ట్ రహిత డిజిటల్ చెల్లింపుల సాధనం. క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో లబ్ధిదారుల మొబైల్ ఫోన్‌కు సంబంధిత ఈ-వోచర్ పంపిస్తారు.
నీలకురింజి పూలు
కేరళలోని షాలోమ్ పర్వతాలపై 12 ఏండ్లకోసారి పూసే నీలకురింజి పూలు పూశాయని అధికారులు ఆగస్టు 2న తెలిపారు. ఈ పూలను శాస్త్రీయంగా ‘స్ట్రాబిలాంతెన్ కుంతియానా’ అని పిలుస్తారు. ఇడుక్కి జిల్లాలోని శాంతనపారా జిల్లాలో విస్తరించి ఉన్న షాలోమ్ పర్వతాలు పశ్చిమ కనుమల్లోని నీలగిరి శ్రేణుల్లో భాగంగా ఉన్నాయి.
ఎత్తయిన రోడ్డు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును తూర్పు లద్దాఖ్‌లో నిర్మించినట్లు రక్షణ శాఖ ఆగస్టు 4న వెల్లడించింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఉమ్లింగ్లా పాస్ వద్ద నిర్మించింది. ఎత్తయిన మోటరబుల్ రోడ్డుగా ఇప్పటివరకు బొలీవియాలోని రహదారి (18,953 అడుగుల ఎత్తు) ఉంది.
యుద్ధనౌక విక్రాంత్
భారత నేవీలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధనౌక (ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్-ఐఏసీ) విక్రాంత్‌ను ఆగస్టు 4న విజయవంతంగా పరీక్షించారు. 40 వేల టన్నుల బరువు ఉండే విక్రాంత్ దేశంలో నిర్మించిన అతిపెద్ద, సంక్లిష్టమైన యుద్ధ వాహక నౌకగా నిలిచింది. 262 మీటర్ల పొడవు, పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తు ఉండే ఈ నౌక 30 ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. దీనిని కొచ్చి షిప్‌యార్డ్ సుమారు 21 వేల కోట్లతో నిర్మించింది. ఈ నౌకను 2022 నాటికి నావికాదళంలో ప్రవేశపెట్టనున్నారు.
మోదీతో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
ప్రధాని మోదీతో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబ్బాట్ ఆగస్టు 5న న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో కొనసాగేందుకు గల అవకాశాలపై చర్చించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తరఫున భారత్ ప్రత్యేక వాణిజ్య దూతగా టోనీ ఆగస్టు 2 నుంచి 6 వరకు భారత్‌లో పర్యటించారు.
హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్
దేశంలో తొలిసారిగా ‘హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్’ను కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ’లో ఆగస్టు 5న ఏర్పాటు చేశారు. గుండె ఆపరేషన్ సమయంలో ముందస్తు సమ్మతి తెలిపిన హృద్రోగుల రక్తం, బయాస్పీ నమూనాలు, డీఎన్ఏ, క్లినికల్ డేటాను సేకరించి ఇక్కడ భద్రపరుస్తారు.
చేనేత దినోత్సవం
7వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న నిర్వహించారు. 1905లో చేపట్టిన స్వదేశీ ఉద్యమంలో చేనేత వస్ర్తాలు కీలకపాత్ర పోషించాయి. దీనికి గుర్తుగా 2015 నుంచి జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
క్రీడలు
సింధు
ఒలింపిక్స్‌లో ఆగస్టు 1న నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలో పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. దీంతో వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు అందుకున్న తొలి భారత మహిళగా నిలిచింది. ఇదివరకు రెజ్లర్ సుశీల్‌కుమార్ (2008, 2012) ఈ ఘనత సాధించాడు.
రవి దహియా
ఒలింపిక్స్‌లో ఆగస్టు 5న నిర్వహించిన 57 కిలోల రెజ్లింగ్ పోటీలో భారత రెజ్లర్ రవికుమార్ దహియా రజత పతకం గెలిచాడు.
లవ్లీనా
ఒలింపిక్స్‌లో ఆగస్టు 4న నిర్వహించిన 69 కేజీల బాక్సింగ్ పోటీలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత్‌కు పతకం అందించిన మూడో బాక్సర్‌గా ఆమె నిలిచింది. ఇదివరకు విజేందర్ సింగ్ 92008, మేరీకోమ్ (2012)లు కూడా కాంస్య పతకాలే సాధించారు.
హాకీకి కాంస్యం
ఒలింపిక్స్‌లో ఆగస్టు 5న నిర్వహించిన హాకీ పురుషుల పోటీలో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ పోటీలో భారత్ చేతిలో జర్మనీ ఓడిపోయింది. 41 ఏండ్ల తర్వాత భారత్ హాకీలో పతకం సాధించింది.
ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డును ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర’గా మారుస్తూ ప్రధాని మోదీ ఆగస్టు 6న నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్‌లో హాకీ పతకం సాధించిన నేపథ్యంలో హాకీ దిగ్గజ ఆటగాడు ధ్యాన్‌చంద్ గౌరవ సూచకంగా రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డు పేరును మార్చారు. ఈ అవార్డును 1991, సెప్టెంబర్‌లో స్థాపించారు. ధ్యాన్‌చంద్ జయంతి అయిన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో ధ్యాన్‌చంద్ సారథ్యంలో భారత్ స్వర్ణ పతకాలు గెలిచింది.
నీరజ్ చోప్రా
ఒలింపిక్స్‌లో ఆగస్టు 7న జావెలిన్‌త్రోలో నీరజ్ చోప్రా (87.58 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు లభించిన తొలి స్వర్ణం. భారత్‌కు స్వర్ణ పతకం తెచ్చిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2008లో షూటింగ్లో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించాడు.
అలిసన్ ఫెలిక్స్
ఒలింపిక్స్‌లో ఆగస్టు 7న 11వ పతకం సాధించిన అలిసన్ ఫెలిక్స్ (అమెరికా) అత్యధిక మెడల్స్ సాధించిన అథ్లెట్ (ట్రాక్ అండ్ ఫీల్డ్)గా రికార్డు సృష్టించింది. 7 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం సాధించింది.
ఒక్సానా చుసోవిటినా
ఒక్సానా చుసోవిటినా ఒలింపిక్స్‌లో వరుసగా 8సార్లు పాల్గొన్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఆమె 1992 నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నది.
అంతర్జాతీయం
హెరిటేజ్ జాబితాలో ఇటలీ
ఆగస్టు 1 నాటికి ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ కట్టడాలు/ప్రదేశాలు ఉన్న దేశంగా ఇటలీ నిలిచింది. గతేడాది వరకు చైనా, ఇటలీలు చెరో 55 స్థానాలతో సమానంగా ఉండేవి. తాజా జాబితాలో ఇటలీ 58 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచింది. చైనా (56) 2, జర్మనీ (51) 3, స్పెయిన్ (49) 4, ఫ్రాన్స్ (49) 5, భారత్ (49) 6, మెక్సికో (35) 7, యూకే (33) 8, రష్యా (30) 9, ఇరాన్ (26) 10వ స్థానాల్లో నిలిచాయి.
పీవోకే ప్రధానిగా అబ్దుల్ ఖయ్యూ
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నూతన ప్రధానిగా తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ నేత అబ్దుల్ ఖయ్యూ నియాజీ ఆగస్టు 4న ఎన్నికయ్యారు. ఖయ్యూ పేరును పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రతిపాదించగా కొత్తగా ఎన్నికలు జరిగిన పీవోకే అసెంబ్లీలో 53 మంది సభ్యులకుగాను 33 మంది అనుకూలంగా ఓటువేశారు.
హార్పూన్ క్షిపణి
హార్పూన్ జాయింట్ కామన్ టెస్ట్ సెట్ (జేసీటీఎస్) యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థను భారత్‌కు విక్రయించడానికి అమెరికా ఆగస్టు 3న అంగీకరించింది. హార్పూన్ క్షిపణితో పాటు దానికి సంబంధించిన స్పేర్ పార్ట్లు, ఇతర పరికరాలు, ఆ క్షిపణి ప్రయోగానికి సంబంధించి సిబ్బందికి శిక్షణ, నిర్వహణ, ఇతర లాజిస్టిక్ సపోర్ట్ అన్నీ కావాలని భారత్ గతంలో విజ్ఞప్తి చేసింది. దీంతో 8.2 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో క్షిపణిని విక్రయించడానికి అమెరికా ఆమోదించింది.
వార్తల్లో వ్యక్తులు
సైరస్ పూనావాలా
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ సైరస్ పూనావాలాను లోకమాన్య తిలక్ అవార్డుకు ఎంపికచేసినట్లు అవార్డు ట్రస్ట్ అధ్యక్షుడు దీపక్ తిలక్ ఆగస్టు 1న తెలిపారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలకుగాను ఈ అవార్డును ఆయనకు ఆగస్టు 13న అందజేయనున్నారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, మెమంటో ఇవ్వనున్నారు.
మిన్ ఆంగ్ లైంగ్
మయన్మార్ ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ హెచ్లైంగ్ తనకు తానే ప్రధానిగా ఆగస్టు 1న ప్రకటించుకున్నారు. 2021, ఫిబ్రవరి 1 నుంచి ఆగస్టు 1 వరకు సైనిక పాలన అమల్లో ఉంది. 2023లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మినీ ఐప్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా మినీ ఐప్ ఆగస్టు 2న బాధ్యతలు చేపట్టారు. ఆమె 1986లో ఎల్ఐసీలో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా చేశారు. 2021, ఏప్రిల్ వరకు దక్షిణ మధ్య జోన్‌కు జోనల్ మేనేజర్‌గా పనిచేశారు.
నటాషా పెరి
భారతీయ అమెరికన్ బాలిక 11ఏండ్ల నటాషా పెరి ప్రపంచంలోనే అత్యంత ప్రజ్ఞావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఆగస్టు 3న ఎంపికయ్యింది. స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజీ టెస్టింగ్ (యాక్ట్)లలో ప్రతిభ చూపినందుకు న్యూజెర్సీ యూనివర్సిటీ నటాషాను ఎంపికచేసింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) సెర్చ్‌లో భాగంగా నిర్వహించిన శాట్, యాక్ట్ పరీక్షల్లో ఆమె ప్రతిభ కనబరిచింది. దీంతో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ హై ఆనర్స్ అవార్డుకు ఎంపికయ్యింది. అమెరికాలో ఎన్నో కాలేజీల్లో అడ్మిషన్ల కోసం శాట్, యాక్ట్ పరీక్షల్లో వచ్చే స్కోర్‌నే ఆధారంగా తీసుకుంటాయి.
రేఖాశర్మ
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న రేఖాశర్మ పదవీ కాలాన్ని మరో మూడేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 6న ఉత్తర్వులు జారీచేసింది. ఆమె పదవీకాలం ఆగస్టు 7తో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2017, సెప్టెంబర్ 29 నుంచి ఆమె ఈ పదవిలో ఉన్నారు.
రంగరాజన్, జగ్దీష్ భగవతి
2020కు గాను ప్రొ.సీఆర్ రావు సెంటినరీ గోల్డ్‌మెడల్ ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జగ్దీష్ భగవతిలకు ఆగస్టు 6న దక్కింది. ప్రముఖ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (గణిత గణాంక) సైంటిస్ట్, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీఆర్ రావు వందో జన్మదిన ఉత్సవాలు 2020, సెప్టెంబర్ 10న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థాపించిన ‘ది ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ (టైస్) సంస్థ ప్రముఖులకు ఈ గోల్డ్‌మెడల్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Current Affairs
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు