TS EAMCET Counselling 2023 | సరైన ఎంపికతోనే.. విలువైన భవిష్యత్తు
TS EAMCET Counselling 2023 | ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపునకు ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 26 నుంచి ప్రారంభమైంది. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, సీట్ అలాట్మెంట్ తదితర ప్రక్రియలన్నీ మూడు దశల్లో జూలై 19 వరకు జరుగనున్నాయి. సీట్ల కేటాయింపు, కౌన్సెలింగ్ విధానంపై విద్యార్థులకు అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను ‘నిపుణ’ పలుకరించింది. కౌన్సెలింగ్ విధానంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తికి ఎంసెట్ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయని తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియ, విద్యార్థుల సందేహాలకు పరిష్కారం, సలహాలు, సూచనలు ఆయన మాటల్లో..
కౌన్సెలింగ్ ప్రక్రియలు
- ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగానికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశాం. జూన్ 26 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాం. మొదట స్లాట్ బుకింగ్ ఉంటుంది. జూన్ 28 నుంచి నుంచి జూలై 6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్లు, బ్రాంచీల సెలక్షన్ జూన్ 28 నుంచి నుంచి జూలై 8 వరకు ఉంటుంది. ఏఐసీటీఈ (AICTE) ఇచ్చిన జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని కళాశాలల్లో అందుబాటులో ఉన్న బ్రాంచీల వివరాలు యూనివర్సిటీ పరిశీలించి సీట్ల వివరాలు మాకు అందిస్తుంది. దాని ప్రకారం తుది జాబితా ప్రకటిస్తాం.
కంప్యూటర్ ఆధారిత కోర్సులపై ఆసక్తి - విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ ఆధారిత కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. జేఎన్టీయూహెచ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. కానీ దానిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం ఉన్న కోర్సుల్లోనే సర్దుబాటు చేస్తున్నాం. సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గించి కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచాలని కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ ఆధారిత కోర్సులపై దృష్టి పెడుతున్నారు. గతేడాది సివిల్, మెకానికల్ సీట్లు దాదాపు 30 శాతం వరకు మిగిలాయి. దీని కారణంగా వాటిని తగ్గించి కంప్యూటర్ సంబంధిత కోర్సులు పెంచాలనే ఆలోచనలో ఉన్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే సీట్ల సర్దుబాటు చేస్తాం.
ఏపీ విద్యార్థులకే ర్యాంకులనడం సరికాదు - రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్ని వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు 2024 వరకు రాసుకోవచ్చు. అప్పటి వరకు వారికి ఇక్కడ అవకాశం కల్పిస్తాం. ఇక ర్యాంకుల విషయానికి వస్తే ఎవరు బాగా చదివితే వారికే ర్యాంకులు వస్తాయి. అన్యాయం జరుగుతుంది అంటే దానికి 2024 వరకు ఏమీ చేయలేం. ఇంకొక విషయం ఏంటంటే టాప్ 100 ర్యాంకుల విద్యార్థుల్లో దాదాపు 70 మంది జేఈఈ మెయిన్స్, ఐఐటీ, ఎన్ఐటీలకు వెళ్లిపోతారు. టాప్ 100 ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ విద్యార్థులున్నారు. కాబట్టి ఇక్కడి విద్యార్థులకు నష్టం జరుగుతుందనడం అవాస్తవం.
నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు - ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయిస్తాం. మేం కేటాయించిన సీట్లు మా వెబ్సైట్లో ఉంచుతున్నాం. ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇందులో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్మెంట్ సీట్లు. అన్ని కళాశాలలు నిబంధనల ప్రకారమే సీట్లు భర్తీ చేయాలి. కళాశాల స్థాయిని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజులు వసూలు చేయాలి. ఎన్బీఏ, న్యాక్ అక్రెడిటేషన్ ఉన్న కళాశాలల్లో మిగతా వాటి కంటే ఫీజు ఎక్కువగా ఉంటుంది. ఏ కళాశాలలోనైనా ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే ఎంసెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
స్లాట్ బుకింగ్ ఫీజు - స్లాట్ బుకింగ్ చేసుకున్నందుకు నామమాత్రపు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.600 ఉంటుంది. బీసీ, ఓసీ, ఇతర కేటగిరీల విద్యార్థులకు రూ.1200 అవుతుంది. మొదటి విడతలో వెబ్ ఆప్షన్లు ఇచ్చినవారు సీటు ఏ కళాశాలలో వచ్చిందో చూసుకుని ట్యూషన్ ఫీజు చెల్లించాలి. రెండో విడతలో కళాశాల మారాలనుకుంటే వెబ్ ఆప్షన్లు మళ్లీ ఇవ్వవచ్చు. ఒకవేళ మొదటి విడతలో వేరే కళాశాలలో సీటు వస్తే ఆ కళాశాలకు ప్రభుత్వం కేటాయించిన ఫీజునే పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హత సాధించినవారందరూ హాజరు కావొచ్చు - ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులందరూ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఆయా కళాశాలల్లో ఉన్న సీట్లు, మొత్తం విద్యార్థుల సంఖ్యను బట్టి కేటాయింపు ఉంటుంది. మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయో అంతవరకు తీసుకుంటాం. అప్పటికీ ఎవరైనా మిగిలితే సీటు వచ్చి చేరని వారి స్థానంలో చేరవచ్చు. మంచి ర్యాంకు రాలేదని సీటు వస్తుందో లేదో అని అపోహకు గురికావొద్దు.
ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలి - విద్యార్థులు చేసే మొదటి తప్పు వెబ్ ఆప్షన్లు చాలా తక్కువగా ఇవ్వడం. ప్రతి విద్యార్థి కచ్చితంగా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలి. ఎందుకంటే ర్యాంకు, రిజర్వేషన్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. చాలా మంది విద్యార్థుల్లో ఎక్కువ ఆప్షన్లు పెట్టుకుంటే టాప్ కళాశాలల్లో సీటు రాదేమో అనే అపోహ ఉంది. అది తప్పు.. ఎందుకంటే ర్యాంకు ఆధారంగానే టాప్ నుంచి మీడియం కళాశాలల కేటాయింపు ఉంటుంది. ఎంసెట్ అధికారిక వెబ్సైట్లో గతేడాది సీట్ల కేటాయింపు వివరాలు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఏ ర్యాంకు వారికి ఏ కళాశాల, ఏ బ్రాంచీలో సీటు వచ్చిందో చూసుకోవాలి. దాన్ని బట్టి ఈసారి కూడా కేటాయింపులు అలాగే ఉంటాయి. అందుకే ర్యాంకు వచ్చిన వారు ఎన్ని ఆప్షన్లు పెట్టుకున్నా టాప్ లిస్టులో ఉన్న కళాశాలలోనే సీటు వస్తుంది. రిజర్వేషన్, ర్యాంకును బట్టి కేటాయింపు ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు - రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. కేంద్రాలన్నీ ఆయా జిల్లా కేంద్రాల్లో ఉంటాయి. హైదరాబాద్‌లో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉండటంతో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశాం. నూతనంగా ఏర్పడిన ఒకటి రెండు జిల్లాల్లో మాత్రం కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఆ జిల్లాలకు చెందిన విద్యార్థులకు వారికి అందుబాటులో ఉన్న కేంద్రాలను కేటాయించాం.
వైద్యుల పర్యవేక్షణలో.. - దివ్యాంగులకు ప్రభుత్వం సదరం ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లు ఆన్లైన్లో లభించవు. వాటిని ప్రభుత్వం ఆన్లైన్ చేయలేదు. దీంతో ఆ సర్టిఫికెట్లు అసలైనవా.. నకిలీవా.. అని నిర్ధారించుకోవాలి. ఇందుకు దివ్యాంగ విద్యార్థులను సంబంధిత వైద్యులు పరీక్షిస్తారు. వారికి కేటాయించిన కౌన్సెలింగ్ కేంద్రంలో చెవిటి, మూగ, మానసిక వైకల్యాన్ని నిర్ధారించే వైద్యులు అందుబాటులో ఉంటారు. వారి ధ్రువీకరించిన వారికి రిజర్వేషన్ కల్పిస్తారు.
ధ్రువపత్రాలు తప్పనిసరి - టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్ తీసుకెళ్లాలి. ఒకటి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి, ఇంటర్ మెమోలు, టీసీ, ఆధార్ కార్డు, కుల, ఆధాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఉండాలి. దివ్యాంగులు, ఎన్సీసీ, క్రీడలకు చెందిన వారికి సంబంధిత ధ్రువపత్రాలు ఉండాలి.
లాగవుట్ చేస్తేనే భద్రం - విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. దీంతో ర్యాంకును బట్టి సీటు వస్తుంది. స్లాట్ బుక్ చేసుకున్నాక ఫోన్ నంబర్, పాస్వర్డ్ ఎవరికీ చెప్పవద్దు. ఏదైనా ఆన్లైన్ సెంటర్లో స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు ఇస్తే ఐడీ లాగవుట్ చేసిన తర్వాతనే అక్కడి నుంచి వెళ్లండి. ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులకు మీ వివరాలు చెబితే వెబ్ ఆప్షన్లు పూర్తయ్యేదాకా దగ్గరుండి చేయించండి. వెబ్ ఆప్షన్లు పూర్తయ్యాక ప్రింట్ తీసుకుని ఎంచుకున్న కళాశాల కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి. ఏదైనా అనుకోని కళాశాల ఎంపికయితే వెంటనే సరి చేసుకోవాలి. ఆందోళనలు, భయానికి గురవకుండా కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి.
ఫోన్ నంబర్, పాస్వర్డ్ ఎవ్వరికీ చెప్పొద్దు
- స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు పూర్తయ్యాక మీ ఫోన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎవరికీ ఇవ్వవద్దు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఫోన్ చేసి మీ పాస్వర్డ్ అడుగుతారు. మీరు పాస్వర్డ్ చెబితే వెబ్ ఆప్షన్లలో వారి కళాశాలనే ఎంపిక చేస్తారు. దీంతో మీ ర్యాంకుకు తగ్గ కళాశాలలో సీటు రాకపోవచ్చు. కొంతమంది మధ్యవర్తులు మంచి వసతులు, సౌకర్యాలు ఉన్నాయంటూ ఫలనా కళాశాలలో చేరాలని మీ ఫోన్ నంబర్, పాస్వర్డ్ అడుగుతారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కొన్ని కళాశాలల వారు అందులో చేరితే ఎలాంటి ఫీజులు ఉండవు. వసతి, భోజనం ఉచితంగా కల్పిస్తాం, మా కళాశాలలో చేరాలని ఫోన్ చేస్తుంటారు. వారిని నమ్మొద్దు. కౌన్సెలింగ్‌లో పాల్గొని కేటాయించిన కళాశాలలోనే విద్యార్థులను చేర్పించాలి.
ఎస్టీ విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్
- ఎస్టీ విద్యార్థులకు గతేడాది వరకు 6 శాతం రిజర్వేషన్ కల్పించేవారు. దీన్ని 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే కౌన్సెలింగ్, సీట్ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తవడంతో అమలు చేయలేదు. ఈ విద్యా సంవత్సరానికి దీన్ని అమలు చేస్తున్నాం. దాని ప్రకారం ఎస్టీ విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.
హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించండి
- స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఆన్లైన్, వెబ్సైట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటున్నాం. అన్ని కౌన్సెలింగ్ కేంద్రాలు నిరంతరం విద్యుత్ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడైనా స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో సమస్యలు తలెత్తితే https:// tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి. ఈ వెబ్సైట్లో హెల్ప్‌లైన్ నంబర్లు ఉంటాయి. వాటికి ఫోన్ చేస్తే సరైన సలహాలు, సూచనలు ఇస్తారు.
దివ్యాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా వారికి ప్రత్యేక కేంద్రం - దివ్యాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటాకు చెందినవారిని పరీక్షించడానికి వైద్య నిపుణులు అవసరం. ప్రతి కౌన్సెలింగ్ కేంద్రంలో సంబంధిత నిపుణులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కాబట్టి వీరి కోసం మాసబ్‌ట్యాంక్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. వారికి అక్కడే కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొని కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
కుమారస్వామి కాసాని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు