నీ ఇల్లు స్మార్ట్‌గానూ!
- ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’తో అద్భుతం..
- అందుబాటులోకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
ఉదయం లేవగానే కిటికీలకున్న కర్టెన్లు వాటికవే తెరుచుకొని.. మీకు ‘గుడ్ మార్నింగ్’ చెబితే! సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేసరికే ఇల్లంతా శుభ్రంగా తుడిచేసి ఉంటే! అర్ధరాత్రి వేళ లైట్లు వేసేందుకు స్విచ్‌బోర్డు కోసం వెతకాల్సిన అవసరం లేకుంటే! నిజంగా ఇది అద్భుతమే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన మహత్యమే. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనుషులూ స్మార్ట్‌గా తయారవుతున్నారు. వారికి మరింత స్మార్ట్‌గా సేవలందించేందుకు అనేక ఆధునిక ఉత్పత్తులు ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నిటినీ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవడం. కావాల్సినప్పుడల్లా కాళ్లు కదపకుండానే వాటితో పనిచేయించుకోవడం. ఒకప్పుడు కుర్చీలో కూర్చొనే, రిమోట్ సాయంతో టీవీ చానెళ్లు మార్చి సంబురపడ్డాం. కానీ, ఇప్పుడు ఇంట్లో లేకున్నా, ఇంట్లోని రకరకాల ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్లను స్మార్ట్‌ఫోన్ యాప్‌ద్వారా నియంత్రిస్తున్నాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)తో అలాంటి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
అంతా అదే
సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. అన్ని రంగాలతోనూ మమేకమై.. అది లేకపోతే రోజు గడవని పరిస్థితిని తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుత ప్రపంచమంతా ‘స్మార్ట్’ జపమే చేస్తున్నది. స్మార్ట్ డోర్ బెల్స్, స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్లు, స్మార్ట్ కర్టెన్లు, స్మార్ట్ ఏసీ, స్మార్ట్ బల్బులు.. ఇలా ఇంట్లో నిత్యావసర వస్తువులన్నీ స్మార్ట్‌గా తయారవుతున్నాయి. ఒక్కొక్కటిగా వచ్చి ఇండ్లలో కొలువుదీరుతున్నాయి. వీటన్నిటికీ తోడుగా ఐటీ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్ సంస్థలు అలెక్సా, గూగుల్ హోం లాంటివి తీసుకువచ్చి, స్మార్ట్ హోంకు సరికొత్త ఫీచర్లను జోడించాయి.
లగ్జరీ ప్రాజెక్టుల్లో..
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం పరిధిలో చేపడుతున్న లగ్జరీ ప్రాజెక్టుల్లో భారీ నిర్మాణ విలువలే కాదు, స్మార్ట్‌హోం ఫీచర్లకూ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. విల్లా ప్రాజెక్టుల్లో ఇండ్లను కొనుగోలు చేసేవారు, హైరైజ్ అపార్టుమెంట్లలో ఫ్లాట్లను కొంటున్నవారు కూడా తమ ఇంటిని స్మార్ట్ హోంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం తమ అభిరుచి, అవసరాలకు అనుగుణంగా ఉండే స్మార్ట్ ఉత్పత్తులపై ముందుగానే అధ్యయనం చేసి, అందుకు సంబంధించిన ఉపకరణాలను సిద్ధం చేసుకుంటున్నారు. తాము ఎలాంటి ఫీచర్లను కోరుకుంటున్నారో బిల్డర్లతో మాట్లాడి, తమ ఇంటిని ‘స్మార్ట్‌హోం’గా తీర్చిదిద్దుకుంటున్నారు.
మధ్యతరగతిలోనూ..
ఒకప్పుడు స్మార్ట్ గృహాలంటే కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితం. విదేశాల్లో తయారయ్యే అధునాతన వస్తువులు అధిక ధర పలుకడమే ఇందుకు కారణం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మధ్యతరగతి ప్రజల్లోనూ ‘స్మార్ట్‌హోం’పై ఆసక్తి పెరుగుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా ఇండ్లను కొనుగోలు చేస్తున్న వారిలో 50 నుంచి 60 శాతం మంది మధ్యతరగతికి చెందినవారే. వీరిలో అత్యధిక శాతం ఇంటీరియర్ డిజైన్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్మార్ట్‌హోం ఫీచర్లకూ ఇస్తున్నారు. ఒక్కసారి ఖర్చు చేస్తే కొన్నేండ్లపాటు స్మార్ట్ ఫీచర్లను పొందవచ్చని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ చేరువయ్యాయి. వీటితో పనిచేసే స్మార్ట్ ఉత్పత్తుల వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతున్నది. ఈ క్రమంలోనే అనేక సంస్థలు తక్కువ ధరల్లోనే స్మార్ట్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అందుకు ప్రత్యేక ఉదాహరణ స్మార్ట్ బల్బులు. కొంతమేర బడ్జెట్ వెచ్చిస్తే ఎల్ఈడీ బల్బుల స్థానంలో స్మార్ట్ బల్బులను సొంతం చేసుకోవచ్చు. చైనాకు చెందిన షామీ సంస్థ తక్కువ ధరల్లోనే స్మార్ట్ బల్బులను తయారు చేస్తున్నది. ఇ-లైట్ పేరుతో మన దేశ మార్కెట్లో విక్రయిస్తున్నది. ఇవి ఇంట్లోని వైఫై నెట్వర్క్ని వాడుకొని పనిచేస్తాయి. వీటిని ఆపరేట్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. నిర్ణీత సమయానికి ఈ బల్బులు వెలిగేలా షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫోన్‌తోనే కాకుండా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తోనూ వీటిని ఆపరేట్ చేయవచ్చు.
అన్నీ ఇన్నీ కావు..
ప్రస్తుతం ఇంటికి అవసరమైన అనేక స్మార్ట్ వస్తువులు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంట్లో ఫ్యాను మొదలు వాక్యూమ్ క్లీనర్, కర్టెన్లు, ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్.. ఇలా ఏ పరికరమైనా స్మార్ట్ సాయంతోనే పని చేస్తుంది. ఆఫీస్‌లో ఉండగానే ఇంటిని అద్దంలా శుభ్రం చేసి పెట్టే స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రిమోట్ లేదా స్మార్ట్‌ఫోన్‌తో తెరుచుకునే కిటికీ కర్టెన్లూ తయారవుతున్నాయి. బల్బులు, ఫ్యాన్లను ఆన్/ఆఫ్ చేయడానికి స్విచ్ బోర్డు దగ్గరిదాకా వెళ్లాల్సిన పనిలేకుండా, ఫోన్ సాయంతోనే నియంత్రించే స్మార్ట్ స్విచ్‌బోర్డులు వచ్చేశాయి.
బడ్జెట్లోనే స్మార్ట్‌హోమ్
అత్యాధునిక సాంకేతికతతో ఇంట్లోని పలు రకాల వస్తువులను పని చేయించడమే స్మార్ట్‌హోమ్. ప్రస్తుతమున్న టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోనే స్మార్ట్ ఉత్పత్తులను ఏర్పాటు చేసుకోవచ్చు. రూ.50 వేలు వెచ్చిస్తే చాలు 2బీహెచ్‌కే ఇంట్లోని ఫ్యాన్లు, బల్బులు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్.. ఇలా అన్నిటినీ ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచే పనిచేయించొచ్చు. ఇంటి వైశాల్యాన్నిబట్టి అందులో ఏర్పాటు చేసుకునే ఉత్పత్తులను బట్టి వ్యయం అవుతుంది. మొత్తంగా చూస్తే రూ.50వేల నుంచి రూ.2లక్షలలోపే ఇంటిని స్మార్ట్‌హోమ్‌గా మార్చుకోవచ్చు. ‘పర్ట్ ఇన్ఫో కన్సల్టింగ్ సంస్థ’ ద్వారా స్మార్ట్హోమ్కు సంబంధించిన అనేక ఉత్పత్తులకు రూపకల్పన చేస్తున్నాం. ప్రధానంగా స్మార్ట్ స్లగ్, ఐఆర్ బ్లాస్టర్, ఆర్బీజీ లైటింగ్, కర్టెన్స్, మోషన్ సెన్సర్స్, డోర్ లాకర్స్ వంటివి తయారు చేస్తున్నాం.
– అరుణ్ చీల, సీఈఓ, పర్ట్ ఇన్ఫో కన్సల్టింగ్
ఎన్నో ప్రయోజనాలు
ఇండ్లలో స్మార్ట్ హోమ్ ఫీచర్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌తోనే ఇంట్లోని ఉపకరణాలను పని చేయించవచ్చు. ముఖ్యంగా విద్యుత్‌ను ఎక్కువగా ఆదా చేయవచ్చు. డోర్ లాకర్స్‌ను ఏర్పాటు చేసుకుంటే తాళం చెవులతో పని ఉండదు. స్మార్ట్ ఫోన్‌లోంచే కోడ్ద్వారా తలుపుల లాక్ తెరవడం/మూసివేయడం చేయవచ్చు. ఒకప్పుడు స్మార్ట్ హోమ్ కోసం లక్షల్లో వెచ్చించాల్సి వచ్చేది. ఉపకరణాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం. ప్రస్తుతం మన నగరంలోనే స్మార్ట్ హోమ్‌కు అవసరమైన రకరకాల ఉత్పత్తులు తయారు చేసి, మార్కెటింగ్ చేసే కంపెనీలు ఉన్నాయి. కొనుగోలుదారులు ఇంటీరియర్ డిజైన్‌కు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో, స్మార్ట్హోమ్కూ అంతే ప్రాధాన్యమిస్తున్నారు.
– జి. రామిరెడ్డి, చైర్మన్, క్రెడాయ్ తెలంగాణ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు