Disaster Management | విపత్తు సంసిద్ధత… ఉపశమనం.. ప్రతిస్పందన
భారతదేశంలో విపత్తు నిర్వహణ, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రతిస్పందించే స్థాయి నుంచి విపత్తు రావడానికి ముందే దానికి దారితీసే కారణాలను కనుగొనివాటిని నివారించే సంస్థాగత నిర్మాణ స్థాయికి ఏక ప్రావీణ్య పరిధి నుంచి బహుముఖ సామర్థ్య స్థాయికి పునరావాస ఆధారిత దృక్పథం నుంచి ముప్పును కుదించే బహుముఖ క్రియాత్మక సమగ్ర దృక్పథం స్థాయికి ఎదిగింది. 1900, 1905, 1907, 1947లో వచ్చిన వరుస దుర్బిక్ష్యాలు 1937లో సంభవించిన బీహార్-నేపాల్ భూకంపం మొదలైనవాటి నేపథ్యంలో భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్ కాలంలో ప్రారంభమైంది. గడిచిన శతాబ్దకాలంలో భారతదేశంలోని విపత్తు నిర్వహణ కూర్పు, స్వభావం విధానపరంగా గణనీయమైన మార్పులకు గురైంది.
బ్రిటిష్ పరిపాలన, స్వాతంత్య్ర అనంతర కాలంలో విపత్తు నిర్వహణ
బ్రిటిష్ పరిపాలనలో విపత్తుల వల్ల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పునరావాస విభాగాలను ఏర్పాటు చేసేవారు. అలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతిస్పందించే దృక్పథంతో ఏర్పాటు చేసే ఆ విభాగాలు విపత్తు అనంతర పరిస్థితుల్లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టేవి. విపత్తు నిర్వహణ విధానం కూడా రిలీఫ్ కోడ్లను రూపొందించడం పనికి ఆహార పథకం వంటి వాటిని చేపట్టడంతోపాటు పునరావాస దృక్పథం, కార్యకలాపాలతో కూడి ఉండేది. స్వాతంత్య్రానంతరం, విపత్తుల నిర్వహణ బాధ్యత ప్రతి రాష్ట్రంలో ఉండే రిలీఫ్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఉండేది. వీరు సెంట్రల్ రిలీఫ్ కమిషనర్ కింది విధులు నిర్వహించేవారు. వారి పాత్ర విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస సామగ్రి, నగదు పంపిణీ చేయడం వరకే పరిమితమయ్యేది. ప్రతి పంచవర్ష ప్రణాళికలో వరద విపత్తులను సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి వరద నియంత్రణ కింద ప్రస్తావించేవారు. ఈ దశ వరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలు రిలీఫ్ డిపార్ట్మెంట్ల కింద పని చేసేవి.
భారతదేశంలో సంస్థాగత ఏర్పాట్ల అవతరణ
- 1990లలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింది విపత్తు నిర్వహణ సెల్‌ను ఏర్పాటు చేయడంతో ఒక శాశ్వత, వ్యవస్థాగతమైన ఏర్పాటు ప్రారంభమైంది. లాతూర్ భూకంపం (1993), మాప్లా భూపాతం (1994), ఒరిస్సా సూపర్ సైక్లోన్ (1999), భుజ్ భూకంపం (2001) వంటి వరుస విపత్తుల నేపథ్యంలో అప్పటి వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి జె.సి. పంత్ చైర్ పర్సన్‌గా విపత్తుల నిర్వహణ సమగ్రంగా చేపట్టాలనే దిశగా విధానంలో పూర్తి మార్పులు చేశారు. అందుకు అనుగుణంగా విపత్తు నిర్వహణ విభాగాన్ని 2002లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోకి మార్చారు. భారతదేశంలో విపత్తు నిర్వహణకు ఒక అధికార క్రమ నిర్మాణం ఏర్పడింది.
విపత్తు నిర్వహణ వ్యవస్థ, నిర్మాణం
- విపత్తు నిర్వహణ విభాగానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (విపత్తు నిర్వహణ) నేతృత్వం వహిస్తారు. ఆయనకు ముగ్గురు డైరెక్టర్లు అండర్ -సెక్రటరీలు, సెక్షన్ ఆఫీసర్లు టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ ఎకనామిక్ ఇన్వెస్టిగేటర్ కన్సల్టెంట్స్, ఇతర సహాయ సిబ్బంది ఉంటారు.
విపత్తు నిర్వహణ చట్టం
- భారతదేశంలో విపత్తు నిర్వహణ పునరావాస కార్యక్రమాల స్థాయి నుంచి తొలి హెచ్చరిక వ్యవస్థలు ముందుగా గుర్తించడం, పలు వాతావరణ సంబంధిత వైపరీత్యాలకు సంబంధిత వ్యవస్థల పర్యవేక్షణ స్థాయికి పరిణామం చెందింది. ఈ చట్రం పరిధిలోనే ముంచుకొస్తున్న వైపరీత్యాల గురించి హెచ్చరికలు, అప్రమత్త ఆదేశాలు తాజా వార్తల రూపంలో సమాచారం అందించేందుకు ఒక వ్యవస్థ ఏర్పడింది. విభిన్న మంత్రిత్వశాఖలు, విభాగాల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ అత్యున్నతాధికార బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
- ఈ మంత్రిత్వ శాఖల్లో కొన్నింటిని నిర్దిష్టమైన విపత్తుల కోసం నోడల్ అథారిటీలుగా ప్రకటించారు. విపత్తు నిర్వహణపై ఏర్పాటు చేసిన అత్యున్నతాధికార కమిటీ నివేదిక సమర్పించింది. విపత్తుల కోసం ఒక ప్రత్యేక వ్యవస్థాగతమైన నిర్మాణాన్ని విపత్తు నిర్వహణను సంస్థాగతం చేసేందుకు సరైన చట్టాన్ని చేయాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. దీంతో మంత్రిత్వశాఖల మధ్య బహుళస్థాయి సంబంధాలు విపత్తు నిర్వహణ చట్టం అవతరించాయి.
విపత్తు నిర్వహణ చట్టం 2005
- విపత్తు నిర్వహణ చట్టం 2005 దేశ వ్యాప్తం గా 2005 డిసెంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందు దీన్ని 2005లో నవంబర్‌లో రాజ్యసభ, డిసెంబర్లో లోక్‌సభ ఆమోదించాయి. 2006 జనవరిలో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ చట్టం సమర్థవంతమైన విపత్తు నిర్వహణకు సంబంధించిన లేదా దానివల్ల యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల నిర్వహణకు తగిన చర్యలను తెలియజేస్తుంది. విపత్తు నిర్వహణ, అమలు విధానం రూపకల్పన పర్యవేక్షణకు అవసరమైన వ్యవస్థాగత యంత్రాంగాలను ఏర్పాటు చేస్తుంది. విపత్తు నివారణ దాని ప్రభావ కుదింపునకు, ఏదైనా పరిస్థితి తలెత్తినప్పుడు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు చేపట్టవలసిన చర్యలకు భరోసా ఇస్తుంది. ఈ చట్టంలో 11 అధ్యాయాలు 79 సెక్షన్లు ఉన్నాయి.
ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థలు - విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలు సంస్థలు ఏర్పడ్డాయి. అవి..
1) జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (National Disaster Management Authority-NDMA)
2) రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (State Disaster Management Authority – SDMA)
3) జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (District Disaster Management Authority- DDMA)
4) నేషనల్ విపత్తు నిర్వహణ సంస్థ (National Institute Disaster Management -NIDM)
5) జాతీయ విపత్తు ప్రతి స్పందన సంస్థ (National Disaster Response Force -NDRF) - జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను 2005 మేలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 అమల్లోకి వచ్చిన తర్వాత చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం ఎన్డీఎంఏను 2006 సెప్టెంబర్ 27న ప్రధానమంత్రి అధ్యక్షుడిగా మరో తొమ్మిది మంది సభ్యులతో లాంఛనంగా ఏర్పాటు చేశారు. సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. దీన్ని 2014 డిసెంబర్ 29న ముగ్గురు సభ్యులతో పునర్ వ్యవస్థీకరించారు.
- విపత్తులను తగ్గించడానికి చేపట్టవలసిన చర్యల విషయంలో వివిధ మంత్రిత్వశాఖలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అనుసరించవలసిన విపత్తు నిర్వహణ విధానాలు మార్గదర్శక సూత్రాలను రూపొందించే అధికారాన్ని ఎన్డీఎంఏకు కల్పించారు. విపత్తుల నిర్వహణకు ఆయా రాష్ట్ర ప్రాధికార సంస్థలు రాష్ట్ర ప్రణాళికల రూపకల్పన విషయంలో అనుసరించవలసిన మార్గదర్శకాలను కూడా ఎన్డీఎంఏ రూపొందించాలి.
ఎన్డీఎంఏ బాధ్యతలు
- విపత్తు నిర్వహణ విధానాలను రూపొందించటం.
- జాతీయ ప్రణాళికను ఆమోదించడం.
- జాతీయ ప్రకణాళికకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలు సిద్ధం చేసిన ప్రణాళికను ఆమోదించడం.
- రాష్ట్ర ప్రణాళిక రూపకల్పనలో ఆయా రాష్ర్టాల ప్రాధికార సంస్థలు అనుసరించవలసిన మార్గదర్శకాలను రూపొందించడం.
- తమ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టుల్లో విపత్తు నిరోధక చర్యలు లేదా వాటి ప్రభావాల ఉపశమన చర్యలను సమీకృతం చేయడానికి వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు అనుసరించవలసిన మార్గదర్శకాలను రూపొందించడం.
- విపత్తు నిర్వహణ విధానం ప్రణాళికల రూపకల్పనకు సిఫారసు చేయడం.
- భారీ విపత్తులు సంభవించిన దేశాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సహకారం అందించడం.
- అవసరమని భావించిన పక్షంలో విపత్తు ముప్పు లేదా విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన నిరోధక /ఉపశమన లేదా సంసిద్ధత నిర్మాణానికి ఇతర చర్యలు చేపట్టడం.
- జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ పని చేయడానికి అవసరమైన విశాల విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడం.
- ఎన్డీఎంఏ 3 దశల్లో విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తుంది. అవి
1) విపత్తు పూర్వ నిర్వహణ
ఎ) నివారణ
బి) సంసిద్ధత
సి) ఉపశమనం
2) విపత్త్తు సంభవించిన సమయంలో చేపట్టవలసిన చర్యలు
ఎ) ఉపశమనం
బి) ప్రతిస్పందన
3) విపత్తు అనంతర నిర్వహణ
ఎ) పునరావాసం
బి) పునర్నిర్మాణం
డి) ప్రతిస్పందన
ఎ) నివారణ: వైపరీత్యాలు సంభవించడానికి ముందే, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలు. ఉదాహరణకు వర్షాకాలానికి ముందే వరదలు సంభవించకుండా జలాశయాల్లో పూడికలు తీయడం, నది గట్లకు కరకట్టలు నిర్మించడం వంటి కార్యక్రమాలను నివారణ అంటారు.
బి) సంసిద్ధత: వైపరీత్యాల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందు వైపరీత్య ఘటనకు ముందు తీసుకొనే జాగ్రత్త చర్యలను సంసిద్ధత అంటారు. ఇది ఒక సంరక్షణ ప్రక్రియ. ఉదాహరణకు వైపరీత్యాలు సంభవించడానికి ముందే ప్రభావిత ప్రాంత ప్రజలు వారికి సహాయక కార్యక్రమాలు అందించే సిబ్బంది తగిన రేషన్‌ను వాహనాలను, ప్రసార సమాచార కార్యక్రమాలను అందుబాటులోకి తేవడం. సమాజానికి విపత్తుల గురించి అవగాహన కల్పించడం. విపత్తులో పాల్గొనేవారికి ట్రైనింగ్ ఇవ్వడం, ఒకరికొకరు సహాయం చేసుకునేలా చర్యలు చేపట్టడం, దుర్బలత్వాన్ని గుర్తించడం మొదలైనవి చేపట్టడాన్ని సంసిద్ధత అంటారు.
సి) ఉపశమనం: విపత్తు పరిధిని లేదా విపత్తు సంభవించడానికి గల అవకాశాన్ని తక్కువ చేసే ఏ చర్యనైనా ఉపశమన చర్య అనవచ్చు. ఉపశమన చర్య విపత్తు ముందు, విపత్తు సమయంలో, విపత్తు అనంతరం కూడా చేపట్టవచ్చు. కానీ ఉపశమన చర్య అనే పదాన్ని, విపత్తుకు గురయ్యే సంభావ్యతను తగ్గించడానికి తీసుకునే చర్యలకు తరచూ ఉపయోగిస్తారు. ఉపశమన చర్యల్లో భాగంగా నిర్మాణాత్మక, నిర్మాణేతర చర్యలను చేపడతారు.
నిర్మాణాత్మక చర్యలు: ఉదాహరణకు రోడ్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరించడం, విపత్తులను తట్టుకునే భవనాల నిర్మాణం చేపట్టడం. నదీ ఆనకట్టల ఎత్తు పెంచడం, భవనాలకు మరమ్మతులు నిర్వహించడం మొదలైనవి.
నిర్మాణేతర చర్యలు: ఉదాహరణకు బాధితులు ఎవరైతే తమవాళ్లను కోల్పోయారో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆర్థిక సహాయం అందేలా చూడటం, ఉద్యోగ అవకాశాలను గుర్తించడం, ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా తరలించడం మొదలైనవి.
ప్రతిస్పందన సహాయక చర్యలు చేపట్టిన వెంటనే విపత్తు ప్రభావిత కమ్యూనిటీ సాధారణ స్థితికి చేరుకునేందుకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు పునరావాస, పునర్నిర్మాణ చర్యలు చేపడతాయి. రోడ్లు, శాశ్వతగృహాలు, విద్యుత్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను పునరుద్ధరించడం జరుగుతుంది. విపత్తు నిర్వహణకు సంబంధించిన ఈ దశలో జీవనోపాధిని కోల్పోయిన వారికి ఆర్థిక పునరావాసం కూడా కల్పిస్తారు.
పునరావాసం, పునర్నిర్మాణం
ప్రతిస్పందన: విపత్తు సందర్భంలో, విపత్తు తాకిన వెంటనే దాని ప్రభావాలను తగ్గించడానికి చేపట్టే తక్షణ చర్యలు. ఇందులో ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛందసంస్ధలు, వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో చేపట్టే చర్యలు. ఉదాహరణకు అత్యవసర ఫోన్ నెంబర్లు దగ్గర పెట్టుకోవడం, ప్రణాళికలను అమలు చేయడం, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం. ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీచేయడం సరిపడా షెల్టర్లు, ఇతర సౌకర్యాలను, తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయడం.
- పైన తెలిపిన వాటిలో చివరి మూడు చర్యలు విపత్తు నిర్వహణ కోసం ప్రభుత్వం 2004 వరకు అమలు పరుస్తున్న కార్యక్రమాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఇవి విపత్తు అనంతరం తీసుకునే చర్యలు అయినందు వల్ల జరగవలసిన నష్టం జరిగిపోయేది. ఈ లోపాన్ని సవరిస్తూ విపత్తు అనుబంధ చర్యలతోపాటు విపత్తులు సంభవించడానికి ముందు తీసుకునే చర్యలు అయిన నివారణ, సంసిద్ధతలను కూడా విపత్తు నిర్వహణ కార్యక్రమాల్లో అంతర్భాగంగా చేర్చాలని ఎన్డీఎంఏ సూచిస్తుంది.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు