శ్రీకొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను జాతి కి అంకితం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ
మల్లన్న సాగర్
సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద నిర్మించిన శ్రీకొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 23న జాతికి అంకితం చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
బయో ఏషియా
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న బయో ఏషియా 19వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో ఐటీ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 24న ప్రారంభించారు. ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ‘ఫ్యూచర్ రెడీ’ నినాదంతో రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించారు.
నేషనల్ వాష్ సదస్సు
మూడు రోజుల పాటు నిర్వహించిన నేషనల్ వాటర్, శానిటేషన్, హైజీన్ కాంక్లేవ్ (నేషనల్ వాష్) సదస్సును వర్చువల్‌గా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫిబ్రవరి 23న ప్రారంభించారు. ఈ సదస్సును రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ)లో నిర్వహించారు. ‘జలమే జీవనం’ అనే అంశంపై చర్చించారు.
ప్రసాద్లో రామప్ప
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ‘పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ (ప్రసాద్-తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం)స్కీమ్’లో రామప్ప ఆలయాన్ని ఆ శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఫిబ్రవరి 24న చేర్చారు. ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపాలని కేంద్ర పర్యాటక శాఖ రాష్ర్టాన్ని కోరనుంది. ఇదివరకే భద్రాచలం ఆలయాన్ని కూడా రామాయణ సర్క్యూట్ కింద ఈ స్కీమ్‌లో చేర్చారు.
విత్తన పరీక్ష కేంద్రం
అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని రాజేంద్ర నగర్లో ఫిబ్రవరి 25న ప్రారంభించారు. రూ.7 వేల కోట్లతో 14.652 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు.
అంతర్జాతీయం
అల్సియోనియస్ గెలాక్సీ
విశ్వంలోకెల్లా అతిపెద్ద గెలాక్సీని కనుగొన్నట్లు నెదర్లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీ సైంటిస్టులు ఫిబ్రవరి 21న వెల్లడించారు. ఇది 1.63 కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉందని తెలిపారు. ‘అల్సియోనియస్’ అని పేరు పెట్టిన ఈ గెలాక్సీ మన పాలపుంత కంటే 152 రెట్లు, సూర్యుడి కంటే 24,000 కోట్ల రెట్లు పెద్దదిగా ఉందని ప్రకటించారు.
మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్
‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ అనే ఏడంతస్తుల భవనాన్ని దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ ఫిబ్రవరి 23న ప్రారంభించారు. 50 ఏండ్ల తరువాత ప్రపంచంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులో ఉంటుందో ఊహిస్తూ ఈ మ్యూజియాన్ని రూపొందించారు. దీనిలో భవిష్యత్తుకు సంబంధించిన వినూత్న పరిశోధనల ప్రదర్శనను అందుబాటులో ఉంచనున్నారు.
కోబ్రా వారియర్
బహుళ దేశాల వైమానిక విన్యాసాలు ‘కోబ్రా వారియర్-2022’ మార్చి 6 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు బ్రిటన్ వైమానిక దళ అధికారులు ఫిబ్రవరి 24న వెల్లడించారు. బ్రిటన్‌లోని వెడ్డింగ్టన్లో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు.
మేధోసంపత్తి సూచీ
9వ అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఫిబ్రవరి 25న విడుదల చేసింది. 55 దేశాలతో ఈ సూచీని ప్రచురించింది. ఈ సూచీలో అమెరికా మొదటి స్థానంలో నిలువగా.. బ్రిటన్ 2, జర్మనీ 3, స్వీడన్ 4, ఫ్రాన్స్ 5వ స్థానాల్లో నిలిచాయి. భారతదేశం 43వ స్థానంలో ఉంది.
ట్రూత్ సోషల్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్, ట్విట్టర్‌కు పోటీగా ‘ట్రూత్ సోషల్’ను ఫిబ్రవరి 21న యాపిల్ యాప్ స్టోర్‌లో విడుదల చేశారు. ట్విట్టర్లో పోస్ట్ చేసేవాటిని ట్వీట్ అంటారు. ట్రూత్ సోషల్ యాప్‌లో ట్రూత్ అంటారు. దీనిలో రాజకీయ వివక్ష ఉండదని యాప్‌ను రూపొందించిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ వెల్లడించింది.
జాతీయం
అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఫిబ్రవరి 20న నిర్వహించారు. ఆ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన గోల్డెన్ జూబిలీ అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘అరుణాచల్ రత్న’ను ఆ రాష్ట్ర మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ కేఏఏ రాజుకు ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా 1987లో అవతరించింది.
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ-2022
ఈస్ట్ నేవీ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం సముద్ర జలాల్లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ-2022 (పీఎఫ్ఆర్-2022)ను ఫిబ్రవరి 21న నిర్వహించారు. త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఫ్లీట్‌లో పాల్గొన్నారు. ఇది 12వ ఫ్లీట్ రివ్యూ.
సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్
ఐబీఎం (ది ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) ఏర్పాటు సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫిబ్రవరి 23న ప్రారంభించారు. కంపెనీలు ఏదైనా సైబర్ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సెంటర్ దేశంలోనే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే తమ కంపెనీ ప్రారంభించిన మొదటి కేంద్రం అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ వెల్లడించారు. ఐబీఎం ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. 1911లో స్థాపించిన దీని ప్రస్తుత చైర్మన్, సీఈవో అర్వింద్ కృష్ణ.
గ్రామీణ కృషి మౌసం
గ్రామీణ కృషి మౌసం సేవా ప్రాజెక్టులో భాగంగా ప్రాంతీయ రైతుల అవగాహన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23న ఐఐటీ రూర్కీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరిద్వార్, డెహ్రాడూన్, పారి గర్వాల్ జిల్లాల రైతులు పాల్గొన్నారు.
వార్ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్
12వ యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్ పీ-81 భారత నావికాదళానికి ఫిబ్రవరి 24న చేరింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ అమెరికాకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ రూపొందించింది. పీ-81 విమానాల కోసం అమెరికాతో 2009లో ఒప్పందం కుదిరింది.
పుస్తకావిష్కరణ
‘ది గ్రేట్ టెక్ గేమ్: షేపింగ్ జియోపాలిటిక్స్ అండ్ ది డెస్టినీస్ ఆఫ్ నేషన్స్’ పుస్తకాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేశారు. అనిరుధ్ సూరి రచించిన ఈ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ ఇండియా ముద్రించింది.
ఆపరేషన్ మిలన్
‘ఆపరేషన్ మిలన్-2022’ నావికాదళ విన్యాసాలు ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు విశాఖపట్నంలో నిర్వహించారు. ఇది హార్బర్ ఫేజ్‌కు చెందిన విన్యాసాలు. సీ ఫేజ్ విన్యాసాలు మార్చి 1 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. ‘స్నేహం-పరస్పర సహకారం’ అనే థీమ్‌తో ఈ విన్యాసాలు చేపట్టారు. ఈ విన్యాసాలను తొలిసారిగా 1995లో అండమాన్ నికోబార్‌లో ప్రారంభించారు. ఈ విన్యాసాలను ఇప్పటి వరకు 25 సార్లు నిర్వహించారు.
వార్తల్లో వ్యక్తులు
రాఘవన్
ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్ (ఐఆర్ఎస్జీ) చైర్మన్‌గా కేఎన్ రాఘవన్ ఫిబ్రవరి 22న నియమితులయ్యారు. ఈయన ఇండియన్ రబ్బర్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఐఆర్ఎస్జీని 1944లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది.
సంజీవ్ సన్యాల్
ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా సంజీవ్ సన్యాల్ ఫిబ్రవరి 23న నియమితులయ్యాడు. అతడు రెండు సంవత్సరాలు పదవిలో ఉంటాడు. ప్రధాన మంత్రి సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్.
రాకేష్ శర్మ
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఎండీగా రాకేష్ శర్మ ఫిబ్రవరి 24న నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేండ్లు ఉంటారు. ఆయన నియామకం మార్చి 19 నుంచి అమల్లోకి వస్తుంది.
క్రీడలు
వింటర్ ఒలింపిక్స్
వింటర్ ఒలింపిక్స్‌ను బీజింగ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు నిర్వహించారు. 7 క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 91 దేశాలు పాల్గొన్నాయి. భారత్ తరఫున ఆరిఫ్ ఖాన్ పాల్గొన్నాడు. పతకాల పట్టికలో మొదటి స్థానంలో నార్వే (16 స్వర్ణాలు, 8 రజతాలు, 13 కాంస్యాలు) నిలిచింది. తరువాతి స్థానాల్లో జర్మనీ (12 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు), చైనా (9 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) నిలిచాయి.
మీరాబాయి చాను
వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో 55 కేజీల విభాగంలో మీరాబాయి చానుకు స్వర్ణం లభించింది. సింగపూర్‌లో ఫిబ్రవరి 25న ఈ పోటీలు నిర్వహించారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. 55 కేజీల విభాగంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు