Chandrayan-3 – Current Affairs | జాబిల్లి అందింది.. భారతావని మురిసింది
భూమి-చంద్రుడు వాటి మధ్యగల అనుబంధం
- భూమి నుంచి పుట్టిందని చెబుతున్న చందమామ భూమిపై జీవకోటికి ముఖ్యంగా మానవులకు ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ బలాల వల్ల ఏర్పడుతున్న ఆటుపోట్లు మత్స్యకారుల పడవలు, రవాణా ఓడలు సునాయాసంగా ఒడ్డుకు చేరుకోవడంలో, సముద్రంలోకి ప్రవేశించడంలో ఎంతో సహకరిస్తున్నాయి. మత్స్య పరిశ్రమ, సీ మెరైన్ యాక్టివిటీస్, టైడల్ ఎనర్జీ ఉత్పత్తి వంటి ఆర్థిక కార్యకలాపాలకు ఆధారంగా ఉన్నాయి.
భూ ఉపగ్రహమైన చంద్రుడిపై ఎందుకింత ఆసక్తి?
- భూమికి అత్యంత సమీపాన గల భారీ ఖగోళ వస్తువు చంద్రుడే. భూమికి ఆవల ఏముందోననే జిజ్ఞాస దగ్గరలోనే ఉన్న చంద్రుడి పైకి దృష్టి మళ్లించింది. ఖగోళ అన్వేషణలో పోటీపడుతూ తమ ఆధిపత్యం ప్రకటించుకోవడానికి ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, రష్యా చంద్రుడిపైకి పోటాపోటీగా రాకెట్లు పంపాయి. అయితే ఆ కాలంలో ముందుగా చంద్రుడిని చేరడం, చంద్రుడిపై కాలుపెట్టడం ద్వారా ప్రతిష్ఠ పెంచుకోవడం మినహా పెద్దగా ఎవరికీ లక్ష్యాలేవీ లేవు. ఈ కోవలో 1950 దశకం నుంచి 1970 దశకం వరకు రష్యా, అమెరికా పోటాపోటీగా వరుస ప్రయోగాలు జరిపాయి. అమెరికా (50), రష్యా (49) చంద్ర మండల యాత్రలు ఈ కాలంలో చేపట్టాయి. అయితే తొలిసారి చంద్రమండలం పైకి విజయవంతంగా చేరినది మాత్రం రష్యాకు చెందిన లూనా-2 (13 సెప్టెంబర్ 1959). అదేవిధంగా 1966లో రష్యా ప్రయోగించిన లూనా-9కు తొలిసారి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఘనత దిక్కింది. తొలిసారి మానవులను చంద్రుని కక్ష్యలోకి (అపోలో-8) అమెరికా పంపగలిగింది. చంద్రుడి మీద మానవులను అడుగుపెట్టించిన ఘనత (అపోలో-11, జూలై 1969)కూడా అమెరికాకు దక్కింది. ఈ ప్రయోగంలో తొలిసారిగా చందమామపై అడుగిడిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్.
- 1968-72 వరకు అపోలో సిరీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి వరుసగా పంపింది. ఈ విధంగా పంపిన 8 వ్యోమగామి సహిత అంతరిక్ష నౌకలు సురక్షితంగా తిరిగి భూమిని చేరాయి. వీటిలో 6 వ్యోమ నౌకలు చంద్రుడిపై వ్యోమగాములను దింపాయి.
- 1950 నుంచి 1970 వరకు 99 అంతరిక్ష నౌకలను రెండు దేశాలూ పోటాపోటీగా పంపాయి. అమెరికా వ్యోమగాములను పంపే లక్ష్యాలతో ప్రయోగాలు చేస్తే, రష్యా రోవర్లను దింపి చంద్రుడి పైనుంచి శాంపిల్స్ సేకరించింది.
- 1972లో జరిపిన అపోలో-17 ప్రయోగం తర్వాత అధిక బడ్జెట్ వ్యయాలు, రాజకీయ సమ్మతి లేకుండటం దృష్ట్యా తన ప్రయోగాలను అమెరికా విరమించుకోవడం వల్ల రష్యా కూడా వెనక్కి తగ్గింది. ఈ విధంగా 1970, 1980 దశకాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయలేదు.
- 1990లో జపాన్ తన Clementine మిషన్‌ను ప్రయోగించడంతో చంద్రుడి పైకి అంతరిక్ష నౌకను పంపిన మూడో దేశంగా పేరుగాంచింది. ఆవిధంగా 1990 దశకం నుంచి మళ్లీ చంద్ర మండల యాత్రలు ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (2003), చైనా (2007), ఇండియా (2008), లక్సెంబర్గ్, ఇజ్రాయెల్, ఇటలీ, సౌత్ కొరియా, యూఏఈ కూడా పాల్గొన్నాయి.
- ఇప్పటి వరకు 146 అంతరిక్ష నౌకలను చంద్ర మండలంపైకి వివిధ దేశాలు ప్రయోగించగా విజయవంతం అయినవి కేవలం 87.
ప్రయోగాల ద్వారా ఏం తెలుసుకోగలిగాం?
- రష్యా ప్రోబ్‌లు, అమెరికా వ్యోమగాములు సేకరించిన వివరాలు చంద్రుడి గురించే కాదు, భూమి గురించి భూమిపై జీవం పుట్టుక గురించి కూడా వివరాలందించాయి.
- రష్యా వ్యోమ నౌక లూనా-3 ద్వారా సేకరించిన చిత్రాలు భూమి నుంచి కనిపించని చంద్రుడి ఆవలి భాగపు ఉపరితలాల గురించి సమాచారాన్ని ఇచ్చాయి. అంతగా స్పష్టతలేని తొలినాళ్ల నాటి ఆ చిత్రాల ద్వారా అక్కడి చీకటి పరిస్థితులు, భౌగోళిక అమరిక గురించి చూఛాయగా అవగతం అయ్యింది.
- అమెరికా హార్డ్ ల్యాండింగ్ తరహా రేంజర్ శ్రేణిని అవి చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొనే ముందే దగ్గరి నుంచి చంద్రుడిని చిత్రీకరించి పంపేవిధంగా రూపొందిచబడింది. పలు వైఫల్యాల అనంతరం రేంజర్-7 ఈ పనిని విజయవంతంగా చేసింది. ఈ విధంగా 1964లో Mare Nubium (Sea of Clouds) ప్రాంతపు ఆనుపానులు చిక్కాయి. భారీ బిలాలు, ఉల్కాపాతాల వల్ల రాళ్లు విచ్ఛిన్నమయి అక్కడ ఏర్పడిన మెత్తటి దుమ్ము గురించి తెలిసింది. అంతేకాక అమెరికాకు చెందిన సర్వేయర్ శ్రేణి పంపిన చాలా నాణ్యమైన చిత్రాలతో అక్కడి మట్టి కెమికల్ కాంపోజిషన్‌ను, ఇనుము సమృద్ధిగా గల నల్లటి లావాను, లేతరంగులో ఉన్న అల్యూమినియం సమృద్ధిగా ఉన్న ఎత్తైన ప్రాంతాలు కనిపించాయి. అవి తర్వాత అపోలో-2 వ్యోమగాములు తెచ్చిన మట్టి శాంపిల్స్‌తో నిర్ధారించబడి చంద్రుడి ప్రాచీన వివరాలు తెలిశాయి.
- లూనార్ ఆర్బిటార్ సిరీస్ (అమెరికా) ఐదు మ్యాపింగ్ మిషన్స్ చేపట్టింది. ఇవి చంద్రుడిని మరింత స్పష్టంగా, దగ్గరగా చిత్రీకరించాయి. ఈ వివరాల ద్వారా చంద్రుడిపైన అయస్కాంత శక్తి క్షేత్రం గానీ, వాతావరణం గానీ లేదని తెలిసింది. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలం భూపటలంపై కనిపించే తరహా రాళ్లతోనే నిర్మితమైందని తెలిసింది. అదేవిధంగా అపోలో సిరీస్ ద్వారా సేకరించిన వివరాలు చంద్రుడిపై ఉన్న అరుదైన ఖనిజాలు, రేడియోధార్మిక పదార్థాల గురించి, ఒకే ఖనిజం సమృద్ధిగా ఉండే Genesis Rocks గురించి, గ్రహాల ఆవిర్భావం, పరిణామ క్రమం గురించి భూమిపై జీవం గురించి ఎంతో విలువైన సమాచారం అందించింది.
- భారతదేశం 2008లో తన తొలి చంద్ర మండల యాత్రకు పంపిన చంద్రయాన్-1, చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ చంద్రుడి దక్షిణ ధ్రువంలో హైడ్రాక్సిల్ అణువుల రూపంలో ఘనీభవించిన నీటి జాడను కనుగొంది. ఇది చంద్ర మండల యాత్రలకు పునరుత్తేజాన్ని కలిగించింది.
భారత్-చంద్ర మండల యాత్రలు
- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుడి గురించి వివరాలు సేకరించడానికి చంద్రయాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మూడు చంద్రయానాలు జరిపింది.
చంద్రయాన్-1 - 2008 అక్టోబర్ 14న శ్రీహరికోట సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-1ను ప్రయోగించారు. దీంతో చంద్రుడి వద్దకు చేరిన 5వ దేశంగా భారత్ అవతరించింది. దీనికి నిర్దేశించిన లక్ష్యాలు రెండేళ్ల కాలంలో చంద్రుడి ఉపరితలం పైగల రసాయన సంఘటనాలను గుర్తించడం, త్రీ డైమెన్షినల్ టోపోగ్రఫి ధ్రువాలను స్పష్టంగా చిత్రీకరించడం మొదలైనవి. ఏడాది పాటు సమర్థంగా వీటన్నింటినీ చంద్రయాన్-1 నిర్వహించింది. దాదాపు సంవత్సరం తర్వాత స్టార్ ట్రోకర్ పనిచేయకపోవడం, థర్మల్ షీల్డింగ్ పాడవడం వంటి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి అనుసంధానాన్ని కోల్పోయింది. పూర్తికాలం పనిచేయ లేకపోయినా చంద్రయాన్-1 చాలా వరకు విలువైన సమాచారం అందించింది. అందువల్ల ఈ ప్రయోగం విజయవంతం అయిందనే పేర్కొంటారు.
చంద్రయాన్-2 - చంద్రుడిపై ఆర్బిటార్ అనుసంధానం గల రోవర్ కలిగిన ల్యాండర్‌ను దింపి రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై పయనింపజేస్తూ పరిశోధనలు చేసేందుకు 2019 జూలై 22న చంద్రయాన్-2ను ప్రయోగించారు. అయితే చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యలైన ప్రజ్వలన నియంత్రణ, అదుపుతప్పడం, సాఫ్ట్వేర్ సమస్యలు, అత్యవసర సమయంలో మలుపు తీసుకొనేందుకు కావలసిన వేగం తక్కువగా ఉండటం, చేరవలసిన నిర్దిష్ట వైశాల్యం మరీ చిన్నగా ఉండటం వల్ల చివరి క్షణంలో దిగే ప్రదేశం సరిగా లేనప్పుడు ల్యాండింగ్ ప్రాంతాన్ని మార్చుకునే అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల హార్డ్ ల్యాండింగ్ జరిగింది. దీంతో ల్యాండర్ పాడైపోవడంతో ఆర్బిటార్‌తో అనుసంధానం కోల్పోయింది. ప్రయోగం విఫలమైంది.
చంద్రయాన్-3 - చంద్రయాన్-2 వైఫల్యాన్ని జయించడానికి మరిన్ని జాగ్రత్తలతో చేసిన ప్రయోగం చంద్రయాన్-3. దీనిలో ల్యాండర్ మాడ్యూల్ (విక్రమ్) 1726 కిలోల బరువు ఉండగా, రోవర్ (ప్రజ్ఞాన్) 26 కిలోలు, ప్రొపల్షన్ మాడ్యూల్ 2148 కిలోలు కలిగి మొత్తంగా దీని బరువు 3900 కిలోలు.
- దీన్ని 2023 జూలై 14న LVM3-M4 వాహక నౌక ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 2023 ఆగస్టు 23న సురక్షితంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది. దీనితో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి దేశంగా భారతదేశ ప్రతిష్ఠ సాంకేతికత పరంగా ఇనుమడించింది.
- ఇస్రో ప్రధానంగా మూడు లక్ష్యాలను చంద్రయాన్-3 పట్ల నిర్దేశించుకుంది.
1.సురక్షితంగా విక్రమ్ ల్యాండర్‌ను
దించడం.
2. రోవర్‌ను సురక్షితంగా ల్యాండర్ నుంచి బయటకు తెచ్చి సవ్యంగా
పనిచేసేటట్లు చూడటం.
3. చంద్రుడి ఉపరితలంపై గల పదార్థాలను నిశితంగా పరిశీలిస్తూ అక్కడి మట్టిలోని నీటి జాడలు, చంద్రుడిపై వాతావరణ పరిణామ క్రమం తెలుసుకునే పరిశోధనలకు తోడ్పడటం. - సూర్యరశ్మి సోకని అతిశీతలమైన చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో పుష్కలంగా హైడ్రాక్సీ అణువుల రూపంలో నీరు ఉంది. విలువైన, అరుదైన ఖనిజ మూలకాలు శక్తి వనరులు ఉన్నాయని తెలియడంతో చంద్రమండల యాత్రపై ప్రపంచ దేశాలన్నీ తిరిగి దృష్టి సారించాయి. ఒకప్పుడు చంద్రుడిపైకి మొదట చేరడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటీపడ్డ అగ్రదేశాలు ఇప్పుడు చంద్రుడిపై తొందరగా పాగా వేసి లబ్ధిపొందడానికి యత్నిస్తున్నాయి.
- భూమిపై అరుదుగా దొరికే విలువైన
బెరీలియం, టైటానియం, జర్మేనియం, లిథియం, టాన్టాలియం వంటి లిథోపైల్ మూలకాలతో పాటు అల్యూమినియం, టైటానియం, కాల్షియం కూడా విరివిగా చంద్రుడిపై ఉండటం వల్ల చంద్ర మండలంలోని ఖనిజ సంగ్రహణకు బాటలు పడుతున్నాయి. - కాలుష్య రహిత శక్తిని ఉత్పత్తి చేయగల హీలియం3 చంద్రుడిపై విరివిగా ఉండటం, అది భూమిపై పెద్దగా లభించకపోవడంతో ప్రపంచ దేశాల దృష్టి పడింది.
- హైడ్రోజన్, ఆక్సిజన్లను వేరు చేసి వాటిని రాకెట్ ఇంధనాలుగా వాడుకోవడానికి, చంద్ర మండలంపైకి వెళ్లిన మానవుల శ్వాస, ఇంధన అవసరాలు, పరికరాలను చల్లబరిచేందుకు (కూలెంట్లుగా), అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రోబోలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారానే ఖనిజ సంగ్రహణం వంటి కార్యక్రమాలన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి కావలసిన ఇంధన అవసరాలకు వినియోగించే అవకాశం ఉండటం సరికొత్త ఆశలు రేపుతోంది.
చంద్రయానాలపై పునరాసక్తికి కారణాలు - చంద్రయాన్-3 విజయం-భారత్‌కు ఏర్పడిన అనుకూలతలు
- సుదూర ఖగోళ వస్తువుల పరిశీలనకు ఒక స్థావరంగా, అంతరిక్ష యాత్రికులకు ఒక ఇంధన విడిదిగా కూడా చంద్రుడు ఆశాజనకంగా కనిపిస్తున్నాడు.
- భూమిపై తరిగిపోతున్న ఖనిజ సంపద, పెరుగుతున్న జనాభా, కాలుష్యం, విపత్తులు, సాంకేతిక పురోభివృద్ధితో కలిగిన వెసులుబాట్లు భూమితో పాటు మనిషికి మరో స్థావరం చంద్రుడని ఆలోచన కలిగించింది. భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ స్థావరం చంద్రుడు మాత్రమే కావడం దీనికి కారణమైంది.
- చంద్రుడు ముఖ్యంగా నీటి జాడలున్న దక్షిణ ధ్రువం, అక్కడి పరిస్థితులపై పట్టు, ఆధిపత్యం సాధించడం వల్ల ఆదేశానికి దౌత్యపరంగా, అంతర్జాతీయంగా సంబంధాల పరంగా, ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడటమే. అందువల్ల అగ్రదేశాల చంద్రమండల యాత్రల రద్దీ మొదలైంది.
- ఇప్పటికే అమెరికా చంద్రుడిపై స్థావరాలను ఏర్పరుచుకోవడానికి అనేక ప్రైవేట్ ఏజెన్సీలతో మౌలిక వసతుల నిమిత్తం ఒప్పందాలు చేసుకుంది.
1. సాంకేతికంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగింది.
2. దక్షిణ ధ్రువం పైకి మొదట చేరగలగడంతో ఏర్పడిన ఎర్లీబర్డ్ అడ్వాంటేజ్.
3. రష్యా లూనా-25 తో పోలిస్తే అతితక్కువ ఖర్చుతో విజయం సాధించగలగడంతో టెక్నాలజీ విపణిలో చౌకైన ప్రత్యామ్నాయంగా చిన్న దేశాల దృష్టిలో పడటంతో లభించనున్న ఆర్థిక ప్రయోజనాలు. తద్వారా మూన్ ఎకానమీలో భాగస్వామ్యం దక్కే అవకాశాలుండటం.
4. ఇస్రో వ్యాపార విభాగాలైన ఆంత్రిక్స్, NSIL వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు చంద్రయాన్ విజయం మరిన్ని లాభాలు ప్రోదిచేసే అవకాశం ఉండటం.
5. దేశీయంగా సాంకేతిక బదిలీ Inspace ద్వారా మరింత జరిగి దేశీయ అంకురాలు, వ్యాపారాలు, ఉపాధి వృద్ధి చెందడం.
భారత్‌పై పెరిగిన బాధ్యత
1. దక్షిణ ధ్రువాన్ని చేరడానికి టెక్నాలజీ సమృద్ధిగా ఉన్న అమెరికా వంటి దేశాలకు పెద్ద కష్టం కాకపోవచ్చు. టెక్నాలజీ, వేగంలో మనకన్నా ముందున్న అమెరికా, రష్యా, చైనా, జపాన్ తదితర దేశాలకు సమఉజ్జీగా నిలవాలంటే టెక్నాలజీ పరంగా ఇస్రో మరింత సాధించాల్సి ఉంది. నిధుల రూపంలో ప్రభుత్వ సాయం మరింత అవసరం.
2. చంద్రుడిపై అక్కడి ఖనిజాల్లో వాటా దక్కాలంటే రోబోటిక్స్, ఇతరత్రా సాంకేతికతల పరంగా మరింత పరిజ్ఞానం, పరిశోధన వృద్ధి చెందాలి.
3. మనం చౌక ప్రత్యామ్నాయ పద్ధతులను ఆశ్రయించి విజయం సాధించినప్పటికీ ఎక్కువ సమయం పట్టే ఈ పద్ధతులు ఇతర దేశాల వేగవంతమైన టెక్నాలజీ ముందు నిలబడటం కష్టం. అమెరికా, రష్యా వంటి దేశాలు రోజుల వ్యవధిలో గమ్యాన్ని చేరగల శక్తిమంతమైన వాహన నౌకలను కలిగి ఉంటే మనం నెలల వ్యవధి తీసుకున్నప్పుడు లబ్ధి పొందడంలో వెనుకబడవచ్చు.
చంద్రుడు
- సౌర వ్యవస్థలో ఉన్న ఉపగ్రహాల్లో 5వ అతిపెద్దది
- చుట్టుకొలత: 10921 కిలోమీటర్లు
- విస్తీర్ణం: 3.783X107 Km2 (భూమిలో ఇది 0.074 భాగం)
- ద్రవ్యరాశి: 7.342X1022 kg (భూమిలో 0.02)
- సగటు సాంద్రత: 3.344 g/cm..2
- ఉపరితల గురుత్వాకర్షణ: 1.622 m/s2 (or) 0.16549
- పలాయన వేగం: 2.38 km/s (or) 8600 km/m
ఉపరితల ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు
- సూర్యకాంతి పడే ఉత్తర ధ్రువ ప్రాంతంలో పగటి పూట 1270C, రాత్రి -1730 (చంద్రుడి ఎక్సో స్పేర్ సూర్య కిరణాల ప్రసారాన్ని ఏమాత్రం అడ్డుకోలేదు)
- అతిపెద్ద లోతైన చీకటి బిలాలు కలిగి ఉన్న దక్షిణ ధ్రువ ప్రాంతంలో కొన్ని బిలియన్ సంవత్సరాలుగా కాంతి చేరనందున అక్కడ అతిశీతలంగా ఉంటుంది. (-2030C)
- సగటు వ్యాసార్థం: 1737.4km (భూమిలో 0.2727 భాగం)
- భూమి-చంద్రుడి మధ్య దూరం: సగటున 3,84,399km (పరిభ్రమణ సమయం దూరాలు మారుతూ ఉంటాయి)
అపోజీ: 4,06,700km
పెరిజీ: 3,56,500km
వ్యత్యాసం: 50,200km - భూగురుత్వాకర్షణతో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ 1/6వ వంతు మాత్రమే (0.1654 గ్రాములు).
- చంద్రుడి ఆకారం: కొద్దిపాటి దీర్ఘవృత్తాకారం
- భూమి చుట్టూ చంద్రుడు ఇంచుమించు 27 రోజుల వ్యవధిలో ‘ఒక పరిభ్రమణం’ చేస్తాడు. తన అక్షం చుట్టూ తాను కూడా చంద్రుడు సరిగ్గా అంతే వ్యవధి (27 రోజులు)లో ‘ఒక భ్రమణం’ చేస్తుంటాడు. రెండు కదలికలకూ చంద్రుడు ఒకే సమయం తీసుకోవడం వల్ల మనకు భూమి నుంచి ఎల్లప్పుడూ చంద్రుడి ఒకవైపు భాగమే కనిపిస్తుంది.
- పరిభ్రమణ వేగం: 1.022
- చంద్రుడు భూమి భ్రమణం చేసే దిశలోనే తాను భ్రమణం చేస్తుంటాడు.
- Inclination: భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే కక్ష్యకు 5.1450 మేర ఒరిగి సూర్యుడి చుట్టూ భూమితో పాటు చంద్రుడు కూడా పరిభ్రమిస్తూ ఉంటాడు. అదే భూమి వైపు భూమధ్య రేఖను 240 కోణం మేర వంగి భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు.
- Lunar Distance: భూమధ్య ప్రాంతం నుంచి చంద్రుడి మధ్య ప్రాంతం వరకు గల దూరాన్ని లూనార్ డిస్టెన్స్ అంటారు. ఖగోళ కాలమానంగా దీన్ని భూమికి దగ్గరలోని ఖగోళ పదార్థాల గురించి తెలపడానికి వినియోగిస్తారు. లూనార్ డిస్టెన్స్ సరాసరి 3,85,000km.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు