Indian Polity | సహేతుక నిబంధనలు.. హేతుబద్ధ పరిమితులు
ప్రకరణలు 19-22 వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు
- ప్రకరణ 19 నుంచి 22 వరకు ఉన్న హక్కులను వివిధ స్వేచ్ఛల రూపంలో పొందుపరిచారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ చాలా విలువైనది. కానీ ఈ స్వేచ్ఛపైన కూడా హేతుబద్ధమైన పరిమితులు
విధించవచ్చు. - అధికరణం 19లో కింద పేర్కొన్న వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి.
1. ప్రకరణ 19(1): ఎ. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన
బి. శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశాలు నిర్వహించుకోవడం
సి. సంస్థలను, సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, సహకార సంఘాలను ఏర్పరుచుకొని నిర్వహించుకోవడం
డి. దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ
ఇ. దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ
ఎఫ్. ఆస్తిని సముపార్జించుకునే స్వేచ్ఛ (ఈ క్లాజును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.)
జి. వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు
ప్రత్యేక వివరణ - పైన పేర్కొన్న స్వేచ్ఛలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉంటాయి. పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు, కంపెనీలకు, కార్పొరేషన్లకు వర్తిస్తాయి.
- ప్రకరణ 19 (1) (ఎ)లో పేర్కొన్న వాక్ స్వాతంత్య్రం భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి చాలా విస్తృతంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చెప్పింది.
- పౌరుడు తన భావాలతో పాటు ఇతరుల భావాలను కూడా వ్యక్తీకరించవచ్చని, ఇది పత్రికా స్వేచ్ఛ ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి ‘పత్రికా స్వేచ్ఛ’ అనేది భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్గతంగా ఉంటుందని పేర్కొంది.
- అలాగే కింద పేర్కొన్న స్వేచ్ఛలు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్గతంగా ఉంటాయని వ్యాఖ్యానించింది.
- పత్రికా స్వేచ్ఛ
- వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ
- రహస్యాలను కాపాడుకునే స్వేచ్ఛ
- ప్రసారాల స్వేచ్ఛ
- బంద్‌కు వ్యతిరేకమైన స్వేచ్ఛ
- సమాచార స్వేచ్ఛ
- మౌనాన్ని పాటించే స్వేచ్ఛ
- నిరసనను వ్యక్తం చేసే స్వేచ్ఛ
- ఇంటర్నెట్ వినియోగం కూడా ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని షహిమా షరీన్ VS స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు 2019లో తీర్పు చెప్పింది.
గమనిక: ‘ఇంటర్నెట్
యాక్సిస్’ను బేసిక్ హ్యూమన్ రైట్‌గా కేరళ ప్రభుత్వం 2017లో ప్రకటించింది.
మినహాయింపులు - పైన పేర్కొన్న స్వేచ్ఛలపై హేతుబద్ధమైన పరిమితులను నిర్మించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కింది కారణాలపై పరిమితులు విధించవచ్చు.
- భారత సార్వభౌమాధికారం, సమగ్రత
- దేశ రక్షణ, విదేశాలతో స్నేహ సంబంధాలు
- ప్రజాశాంతి, సఖ్యత, మర్యాద, నీతి, కోర్టు ధిక్కారం
- పరువు నష్టం, నేర ప్రేరేపణ మొదలగు ప్రాతిపదికలపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు.
- ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124 (శాంతి భద్రతలు) 499, 500 (పరువు నష్టం), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 (నిషేధ ఆజ్ఞలు) ప్రకారం పరిమితులు విధించవచ్చు.
- అయితే పైన పేర్కొన్న పరిమితులు పార్లమెంటు, శాసనసభ చర్చలకు వర్తించవు. సభాధ్యక్షుల రూలింగ్ మేరకు సభ్యులు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు.
గమనిక: ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124(ఎ)లో ప్రస్తావించిన రాజద్రోహం అనే కారణంగా పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై పరిమితులు విధించడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ పదాన్ని రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఇటీవల హెచ్.కె.దువా VS స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ 2021 కేసులో తీర్పు చెప్పింది. (హెచ్.కె. దువా ప్రముఖ పాత్రికేయుడు ప్రభుత్వంపైన కొన్ని విమర్శలు చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది)
19 (1)(b) సమావేశ స్వేచ్ఛ - పౌరులు శాంతి భద్రతలకు భంగం కలిగించని రీతిలో ఆయుధాలు లేకుండా, శాంతియుతంగా సమావేశం కావడానికి స్వేచ్ఛ ఉంది. అయితే సిక్కు మతస్థులు తమ మత చిహ్నమైన చిన్న కత్తిని (కృపాణాన్ని) ధరించి శాంతియుతంగా సమావేశం కావచ్చు.
- స్వేచ్ఛపైన కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా సమావేశాలు ఉంటే వాటిని నిషేధించవచ్చు. ఉదా: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞను కర్ఫ్యూ నిబంధనలను అమలు చేయవచ్చు.
19 (1)(c): సంఘాలు, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
- పౌరుడు స్వచ్ఛందంగా తమకు నచ్చిన సంఘాలు, సంస్థలు స్థాపించుకుని కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అయితే కొన్ని నైతిక విరుద్ధమైన, సమాజ హితానికి వ్యతిరేకమైన సంస్థలను, దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే సంస్థలను, సంఘాలను అనుమతించరు.
గమనిక: 2012లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలను ఏర్పర్చుకుని నిర్వహించుకునే స్వేచ్ఛను ఆర్టికల్ 19(1) (c)లో చేర్చారు.
19 (1) (d): సంచార స్వేచ్ఛ - పౌరుడు దేశమంతటా తమ ఇష్ట ప్రకారం సంచరించడానికి స్వేచ్ఛ ఉంటుంది. తద్వారా వారికి విశాల భావజాలం పెంపొందడమేకాక వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
- అయితే ఈ సంచార స్వేచ్ఛపై కొన్ని ఆంక్షలు విధించవచ్చు. సామాన్య ప్రజల సంక్షేమం, షెడ్యూల్డు తెగల ప్రయోజనాలు, శాంతి భద్రతల దృష్ట్యా జన సంచారాన్ని నిషేధించవచ్చు.
- సంచార సమయంలో పౌరులు కొన్ని నియమ నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఉదా: వాహనదారులు హెల్మెట్లు ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, అంటువ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు వేసుకోవడం మొదలైన సహేతుకమైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవచ్చు.
19(1)(e): నివాసం ఏర్పరుచుకుని స్థిరపడటానికి స్వేచ్ఛ
- పౌరులు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పరచుకుని స్థిర పడటానికి స్వేచ్ఛ ఉంది.
- అయితే ఈ హక్కుపై ప్రజా సంక్షేమం, షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రయోజనాల దృష్ట్యా హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు.
19 (1) (f): వృత్తి వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ - భారత పౌరులు తమకు ఇష్టమైన వృత్తిని, వ్యాపార వాణిజ్యాలను చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది.
- అయితే ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం హేతుబద్ధమైన ఆంక్షలు విధించవచ్చు. ఉదా: కొన్ని కులవృత్తులైన జోగిని, దేవదాసి, వేశ్యా వృత్తి పూర్తిగా నిషేధించడమైనది.
- అలాగే కొన్ని వృత్తులు చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతులతో పాటు కొన్ని అర్హతలు, షరతులు పాటించాలి. ఉదా: వైద్య వృత్తి, న్యాయవాద వృత్తి, ఔషధాలను విక్రయించే వారికి ప్రత్యేక అర్హతలతో పాటు ప్రభుత్వ అనుమతి కూడా ఉండాలి.
గమనిక: హెక్లర్స్ వీటో : భావ వ్యక్తీకరణ వల్ల ప్రజా శాంతికి, భద్రతకు భంగం కలుగుతుందని భావించినప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నియంత్రించడానికి ఉపయోగించే పద్ధతులను హెక్లర్స్ వీటో అంటారు.
ప్రకరణ 20: నేరం, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు
- ఈ నిబంధన ప్రకారం వ్యక్తులకు నేరం, శిక్ష నుంచి రక్షణ పొందేందుకు కొన్ని అంశాలు పొందుపరిచారు.
- 20(1)- ఏ వ్యక్తినీ తప్పు చేయనిదే శిక్షించరాదు. ఒక వ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి. ఆ నేరానికి చట్టపరంగా ఎంత శిక్ష విధించదగినదో అంతకంటే ఎక్కువ శిక్షను విధించొద్దు.
- అయితే తక్కువ శిక్షను విధించవచ్చు. దీన్ని ‘Doctrine of Beneficial Construction’ అంటారు.
- 20(2)- ఏ వ్యక్తినీ ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించొద్దు.
- 20(3)- ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయొద్దు.
వివరణ - ఒక వ్యక్తి వర్తమానంలో చేసిన పనిని భవిష్యత్ కాలంలో నేరంగా పరిగణించి శిక్షించొద్దు. క్రిమినల్ చట్టాలు చేసిన రోజు నుంచి లేదా తర్వాత కానీ అమల్లోకి వస్తాయి.
- వెనుకటి తేదీతో అమలు చేయడానికి వీలు లేదు. అంటే క్రిమినల్ చట్టాలు ముందు కాలానికి వర్తిస్తాయి, కానీ గత కాలానికి వర్తించవు. దీన్నే న్యాయ పరిభాషలో ఎక్స్‌పోస్ట్ ఫ్యాక్టో చట్టాలు అంటారు.
ఉదా: ప్రభుత్వం ఇంటి పన్నును పెంచుతూ 2015, జనవరి 26న ఒక ఆదేశం జారీ చేస్తే దాన్ని గత సంవత్సరంలో జూలై నుంచి వర్తిస్తుందని పేర్కొనడం సమంజసమే. పౌరులు ఆ రోజు నుంచి పెరిగిన పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
డబుల్ జపార్డి
- ద్వంద్వ శిక్షలను న్యాయ పరిభాషలో ‘డబుల్ జపార్డి’ అంటారు. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పునకు ఒక పర్యాయం శిక్ష పడి ఉంటే అదే నేరానికి మరోసారి శిక్ష వేయొద్దు.
- ఈ భావాన్ని లాటిన్ భాషలో ‘Nemo Detet Bis Vexari Pro Una Et Eadem Causa’ అంటారు. అంటే No one shall be tried or punished twice in regards to the same event or crime అనే లాటిన్ సూత్రం నుంచి తీసుకున్నారు.
- ఈ రక్షణ న్యాయపరమైన ప్రక్రియలకే వర్తిస్తుంది. శాఖాపరమైన, పరిపాలనాపరమైన చర్యలకు వర్తించదు. ఉదా: ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైతే ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా జైలు శిక్షతో పాటు అన్యాక్రాంతమైన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేసుకుంటారు. ఇక్కడ తప్పు ఒక్కటే కానీ శిక్షలు రెండు, మూడు ఉండవచ్చు.
స్వయం సాక్ష్యం చెల్లదు - ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయొద్దు. దీన్ని న్యాయభాషలో ‘సెల్ఫ్ ఇంక్రిమినేషన్’ అంటారు. అయితే ముద్దాయి చేతిగుర్తులు, చేతిరాత, రక్త నమూనాలు, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా తీసుకుంటారు.
- 1978లో నందిని శతపతి vs పి.ఎల్. డానీ కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని విశదీకరించింది. దీని ప్రకారం శారీరకంగా పదేపదే బెదిరించి, హింసించి, మానసిక క్షోభకు గురిచేసి నేరం ఒప్పుకునేటట్లు చేసి సమాచారాన్ని రాబడితే అది బలవంతపు సాక్ష్యం కిందకు వస్తుందని పేర్కొంది. అలాంటి చర్యలు ప్రకరణ 20(3)కు వ్యతిరేకమని పేర్కొంది.
- నేర వైద్య శాస్త్ర పరంగా నిందితుల నుంచి సమాచారం రాబట్టడం కొంత మేరకు చెల్లుబాటు అవుతుంది. ఉదా: సత్యశోధన లేదా లై డిటెక్టర్. నార్కో అనాలిసిస్, మైండ్మ్యాపింగ్ (P-300), అయితే కొన్ని రసాయనాలు ఉపయోగించి చేసే నార్కో అనాలిసిస్ అనేది’ పూర్తిగా శాస్త్రబద్ధం కాదని రాజ్యాంగ వ్యతిరేకమని, రహస్యాలను కాపాడుకునే హక్కును ఉల్లంఘిస్తుందని సెల్వీ vs కర్ణాటక 2014 కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రకరణ-21: వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి రక్షణ - ఈ స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైంది. భారత పౌరులకే కాకుండా విదేశీయులకు కూడా వర్తిస్తుంది.
- జీవించే హక్కును, అంతరంగిక స్వేచ్ఛను చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం తప్ప మరే విధంగానూ హరించడానికి వీలులేదు. ఈ నిబంధన వ్యక్తి జీవించే స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది.
- చట్టం నిర్దేశించిన పద్ధతి అనే భావాన్ని జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. శాసనసభల చట్టాలు నిర్ణీత పద్ధతి ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే పై పద్ధతి చెల్లుబాటు అవుతుంది.
- ఈ ప్రకరణ కార్యనిర్వాహక అధికారాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాత్రమే పొందుపరిచారు. ఇది శాసనసభల చట్టాలకు వ్యతిరేకంగా రక్షణ ఇవ్వదు.
ప్రత్యేక వివరణ
- ప్రకరణ 21లో కల్పించిన రక్షణలు కార్యనిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తిస్తాయి. శాసనపరమైన చర్యలకు వర్తించవు.
- శాసనసభ ఒక ప్రక్రియను నిర్ణయించి, ఆ మేరకు కార్యనిర్వాహక వర్గానికి అధికారం కల్పిస్తే, వారు ఆ ప్రక్రియ ప్రకారం చర్యలు తీసుకుంటే వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు.
- అయితే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మేనకా గాంధీ కేసులో విస్తృతంగా వ్యాఖ్యానించి, శాసన శాఖ చర్యలకు వ్యతిరేకంగా కూడా రక్షణ కల్పించేలా కొన్ని సూత్రాలను నిర్దేశించింది.
Previous article
TREIRB TS | GURUKULA – Junior College PD GRAND TEST
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు