కరెంట్ అఫైర్స్
జాతీయం
ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ జూలై 4న బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయనతో ప్రమాణం చేయించారు. ఏడాదిలో ఉత్తరాఖండ్‌కు ముగ్గురు సీఎంలు మారారు.
నిపుణ్ భారత్
‘నిపుణ్ భారత్-2021’ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ జూలై 5న ప్రారంభించారు. దేశంలో సమగ్ర విద్య, అక్షరాస్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు జాతీయ విద్యావిధానం-2020 అమలులో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో దీనిని చేపట్టనున్నారు.
కొత్త గవర్నర్లు
కేంద్ర ప్రభుత్వం జూలై 6న 8 రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించింది. జార్ఖండ్‌కు రమేష్ బైస్, త్రిపురకు సత్యదేవ్ నారాయణ్ ఆర్య, మధ్యప్రదేశ్‌కు మంగుభాయ్ చగన్‌భాయ్ పటేల్, హిమాచల్‌ప్రదేశ్‌కు రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లేకర్, మిజోరంనకు కంభంపాటి హరిబాబు, గోవాకు పీఎస్ శ్రీధరన్ పిైళ్లె, హర్యానాకు దత్తాత్రేయ, కర్నాటకకు థావర్‌చంద్ గెహ్లాట్ నియమితులయ్యారు.
వాయుసేనకు ఆకాశ్ మిసైల్స్
భారత వైమానిక దళానికి ఆకాశ్ క్షిపణులను సరఫరా చేసేందుకు బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) జూలై 8న ఒప్పందం చేసుకుంది. రూ.499 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై వైమానిక దళం ఎయిర్ కమోడోర్ అజయ్ సింఘాల్, బీడీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమోడోర్ టీఎన్ కౌల్ సంతకాలు చేశారు.
ఫిర్యాదుల అథారిటీ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీని జూలై 8న ఏర్పా టు చేసింది. విశ్రాంత జస్టిస్ విలాస్ వీ అఫ్జల్ పుర్కర్ను అథారిటీ చైర్మన్‌గా నియమించింది. రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులుగా విశ్రాంత ఐపీఎస్ నవీన్ చంద్, సభ్య కార్యదర్శిగా శాంతి భద్రతల అడిషనల్ డీజీ వ్యవహరిస్తారు.
కేంద్ర కేబినెట్లో కొత్త మంత్రులు
ప్రధాని మోదీ క్యాబినెట్లో 43 మంది కొత్తవారు జూలై 7న ప్రమాణం చేశారు. ప్రస్తుతం 75 మంది మంత్రులు ఉన్నారు. 30 మందికి కేబినెట్ హోదా ఉంది. దళితులు 37 మంది మంత్రులుగా ఉన్నారు. నూతనంగా కేంద్ర సహకార మంత్రి పదవిని సృష్టించారు. మోదీ కేబినెట్లో 35 ఏండ్ల వయస్సులో కూచ్ బీహార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన నిశిత్ ప్రమాణిక్‌కు మంత్రి పదవి దక్కింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 14 మంది మంత్రులుగా ఎంపికయ్యారు.
వార్తల్లో వ్యక్తులు
ఇసాక్ హెర్జోగ్
ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా ఇసాక్ హెర్జోగ్ జూలై 7న ఆ దేశ పార్లమెంట్లో ప్రమాణం చేశారు. లేబర్ పార్టీ నుంచి ఎన్నికైన ఆయన ఈ పదవిలో 7 సంవత్సరాలు ఉంటారు. ఆయన గతంలో యూఎన్వోలో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేశారు. ప్రధాని నఫ్తాలీ బెన్నెట్. పార్లమెంట్ స్థానాలు 120.
కౌశిక్ బసు
ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసుకు జర్మనీలోని హాంబర్గ్‌లోని బసెరియస్ లా స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ హన్స్-బెర్న్డ్ షెఫర్ అవార్డు జూలై 6న లభించింది. ఆయన 2009 నుంచి 2012 వరకు భారత ఆర్థిక సలహాదారుడిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త కార్నెల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా వ్యవహరించారు.
జొవెనెల్ మోయిస్
హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్ మోయిస్‌ను సాయుధ కమాండో గ్రూపు సభ్యులు హత్యచేశారని తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ జూలై 7న వెల్లడించారు. హైతీ కరీబియన్ దీవుల సముదాయంలోని దేశం. పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ రాజధానిగా గల ఈ దేశం ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత పేదది.
దిలీప్ కుమార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ జూలై 7న మరణించారు. ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్. 1922లో పెషావర్‌లో జన్మించిన ఆయన జ్వూర్ భాటా చిత్రంతో 1944లో రంగప్రవేశం చేశారు. ‘పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలను అందుకున్నారు.
ఎంపీ సింగ్
కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌గా ఎంపీ సింగ్ జూలై 7న బాధ్యతలు చేపట్టారు. గత బోర్డు చైర్మన్ పరమేశం మే నెలలో పదవీ విరమణ పొందారు. తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ స్థానంలో సింగ్ నియమితులయ్యారు.
జైలా అవంత్ గార్డే
అమెరికాలో జూలై 8న నిర్వహించిన స్పెల్లింగ్ బీ పోటీలో తొలిసారి ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన జైలా అవంత్ గార్డే విజేతగా నిలిచింది. ముర్రే యా ఆస్ట్రేలియా జాతి వృక్షం, querimanious, solidungulate లాంటి కఠినమైన పదాలను పలికింది. 209 మంది పాల్గొన్న ఈ పోటీలో ఫైనల్‌కు 11 మంది చేరుకున్నారు. తెలుగు మూలాలున్న చైత్ర తుమ్మల 2, భావన మదిని 3వ స్థానాల్లో నిలిచారు.
అంతర్జాతీయం
88 ఉపగ్రహాలు
అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ‘స్పేస్ ఎక్స్’ ‘ట్రాన్స్పోర్టర్-2’ మిషన్‌లో భాగంగా ఒకేసారి 88 ఉపగ్రహాలను నింగిలోకి జూలై 3న పంపింది. ఫాల్కన్ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్‌కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. వీటిలో వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, స్టార్‌లింక్ ప్రాజెక్టుకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. 2021లో ఈ సంస్థకు ఇది 20వ ప్రయోగం. జనవరిలో ట్రాన్స్పోర్టర్-1 మిషన్ ద్వారా 143 ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది.
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం
అమెరికా 245వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జూలై 4న నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొని కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం దేశభక్తిని చాటుకునే అత్యుత్తమ విధానమన్నారు.
కొవిన్ సదస్సు
‘కొవిన్’ అంతర్జాతీయ సదస్సును జూలై 5న నిర్వహించారు. ఈ సదస్సులో భారత్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్, గయానా, జాంబియా సహా 142 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ కొవిన్ యాప్‌ను అందరికీ ఉచితంగా లభ్యమయ్యేలా ఓపెన్ సోర్స్‌గా మార్చి, అన్ని దేశాలకూ అందిస్తామన్నారు.
చైనా ఉపగ్రహం
వాతావరణ పరిశీలన కోసం చైనా ఫెంగ్యున్-3ఇ అనే అధునాతన ఉపగ్రహాన్ని జూలై 5న ప్రయోగించింది. జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-4సి రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వల్ల ముందస్తు వాతావరణ హెచ్చరికల సామర్థ్యం పెరగడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచు విస్తీర్ణం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను పర్యవేక్షించడానికి వీలు
కలుగుతుంది.
చైనా-శ్రీలంక
చైనా-శ్రీలంక దేశాల మధ్య వాణిజ్య, స్నేహసంబంధాలు ఏర్పడి జూలై 7 నాటికి 65 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం రెండు బంగారు నాణేలను విడుదల చేసింది. ఒక నాణెం మీద ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా-1921-2021’ అని సింహళ, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించారు. రెండో నాణెంపై కొలంబోలో నిర్మించిన నీలుం పోకునా మహేంద్ర రాజపక్సే, చైనా థియేటర్ చిత్రం ఉంది.
క్రీడలు
మిథాలీ రాజ్
ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) జూలై 6న ప్రకటించిన మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ నంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచింది. గత ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉంది. తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు అర్ధసెంచరీలు చేసిన మిథాలీ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. 2018 ఫిబ్రవరిలో చివరిసారిగా మిథాలీ నంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచింది.
కేశవ్
భారత హాకీ దిగ్గజం కేశవ్ చంద్ర దత్ కోల్‌కతాలో జూలై 7న మరణించారు. 1948 లండన్, 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు గెలిచిన జాతీయ జట్టులో కేశవ్ సభ్యుడిగా ఉన్నారు.
నిహాల్ సరిన్
భారత యువ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరిన్ సెర్బియా ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. జూలై 8న నిర్వహించిన ఈ పోటీలో రష్యా గ్రాండ్ మాస్టర్ వ్లాదిమిర్ పెడోసివ్ను ఓడించాడు. నిహాల్‌కు వరుసగా ఇది రెండో టైటిల్.
ఒలింపిక్స్ నజరానాలు
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చే క్రీడాకారులకు నజరానాలను ఒడిశా ప్రభుత్వం జూలై 8న ప్రకటించింది. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో స్వర్ణ విజేతకు రూ.6 కోట్లు, రజత విజేతకు రూ.4 కోట్లు, కాంస్య విజేతకు రూ.2.5 కోట్ల చొప్పున అందిస్తామని, ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరికి రూ.15 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది.
మను సాహ్ని
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) మను సాహ్ని తన పదవికి జూలై 8న రాజీనామా చేశారు. సహచరులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడన్న కారణంతో అతడిపై ఐసీసీ విచారణ ప్రారంభించింది. దీంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. జెఫ్ అలార్డీన్ తాత్కాలిక సీఈవోగా కొనగుసాగుతాడని ఐసీసీ ప్రకటించింది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు