కరెంట్ అఫైర్స్-05-09-2021
జాతీయం
స్కైవే పునఃప్రారంభం
ఉత్తరాఖండ్‌లో చారిత్రక గర్తాంగ్ గలి చెక్క మెట్ల మార్గాన్ని (స్కైవే) 59 ఏండ్ల తరువాత ప్రభుత్వం ఆగస్టు 20న తెరిచింది. ఈ స్కైవేని 150 ఏండ్ల క్రితం పెషావర్ (ప్రస్తుత పాకిస్థాన్)కు చెందిన పఠాన్లు నిర్మించారు. ఈ మార్గం భూ ఉపరితలానికి 11 వేల అడుగుల ఎత్తులో 150 మీటర్ల పొడవులో ఉంది. 1962 భారత్-చైనా యుద్ధం తరువాత ఈ స్కైవేని మూసివేశారు.
బీ ఇంటర్నెట్ ఆసమ్
దేశంలోని చిన్నారులకు ఇంటర్నెట్ భద్రతపై అవగాహన కల్పించేందుకు గూగుల్ ‘బీ ఇంటర్నెట్ ఆసమ్’ అనే కార్యక్రమాన్ని ఆగస్టు 25న ప్రారంభించింది. హాస్య పుస్తక ప్రచురణలకు ప్రసిద్ధి చెందిన ‘అమర్ చిత్ర కథ’ భాగస్వామ్యంతో 8 భారతీయ భాషల్లో ఇంటర్నెట్ భద్రతపై పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ‘గూగుల్ సేఫ్టీ సెంటర్’ను ప్రారంభించారు.
న్యూ స్టార్ట్ న్యూ గోల్స్
లద్దాఖ్‌లో ‘న్యూ స్టార్ట్ న్యూ గోల్స్’ పేరుతో ఆగస్టు 26న సదస్సు నిర్వహించారు. లద్దాఖ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. ఇక్కడి నుంచి సింధు నది ప్రవహిస్తుండటంవల్ల పర్యాటక రంగ అభివృద్ధికి అనువుగా ఉంటుందన్నారు.
ఈ-శ్రమ్
దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేసేందుకు ‘ఈ-శ్రమ్’ వెబ్ పోర్టల్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆగస్టు 26న ప్రారంభించారు. ఉచితంగా చేపట్టే ఈ ప్రక్రియలో డిసెంబర్ 31 నాటికి 38 కోట్ల మంది కార్మికులను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
చిత్రాంజలి 75
పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ‘చిత్రాంజలి 75: ఏ ప్లాటినం పనోరమా’ ఆన్లైన్ పోర్టల్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆగస్టు 27న ప్రారంభించారు. దీనిలో దేశభక్తితో కూడిన 75 భారతీయ చిత్రాల పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. దీనిలో పదండి ముందుకు, అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి, డాక్టర్ అంబేద్కర్, సైరా నరసింహారెడ్డి, పయనం వంటి తెలుగు సినిమా పోస్టర్లు ఉన్నాయి.
క్రీడలు
హకీం మృతి
భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ షాహిద్ (ఎస్ఎస్) హకీం ఆగస్టు 22న మరణించారు. ఆయన హైదరాబాద్‌లో జన్మించారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఫుట్‌బాల్ జట్టులో ఆయన సభ్యుడు. ఆయన ఫిఫాలో రిఫరీగా కూడా పనిచేశారు. ధ్యాన్‌చంద్, ద్రోణాచార్య అవార్డులను అందుకున్నారు.
శైలీ సింగ్
నైరోబీ (కెన్యా రాజధాని)లో నిర్వహించిన ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ (అండర్-20) చాంపియన్‌షిప్‌లో శైలీ సింగ్ రజత పతకం సాధించింది. ఆగస్టు 22న నిర్వహించిన మహిళల లాంగ్‌జంప్ ఫైనల్లో మజ అస్కగ్ (స్వీడన్)కు స్వర్ణ పతకం సాధించగా శైలీకి రజతం లభించింది. మరియా హొరియెలొవా (ఉక్రెయిన్) కాంస్యం గెలిచింది.
చంద్రశేఖర్ మృతి
భారత ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు చంద్రశేఖర్ ఆగస్టు 24న మరణించారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన జట్టులో ఆయన సభ్యుడు. కేరళకు చెందిన ఈయన 1958-66 మధ్య భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
సత్యన్‌కు టీటీ టైటిల్
ఐటీటీఎఫ్ (ఇంటర్నేషన్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) చెక్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ టైటిల్‌ను భారత ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్ సాధించాడు. ఆగస్టు 25న నిర్వహించిన ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన యెహెన్ను ఓడించాడు. ఇటీవల బుడాపెస్ట్‌లో జరిగిన డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో అతడు మనికబాత్రాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచాడు.
పారాలింపిక్స్ ప్రారంభం
టోక్యోలో ఆగస్టు 24 నుంచి పారాలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో మొత్తం 4,403 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను రెండోసారి నిర్వహిస్తున్న తొలి నగరం టోక్యో. పారాలింపిక్స్ పోటీలు తొలిసారిగా 1960లో రోమ్‌లో నిర్వహించారు. మార్చ్ఫాస్ట్లో భారత ఫ్లాగ్ బేరర్‌గా టెక్ చంద్ ముందుకు సాగాడు. మరియప్పన్‌తో కలిసి ప్రయాణించిన విదేశీ ఆటగాడికి కరోనా పాజిటివ్ తేలడంతో మరియప్పన్ చివరి నిమిషంలో తప్పుకొన్నాడు.
అంతర్జాతీయం
ఫైజర్ వ్యాక్సిన్
ఫైజర్, బయోఎన్టెక్లు సంయుక్తంగా తయారుచేసిన ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా పూర్తిస్థాయి అనుమతులు కల్పిస్తూ ఆగస్టు 23న నిర్ణయం తీసుకుంది. దీంతో పూర్తిస్థాయిలో అనుమతులు పొందిన తొలి టీకాగా ఫైజర్ నిలిచింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రస్తుతం వాడుతున్న వ్యాక్సిన్లు కేవలం అత్యవసర అనుమతులు మాత్రమే పొందాయి.
గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్
అమెరికాకు చెందిన కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్-2021ని ఆగస్టు 24న విడుదల చేశారు. ఈ సూచీలో చైనా మొదటి స్థానంలో నిలువగా.. భారత్ 2, అమెరికా 3వ స్థానాల్లో నిలిచాయి. తయారీని సత్వరం తిరిగి ప్రారంభించగలగడం, వ్యాపార పరిస్థితులు, నిర్వహణ వ్యయాలు, రిస్కులు (రాజకీయ, ఆర్థిక, పర్యావరణపరమైనవి) అనే అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.
జీ-7 సమావేశం
అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై జీ-7 (రష్యా, అమెరికా, జర్మనీ, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ) కూటమి ఆగస్టు 24న వర్చువల్‌గా సమావేశమయ్యింది. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ గడువు ఆగస్టు 31న ముగిసిన తరువాత కూడా దేశాన్ని వీడాలనుకునే వారు సురక్షితంగా వెళ్లిపోవడానికి వీలు కల్పిస్తామని తాలిబన్లు హామీ ఇవ్వాలని ఈ సమావేశం షరతు విధించింది. తాలిబన్లతో వ్యవహరించే ఒక రోడ్‌మ్యాప్‌ను ఆమోదించనున్నారు. ఈ సమావేశానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహించారు.
ఫతా-1
పాకిస్థాన్ తమ దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గైడెడ్ రాకెట్ ఫతా-1ను ఆగస్టు 24న విజయవంతంగా పరీక్షించింది. బహుళ ప్రయోగ రాకెట్ అయిన దీనికి శత్రు భూభాగంలోని లక్ష్యాలపైకి వార్హెడ్లను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం ఉంది. రెండోసారి పరీక్షించిన ఈ ఫతా-1 140 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు.
మలబార్ విన్యాసాలు
పసిఫిక్ మహాసముద్రం గువామ్ తీరం (అమెరికా)లో ఆగస్టు 26న ప్రారంభమైన 25వ ఎడిషన్ మలబార్ నేవీ ఎక్సర్సైజ్ 29న ముగిసింది. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ శివాలిక్, కద్మత్, అమెరికాకు చెందిన యూఎస్ఎస్ జాన్ మెక్‌కైన్, హెచ్ఎంఏఎస్ బలారత్, జపాన్‌కు జపనీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్) చెందిన జేఎస్ ఒనామీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్)కి చెందిన యుద్ధ నౌకలు విన్యాసాలు నిర్వహించాయి.
వార్తల్లో వ్యక్తులు
శ్రీకాంత్
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా టీ శ్రీకాంత్ ఆగస్టు 23న నియమితులయ్యారు. 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయన. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన 2012-14 మధ్య పుదుచ్చేరి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
లా గణేశన్
మణిపూర్ గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు లా గణేశన్ ఆగస్టు 22న నియమితులయ్యారు. గత గవర్నర్ నజ్మాహెప్తుల్లా పదవీవిరమణ పొందారు.
హరీశ్
జర్మనీలో భారత రాయబారిగా హరీశ్ పర్వతనేని ఆగస్టు 24న నియమితులయ్యారు. ఆయన 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్కు చెందిన అధికారి.
యశోధర
కేంద్ర సాహిత్య అకాడమీ-2020 అవార్డుకు ఒడిశా రచయిత్రి యశోధర మిశ్రా ఎంపికయ్యారని అకాడమీ కార్యదర్శి కే శ్రీనివాసరావు ఆగస్టు 25న ప్రకటించారు. ఆమె రచించిన ‘సముద్ర కులె ఘొరో (సాగర తీరంలో ఇల్లు)’ కథల సంకలనానికి ఈ అవార్డు లభించింది. ఆమె తండ్రి ప్రముఖ రచయిత భువనేశ్వర్ మిశ్రా
పంకజ్ కుమార్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా పంకజ్ కుమార్ సింగ్ ఆగస్టు 25న నియమితులయ్యారు. 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన బీఎస్ఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.
బాలాజీ శ్రీవాస్తవ
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు డైరెక్టర్ జనరల్‌గా బాలాజీ శ్రీవాస్తవ ఆగస్టు 25న నియమితులయ్యారు. ఈయన 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు.
సంజయ్ అరోరా
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ అరోరా ఆగస్టు 25న నియమితులయ్యారు. ఈయన 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు.
జస్టిస్ ఖాన్విల్కర్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ (న్యాయ సేవా సంస్థ) చైర్మన్‌గా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఆగస్టు 26న నియమితులయ్యారు. ఇదివరకు ఈ పదవిలో ఉన్న జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారిమన్ పదవీ విరమణ చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు