Rajputs .. war .. their sport | రాజపుత్రులు ..యుద్ధం.. వారికోక్రీడ
భారతదేశ చరిత్రలో రాజపుత్రులది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో హర్షుడి తర్వాత ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు పూనుకొని చిన్నచిన్న రాజ్యాలను స్థాపించిన వివిధ వంశాల రాజపుత్రులు వీరత్వానికి మారుపేరుగా నిలిచారు. నిత్యం యుద్ధాల్లో మునిగితేలుతూనే సాహిత్యం, కళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేశారు.
పరమారులు
-ఈ వంశస్థాపకుడు ఉపేంద్రుడు. ఇతను మొదట మాళ్వాకు పాలకుడైనాడు.
-వీరు మొదట రాష్ట్రకూటులకు సామంతులుగా ఉంటూ క్రీ.శ. 950లో స్వతంత్రులయ్యారు.
-వీరు శాసనాల్లో తాము రాష్ట్రకూట వంశస్థులమని చెప్పుకున్నారు.
-మాళ్వా దేశం ప్రతీహార, రాష్ట్రకూట రాజ్యాల మధ్య ఉండటంతో దీనిపై రాష్ట్రకూట రాజులకు ప్రత్యక్షంగా పరిపాలించడం సాధ్యంకాక వారితో సఖ్యతగా ఉండి ప్రతీహారుల ప్రాబల్యం పెరగకుండా చూశారు.
-వీరు క్రీ.శ. 10వ శతాబ్దం మధ్య భాగంలో అటు రాష్ట్రకూటులు, ఇటు ప్రతీహార రాజ్యాలు పతమైన తర్వాత స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు.
-వీరి రాజధాని దారా నగరం.
-ఈ వంశంలో సుప్రసిద్ధుడు ముంజరాజు. ఇతనికే వాక్పతి రాజు అనే మరోపేరు ఉంది.
-ఇతను కవి, పండిత పోషకుడు.
-ఇతని ఆస్థానంలో నవసాహసాంక చరిత్ర గ్రంథకర్త అయిన పద్మగుప్తుడు, దానరూప రచయిత అయిన ధనంజయుడు ఉండేవారు.
-అంతేకాకుండా హాలాయుధ, ధనిక అనే కవులు కూడా ఇతని ఆస్థానంలో ఉండేవారు.
-ఇతను ముంజేశ్వర తటాకంను నిర్మింపజేశాడు.
భోజరాజు (1008-1060)
-ఇతను పరమారుల్లో గొప్పవాడు.
-ఇతడు సైనికరంగం, సాహిత్యరంగంలోనూ నిష్ణాతుడు.
-ఇతడి సుదీర్ఘమైన పరిపాలనాకాలంలో పరమార రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉండేది.
-1008లో గజినీ మహ్మద్ ఆనందపాలునిపై దండెత్తగా, ఆనందపాలునికి సహాయంగా భోజరాజు తన సైన్యాలను పంపాడు.
-అంతేకాకుండా 1019లో ఇతడు ఆనందపాలుడి కుమారుడైన త్రిలోచనాపాలునికి తన రాజ్యంలో ఆశ్రయం కల్పించాడు.
-ఇతను 1043లో స్వదేశీ రాజుల సమాఖ్యలో చేరి హాన్సి, థానేశ్వర్, నాగర్‌కోట, లాహోర్ కోటలను ఆక్రమించాడు.
-కానీ తర్వాత ఆ కాలంలోని అందరి రాజుల్లాగే ఇతను కూడా పొరుగు రాజ్యాలతో నిరంతరం యుద్ధాలు చేశాడు.
-భోజరాజు స్వయంగా కవి. సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషిచేశాడు. కవిరాజు అనే బిరుదు కలదు.
-ఇతడు రచించిన గ్రంథాలు యుక్తికల్పతరువు, సమరాంగణ సూత్రధారా, ఆయుర్వేద సర్వస్వం, సరస్వతి కంఠాభరణం, తత్వ ప్రకాశ, చంపూరామాయణం.
-మనుధర్మశాస్ర్తానికి వ్యాఖ్యానమైన మితాక్షర అనే గ్రంథాన్ని రచించిన విజ్ఞానేశ్వరుడు భోజరాజు ఆస్థానంలో ఉండేవాడు. ధనపాల, శాంతిసేన, శోభన, ప్రభాచంద్రసూరి కూడా ఇతని ఆస్థానంలోనివారే.
-అంతేకాకుండా భోజరాజు గొప్ప భవన నిర్మాత కూడా.
-ఇతడు భోపాల్‌కు సమీపంలో భోజ్‌పూర్ అనే పట్టణాన్ని నిర్మించి అక్కడ శైవాలయాలను నిర్మింపజేశాడు. భోజ్‌పూర్ సరస్సును కూడా తవ్వించాడు.
-దారా నగరంలో సరస్వతీ దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ భోజశాల అనే సంస్కృత కళాశాలను కూడా స్థాపించాడు.
-భోజుని తర్వాత చాళుక్యుల నిరంతర దాడుల వలన పరమార రాజ్యం బలహీనపడింది. తర్వాతి కాలంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు.
చందేలులు
-బుందేల్‌ఖండ్ ప్రాంతంలో చందేల వంశంవారు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. వీరి రాజధాని ఖజురహో. మొదట ప్రతీహారులకు సామంతులు.
-వీరి మూలపురుషుడు జయశక్తి. అందువల్లనే చందేల రాజ్యాన్ని జజకభక్తి అని కూడా పిలిచేవారు.
-యశోవర్మ క్రీ.శ. 950లో స్వతంత్ర చందేల రాజ్యాన్ని స్థాపించాడు.
-ఇతను కలంజర్ను జయించి రాజ్యాన్ని శక్తిమంతం చేసి మహోబాను రాజధానిగా చేసుకొని పాలించాడు.
-యశోవర్మ తర్వాత అతని కుమారుడు ధంగరాజు రాజ్యానికి వచ్చాడు.
-ఇతడు గొప్ప కళాభిమాని. ఖజురహోలో అనేక దేవాలయాలను నిర్మించాడు.
-ఇవన్నీ కూడా నగ్నశైలిలో నిర్మించినవే.
-ధంగరాజు పాల, ప్రతీహార రాజ్య భూభాగాలను ఆక్రమించి తన రాజ్యాన్ని విస్తరించాడు.
-సబక్తజిన్ (మహ్మద్ గజిని తండ్రి) జయపాలునిపై దాడిచేసినప్పుడు ధంగరాజు జయపాలునికి సహాయం చేశాడు.
-ఇతను 100 ఏండ్లకుపైగా జీవించి, చివరి రోజుల్లో అలహాబాద్‌లో నివసిస్తూ శివధ్యానంలో గడుపుతూ మరణించాడు.
-తర్వాత ఇతని కుమారుడు గండ రాజు రాజ్యానికి వచ్చాడు.
-ఇతడు మహ్మద్ గజినీకి వ్యతిరేకంగా జయపాలుని కుమారుడైన ఆనందపాలునికి సహాయంగా సైన్యాలను పంపాడు.
-ఈ వంశంలో సుప్రసిద్ధుడైన రాజు గండరాజు కుమారుడైన విద్యాధరుడు.
-ఇతని కాలంలో గజినీ మహ్మద్ క్రీ.శ. 1019, 1022లలో రెండుసార్లు చందేల రాజ్యంమీద దండెత్తి విద్యాధరుని చేతిలో ఓడిపోయాడు.
-ఈ విధంగా గజినీ దండయాత్రలను తిప్పికొట్టిన గౌరవం విద్యాధరుడికే దక్కింది.
-ముస్లిం చరిత్రకారులు తమ రచనల్లో విద్యాధరుని గొప్పతనాన్ని వర్ణిస్తూ భారతదేశంలోని పాలకులందరిలో అత్యంత శక్తిమంతుడని, గొప్పసైన్యాన్ని కలిగి ఉన్నాడని వివరించాడు.
-చందేల వంశ పాలకుల్లో స్వతంత్ర రాజకీయాధికారాన్ని చెలాయించిన చివరి రాజు పర్మాల్ రాజు. క్రీ.శ. 1203లో కుతుబుద్దీన్ ఐబక్ పర్మాల్ రాజుని ఓడించి చందేల రాజ్యాన్ని ఆక్రమించాడు.
సోలంకీలు లేదా చాళుక్య వంశం
-గుజరాత్‌లోని అన్హిల్వాడ్ను రాజధానిగా చేసుకొని క్రీ.శ. 945లో మూలరాజు సోలంకి రాజ్యాన్ని స్థాపించాడు.
-సోలంకి అనేది చాళుక్య పదానికి వికృత రూపం అని వీరిది చాళుక్య వంశ శాఖ అని దీన్నే లాట చాళుక్య అని, సోలంకి చాళుక్య అని వ్యవహరించారు.
-ఈ వంశంలో మొదటి భీమరాజు (1022-64) పాలనకాలంలో గజినీ మహ్మద్ గుజరాత్‌పై దండెత్తి సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు.
జయసింహుడు (1094-1143)
-ఇతను మొదటి భీమరాజు మనుమడు.
-ఇతనికాలంలో సోలంకి రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉంది. సింహ సంవత్సరం అనే శకాన్ని జయసింహుడే ప్రారంభించాడు.
-ఇతనికి సిద్దరాజు అనే బిరుదు ఉంది.
-ప్రసిద్ధ జైనమత పండితుడు హేమచంద్రుడు ఇతని మంత్రిగా ఉండేవాడు.
-హేమచంద్రుడు రాసిన గ్రంథాలు ప్రమాణ మీమాంస (ఇది ఒక జైనమత తత్వ గ్రంథం), పరిశిష్ట పర్వన్, త్రిషష్టి శలకపురుష, కుమారపాల చరిత, నేమినాథ చరిత.
-జయసింహుడు చౌహాన్ రాజైన అర్నోర్జాను ఓడించి అతనికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు.
-అంతేకాకుండా 1137లో పరమారుల రాజ్యంపై దండెత్తి కొన్ని ప్రాంతాలను ఆక్రమించి అవంతినాథ్ (లార్డ్ ఆఫ్ మాళ్వా) బిరుదు పొందాడు.
-ఈ విధంగా ఇతని రాజ్యాన్ని విస్తరించాడు.
-ఇతడు శివ భక్తుడు. రుద్రమహాకాల ఆలయాన్ని సిద్దాపురంలో కట్టించాడు.
-ఇదే వంశానికి చెందిన మరో గొప్పరాజు రెండో భీముడు. ఇతడు క్రీ.శ. 1178లో మహ్మద్ ఘోరీని మౌంట్ అబూ యుద్ధంలో ఓడించాడు.
-ఇతని మంత్రులయిన వస్తుపాల, తేజపాలలు మౌంట్ అబూలో జైనాలయాలు నిర్మించారు.
-తర్వాత కాలంలో వీరి రాజ్యం ముస్లిం, యాదవుల దండయాత్రలకు గురైంది. ఇదే సమయంలో సోలంకీల సామంతులు వాఘేల వంశంవారు సింహాసనం ఆక్రమించడంతో వీరి రాజకీయాధికారం పతనమైంది.
ఇదే యుగం నాటి ఇతర రాజవంశాలు
పాల వంశం – బెంగాల్
-గౌడరాజు శశాంకుడు (ఇతడు హర్షుని సమకాలికుడు) మరణించిన తర్వాత బెంగాల్లో ఒక శతాబ్దకాలం పాటు రాజకీయ అస్థిరపరిస్థితులు నెలకొన్నాయి.
-ఈ సమయంలో బెంగాల్ ప్రజలు క్రీ.శ. 750లో గోపాలుడు అనేవాడిని తమ పాలకునిగా ఎన్నుకొన్నారు. ఇతడే పాల రాజ్యస్థాపకుడు.
-అయితే వీరు రాజపుత్రులు కారు. స్థానిక ప్రభువంశస్థులు. వీరు ప్రతీహార, రాష్ట్రకూట వంశస్థులతో పోరాడి దేశ చరిత్రలో బెంగాల్‌కు గౌరవ ప్రాధాన్యాన్ని చేకూర్చారు. వీరి రాజధాని మెహంగీర్.
ధర్మపాల (770-810)
-ఇతడు గోపాలుని కుమారుడు.
-ధర్మపాలుడు పాలవంశంలో ప్రసిద్ధిచెందిన రాజు. ఇతనికాలంలో పాల రాజ్యం బ్రహ్మపుత్రనది నుంచి వారణాసి వరకు విస్తరించింది.
-ప్రతీహారులను ఓడించిన రాష్ట్రకూట రాజు ధ్రువ ఆ తర్వాత ధర్మపాలుడిని కూడా ఓడించాడు. అయితే ధర్మపాలునిపై విజయం తర్వాత ధ్రువ ఆ ప్రాంతాన్ని వదిలి దక్కనుకు తిరిగి వెళ్లిపోయారు.
-దీంతో ధర్మపాలుడు తిరిగి కనోజ్‌ను ఆక్రమించాడు.
-ప్రఖ్యాతిగాంచిన నలంద విశ్వవిద్యాలయాన్ని ధర్మపాల పునరుద్ధరించాడు.
-దీని నిర్వహణకు 200 గ్రామాల ఆదాయాన్ని కేటాయించాడు.
-అంతేకాకుండా దీనికి నమూనాగా ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇది పేరుప్రఖ్యాతుల్లో నలంద తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది.
-మగధలోని గంగానది తీరాన కొండపైన రమణీయ వాతావరణంలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.
-వజ్రాయానం మత శాఖమీద సుమారు రెండువందల గ్రంథాలను రచించి టిబెట్‌లో బౌద్ధమత ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన అతిశదాపాంకరుడు (త్రిలిస అనికూడా అంటారు) ఈ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు.
దేవపాలుడు (810-850)
-ఇతడు ధర్మపాలుని కుమారుడు.
-ఇతడు ప్రాక్జ్యోతికాపురం (అస్సాం), ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి తన రాజ్యాన్ని విస్తరించాడు.
-ఆ తర్వాత క్రీ.శ. 908 నుంచి 1030 వరకు పాలించిన మహిపాలుని కాలంలో తీరభుక్తి, మగధలు కూడా పాలరాజ్యంలో అంతర్భాగమయ్యాయి. కానీ మహిపాలుని కాలం తర్వాత కొంతకాలానికే పాలరాజ్యం క్షీణించింది. పాలలు కాలాచార్యులతో, కళింగ గాంగులతో యుద్ధాలు చేయడం, కాంభోజ, కైవార్త మొదలైన అనాగరిక, ఆటవిక జాతులు దండెత్తడంతో క్రమేణా రాజ్యం క్షీణించింది. ఇదే సమయంలో పాల రాజులకు సామంతులుగా ఉన్న సేనవంశంవారు బెంగాల్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.
-అంతేగాక చివరి పాల రాజు మదనపాలున్ని సేనరాజు విజయసేనుడు ఓడించి బెంగాల్‌ను ఆక్రమించడంతో పాల వంశ పాలన ముగిసింది.
-8వ శతాబ్దం మధ్యభాగం నుంచి 9వ శతాబ్దం మధ్యభాగం వరకు దాదాపు 100 ఏండ్లు పాల రాజులు భారతదేశాన్ని పాలించారు. కొంతకాలం వీరి రాజ్యం వారణాసి వరకు విస్తరించింది.
-9వ శతాబ్దం మధ్య భాగంలో భారత్‌ను సందర్శించిన సులేమాన్ పాల రాజుల పాలన గురించి రాశారు. ఆయన పాల రాజ్యాన్ని రహ్మ రాజ్యంగా పేర్కొన్నాడు. పాల రాజు తన పొరుగు రాజులైన ప్రతీహారులతో రాష్ట్రకూటులతో యుద్ధం చేశాడని, తన శత్రువుల బలగాల కన్నా పాల రాజు బలగాల సంఖ్య ఎక్కువ అని సులేమాన్ పేర్కొన్నాడు. పాల రాజు యుద్ధానికి వెళితే అతడి బలగంలో కనీసం 50,000 ఏనుగులు ఉండేవని, బట్టలు ఉతకడానికి, ఇతర పనులకు 10 నుంచి 15 వేలమంది సేవకులు ఉండేవారని అతడు వివరించాడు. ఈ లెక్కన పాల రాజుల సైన్యం ఎంతపెద్దదో ఊహించుకోవచ్చు.
-అంతేకాకుండా పాల రాజుల గురించిన సమాచారం మనకు టిబెట్ చరిత్ర గ్రంథాల్లో కూడా లభిస్తుంది. అయితే ఇవి 17వ శతాబ్దంలో రాసినవి. వీటి ప్రకారం పాల రాజులు బౌద్దమతానికి, సారస్వతానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని తెలుస్తుంది.
-వీరు టిబెట్‌లో సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉండేవారు. ప్రముఖ బౌద్ద పండితులు సంతదక్షిత, దీపాంకర టిబెట్ ఆహ్వానంపై అక్కడకు వెళ్లి బౌద్దమతాన్ని కొత్తరూపంలో ప్రవేశపెట్టారు.
-దీంతో పలువురు టిబెట్ విద్యార్థులు అధ్యయనం కోసం నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలకు వచ్చేవారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?