Indian History | నిరంజన నదిలో స్నానం.. రావిచెట్టు కింద జ్ఞానం
బౌద్ధ మతం
- బౌద్ధ మత స్థాపకుడు బుద్ధుడు. క్రీ.పూ.567లో లుంబినీ వద్ద జన్మించాడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి.
- తండ్రి శాఖ్య తెగలో, తల్లి కోలియ తెగలో పుట్టారు. తల్లి వెంటనే చనిపోగా, పినతల్లి మహాప్రజపతి గౌతమి బుద్ధుడిని పెంచింది.
- ఇతని భార్య యశోధర, కుమారుడు రాహులుడు.
- ఒకనాడు వ్యాధిగ్రస్థుడిని, జ్వర పీడితుడిని, అనాథను, మృతదేహాన్ని చూసిన తర్వాత అతడిలో తాత్విక ధోరణి, మానసిక అంశాంతి పెరిగాయి.
- అనంతరం కుటుంబాన్ని వదిలేసి జ్ఞానాన్వేషణ కోసం దేశం అంతటా సంచరిస్తూ మొదట ఉరువేల అనే గ్రామంలో అలరక, ఉదరక అనే గురువుల వద్ద శిష్యరికం చేశాడు. తపస్సులు చేశాడు. కానీ అన్వేషణ ఫలించలేదు.
- ఒకరోజు నిరంజన నదిలో స్నానం చేసి రావిచెట్టు కింద జ్ఞాననిమగ్నుడై కూర్చొని ఉండగా జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానోదయం అయిన తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడిగా పిలువబడ్డాడు (ఇతనికి చిన్ననాడు గౌతముడు అని సిద్ధార్థుడు అనే పేర్లు ఉన్నాయి).
- జ్ఞానోదయం అయిన తర్వాత అతను సారనాథ్ వద్ద మృగవనంలో మొదటిసారిగా బోధ చేశాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తనం అన్నారు.
- అనంతరం తన 80వ ఏట కుశీనార వద్ద మరణించాడు. ఈయన మరణాన్ని మహాపరినిర్వాణం అంటారు.
బౌద్ధ మత సిద్ధాంతాలు - ఈయన ఆత్మను గురించి, బ్రహ్మ (దేవుడు) ను గురించి చర్చల్లోకి వెళ్లకుండా మనిషి ఇహలోక సమస్యల గురించి ఆలోచించాడు.
- ప్రపంచం దుఃఖమయం అని, దుఃఖానికి కారణం మానవుని కోరికలు అని, కోరికలను జయిస్తే నిర్వాణం సాధించవచ్చని తెలిపాడు.
- నిర్వాణం అంటే జనన, మరణాల గురించి విముక్తి పొందడం.
- మానవుడు జీవితంలోని దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి ఈయన అష్టాంగమార్గాన్ని తెలిపాడు. అవి..
1) సమ్యక్ దృష్టి 2) సమ్యక్ ఆలోచన
3) సమ్యక్ వాక్కు 4) సమ్యక్ క్రియ
5) సమ్యక్ జీవనం 6) సమ్యక్ శ్రమ
7) సమ్యక్ నిశ్చయం 8) సమ్యక్ ధ్యానం - సమ్యక్ అంటే మంచి అని అర్థం. పై 8 మార్గాలను పాటించే వ్యక్తి ఏ పురోహిత వర్గం మీద ఆధారపడాల్సిన అవసరం లేదని, వాటిని పాటిస్తే గమ్యాన్ని చేరుకుంటాడని తెలిపాడు. ఈయన కూడా తన అనుచరులకు ఒక సామాజిక ప్రవర్తనను నిర్దేశించాడు.
1) ఇతరుల ఆస్తిని ఆశించకూడదు
2) హింస చేయకూడదు
3) మత్తు పదార్థాలు ఉపయోగించకూడదు
4) అసత్యాలు చెప్పకూడదు
5) లంచగొండి పనులు చేయకూడదు - బౌద్ధమతం అనుసరించే మార్గాన్ని మధ్యేమార్గం అని అంటారు.
- ఇంద్రియ సంతృప్తిని కోరే భౌతికవాదాన్ని, శరీరాన్ని తీవ్ర బాధలకు గురిచేసే ఆత్మవాదాన్ని (జైనులు ఇలా చేసేవారు) రెండింటినీ తిరస్కరించి మధ్యేమార్గంగా బుద్ధుడు ఒకవైపు సరైన పద్ధతిలో మన భౌతిక కోరికలు తీర్చుకుంటూ, మరోవైపు జ్ఞానపూరిత సమ్యక్ మార్గాలను పాటిస్తూ ఈ జన్మ నుంచి విముక్తి పొందాలని బుద్ధుడు చెప్పాడు.
- బుద్ధుడు భగవంతుడిని, ఆత్మను, దేవాలను, వర్ణవ్యవస్థను తిరస్కరించిన కర్మసూత్రాన్ని ఒప్పుకున్నాడు.
- కర్మ మానవుని మరణానంతరం కూడా వెంటాడుతుందని ఆయన భావించాడు. ఈ కర్మ నుంచి విముక్తి పొందాలంటే కోరికలను జయించాలని, కానీ ఆ కోరికలను అజ్ఞానం ద్వారా జయించలేకపోతున్నామని, ఈ అజ్ఞానం నుంచి కోరికల ఊహలు రావడం, అది పొందాలని భావించడం దాని గుండా స్పర్శ, భావన, కామన, సాంగత్యం, అహంకారం, పునర్జన్మ ఇలా ఒకదానికొకటి గొలుసుకట్టుగా పరిణమిస్తుందని బౌద్ధం తెలిపింది.
- ఈ సిద్ధాంతాన్ని ప్రతీత్య సముత్పాద అని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కోర్కెలను జయిస్తే నిర్వాణం పొందవచ్చని, నిర్వాణం పొందితే కర్మ నుంచి విముక్తి పొందుతామని, తద్వారా పునర్జన్మ ఉండదని బౌద్ధం తెలుపుతుంది.
బౌద్ధ మతం విస్తరణకు గల కారణాలు - బౌద్ధ మతం దేవుని ఉనికిని గురించి, ఆత్మను గురించి చర్చించలేదు, గుర్తించలేదు. భారతదేశ మతాల చరిత్రలో ఇదొక విప్లవాత్మకమైన అంశం.
- తాత్విక చర్చల్లో ఇరుక్కోకపోవడంతో ఇది సామాన్య ప్రజలకు ఆకర్షణీయమైంది (ఎందుకంటే తాత్విక అంశాలు సామాన్యులకు అర్థం కావు).
- వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం వల్ల కింది వర్గాల మద్దతును ప్రత్యేకంగా పొందింది. ఎలాంటి వర్ణాలతో సంబంధం లేకుండా అందరినీ బౌద్ధ మతంలోకి ఆహ్వానించారు.
- ఉదాహరణకు తపుస్సా, బల్లిక వంటి వర్తకులు, సరిపుత్త, మొగ్గలన వంటి బ్రాహ్మణులు, ఉపాని, సునీత వంటి శూద్రులు కూడా బౌద్ధమతం స్వీకరించారు.
- స్త్రీలను కూడా సంఘంలోకి ఆహ్వానించి, పురుషుల సమాన స్థాయికి తెచ్చారు. తద్వారా కింది స్థాయి వర్గాల ప్రజలు, స్త్రీలు బౌద్ధ మతం పట్ల ఆకర్షితులయ్యారు.
- బ్రాహ్మణ మతంతో పోల్చినప్పుడు బౌద్ధమతంలో ఎంతో ఉదారత్వం, ప్రజాస్వామ్యం అంశాలు ఉండేవి.
- సంప్రదాయ బ్రాహ్మణ (వైదిక) మతంతో తక్కువగా చూడబడుతున్న మగధ ప్రజలు (మగధను ఆర్యులు ఆర్యావర్త ప్రాంతంగా గుర్తించలేదు) బౌద్ధ మతం పట్ల ఆకర్షితులయ్యారు.
- బుద్ధుని వ్యక్తిత్వం, మత ప్రచారంలో అతడు అనుసరించిన శాంతియుత విధానం, సహనం, గంభీరత్వం, బుద్ధి కుశలత లక్షణాల నుంచి బౌద్ధమతం పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు.
- అతి ముఖ్య కారణం బౌద్ధమత సాహిత్యం సంస్కృతంలో కాకుండా సామాన్య ప్రజల భాష అయిన పాళీ భాషలో రాయడం గుండా బౌద్ధ మత విస్తరణకు ముఖ్య కారణమైంది.
- అలాగే పేరొందిన చక్రవర్తులైన బింబిసారుడు, అజాతశత్రువు, కాలాశోకుడు, అనంతర కాలంలో అశోకుడు, హర్షుడు వంటి వారు ఈ మతానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఇది ప్రజల్లోకి బాగా చొచ్చుకొనిపోయింది.
- ఇతను బోధించిన అహింసా విధానం వ్యాపార వర్గాలైన వైశ్యులకు బాగా నచ్చింది. ఎందుకంటే వ్యాపారాలు జరగాలంటే శాంతిభద్రతలతో పాటు యుద్ధాలు వంటివి ఉండకూడదు. అందుకే ఈ వర్గానికి చెందినవారు చాలామంది బౌద్ధమతంలోకి చేరి, మతాన్ని బలపరిచారు.
- ఉదాహరణకు అనాదపిండక అనే వ్యాపారి బుద్ధునికి శ్రావస్తిలో జేతవనం దానం చేశాడు.
- అలాగే బ్రాహ్మణ మతంలో కర్మకాండలప్పుడు జంతుబలులు ఇచ్చేవారు. ఆ సమయం నాటికే ఇనుమును కనుక్కోవడం తో వ్యవసాయం బాగా వేగంగా ముందుకుసాగింది.
- వ్యవసాయానికి పశువుల అవసరం ఎంతో ఉంది. అలాంటి పశువులను బలి ఇవ్వడం వ్యవసాయ వర్గాలకు నచ్చలేదు. దీంతో హింసను, జంతు బలులను వ్యతిరేకించి బౌద్ధమతానికి కింది స్థాయి వ్యవసాయ వర్గ ప్రజలు పట్టంగట్టారు.
మౌర్య సామ్రాజ్యం - భారతదేశంలో ప్రప్రథమంగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన దేశ సమైక్యతను సాధించిన వారు మౌర్యులు.
- మౌర్య సామ్రాజ్య స్థాపనతో ఉత్తర భారతదేశ చరిత్రలో సామ్రాజ్యాల యుగం ప్రారంభమైంది. తమిళ, కేరళ ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా వీరి ఆధీనంలోకి రావడం ప్రధానమైన అంశం.
- రాజకీయ ఐక్యతతో పాటు మౌర్యులు ఆర్థిక, సామాజిక రంగాల్లో అద్వితీయమైన అభివృద్ధిని సాధించారు.
- ఇతర దేశాలైన పశ్చిమాసియా, చైనా, సింహళం, బర్మాలతో వర్తక, సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పారు.
- మగధ సామ్రాజ్యాన్ని లేదా నంద వంశస్థులను కూలదోసిన మౌర్యులు అమోఘమైన ప్రగతిని సాధించి మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడమే కాకుండా అనంతర రాజ వంశాలైన కుషాణులు, గుప్తులు, పుష్యభూతి వారికి ఆదర్శంగా పరిపాలన అందించారు.
మౌర్య చరిత్రకు ఉపకరించే ఆధారాలు - శిలలపై, రాతి స్తంభాలపై కనిపించే అశోకుని శాసనాలు, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం, గ్రీకు రచయితల రచనలు, పురాణాలు, బౌద్ధమత గ్రంథాలు, ముద్రారాక్షసం.
అశోకుని చరిత్ర తెలిపే ప్రధాన ఆధారాలు - ప్రజలతో తన శాసనాల ద్వారా నేరుగా సంభాషించిన భారతీయ రాజు అశోకుడు.
- అశోకుని శాసనాలు భారతదేశంలో లభిస్తున్న మొట్టమొదటి ‘పాళి’ భాష నమూనాలు. ఇవి రాళ్లమీద, నునుపు చేసిన పీటల మీద, నాటిన రాతి స్తంభాల మీద, గుహల్లో, మట్టిపాత్రల మీద కూడా చెక్కి ఉన్నాయి.
- ఇవి భారతదేశంలో కాకుండా అఫ్గానిస్థాన్ లో కూడా లభించాయి. ఈ శాసనాలు రాజు ఉత్తర్వులను తెలియజేస్తాయి. ఇటువంటి శాసనాలు భారతదేశంలో 45 ప్రదేశాల్లో లభించాయి.
- ఇవి ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో రాసి ఉన్నాయి. ప్రత్యేకించి వాయవ్య భారతదేశంలో అశోకుని శాసనాలు అరామిక్, ఖరోష్ఠి లిపిలలో రాసి ఉన్నాయి.
- అఫ్గానిస్థాన్‌లో (కాందహార్) అరామిక్, గ్రీకు భాషలు, లిపులు కూడా ఉపయోగించారు.
- అశోకుని శాసనాల్లో 14 పెద్ద శిలాశాసనాలు, 2 చిన్న శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు, 7 చిన్న స్తంభ శాసనాలు, 3 గుహ శాసనాలు కలవు.
- ప్రజల భాష అయిన ప్రాకృతంలో ఉన్న ఈ శాసనాలను 1837లో ఈస్టిండియా కంపెనీకి చెందిన జేమ్స్ ప్రిన్సెస్ అనువదించాడు.
- ఈ శాసనాలను అశోకుడే చెక్కించాడని, కాబట్టి అతడే శాసన కర్త అని 1915లో దొరికిన మాస్కీ (కర్ణాటక) శాసనంలో అశోకుని పేరు అశోక ప్రియదర్శి అని రాయడం వల్ల తెలుస్తుంది.
- సాధారణంగా అశోకుని శాసనాలు ప్రాచీనమైన రహదారుల పక్కల్లో ఉంచేవారు.
- అశోకుని చరిత్ర తెలుసుకోవడానికి ఉపకరించే ప్రధాన ఆధారాలు అశోకుని శిలాశాసనాలు.
- అశోకుని జీవిత విశేషాల గురించి తెలుసుకోవడానికి బౌద్ధ గ్రంథాలైన మహావంశ, దివ్యావధాన ఉపకరిస్తాయి.
- కళింగ యుద్ధం గురించి అశోకుని 13వ శిలాశాసనం తెలియజేస్తుంది (ఒడిశాలోని జౌగఢ్ ప్రదేశంలో కళింగ యుద్ధం జరిగినట్లు తెలుస్తుంది).
- అశోకుడు రూపొందించిన ధర్మవిధానం గురించి రెండు, ఏడు స్తంభ శాసనాలు తెలియజేస్తున్నాయి.
- ఈ శాసనాలను ప్రతిష్ఠించిన స్థలాల ఆధారంగా చేసుకొని అశోకుని సామ్రాజ్య సరిహద్దులను నిర్ణయించవచ్చు.
వాయవ్యం: షబాజ్గిరి, మాన్సెహరా
ఈశాన్యం: రుమిండై
పడమర: సోపారయ గిర్నార్
దక్షిణం: బ్రహ్మగిరి, జొన్నగిరి - బబ్రూ ప్రదేశంలో దొరికిన శాసనాన్ని బట్టి అశోకుడు బౌద్ధమతం స్వీకరించినట్లు తెలుస్తుంది.
- బెంగాల్‌లోని సొహ్రాగుర, మహాస్థాన్ శాసనాలు కరువు వచ్చినట్లు, కరువు సహాయ చర్యలను చక్రవర్తి చేపట్టినట్లు తెలుస్తుంది.
- అశోకుని మనుమడైన దశరథుని నాగార్జుని కొండ శాసనాలు రుద్రదమనుడి జునాగఢ్ శాసనాలు మౌర్యుల గురించి తెలుపుతు న్నాయి.
- తోప్రా, మీరట్‌లలో ఉన్న అశోకుని శాసనాలను మధ్యయుగంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించాడు. అలాగే కౌశాంబిలో ఉన్న అశోకుని శాసనాన్ని సముద్రగుప్తుడు అలహాబాద్‌కు తరలించి అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని హరిసేనునితో రాయించాడు.
అర్థశాస్త్రం - మౌర్యుల చరిత్రకు సంబంధించిన ప్రధాన సాహిత్య ఆధారం.
- 1905లో తంజావూరులోని ఒక పండితుని వద్ద ఈ ప్రాచీన గ్రంథం శ్యామశాస్త్రికి లభించింది.
- 1909లో ఆచార్య శ్యామశాస్త్రి ఆంగ్లభాషలోకి దీన్ని అనువదించాడు.
- ఈ గ్రంథం ప్రతులు మరో రెండు జర్మనీ గ్రంథాలయంలో ఉన్నాయి.
- 1915 నాటికి ఈ గ్రంథం సంపూర్ణ అనువాదం వచ్చింది.
- అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, పాలనా శాస్ర్తాలకు సంబంధించిన అంశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
మాదిరి ప్రశ్నలు
1. ‘అశోక ప్రియదర్శి’ అనే పేరు ఏ శాసనం ద్వారా బయటపడింది?
1) మాస్కీ 2) రుమిండై
3) సోపార 4) గిర్నార్
2. అశోకుని ఎన్నో శిలా శాసనం కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది?
1) 12 2) 13
3) 14 4) 11
3. ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ఏ మతానికి చెందింది?
1) బౌద్ధం 2) జైనం
3) అజీవకం 4) వైదికం
4. కింది వాటిలో సరైనవి?
1) కౌశాంబిలోని అశోకుని శాసనాన్ని సముద్ర గుప్తుడు అలహాబాద్‌కు తరలించాడు
2) ఈ శాసనం వెనుక వైపున హరిసేనునితో అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని రాయించాడు
3) 1 4) 1, 2
5. కింది వాటిలో సరైనవి?
1) బౌద్ధ గ్రంథాలైన మహావంశ, దివ్యావధాన అనే గ్రంథాలు అశోకుని జీవిత విశేషాలను వివరిస్తాయి?
2) బబ్రు శాసనం అశోకుడు బౌద్ధ మతం స్వీకరించినట్లు తెలుపుతుంది
3) 1 4) 1, 2
6. ‘ఇండియన్ మాకియవెల్లి’గా ప్రసిద్ధి చెందినవారు?
1) మెగస్తనీస్
2) కౌటిల్యుడు
3) విశాఖదత్తుడు 4) కాళిదాసు
సమాధానాలు
1-1, 2-2, 3-1,
4-4, 5-4, 6-2.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు