Current Affairs | ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి?
1. సీబీడీసీ వినియోగించనున్న మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? (3)
1) పుణె 2) ఇండోర్
3) పాట్నా 4) గువాహటి
వివరణ: దేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని వినియోగించనున్న మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్‌గా పాట్నా నిలిచింది. మున్సిపల్ కార్యాలయం ప్రధాన కేంద్రం వద్ద అంగీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మే 23న ఇది అందుబాటులోకి వచ్చింది. దీన్ని వినియోగించే అంశానికి సంబంధించి కార్పొరేటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డిజిటల్ ఈ-రూపాయి మూలంగా కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
2. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు? (2)
1) ప్రవీణ్ సూద్
2) ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ
3) అజిత్ దోవల్ 4) ఎవరూ కాదు
వివరణ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. సురేశ్ ఎన్ పటేల్ పదవీ విరమణ పొందడంతో అతడి స్థానంలో శ్రీవాస్తవను ఎంపిక చేశారు. అతను అస్సాం-మేఘాలయ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను 1964లో ఏర్పాటు చేశారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఇది ఏర్పాటయ్యింది. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. సంతానం కమిటీ సూచన మేరకు సెంట్రల్ విజిలెన్స కమిటీని అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన పౌర పనులను ఇది పరిశీలిస్తుంది.
3. ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి అని ఇటీవల ఐక్యరాజ్య సమితి నివేదికను వెలువరించింది? (3)
1) 22 2) 9 3) 18 4) 30
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సమస్య తీవ్రంగా ఉందని ఐక్యరాజ్య సమితి ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. లక్షల సంఖ్యలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ‘హంగర్ హాట్‌స్పాట్స్’ పద్దెనిమిది ఉన్నాయని వెల్లడించింది. రానున్న ఆరు నెలల్లో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని వెల్లడించింది. ఈ నివేదికను ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం సంయుక్తంగా రూపొందించాయి. ఆఫ్రికా ఖండంలోని సూడాన్, హైతి, బుర్కినోఫాసో తదితర దేశాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది.
4. ఏ సంస్థకు భారత కాగ్ మరోసారి ఎక్స్టర్నల్ ఆడిటర్‌గా ఎన్నికయ్యారు? (4)
1) ప్రపంచ వాతావరణ సంస్థ
2) యునిసెఫ్
3) ప్రపంచ ఆర్థిక ఫోరం
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
వివరణ: జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారత కాగ్ ఎక్స్టర్నల్ ఆడిటర్‌గా మరోసారి ఎన్నికయ్యారు. 2024-27 మధ్య ఆయన కొనసాగనున్నారు. 2019-23 కాలానికి కూడా ఆడిటర్‌గా భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము వ్యవహరించారు. జెనీవాలో నిర్వహించిన 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. మొత్తం 156 దేశాలు పాల్గొనగా 114 దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. తొలి రౌండ్లోనే భారత్.. చైనా, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ తదితర దేశాలను ఓడించింది.
5. నాటో+లో కింది వాటిలో లేని దేశం? (2)
1) దక్షిణ కొరియా 2) ఇండోనేషియా
3) జపాన్ 4) దక్షిణ కొరియా
వివరణ: నాటోలో ఉన్న 31 దేశాలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాలను కలిపి నాటో+ అంటారు. రక్షణ రంగంలో సహకారం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఇటీవల వార్తల్లో నిలిచింది. అమెరికాకు చెందిన ఒక కాంగ్రెషనల్ కమిటీ భారత్ పేరును ప్రస్తావించింది. నాటో+ కూటమిలో భారత్‌కు చోటు కల్పించాలని సూచించింది. ఇందులో చేరడం వల్ల భారత్‌కు ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంశాలు అందుతాయి. ఆధునిక మిలిటరీ సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వస్తుంది. నాటో కూటమిలో ఇప్పటి వరకు 30 దేశాలు ఉండేవి. ఇటీవల ఫిన్లాండ్ చేరికతో 31కి చేరింది.
6. కింది ఏ ప్రాంతంలో సెంకకు దీవులు కనిపిస్తాయి? (3)
1) మధ్యధరా సముద్రం
2) అరేబియా సముద్రం
3) తూర్పు చైనా సముద్రం
4) అట్లాంటిక్ మహా సముద్రం
వివరణ: సెంకకు దీవి తూర్పు చైనా సముద్రంలో కనిపిస్తుంది. జపాన్‌కు చెందిన ఒకినావా నుంచి సుమారు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఉంటుంది. చైనా, జపాన్ మధ్య ఇది వివాదాస్పదంగా ఉంది. ఇందులో ఓట్సురి, కుబా, తైషో తదితర దీవులున్నాయి. చైనా తీర భద్రతా దళానికి చెందిన ఒక నౌక ఇటీవల ఈ దీవిలో కనిపించిందని జపాన్ ఆరోపిస్తుంది. జపాన్-చైనాతో పాటు జపాన్-తైవాన్‌కు కూడా ఈ దీవికి సంబంధించి వివాదం ఉంది. 1895లో జపాన్ వీటిని తమవిగా ప్రకటించుకుంది. అంత వరకు వీటిపై ఎవరూ దృష్టి సారించలేదు.
7. తుర్కియే దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? (1)
1) ఎర్డోగన్ 2) కెమల్
3) బొలా అహ్మద్ 4) రౌటేలా
వివరణ: తుర్కియే అధ్యక్షుడిగా మరోసారి తయ్యిప్ ఎర్డోగన్ ఎన్నికయ్యారు. గతంలో ఆయన 20 సంవత్సరాలు ఆ దేశానికి నేతృత్వం వహించారు. ఎన్నికల్లో ఎర్డోగన్‌కు 52.14% ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థికి 47.86 శాతం ఓట్లు దక్కాయి. అలాగే బోలా టినుబు అహ్మద్ నైజీరియా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుకకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
8. ఏ రాష్ట్రంలో వీర్ సావర్కర్ సేతు రానుంది? (4)
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) కర్ణాటక 4) మహారాష్ట్ర
వివరణ: మహారాష్ట్రలోని బాంద్రా- వెర్సోవా సముద్రపు అనుసంధానాన్ని వీర్ సావర్కర్ సేతుగా మార్చనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. వెర్సోవా-బాంద్రా సముద్రపు అనుసంధానం 17.17 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. ముంబైలో అందుబాటులోకి తేనున్నారు. ఇది వెర్సోవా-అంధేరీలను కలుపుతుంది.
9. గొంఫోనెమా రాజగురు అనే పదం దేనికి సంబంధించింది? (3)
1) నూతన పార్లమెంట్లో ఒక గది పేరు
2) భారత సైన్యంలోని ఒక రెజిమెంట్
3) కొత్త జాతికి పెట్టిన పేరు
4) ఏదీకాదు
వివరణ: పశ్చిమ కనుమల్లోని ఉత్తర భాగంలో కొత్త జాతిని గర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పుణె కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్‌గా భావించే సతారా జిల్లాలోని మహాబలేశ్వర్‌లో ఇది కనిపిస్తుంది. దీనికి భూ ఆర్కియాలజిస్ట్ అయిన రాజగురు పేరును పెట్టారు.
10. ఐపీఎల్-2023లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు ఎవడు? (1)
1) శుభ్‌మన్ గిల్ 2) డుప్లెసిస్
3) విరాట్ కోహ్లీ
4) సూర్యకుమార్ యాదవ్
వివరణ: ఐపీఎల్-2023ని చెన్నై జట్టు గెలుచుకుంది. తుదిపోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ సీజన్లో అత్యధికంగా పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఆయన గుజరాత్ టైటాన్స్‌కు చెందిన క్రీడాకారుడు. అలాగే రెండు, మూడు స్థానాల్లో వరుసగా డుప్లెసిస్, కాన్వే ఉన్నారు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా మహ్మద్ షమి నిలిచాడు. అతను కూడా గుజరాత్ టైటాన్స్‌కు చెందిన క్రీడాకారుడే. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్లు తీసిన వాళ్లకు పర్పుల్ క్యాప్ ఇస్తారు. ఐపీఎల్ ఈ ఏడాది మార్చి 31న ప్రారంభమై, మే 29న ముగిసింది. మొత్తం 10 జట్లు ఇందులో పాల్గొన్నాయి.
11. 57వ జ్ఞానపీఠ్ అవార్డ్ ఎవరికి లభించింది? (2)
1) నీలమణి 2) దామోదర్ మౌజో
3) శంకర్ కురుప్ 4) బందోపాధ్యాయ
వివరణ: 57వ జ్ఞానపీఠ్ అవార్డ్ గోవా రాష్ర్టానికి చెందిన దామోదర్ మౌజోకు లభించింది. దేశంలో సాహిత్య రంగంలో ఇదే అత్యుత్తమ అవార్డ్. మౌజో కొంకణి భాషలో రచనలు చేశారు. ఆయన గోవా రాష్ట్రం నుంచి ఈ అవార్డును పొందిన రెండో వ్యక్తి. 2008లో రవీంద్ర కెలెకర్కు ఈ అవార్డు లభించింది. 56వ జ్జానపీఠ్ అవార్డ్ నీలమణికి దక్కింది. ఈ అవార్డును 1961లో స్థాపించారు. 1965 నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి వ్యక్తి మలయాళ రచయిత శంకర్ కురుప్. ఎనిమిదో షెడ్యూల్లోని భాషల రచనలకు ఈ అవార్డులు ఇస్తారు.
12. యూన్ఎఫ్సీసీ 28వ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? (3)
1) భారత్ 2) ఇండోనేషియా
3) యూఏఈ 4) సౌదీ అరేబియా
వివరణ: 28వ పర్యావరణ మార్పు సదస్సు (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ైక్లెమేట్ చేంజ్)ను యూఏఈలో నిర్వహించనున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఇది కొనసాగనుంది. భూతాపాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి దీన్ని నిర్వహించనున్నారు. ఇంతకుముందు ఈ సదస్సును ఈజిప్ట్‌లోని షార్మ్-ఎల్ షేక్‌లో నిర్వహించారు. యూఏఈలో జరుగనున్న ఈ సమావేశానికి చైర్మన్ సలహా ప్యానెల్లో తాజాగా ముకేష్ అంబానీని కూడా చేర్చారు. ఇప్పటికే ఈ ప్యానెల్లో భారత్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త సునీతా నరైన్ ఉన్నారు. ఆమె పర్యావరణ మెరుగు కోసం కృషి చేస్తున్నారు.
13. సీడ్ (ఎస్ఈఈడీ) అనే పథకం ఎవరికి సంబంధించింది? (1)
1) డీ నోటిఫైడ్ ట్రైబ్స్ 2) రైతులు
3) వ్యవసాయ కూలీలు 4) గిగ్ వర్కర్లు
వివరణ: ఎస్ఈఈడీ (సీడ్) అనేది సంక్షిప్త రూపం. దీని విస్తరణ రూపం స్కీం ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు ఆరోగ్య బీమా, గృహ సదుపాయం తదితరాలను కల్పిస్తారు. ఇందుకు రూ.200 కోట్లు కేటాయించారు. 2025-26 సంవత్సరం వరకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది.
14. ఎన్ని రాష్ర్టాల్లో డిజిటల్ క్రాస్ సర్వేను చేపట్టనున్నారు? (4)
1) 3 2) 4 3) 5 4) 6
వివరణ: ఒడిశా, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో డిజిటల్ క్రాప్ సర్వేను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి ఒక మొబైల్ అప్లికేషన్, వెబ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు.
15. చీతా ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి ఎవరి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు? (3)
1) రామ్ నారాయణ్ 2) వినయ్ కుమార్
3) రాజేష్ గోపాల్ 4) మనోహర్
వివరణ: నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి భారత్ చీతాలను తీసుకొచ్చింది. ఇందులో పలు చీతాలు మృతిచెందడంతో, ఈ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి ఒక కొత్త కమిటీని ఎన్టీసీఏ ఏర్పాటు చేసింది. ఎన్టీసీఏ పూర్తి రూపం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ కమిటీలో 11 మంది సభ్యులు ఉంటారు. దీనికి రాజేష్ గోపాల్ నేతృత్వం వహిస్తారు. ఆయన గ్లోబల్ టైగర్ ఫోరం అనే వ్యవస్థకు సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు ఉనికిని కలిగి ఉంటుంది. ప్రతి నెలా కనీసం ఒక్కసారన్న సమావేశం అవుతుంది. అలాగే కునో జాతీయ పార్క్‌ను క్రమం తప్పకుండా పర్యటించి పరిస్థితిని తెలుసుకుంటుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు