Sepoy rebellion | సిపాయిల తిరుగుబాటు
ఆర్థిక కారణాలు
– ప్రజల్లో బ్రిటిష్ పరిపాలనపై కలిగిన వ్యతిరేకతకు ప్రధాన కారణం వారు అనుసరించిన ఆర్థిక దోపిడీ విధానం. బ్రిటిష్‌వారు తమ దేశ ఆర్థిక పరిస్థితులను పెంపొందించుకోవడానికి హిందూ దేశ సహజ సంపదను కొల్లగొట్టడం ప్రారంభించారు. భారతదేశం నుంచి ముడి సరుకులను తమ దేశానికి చేరవేశారు. దీంతో స్వదేశీ పరిశ్రమలు మరుగునపడ్డాయి. మనదేశంలో తయారైన పట్టు, నూలు వస్ర్తాలు విదేశాలకు ఎగుమతికి కానివ్వకుండా, వాటిపై సుంకాలను విధించారు. పేదరికం ప్రబలి దేశం కరువు కాటకాలకు నిలయమైంది. సామాన్య ప్రజలు వేరే మార్గం లేక తమ పరిస్థితులను మెరుగుపర్చుకొనే ఉద్దేశంతో తిరుగుబాటులో చేతులు కలిపారు. స్థానిక సంస్థానాలను బ్రిటిష్‌వారు ఆక్రమించడం అనేక అనర్థాలకు దారితీసింది. రాజులు తమ అధికారాన్ని పోగొట్టుకున్నారు. వారి సైన్యాలు రద్దయ్యాయి. సైనికులు జీవనాధారం కోల్పోయారు. బ్రిటిష్‌వారు మాత్రం ఉన్నత పదవుల్లో నియమితమయ్యారు. విద్యావంతులైన భారతీయులు కూడా మంచి ఉద్యోగాలకు, ఉన్నత వేతనాలకు అర్హులుగా భావించలేదు. ఉన్నత పదవులకు భారతీయులు అనర్హులని బహిరంగంగా చాటిచెప్పారు. బ్రిటిష్‌వారి ఆర్థిక విధానం, భారతీయ రైతాంగాన్ని, చేతి పనివారిని, స్థానిక ప్రభువులను అందరినీ కుంగదీసింది. తిరుగుబాటు సమయంలో అన్ని తరగతులవారు కలిసి బ్రిటిష్‌వారిపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నించారు.
సైనిక కారణాలు
– లార్డ్ అక్లాండ్ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పటి నుంచి బ్రిటిష్ సైన్యంలో క్రమశిక్షణ తగ్గుముఖం పట్టింది. డల్హౌసీ ఈ విషయాన్ని మాతృదేశ అధికారులకు తెలియజేస్తూ పెద్ద అధికారుల నుంచి చిన్న సైనికుల వరకు సైన్యంలో క్రమశిక్షణ మిక్కిలి శోచనీయంగా తయారైంది అని రాశాడు. హిందూ దేశంలోని బ్రిటిష్ సైన్యాన్ని సోల్జర్స్అని, దేశీయ సైనికులను సిపాయిలని పిలిచేవారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవ్యాప్తికి సిపాయిలు ఎంతో సహాయపడ్డారు. ఇండియా ఖర్చుతోనే ఇండియన్ సైన్యం ఇండియాను ఇంగ్లిష్‌వారి బానిసత్వంలో అణచి ఉంచుతుందన్న 1853లో మార్క్స్ ప్రకటన వీరి ప్రాముఖ్యతను స్పష్టపరుస్తున్నది. 1856 నాటి కంపెనీ సైన్యంలో 2,32,234 మంది ఉండగా, వీరిలో బ్రిటిష్ సైనికులు 45 వేలమంది మాత్రమే. జీతభత్యాలు, పదోన్నతి ఉద్యోగ నియమాకాల్లో భారతీయులకు ఏమాత్రం ప్రాధాన్యం ఉండేది కాదు. వీరి పట్ల వ్యత్యాసం, పక్షపాత దృష్టి చూపించేవారు. సుబేదార్ హోదాకు మించి భారతీయులను నియమించేవారు కాదు. కింది అధికారి నుంచి పైస్థాయి అధికారి వరకు అందరూ తమను తక్కువగా చూడటం వల్ల ఆత్మాభిమానంతో గాయపడిన సిపాయిల అసంతృప్తి క్రమక్రమంగా పెరిగి బ్రిటిష్‌వారిపై కక్షగా రూపుదిద్దుకుంది.
తక్షణ కారణం
– క్రీ.శ. 1857లో జరిగిన తిరుగుబాటుకు తక్షణ కారణం కొవ్వు పూసిన తూటాలు. 1856లో గవర్నర్ జనరల్ లార్డ్‌కానింగ్ కొత్త రకమైన ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించడంలో చివరి భాగాన్ని నోటితో కొరికి తుపాకిలో పెట్టాల్సి వచ్చేది. ఈ తూటాలపై ఆవు, పంది కొవ్వు పూశారనే వదంతి వ్యాపించింది. ఇది హిందువులను, ముస్లింలను తీవ్రంగా బాధకు గురిచేసింది. సిపాయిల్లో అసంతృప్తి జ్వాల భగ్గుమన్నది. ఇది తమ మతంపై జరిగిన దాడిగా భావించారు. కొవ్వు పూసిన తూటాలు తిరుగుబాటు అగ్నిజ్వాలకు ఆజ్యంపోసి తక్షణ కారణమయ్యాయి. 1857 మార్చి 29న బారక్పూర్ శిబిరంలో 34వ పటాలానికి చెందిన మంగల్‌పాండే అనే సిపాయి కొవ్వు తూటాలను ఉపయోగించడానికి నిరాకరించి తన పై అధికారిని కాల్చిచంపాడు. దీంతో తిరుగుబాటు ఆరంభమైంది. బ్రిటిష్‌వారు మంగల్‌పాండేను పట్టుకొని ఏప్రిల్ 8న ఉరితీశారు. వాస్తవంగా ఈ తిరుగుబాటు 1857 మే 10న మీరట్‌లో ప్రారంభమైంది. మీరట్‌లోని 3 రెజిమెంట్లు తిరుగుబాటు చేసి ఖైదీలను విడిపించారు.
తిరుగుబాటు గమనం
– మీరట్ విప్లవకారులు ఢిల్లీలో ప్రవేశించి అక్కడి సిపాయిలతో చేతులు కలిపి అనేకమంది అధికారులను వధించి ఢిల్లీ నగరాన్ని స్వాధీన పర్చుకొని రెండో బహదూర్‌షాను చక్రవర్తిగా ప్రకటించారు. ఢిల్లీని విప్లవకారులు ఆక్రమించడం బ్రిటిష్‌వారి అధికార ప్రతిష్టకు తీవ్ర లోపంగా పరిణమించింది. భారతీయ సిపాయిలు మే 14న ముజఫర్‌నగర్‌లో, 18న ఫిరోజ్షాపూర్లో, మే 20న అలీఘర్, మే 30న హజల్, మధుర, లక్నోల్లో, జూన్ 3న బరేలీ షాజహాన్‌పూర్‌లలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. కాని పంజాబ్‌లోని సిక్కులు, నేపాల్‌లోని గూర్ఖాలు తిరుగుబాటులో చేరలేదు. హైదరాబాద్‌లో ఒకటి, రెండు ఘటనలు తప్ప శాంతియుత పరిస్థితులే నెలకొని ఉన్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణంగా బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు లేవు.
తిరుగుబాటు విఫలం – కారణాలు
– 1857 తిరుగుబాటు నాటికి సిపాయిలు ఆంగ్లేయాధికారుల కింద చక్కని తర్ఫీదు పొంది ఆధునిక పద్ధతిలో యుద్ధం చేయడం నేర్చుకున్నారు. అప్పటికే సిపాయిల సంఖ్యాబలం కూడా ఎక్కువే. కొన్ని ప్రాంతాల్లో సామాన్య ప్రజలు కూడా తిరుగుబాటులో చేరారు. స్వదేశీయులకు అన్ని విధాల అనుకూలంగా కనిపించినా చివరికి ఈ తిరుగుబాటు విఫలం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తిరుగుబాటు అనేక ప్రాంతాల్లో ఒకేమారు జరిపినప్పటికీ అందరిని ఒక పద్ధతిలో నడపడానికి తగిన వ్యూహరచన చేయడానికి సమర్థుడైన నాయకుడు తిరుగుబాటుదారులకు లేడు. ఎవరికి తోచినవిధంగా వారు యుద్ధాలు చేశారు. ఆంగ్లేయుల సైన్యం ఇందుకు భిన్నంగా ఒకే నాయకత్వంలో ఒకే అధికారి కింద నడిచి సమయానుకూలంగా వ్యూహరచన చేస్తూ ఏవిధంగానైన దేశీయులను అణచివేయాలనే పట్టుదలతో వ్యవహరించింది. పైగా ఇంగ్లండ్ నుంచి సహాయం లభించింది. దీంతో తిరుగుబాటును అణచివేయడం వారికి సాధ్యమైంది. దీనికితోడు పాటియాలా, సింధ్, గ్వాలియర్, జైపూర్, ఉదయ్‌పూర్, ఇందూరు, హైదరాబాద్ మొదలైన స్వదేశీ రాజులు బ్రిటిష్‌వారికి సహాయసహకారాలు అందించడంతో వారు విజయాన్ని సాధించగలిగారు. తిరుగుబాటుదార్లకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అందలేదు. బ్రిటిష్‌వారి ఆధీనంలో తంతితపాలా, రైలు సౌకర్యాలు తిరుగుబాటుని అణచడానికి తోడ్పడ్డాయి. తిరుగుబాటుదార్ల గమనంలో పరస్పర సమన్వయం లోపించింది. వారు ధైర్య సాహసాలు ప్రదర్శించి పోరాడినప్పటికి సైనిక పాటవంతో సుశిక్షుతులైన బ్రిటిష్ సేనా నాయకులకు సమ ఉజ్జీలుగా నిలువలేకపోయారు.
తిరుగుబాటు ప్రధాన కేంద్రాలు
– ఢిల్లీ : ఢిల్లీలో తిరుగుబాటుకి నామమాత్రపు నాయకత్వం బహదూర్షా చక్రవర్తి వహించాడు. అసలు నాయకత్వం జనరల్ భక్తఖాన్ అనే సేనాని ఆధ్వర్యంలో ఏర్పాటయిన ఒక సైనిక మండలి చేతుల్లో ఉంది. ఢిల్లీని 1857 సెప్టెంబర్ 20న నికల్సన్ తిరిగి ఆక్రమించుకున్నాడు. అయితే ఢిల్లీని ఆక్రమించుకున్నప్పటికీ నికల్సన్ గాయపడి మరణించాడు. ఢిల్లీని వశపరుచుకున్న బ్రిటిష్‌వారు రెండో బహదూర్‌షాను బందీగా చేసి విచారణ జరిపి ఖైదీగా రంగూన్‌కు పంపించారు. అతని ఇద్దరు కుమారులు, మనుమళ్లను అతని కళ్ల్లెదుటే కాల్చిచంపారు. బహదూర్షా రంగూన్ జైళ్లోనే బందీగా 1862లో మరణించాడు. మొఘల్ సామ్రాజ్యం ఈ విధంగా అంతమొందింది. వేలాది సిపాయిలు, ప్రజలు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు.
– కాన్పూర్ : నానాసాహెబ్ (దొండెపంథ్) తిరుగుబాటుదారుల్లో ప్రముఖుడు. ఈయన పీష్వా బాజీరావు-2 దత్తపుత్రుడు. మార్కోస్ ఆఫ్ హౌస్టింగ్స్ మూడో మరాఠా యుద్ధంలో మరాఠాలను ఓడించి పీష్వాను మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బిధారికి పంపించి పెన్షన్ ఇచ్చారు. అయితే ఇతని మరణానంతరం అతని దత్తపుత్రుడైన నానాసాహెబ్‌కు బ్రిటిష్‌వారు దత్తతను నిరాకరించి భరణాన్ని రద్దు చేశారు. అందువల్ల తిరుగుబాటు కాలంలో అతడు పీష్వా బిరుదులను ధరించి కాన్పూర్ సైనిక స్థావరాలను ముట్టడించి 1857 జూన్ 27న కాన్పూర్ను స్వాధీనపర్చుకున్నాడు. ఇతని విశ్వాసపాత్రులైన నాయకులు తాంతియాతోపే, అజీముల్లాఖాన్లు తిరుగుబాటులో పాల్గొన్నారు. నానాసాహెబ్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన తాంతియాతోపే (రామచంద్ర పాండురంగ) నాయకత్వంలో తిరుగుబాటుదారులు కాన్పూర్ను ఆక్రమించుకున్నారు. కానీ కాలన్ క్యాంబెల్ నాయకత్వంలో బ్రిటిష్‌సైన్యం తిరుగుబాటుదారులను తరిమివేసి కాన్పూర్ను పునర్ ఆక్రమించుకుంది.
– ఝాన్సీ : తిరుగుబాటుదారుల్లో గణనీయమైన శౌర్య, ధైర్యాలతో పోరాడి స్త్రీ అబల కాదు సబల అని నిరూపించిన వీరమాత ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె మహారాష్ట్ర వీరుడైన తాంతియాతోపేతో కలిసి బ్రిటిష్‌వారిని గడగడలాడించింది. లక్ష్మీబాయి పురుషవేషంతో ఆయుధాలు ధరించి తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించి బ్రిటిష్‌వారితో యుద్ధం చేసింది. 1858 మార్చిలో సర్హ్యూరస్ సేనాని ఝాన్సీ దుర్గాన్ని ఆక్రమించగా, తన దత్త కుమారుడితో కోట నుంచి బయటపడి ఝాన్సీ లక్ష్మీబాయి తాంతియాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి బ్రిటిష్‌వారితో యుద్ధాన్ని కొనసాగించింది. కానీ 1858 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది. తాంతియాతోపే పోరాటంలో ఓడిపోయి సింధియ దగ్గర ఆశ్రయం పొందగా, మాన్సింగ్ అనే నమ్మకద్రోహి అతన్ని ఇంగ్లిష్‌వారికి అప్పగించాడు. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలు, యుద్ధ నైపుణ్యాన్ని పొగుడుతూ బ్రిటిష్ సేనాధిపతి హ్యూరోస్ ఆమెను భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని శ్లాఘించాడు.
– లక్నో : ఇక్కడ జరిగిన తిరుగుబాటుకు అవధ్బేగం హజ్రత్‌మహల్ నాయకత్వం వహించింది. తన చిన్న కుమారుడు బెర్జిస్ఖాన్ను అవధ్‌కు నవాబుగా ప్రకటించింది. లక్నో సిపాయిల సహకారంతో అయోధ్య జమీందార్లు, రైతాంగం మద్దతుతో బేగం బ్రిటిష్వాళ్లని నలువైపులా ముట్టడించింది. బ్రిటిష్‌వారు తక్కువమంది అయినా వారి కున్న అధునాతన ఆయుధాల మూలంగా తిరుగుబాటుదారులను తిప్పికొట్టారు.
– బీహార్ : ఇక్కడ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జగదీష్పూర్ జమీందార్ కున్వర్సింగ్ తిరుగుబాటు చేశాడు. ఇతను నానాసాహెబ్ సైన్యంతో కలిసి అయోధ్యలో మధ్యభారత్‌లో తిరుగుబాట్లలో పాల్గొన్నాడు. మళ్లీ తిరిగి స్వరాష్ట్రం చేరుకొని ఆరా ఆనే బ్రిటిష్ సేనల్ని ఓడించాడు. యుద్ధంలో తీవ్రంగా గాయపడి చివరి 1858 ఏప్రిల్ 27న జగదీష్పూర్లో కన్నుమూశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?