Indian Polity | అధిక వివాదాల వేళ.. అదనపు న్యాయమూర్తుల సేవ
భారత న్యాయ వ్యవస్థ హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు
- రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానాన్ని హైకోర్టు అంటారు. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం దేశంలో మొదటిసారి హైకోర్టును కలకత్తాలో 1862లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మద్రాసు (1862), బొంబాయి (1862) లో ఏర్పాటు చేశారు.
- భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 214 నుంచి 231 వరకు గల ప్రకరణల్లో రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, వాటి నిర్మాణం, అధికార విధుల గురించి పేర్కొన్నారు.
- ప్రకరణ 214 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. హైకోర్టు రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం.
ప్రత్యేక వివరణ - ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్టులున్నాయి. 2013లో త్రిపుర, మేఘాలయ, మణిపూర్, ఏపీలకు 2019లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు.
- ప్రకరణ 231 ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేస్తుంది.
- పార్లమెంటు హైకోర్టు పరిధిని ఇతర భాగాలకు విస్తరించవచ్చు.
హైకోర్టు నిర్మాణం - ప్రకరణ 216 ప్రకారం ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులుంటారు.
- హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య రాష్ర్టాలను బట్టి మారుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా న్యాయమూర్తులున్నారు.
గమనిక: ప్రస్తుతం ఏపీ హైకోర్టులో అనుమతించిన జడ్జిల సంఖ్య 37 అయితే 26 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అనుమతించిన జడ్జీల సంఖ్య 42 అయితే 19 మంది న్యాయమూర్తులు ఉన్నారు. (2022 మార్చి నాటికి)
హైకోర్టు న్యాయమూర్తులు-అర్హతలు - ప్రకరణ 217(1) ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. న్యాయమూర్తుల నియామక సమయంలో రాష్ట్రపతి కింది వారిని సంప్రదించాలి.
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని
2. ఆయా రాష్ర్టాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు
3. ఆయా రాష్ర్టాల గవర్నర్లు
4. ఆ రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలు తెలిసిన సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులు
ప్రత్యేక గమనిక: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పడిన తర్వాత పైన పేర్కొన్న విధంగా సంప్రదించే విషయంలో మార్పులు చేశారు. దీని గురించి సుప్రీంకోర్టు ఛాప్టర్లో వివరించారు.
అర్హతలు - భారతదేశ పౌరుడై ఉండాలి
- 62 సంవత్సరాలు నిండి ఉండొద్దు
- ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా న్యాయవాదిగా అనుభవం ఉండాలి
- కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసుల్లో న్యాయాధికారిగా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి
ప్రత్యేక వివరణ - హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కనీస వయస్సు ప్రస్తావన లేదు.
- ప్రారంభంలో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు ఉండేది. అయితే 1963లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా వీరి పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచారు.
- దీన్ని 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పొడిగిస్తూ 114వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు.
పదవీ ప్రమాణ స్వీకారం - ప్రకరణ 219 ప్రకారం ఆ రాష్ట్ర గవర్నర్ లేదా అతడు నియమించిన వ్యక్తి ముందు హైకోర్టు న్యాయమూర్తులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. దీని గురించి మూడో షెడ్యూల్లో పేర్కొన్నారు.
జీతభత్యాలు - ప్రకరణ 221 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు 1954లో రూపొందించిన జీతభత్యాల సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం నిర్ణయిస్తుంది.
- వీటిని ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితిలో తప్ప ఎప్పుడూ తగ్గించడానికి వీలు లేదు.
- 2018లో హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను పెంచారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనం రూ.2,50,000, సాధారణ న్యాయమూర్తుల వేతనం రూ.2,25,000. పెన్షన్ ఇతర సౌకర్యాలు ఉంటాయి.
గమనిక: హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్లు కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. కారణం వారు రాష్ర్టాల వారీగా బదిలీ అవుతుంటారు. - హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసన- తొలగింపు పద్ధతి
- ప్రకరణ 217(బి) ప్రకారం హైకోర్టు జడ్జిలు తొలగించబడతారు. సుప్రీంకోర్టు జడ్జిలు ఏ విధంగా తొలగిస్తారో అవే కారణాలు, అదే పద్ధతిలో హైకోర్టు జడ్జిలు కూడా తొలగిస్తారు.
ప్రత్యేక సమాచారం - కలకత్తా హైకోర్టు (2011)లో న్యాయమూర్తిగా పని చేసిన సౌమిత్ర సేన్ (కోర్టు సొమ్మును దుర్వినియోగం చేయడం) పైన రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం నెగ్గింది. అయితే లోక్‌సభ తీర్మానాన్ని చేపట్టడానికి ముందే ఈ న్యాయమూర్తి రాజీనామా చేశారు.
- కర్ణాటక, సిక్కిం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ పి.వి.దినకరన్ (అవినీతి, భూ ఆక్రమణ, అధికార దుర్వినియోగం) పైనా అభిశంసన తీర్మానాలు రాజ్యసభలో (2011)లో విచారణలో ఉండగానే రాజీనామా చేశారు. ఇంతవరకు ఏ హైకోర్టు జడ్జిని కూడా తొలగించలేదు.
న్యాయమూర్తుల రాజీనామా ప్రకరణ 217(1ఎ) - న్యాయమూర్తులు (ప్రధాన న్యాయమూర్తితో సహా) రాష్ట్రపతిని సంబోధిస్తూ తమ రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు.
న్యాయమూర్తుల బదిలీ - ప్రకరణ 222 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కొలీజియంను, సంబంధిత రాష్ట్ర హైకోర్టు సీజేలను సంప్రదించి న్యాయమూర్తులను దేశంలో ఏ హైకోర్టుకైనా రాష్ట్రపతి బదిలీ చేయవచ్చు. కానీ ప్రస్తుతం జాతీయ న్యాయ నియామకాల సంస్థను సంప్రదించాలి.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి- నియామకం (ప్రకరణ 223) - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఖాళీ ఏర్పడినా లేదా ఇతర కారణాల వల్ల ప్రధాన న్యాయమూర్తి తన విధులను నిర్వర్తించలేని సమయంలో, హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించవచ్చు.
అదనపు, తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం (ప్రకరణ 224) - హైకోర్టులో పరిష్కరించాల్సిన వివాదాలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు అదనపు న్యాయమూర్తులను సమయానుకూలంగా రాష్ట్రపతి నియమించవచ్చు.
- వీరి పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది.
పదవీ విరమణ పొందిన న్యాయమూర్తుల నియామకం - ప్రకరణ 224(ఎ) ప్రకారం హైకోర్టులో కేసుల పరిష్కారానికి తమ సేవలు అందించాల్సిందిగా పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి పూర్వానుమతితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు.
హైకోర్టు- అధికారాలు, విధులు
ప్రారంభ అధికారం లేదా ప్రాథమిక అధికారం
- ప్రకరణ 225 ప్రకారం కొన్ని వివాదాలను నేరుగా హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఉదాహరణకు రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నిక వివాదం. పార్లమెంటు సభ్యుల ఎన్నిక వివాదం, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, కంపెనీ చట్టాలు, కాపీరైట్ చట్టాలు, వీలునామా, కోర్టు ధిక్కారం మొదలైన వివాదాలను నేరుగా హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి.
గమనిక: హైకోర్టులకు క్రిమినల్ అంశాలపై ఎలాంటి ప్రారంభ పరిధి ఉండదు. అయితే ప్రెసిడెన్సీ పట్టణాలైన బొంబాయి, మద్రాసు, కలకత్తా హైకోర్టులకు నిర్ణీత విలువ కలిగిన సివిల్ కేసులపై ప్రారంభ పరిధి ఉంటుంది.
సముద్రయానం, తీరప్రాంత వివాదాల విచారణ పరిధి - సముద్రయానం, తీర ప్రాంతాల్లో సరకు రవాణా మొదలగు వివాదాలను పరిష్కరించే అధికారాలను బ్రిటిష్ చట్టం 1861 ప్రకారం కలకత్తా, బొంబాయి, మద్రాసు హైకోర్టులకు మాత్రమే ఉండేది.
- ఈ చట్టాన్ని రద్దు చేసి పార్లమెంటు 2017లో నూతన చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం తీర ప్రాంత రాష్ర్టాల్లో ఉన్న హైకోర్టులకు ఈ పరిధిని కల్పించింది.
- ప్రస్తుతం కర్ణాటక, కేరళ, గుజరాత్, ఒడిశా, ఏపీ హైకోర్టులకు కూడా కల్పించారు. ఈ తీర్పులను సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
అప్పీళ్లు-అధికార పరిధి - అప్పీళ్లకు సంబంధించి రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నత కోర్టు. సివిల్, క్రిమినల్ కేసుల్లో కింది కోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.
- జిల్లా కోర్టులు, అదనపు కోర్టులు, సబార్డినేట్ కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో చట్టానికి, వాస్తవాలకు సంబంధించిన వివాదాలు ఉంటే నేరుగా హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. దీన్నే మొదటి అప్పీలు అంటారు.
- పైన పేర్కొన్న కోర్టు ఇచ్చిన తీర్పులో కేవలం చట్టానికి సంబంధించిన వివాదం ఉంటే హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. దీన్నే రెండో అప్పీలు అంటారు.
- సెషన్సు కోర్టు మరణశిక్షను విధించినా లేదా ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించినా అలాంటి కేసులన్నింటిని హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.
గమనిక: జిల్లా సెషన్స్ కోర్టు విధించిన మరణ శిక్ష అమలును హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2007లో సాయుధ బలగాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. వాటి తీర్పులను హైకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి వీలు లేదు. నేరుగా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవాలి. - అలాగే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను కూడా హైకోర్టు పరిధిలో నుంచి మినహాయించారు. వాటిని కూడా నేరుగా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవాలి.
రిట్లు-అధికార పరిధి - ప్రకరణ 226(1) ప్రకారం ఆ రాష్ట్ర సరిహద్దు లోపల గల వ్యక్తులకు, సంస్థలకు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టు వివిధ రిట్లను జారీ చేస్తుంది.
- రిట్లు జారీ చేసే అధికారం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం అని 1997లో ఎల్.చంద్రకుమార్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
- రిట్లు జారీ చేసే అధికారాల విషయంలో 32వ అధికరణం కింద సుప్రీంకోర్టుకు గల అధికారాలకన్నా 226వ అధికరణం కింద హైకోర్టుకు గల అధికారాలు ఎక్కువ.
- ఎందుకంటే 32వ అధికరణం కింద సుప్రీంకోర్టుకు గల అధికారాలు ప్రాథమిక హక్కుల పరిరక్షణకే పరిమితం అయితే, 226వ అధికరణం కింద హైకోర్టు అధికారాలు ప్రాథమిక హక్కుల రక్షణకు మాత్రమే కాకుండా ఇతర అంశాలకు సంబంధించి కూడా హైకోర్టులు రిట్స్ జారీ చేయొచ్చు.
- అందువల్లనే ప్రకరణ 226 క్లాజ్ (1)లో for any other purpose అని పేర్కొనడం గమనార్హం.
కోర్ట్ ఆఫ్ రికార్డ్ - ప్రకరణ 215 ప్రకారం రాష్ట్రంలో కోర్ట్ ఆఫ్ రికార్డ్‌గా హైకోర్టు వ్యవహరిస్తుంది. హైకోర్టు తీర్పులను రాష్ట్రంలోని అన్ని దిగువ న్యాయస్థానాలు వ్యక్తులు, సంస్థలు గౌరవించాలి.
- హైకోర్టు తీర్పులను, దిగువ న్యాయస్థానాలు సాక్ష్యాలు, ఆధారాలుగా తీసుకొని తమ తీర్పులను వెలువరించాలి. తీర్పును ధిక్కరించిన వారిని కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించవచ్చు.
న్యాయ సమీక్షాధికారం (ప్రకరణ 226) - కేంద్ర, రాష్ట్ర చట్టాల రాజ్యాంగబద్ధతను పరిశీలించి అవి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమైతే ఆ చట్టాలను హైకోర్టు న్యాయ సమీక్షాధికారం కింద కొట్టివేస్తుంది.
- తన తీర్పులను తానే సమీక్ష చేయదు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
సుప్రీంకోర్టు-హైకోర్టు మధ్య సంబంధం - హైకోర్టు సుప్రీంకోర్టుకు సబార్డినేట్ కోర్టు కాదు. రెండింటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. రెండూ కోర్ట్స్ ఆఫ్ రికార్డుగా
వ్యవహరిస్తాయి. - హైకోర్టుకు దిగువ కోర్టులు, ట్రిబ్యునళ్లపై పరిపాలన, న్యాయపరమైన పర్యవేక్షణ ఉంటుంది. సుప్రీంకోర్టుకు అలాంటి అధికారాలు ఉండవు.
- రిట్లు జారీ చేసే విషయంలో హైకోర్టుకు విషయపరమైన పరిధి ఎక్కువ.
- అయితే క్రమానుగత శైలిలో సుప్రీంకోర్టు ఎగువ స్థాయిలో ఉంటుంది. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ పరమైన విషయాల్లో అంతిమ తీర్పును విలువరిస్తుంది.
- ప్రకరణ 141 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టుతో సహా అందరూ పాటించాలి.
Previous article
Irrigation System | నీటి పారుదల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు