అమెరికా చదువు భారం
# 80కి పడిపోయిన రూపాయి మారకం విలువ
# సగటున లక్ష రూపాయలు పెరిగిన ఫీజులు
# విదేశీ విద్యపై మున్ముందు మరింత ఎఫెక్ట్
# ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు
ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పడిపోతున్నది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 80కి చేరింది. ఇది మరింత క్షీణించే ప్రమాదం ఉన్నదని అంచనాలు ఉన్నాయి. ఈ ప్రభావం విదేశాల్లో చదుకోవాలనుకొనే విద్యార్థులపై మరింత భారాన్ని మోపుతున్నది. కేవలం ఏడు నెలల్లోనే సగటున ఫీజుల ఖర్చు రూ.లక్ష పెరిగింది. ఏటా దేశం నుంచి 2 లక్షల మంది అమెరికా బాటపడుతున్నట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో ఉంటున్నవారిలో 18 శాతం భారతీయులేనని అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. వీరిలో తెలంగాణ నుంచి 15 వేల మంది ఉంటారని అంచనా. దేశంలో హైదరాబాద్ నుంచే అత్యధిక విద్యార్థులు అమెరికా చదువుపై ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. తాజా పరిస్థితులతో పునరాలోచనల్లో పడుతున్నారు. అమెరికా వెళ్లేవారిలో అత్యధికులు విద్యారుణాల మీదే ఆధారపడతారు. వీరంతా ప్రస్తుత ఫీజుల ప్రకారం రుణాలు తీసుకుంటారు. అకస్మాత్తుగా ఫీజులు పెరగడం, జీవవ వ్యయం సైతం అధికమవడంతో అవస్థలు తప్పడం లేదు. 2-3 ఏండ్ల క్రితం రుణాలు తీసుకున్నవారు తాజాగా పెరిగిన ఫీజులు చెల్లించేందుకు అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తున్నది. ఫీజుల పెంపు, తాజా పరిస్థితులతో విద్యార్థులు ఫీజులు తక్కువగా ఉండే దేశాలైన జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల వైపు చూస్తున్నారు.
ఆశలు అవిరేనా..!
ఈ వారంలోనే డాలర్‌తో రూపాయి మారకం రేటు ఆల్‌టైం పతనం రికార్డును నమోదుచేసింది. యూఎస్ కరెన్సీతో పొల్చితే రూ.80 మార్కును తాకింది. ఈ సంవత్సరంలో జనవరి 12న రూపాయి విలువ 73.80గా ఉండగా, సోమవారం నాటికి 79.98కి చేరుకున్నది. భారత కరెన్సీ బలహీనపడటంతో డాలర్ల రూపంలో చెల్లించే ఫీజులకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నది. రోజువారి ఖర్చులకు సైతం భారీగానే డబ్బు పంపాల్సి వస్తున్నది. వాస్తవానికి ద్రవ్యోల్బణం ఫలితంగా ఏటా 10 శాతం ఖర్చులు పెరుగుతున్నాయి. మిగతా దేశాలతో పోల్చితే అమెరికాలో ఫీజలు, జీవన వ్యయం అధికం. దీంతో విదేశీ చదువుల ఖర్చులు భరించే పరిస్థితి లేకుండాపోయింది.
డాలర్ డ్రీమ్స్ ఇక కలే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం ఎక్కువశాతం దిగుమతులపై ఆధారపడి ఉన్నది. దీంతో చెల్లింపులన్నీ డాలర్లలో చేయాల్సి ఉంటుంది. ఫలితంగా వాణిజ్యలోటు ఏర్పడి రూపాయి పతనానికి దారి తీస్తున్నది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు దిగుమతుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దిగుమతి అధార వస్తువుల ధరలు పెరిగితే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతున్నది. దీంతో రుణాలు, చెల్లించాల్సిన ఈఎంఐలు భారమవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న ఖర్చులకు, విదేశీ విద్యకు ఎక్కువ చెల్లించాల్సి రావటంతో డాలర్ డ్రీమ్స్ కలగా మిగిలిపోతున్నాయి.
వర్సిటీల వారిగా ఫీజుల వ్యత్యాసం..
వర్సిటీ ట్యూషన్‌ఫీజు 2022 2022 వ్యత్యాసం
————— (డాలర్స్‌లో) (జనవరి 12న ఫీజు) (జూలై 18న ఫీజు)
సెయింట్ లూయిస్ 14,715 రూ. 10,85,967 రూ. 11,76,905 రూ. 90,938
అబర్న్ 17,812 రూ. 13,14,525 రూ. 14,24,603 రూ. 1,10,078
ఫ్లోరిడా 25,986 రూ. 19,17,766 రూ. 20,78,360 రూ. 1,60,594
న్యూహెవెన్ 28,950 రూ. 21,36,510 రూ. 23,15,421 రూ. 1,78,911
ప్రతికూల పరిస్థితులు : -హరికాంత్‌రెడ్డి, ఎడ్యు2టెక్, సీఈవో
రూపాయి విలువ పతనంతో అమెరికా చదువుల పట్ల ప్రతికూల పరిస్థితులున్నాయి. డాలర్‌ను 65 దేశాలు అనుసరిస్తున్నాయి. మన దగ్గరి నుంచి వెళ్లేవారిలో అత్యధికులు విద్యారుణాలపై ఆధారపడుతున్నారు. వీరు ముందుగానే ఎంత ఖర్చవుతుందో అంచనాతో ఉంటారు. అకస్మాత్తుగా రూపాయి విలువ తగ్గటంతో ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. ఫీజులు పెరిగితే కట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాం.
మధ్య తరగతికి ఇబ్బందికరమే : మహ్మద్ ఉమర్ఖాన్, విద్యార్థి
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. కొవిడ్ భయాలతో ఏడాది వృథా అయ్యిం ది. తాజాగా అమెరికా వెళ్దామని ఏర్పాట్లు చేసుకొంటే ఫీజులు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్య తరగతివారికి ఇబ్బందిగా ఉన్నది. అయినా మా ఫ్రెండ్స్‌లో కొంత మంది యూఎస్‌కే జై కొడుతున్నారు. జీవితంలో స్థిరపడాలంటే కొన్ని భరించక తప్పదు. న్యూ హెవెన్ యూనివర్సిటీకి దరఖాస్తుచేశాను.
గతం కన్నా లక్ష పెరిగింది : అఖిలారెడ్డి, విద్యార్థిని
అడ్మిషన్స్ కోసం కన్సల్టెన్సీకి వెళ్తే ఫీజులు పెరిగాయని, భవిష్యత్తులో మరింత పెరుగుతాయన్నారు. నాకు తెలిసినవాళ్లు జనవరిలో తక్కువకే వెళ్లారు, నేను కూడా సిద్ధపడుతుండగా ఫీజులు పెరిగిన విషయం తెలిసింది. గతం కన్నా లక్ష రూపాయల ఎక్కువవుతున్నది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీకి దరఖాస్తు చేశాను.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు