Indian Polity | స్పీకర్ ఎన్నిక.. మెజారిటీ సభ్యులే ప్రాతిపదిక
పార్లమెంటు-సమావేశాలు
- ప్రకరణ 85 ప్రకారం సంవత్సరానికి కనీసం రెండుసార్లు పార్లమెంటు సమావేశం కావాలి. అయితే రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలలకు మించొద్దు.
- అవసరమైనప్పుడు, ప్రత్యేక పరిస్థితుల్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించవచ్చు. గరిష్ఠ సమావేశాలపైన పరిమితి లేదు.
- ప్రస్తుతం పార్లమెంటు ఆనవాయితీగా మూడు పర్యాయాలు సమావేశం అవుతున్నది. పార్లమెంటు సమావేశాలు ఢిల్లీతో పాటు రాష్ట్రపతి నిర్ణయించిన ఇతర ప్రాంతాల్లో కూడా జరపవచ్చు.
1. బడ్జెట్ సమావేశాలు (ఫిబ్రవరి-ఏప్రిల్)
2. వర్షాకాల సమావేశాలు (జూలై-ఆగస్టు)
3. శీతాకాల సమావేశాలు (నవంబర్-డిసెంబర్) - ప్రతి సమావేశాన్ని ఎన్ని రోజులు నిర్వహిస్తారనే అంశంపై నిర్దిష్ట సంఖ్య లేదు. మూడు సమావేశాలు కలిపి సుమారుగా 90 రోజుల నుంచి 110 రోజుల వరకు ఉంటుంది.
సభ్యుల అనర్హతలు - పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించిన అంశాలను ప్రకరణ 102(1)లో పేర్కొన్నారు. కింద పేర్కొన్న ప్రాతిపదికలపై పార్లమెంటు సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది.
1. లాభదాయక పదవుల్లో కొనసాగినప్పుడు
2. మానసిక స్థిమితం లేదని కోర్టు ధ్రువీకరించినప్పుడు
3. దివాళా తీసినప్పుడు
4. భారత పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు
5. ఎన్నికల్లో అక్రమాలు రుజువైనప్పుడు
6. ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోపు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనప్పుడు
7. పదవిని దుర్వినియోగపరిచినప్పుడు
8. వరకట్నం, సతీ, అస్పృశ్యతా చట్టాల కింద శిక్షకు గురైనప్పుడు
9. పార్టీ ఫిరాయించినా పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు చేసినా పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యత్వం రద్దవుతుంది. - పై అన్ని కారణాల ప్రాతిపదికన (చివరి కారణం మినహా) కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. రాష్ట్రపతి నిర్ణయమే తుది నిర్ణయం.
సభ్యుల అనర్హత-వివాదాలు (ప్రకరణ 103) - పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించి తుది నిర్ణయం రాష్ట్రపతిదే. దీనికి సంబంధించి న్యాయస్థానాలు సాధారణంగా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు.
సుప్రీంకోర్టు తీర్పులు - 2006లో జయాబచ్చన్ VS యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కింది విధంగా తీర్పు చెప్పింది.
- గౌరవ వేతనం కూడా లాభదాయక పదవి కిందకు వస్తుందని, వేతనం తీసుకోకపోయినా, ఆ పదవిలో ఉండే అధికారం, హోదా, గుర్తింపు కూడా లాభంగానే పరిగణించాలని, అలాంటి సందర్భాల్లో వారిని అనర్హులుగా ప్రకటించవచ్చని పేర్కొంది.
గమనిక: లిల్లీ థామస్ vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు(2014)లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడినవారు అనర్హతకు గురవుతారని పేర్కొంది.
ప్రత్యేక సమాచారం - ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ శాసన సభ్యులను లాభదాయక పదవుల్లో ఉన్నారనే కారణంగా రాష్ట్రపతి వారి సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టు స్టే ఇచ్చింది. తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
పార్లమెంటు-ఖాళీలు ఏర్పడే పద్ధతి (ప్రకరణ 101) - కింద పేర్కొన్న సందర్భాల్లో పార్లమెంటులో స్థానాలు ఖాళీ ఏర్పడినట్లుగా భావిస్తారు.
రాజీనామా: పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని సంబంధిత సభాధ్యక్షులకు సమర్పించాలి. ఉదా: లోక్‌సభ సభ్యులైతే స్పీకర్‌కు, రాజ్యసభ సభ్యులైతే రాజ్యసభ చైర్మన్‌కు స్వదస్తూరితో తమ రాజీనామా పత్రాలను వ్యక్తిగతంగా ఇవ్వాలి. ఆ రాజీనామాను స్వచ్ఛందంగా చేశారా లేదా అని విచారించిన తర్వాతనే సభాధ్యక్షులు ఆమోదిస్తారు.
గైర్హాజరు: పార్లమెంటు సభ్యులు సభాధ్యక్షుల అనుమతి లేకుండా నిరవధికంగా 60 రోజులు సభా సమావేశాలకు గైర్హాజరైతే సభ్యత్వాన్ని కోల్పోతారు.
ద్వంద్వ సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు: సభ్యులు ఏకకాలంలో రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉంటే ఏదైనా ఒక సభలో సభ్యత్వం కోల్పోతారు. - రాజ్యసభకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికైతే, ఎన్నికైన పది రోజుల్లోపు తన అభీష్టాన్ని తెలియజేయాలి. లేదంటే రాజ్యసభలో సభ్యత్వం రద్దవుతుంది.
- అప్పటికే ఒక సభలో సభ్యుడిగా ఉండి మరో సభకు ఎన్నికైతే మొదట సభ్యుడిగా ఉన్న సభలో సభ్యత్వం రద్దవుతుంది. ఉదా: లోక్‌సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాజ్యసభకు కూడా పోటీ చేసి గెలిస్తే, తన ఐచ్ఛికాన్ని తెలియచేయని పక్షంలో లోక్‌సభ సభ్యత్వం
రద్దవుతుంది. - ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింట్లోను గెలిచి నిర్ణీత గడువులో (10 రోజులు) తన ఐచ్ఛికాన్ని తెలపకపోతే రెండు స్థానాల్లో తన సభ్యత్వాన్ని కోల్పోతాడు.
- రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికైతే 14 రోజుల లోపల రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో పార్లమెంటు సభ్యత్వం రద్దవుతుంది.
ఇతర కారణాలు - పార్లమెంటు సభ్యుని ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పినప్పుడు
- సభ్యుడు ఆ సభ చేత బహిష్కరించబడినప్పుడు
- పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు, గవర్నర్‌గా నియమించబడినప్పుడు
- ఇతర కారణాల వల్ల అనర్హుడిగా ప్రకటించినప్పుడు
గమనిక: 14వ లోక్‌సభలో (2005) 10 మంది సభ్యులను ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నందుకు సభ నుంచి బహిష్కరించారు. 1978 ఆరో లోక్‌సభ నుంచి ఇందిరాగాంధీని సభా హక్కుల ఉల్లంఘనల కారణంగా బహిష్కరించారు.
పార్లమెంటు-చర్చలు-అధికార భాష (ప్రకరణ 120) - పార్లమెంటు చర్చలు హిందీ లేదా ఇంగ్లిష్‌లో జరుగుతాయి. అయితే సభాధ్యక్షుల అనుమతితో మాతృభాషల్లో కూడా సభ్యులు మాట్లాడవచ్చు.
సభాధ్యక్షులు-లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్
- పార్లమెంటు ప్రతి సభలోనూ సభాధ్యక్షులు, ఉప సభాధ్యక్షులు ఉంటారు. లోక్‌సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులుంటాయి.
- వీరు ఆయా సభలకు అధ్యక్షత వహించి, సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- ప్రకరణ 93లో స్పీకర్ పదవిని ప్రస్తావించారు. 1919 చట్టం ప్రకారం భారతదేశంలో మొదటిసారి 1921లో ఈ సభాపతి పదవిని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్పీకర్‌ను అధ్యక్షుడిగా పిలిచేవారు. 1935లో అధ్యక్షుడనే పదాన్ని స్పీకర్‌గా మార్చారు.
- 1946, డిసెంబర్ 9 నుంచి 1947, నవంబర్ 16 వరకు స్పీకర్ పదవిని రాజ్యాంగ సభ రద్దు చేసింది. 1946 నుంచి 1949 వరకు రాజ్యంగ పరిషత్తే శాసనసభగా వ్యవహరించింది. జి.వి. మౌలాంకర్ మొదటి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
ప్రత్యేక సమాచారం - స్వాతంత్య్రం రాకముందు నియమించబడిన మొదటి స్పీకర్ సర్ ఫ్రెడరిక్ వైటీ. ఆ తర్వాత ఎన్నికైన మొదటి స్పీకర్ విఠల్‌భాయ్ పటేల్.
ఎన్నిక - స్పీకర్‌ను లోక్‌సభ ప్రారంభ సమావేశంలోనే సభ్యులు మెజారిటీ ప్రాతిపదికపై నేరుగా ఎన్నుకుంటారు. స్పీకర్‌గా ఎన్నిక కావడానికి లోక్‌సభలో సభ్యత్వం కలిగి ఉండాలి.
కాల పరిమితి - లోక్‌సభ స్పీకర్ పదవీకాలం ఐదు సంవత్సరాలు. కానీ నూతన స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో కొనసాగుతారు.
- లోక్‌సభ రద్దయినా తన కాలవ్యవధి పూర్తి అయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. కొత్త లోక్‌సభ ఏర్పడి స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో ఉంటారు.
తొలగింపు పద్ధతి (ప్రకరణ 94(C)) - ప్రకరణ 94 ప్రకారం స్పీకర్‌ను లోక్‌సభే తొలగిస్తుంది. పదవిని దుర్వినియోగపర్చడం, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలపై తొలగించవచ్చు.
- సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందస్తు నోటీసును స్పీకర్‌కు ఇవ్వాలి.
- 50 మంది సభ్యులు సంతకాలు చేసి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇవ్వాలి. సభలో చర్చింపబడాలంటే మరో 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి.
- తొలగించే తీర్మానాన్ని సభకు హాజరైనవారిలో సగానికంటే (ఇది ఒకరకమైన ప్రత్యేక మెజారిటీ) ఎక్కువ సభ్యులు ఆమోదిస్తే స్పీకర్ తన పదవి నుంచి తొలగించబడతాడు.
- స్పీకర్‌ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు. కానీ సమావేశానికి హాజరు కావచ్చు, తీర్మానం మీద తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు.
- తీర్మానంపై సాధారణ సభ్యుడిగానే ఓటు చేయవచ్చు. కానీ నిర్ణయాత్మక ఓటు ఉండదు.
గమనిక: స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయరు. దీని గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు.
జీత భత్యాలు - స్పీకర్ జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటిని రెండో షెడ్యూల్లో పేర్కొన్నారు.
- ప్రస్తుతం స్పీకర్‌కు వేతనంరూ.4,00, 000, పదవీ విరమణ పెన్షన్ ఇతర అన్ని సౌకర్యాలుంటాయి.
- వీరి జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవీ కాలంలో వీరికి నష్టం వచ్చేలా వేతనాలను సవరించొద్దు.
రాజీనామా - స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు సంబోధిస్తారు.
స్పీకర్ అధికారాలు-విధులు - స్పీకర్ అధికారాలు, విధులను రాజ్యాంగంలో, పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణ చట్టంలోనూ పేర్కొన్నారు. వాటిని కింది విధంగా పేర్కొనవచ్చు.
- స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహించి, సభాకార్యకలాపాలను నిర్వహిస్తారు.
- సభలో జరిగే చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ మొదలగు అంశాలను నియంత్రిస్తారు.
- లోక్‌సభ తరఫున ముఖ్య ప్రతినిధిగా వ్యవహరిస్తారు.
- సభా హక్కులను, సభా గౌరవాన్ని, సభా ప్రతిష్ఠను కాపాడేందుకు చర్యలు తీసుకుంటారు. సభలో గందరగోళం ఏర్పడితే తగిన ఆదేశాల ద్వారా పరిస్థితిని చక్కబెడతారు.
- ఏదైనా బిల్లు విషయంలో అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానమై ప్రతిష్టంభన ఏర్పడితే, నిర్ణయాత్మక ఓటును వినియోగిస్తాడు.
- జరిగే చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ఆక్షేపణలు, సభలో కోరం మొదలగు అంశాలపై స్పీకర్ నియంత్రణ ఉంటుంది.
- అనుచితం గా ప్రవర్తిస్తున్న సభ్యులను హెచ్చరించడం, అది మితిమీరినప్పుడు సభ నుంచి వెళ్లమనడం, ఆ ఆదేశాన్ని ఖాతరు చేయనప్పుడు సంబంధిత అధికారుల చేత బయటికి బలవంతంగా పంపడం చేస్తారు.
- కొన్ని పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా ఉంటాడు. ఉదా: సభా వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ, అలాగే కొన్ని కమిటీల చైర్మన్లను కూడా నియమిస్తారు.
- లోక్‌సభకు చెందిన అన్ని కమిటీలు స్పీకర్ పర్యవేక్షణలోనే పని చేస్తాయి.
ప్రత్యేక వివరణ - స్పీకర్ తన అధికారాలను రాజ్యాంగంగా, పార్లమెంటు చట్టాలు, రూల్స్ పరంగా పొందుతారు.
పరిపాలన సంబంధిత అధికారాలు - లోక్‌సభ సచివాలయానికి అధిపతిగా వ్యవహరించి సిబ్బందిపై పరిపాలనా నియంత్రణ కలిగి ఉంటారు.
- బిల్లులకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేస్తారు.
- సభ్యులకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు, మొదలగు అంశాల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
ప్రత్యేక అధికారాలు - ద్రవ్య బిల్లులను ధ్రువీకరిస్తారు.
స్పీకర్ ధ్రువీకరణే అంతిమం. - లోక్‌సభకు సంరక్షకుడిగా వ్యవహరిస్తారు.
- సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, ఏర్పాటు చేసే సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అఖిల భారత స్పీకర్ల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
- ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్‌నకు హోదారీత్యా అధ్యక్షుడిగా ఉంటాడు.
డిప్యూటీ స్పీకర్
- ప్రకరణ 93లో డిప్యూటీ స్పీకర్ పదవి గురించి పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్‌ను ప్రత్యక్షంగా మెజారిటీ ప్రాతిపదికన లోక్‌సభ సభ్యులు ఎన్నుకుంటారు.
- అయితే పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం లోక్‌సభలో అత్యధిక స్థానాలు సాధించిన ప్రతిపక్ష పార్టీకి ఏకగ్రీవంగా ఆ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.
ప్రత్యేక వివరణ : డిప్యూటీ స్పీకర్ పదవి 1919 చట్టం ద్వారా 1921లో ఏర్పాటు చేశారు. మొదట్లో డిప్యూటీ స్పీకర్‌ను డిప్యూటీ ప్రెసిడెంట్ అని పిలిచేవారు. - స్వాతంత్య్రం రాకముందు డిప్యూటీ స్పీకర్‌గా సచ్చిదానంద సిన్హా వ్యవహరించారు. స్వాతంత్య్రానంతరం మొదటి డిప్యూటీ స్పీకర్‌గా అనంత శయనం అయ్యంగార్ పని చేశారు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు