Biology | పెరుగుదలకు మూలం.. దేహ భాగాల జన్మస్థానం
పుష్పించే మొక్కల భాగాలు
ఆవృత బీజ మొక్కలు లేదా వృక్షాల దేహంలో రెండు ప్రధాన వ్యవస్థలు ఉంటాయి. అవి వేరు వ్యవస్థ, కాండం. వృక్షం పెరుగుదల, దేహ నిర్మాణానికి మూల స్తంభాలుగా ఈ రెండు వ్యవస్థలు ఉంటాయి. వీటి నుంచే మిగతా భాగాలు ఉద్భవించి మొక్క నేలపై ఆధారాన్ని ఏర్పరుచుకోవడానికి వీలవుతుంది. మొక్కల్లోని
వేరు వ్యవస్థ, కాండం నిర్మాణం, విధులను పరిశీలిద్దాం.
వేరు వ్యవస్థ
- పిండంలోని ప్రథమ మూలం నుంచి వేరు ఉద్భవిస్తుంది.
- ద్విదళ బీజ మొక్కల్లో (ఉదా: చింత, మామిడి) ప్రథమ మూలం తల్లి వేరుగా అభివృద్ధి చెందుతుంది. దాని నుంచి పార్శ (పక్క) వేర్లు ఏర్పడతాయి. వీటి కొన భాగాల్లో వేరు తొడుగు లేదా కాలిప్ట్రా ఉంటుంది.
- పార్శ వేర్ల మీద పిల్ల వేర్లు, మూలకేశాలు ఏర్పడతాయి.
- మూలకేశాలు నీటి శోషణలో తోడ్పడతాయి.
- ఏక దళ బీజ మొక్కల్లో (ఉదా: గడ్డి జాతి మొక్కలు) ప్రథమ మూలం కొంతకాలం తర్వాత నశిస్తుంది. ఆ తర్వాత ఆ భాగంలో ఒకే పొడవులో ఉండే పీచు వేళ్లు ఏర్పడతాయి. దీన్ని అబ్బురపు వేరు వ్యవస్థ అంటారు.
వేరు విధులు - మొక్కను భూమిలో పాతుకునేలా చేసి, స్థిరత్వాన్ని కల్పిస్తుంది.
- నేల నుంచి నీటిని, ఖనిజ లవణాలను శోషిస్తుంది.
- శోషించిన నీటిని, ఖనిజ లవణాలను అన్ని కాండ భాగాలకు సరఫరా చేస్తుంది.
వేరు రూపాంతరాలు - కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వర్తించడానికి వేరే వివిధ రూపాలను పొందుతుంది.
- స్వయం పోషక మొక్కలు తాము తయారు చేసుకున్న ఆహారంలో కొంత మొత్తాన్ని రాబోయే అవసరాలకు నిల్వ చేసుకుంటాయి.
- ఈ ఆహారం వేర్లలో నిల్వ ఉండటం వల్ల అవి ఉబ్బి, దుంపల లాగా ఏర్పడతాయి. వీటిని నిల్వ చేసే వేర్లు లేదా దుంప వేర్లు అంటారు. ఉదా: ముల్లంగి (రఫానస్ సటైవస్), క్యారెట్ (డాకస్ కరోటా), బీట్ రూట్ (బీటా వల్గారిస్), చిలగడదుంప (ఐపోమియా బటాటస్), డాలియా, ఆస్పరాగస్, మోమార్డిక మొదలైనవి.
- వాండా అనే మొక్కలో వెలామిన్ వేళ్లు ఉంటాయి. వీటిలో ఉండే వెలమిన్ కణజాలం మృత్తికలాగా వర్షపు నీటిని వాతావరణంలోని తేమను పీలుస్తుంది.
- టీనియోఫిల్లమ్, టీనోస్ఫోరా, పోడో స్టెమాన్, ట్రాపా అనే మొక్కల్లో ఉండే వేర్లు పత్రాల వలె కిరణజన్య సంయోగ క్రియ నిర్వహిస్తాయి.
- ఉప్పునీటి బురద ప్రాంతాల్లో పెరిగే (మాంగ్రూవ్) మొక్కలకు, రైజోఫొరా, అవిసీనియా, జస్సియా వంటి నీటిలో తేలియాడే మొక్కల్లో శ్వాస వేర్లు ఉండి ఆక్సిజన్‌ను శోషిస్తాయి.
- కరివేపాకు (మురయా), పున్నాగ (మిల్లింగ్టోనియా) వంటి మొక్కల్లో ప్రత్యుత్పత్తి వేర్లు ఉంటాయి. ఇవి మొగ్గలను ఉత్పత్తి చేస్తాయి. ఈ మొగ్గలు పెరిగి కొత్త మొక్కను ఏర్పరుస్తాయి.
- కొన్ని పరాన్నజీవ మొక్కలు ఇతర మొక్కల (అతిథేయి)పై హాస్టోరియం అనే పరాన్నజీవ వేర్లను ఉత్పత్తి చేసి వాటి ద్వారా ఆహార పదార్థాలను, లవణ జలాన్ని శోషించుకుంటాయి.
ఉదా: కస్క్యుటా, లొరాంథస్ (కాండ పరాన్నజీవ మొక్కలు)ఓరబాంకి, బెలనోఫొరా, స్ట్రైగా (వేరు పరాన్నజీవ మొక్కలు) - ఫిస్టియా, ఐకార్నియా వంటి మొక్కల్లో వేర్లు సంతులన వేర్లుగా మార్పు చెందుతాయి. ఇవి మొక్క అలల తాకిడికి తలకిందులైనప్పుడు తిరిగి యథాస్థితికి రావడానికి సహకరిస్తాయి.
- ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కల బుడిపె వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా ఆవాసం ఉంటుంది. ఇది వాతావరణంలోని అణు నత్రజనిని శోషించి దాన్ని నైట్రేట్లుగా మార్చి మొక్కకు అందిస్తుంది.
ఉదా: వేరుశనగ (అరాఖిస్ హైపోజియా), చిక్కుడు (డాలికస్ లాబ్లాబ్) - మొగలి (పెండానస్), రైజోఫొరా వంటి బురద మొక్కల్లో, మొక్కజొన్న (జియామేజ్), వంటి గ్రామినే జాతి మొక్కల్లో ఊత వేర్లు ఉండి, మొక్కకు యాంత్రిక ఆధారాన్నిస్తాయి.
- మర్రి (ఫైకస్ బెంగాలెన్సిస్) వృక్షాల్లో వాటి కాండాలు విరిగిపోకుండా యాంత్రిక ఆధారాన్నిచ్చే ఊడ వేర్లు ఏర్పడతాయి.
- తమలపాకు (హైపర్ బీటిల్) మొక్కల్లో ఎగబాకే వేర్లు వాటి కణుపుల వద్ద ఏర్పడతాయి.
ప్రకాండ వ్యవస్థ
- ఇది వాయుగతంగా భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా, పిండం ప్రథమ కాండం నుంచి ఏర్పడుతుంది.
- దీనిలో ప్రధానాక్షమైన కాండం ఉంటుంది.
- కాండం నుంచి పత్రాలు, మొగ్గలు, శాఖలు, పుష్పాలు, ఫలాలు వంటి ఉపాంగాలు ఏర్పడతాయి.
కాండం - ఇది నిటారుగా పెరిగే అక్షం.
- కాండం చివరలోని కొన మొగ్గ కాండం నిలువు పెరుగుదలను నియంత్రిస్తుంది.
విధులు - కాండం పత్రాలన్నింటికి సూర్యరశ్మి తగిలేటట్లుగా విస్తరింపజేయడంలో సహాయపడుతుంది.
- వేర్ల ద్వారా వచ్చిన నీటిని, లవణాలను పత్రాలకు అందజేయడం, పత్రాల్లో తయారైన ఆహార పదార్థాలను మొక్కల్లోని ఇతర భాగాలకు అందించడంలో సహాయపడుతుంది.
కాండం రూపాంతరాలు - కాండం కూడా వేర్లలాగానే కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతుంది.
- ఉనికిని బట్టి కాండ రూపాంతరాలు మూడు రకాలు
1. భూగర్భ కాండాలు
2. ఉప వాయుగత కాండాలు
3. వాయుగత కాండాలు
భూగర్భ కాండాలు - ఈ కాండాల్లో కణుపులు, కణుపు మాధ్యమాలు, పొలుసాకులు, గ్రీవపు మొగ్గలు, కొన మొగ్గలు ఉంటాయి.
- కాండాలు పెరిగే తీరు, వాటిలో ఆహారం నిల్వ ఉండే మొక్క భాగాల ఆధారంగా నాలుగు రకాలు.
కొమ్ము: మృత్తికలో ఒక నిర్ణీతమైన లోతులో భూమికి సమాంతరంగా పెరిగే, ఉబ్బిఉన్న భూగర్భ కాండం కొమ్ము. గడ్డి జాతుల్లో కొమ్ము ఆహారాన్ని నిల్వ చేయదు.
ఉదా: అల్లం (జింజిబర్), పసుపు (కర్క్యుమా), అరటి (మ్యూసా), మెట్ట తామర (కెన్నా ఇండికా)
కందం: ఇది నిర్ణీత లోతులో నిలువుగా పెరిగే, ఉబ్బి ఉన్న కాండం. వీటిపై సంకోచ వేళ్లు ఏర్పడి ఉంటాయి.
ఉదా: కంద (అమార్ఫో ఫాలస్), చామ (కొలకేషియా)
దుంప కాండం: భూగర్భ శాఖల కొనల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉండటం వల్ల అవి ఉబ్బి, గుండ్రంగా దుంపలాగా ఏర్పడతాయి. వీటిని దుంప కాండాలు అంటారు. బంగాళదుంప కాండంపై సర్పిలాకార కణుపులుంటాయి. ఈ కణుపుల్లో గ్రీవపు మొగ్గలుంటాయి. ఈ కణుపులు శాఖీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి.
ఉదా: బంగాళదుంప (సొలానమ్ ట్యూబరోసమ్)
జరూసలెమ్ ఆర్టిచోక్ (హీలియాంథస్ ట్యూరోసస్)
చైనీస్ ఆర్టికోచ్ (స్టాఖిస్ ట్యూబిఫెరా)
లశునం: ఇది నిలువుగా పెరిగే భూగర్భకాండం. దీనిలో కాండం క్షీణించి ఉంటుంది. ఈ క్షీణించిన కాండం పై భాగంలో అనేక పత్ర పీఠాలు రసభరితంగా, వలయాలుగా అమరి ఉంటాయి. వీటి గ్రీవాల్లో గ్రీవపు మొగ్గలుండి, పిల్ల లశునాలను ఏర్పరుస్తాయి. పిల్ల లశునాలు శాఖీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడుతాయి. లశునంలో ఉండే పొలుసాకుల అమరికను బట్టి కంచుకం కలిగిన లశునాన్ని కంచుకిత లశునం అంటారు. కంచుకం లేని లశునాలను కంచుక రహిత లశునాలంటారు. ఇవి వలయాలుగా కాకుండా విడివిడిగా ఉంటాయి. వీటిని క్లోవ్లు అంటారు.
ఉదా: వెల్లుల్లి (ఏలియమ్ సటైవం)
ఉపవాయుగత కాండాలు - ఇవి కొంతభాగం వాయుగతంగా, కొంతభాగం భూగర్భంగా పెరిగే కాండాలు.
- ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి.
రన్నర్లు: ఇవి నేలపై సాగిలపడి అన్ని వైపులకు పెరుగుతాయి.
ఉదా: సరస్వతి ఆకు (హైడ్రో కొటైల్), ఆగ్జాలిస్ (పులి చింత)
స్టోలన్లు: కొన్ని బలహీనమైన శాఖలు వంగి మృత్తికను తాకుతాయి. మృత్తికను తాకిన శాఖల కణుపులు, కణుపు మాధ్యమాల నుంచి అబ్బురపు వేళ్లు పెరుగుతాయి. ఇటువంటి శాఖలనే స్టోలన్లు అంటారు. ఇవి వేరయినప్పుడు స్వతంత్ర మొక్కగా జీవించగలవు.
ఉదా: ఎర్రగన్నేరు (నీరియం), మల్లె (జాస్మినమ్)
పిలక మొక్కలు: ఇవి భూగర్భ శాఖలపై ఏర్పడి, వాయుగతంగా పెరుగుతాయి.
ఉదా: చామంతి (క్రైసాంథిమమ్), పుదీనా (మెంతా)
ఆఫ్సెట్లు: స్వేచ్ఛగా తేలియాడే నీటి మొక్కల్లో కాండం క్షీణించి చిన్న దిమ్మెలాగా ఏర్పడుతుంది. దీన్ని ఆఫ్సెట్ అంటారు. దీని పైన పత్రాల గుంపు, కింద అబ్బురపు వేర్లు ఏర్పడతాయి.
ఉదా: అంతర తామర (ఫిస్టియా), బుడగ తామర (ఐకార్నియా), కిత్తనార (అగేవ్)
వాయుగత కాండాలు - మొక్కలోని వాయుగత కాండాలు, శాఖీయ, పూ మొగ్గలు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతాయి.
- ఇవి ఆరు రకాలు.
నులితీగలు: ఇవి బలహీన కాండం గల మొక్కల్లో ఎగబాకడానికి తోడ్పడతాయి. నులి తీగలు గ్రీవపు మొగ్గల నుంచి కాని, కొన మొగ్గ నుంచి గాని ఏర్పడతాయి.
ఉదా: జూకామల్లి (పాసిఫ్లోరా), ద్రాక్ష (వైటిస్), నల్లేరు (సిస్సస్)
ముళ్లు: ఇవి రక్షణ కోసం ఏర్పడ్డ మొనదేలిన నిర్మాణాలు. శాఖీయాభివృద్ధిని నిరోధించి, బాష్పోత్సేక ప్రమాణాన్ని తగ్గిస్తాయి.
ఉదా: బోగన్‌విల్లియా, డ్యురాంట, ప్యూనికా (దానిమ్మ)
కొక్కేలు : ఇవి కూడా ఎగబాకడానికి తోడ్పడే దృఢమైన, వంపు తిరిగిన, స్పర్శ జ్ఞానం కలిగిన నిర్మాణాలు. ఇవి కూడా గ్రీవపు మొగ్గ లేదా కొనమొగ్గల నుంచి ఏర్పడతాయి.
ఉదా: హ్యూగోనియా, ఆర్టాబోట్రిస్ (తీగ సంపెంగ)
పత్రాభ కాండాలు: నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో, ఎడారి ప్రాంత మొక్కల్లో బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి పత్రాలు క్షీణించి ఉంటాయి. ఇటువంటి మొక్కల్లో కాండం లేదా శాఖలు ఆకుపచ్చని పత్రాల వలె మార్పు చెంది కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి.
ఉదా: ఒపెన్షియా(బ్రహ్మజెముడు), సరుగుడు (కాజురైనా)
దుంప వంటి కాండాలు: వాయుగత కాండాల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉండటం వల్ల అవి రసభరితమై ఉబ్బి ఉంటాయి.
ఉదా: చెరుకు (శాఖారమ్)లో ఆహార పదార్థం చక్కెర రూపంలో నిల్వ ఉండటం వల్ల అవి రసభరితమై ఉబ్బి ఉంటాయి
నూల్‌కోల్ (బ్రాసికా) పోషక పదార్థాలను నిల్వ చేసి లశునంగా ఉంటుంది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు