Peninsular India | ద్వీపకల్ప భారతదేశం
దక్కన్ పీఠభూమి
ద్వీపకల్ప భారతదేశంలో దక్కన్ పీఠభూమి ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంది. ఇది దేశంలో అతి పురాతన, కదలికలు లేని నైసర్గిక స్వరూపం. పురాతన స్పటిక శిలలతో, రూపాంతర, అగ్ని శిలలతో ఆవరించి ఉన్న ఈ పీఠభూమి ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లలో, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉంది. కఠినమైన శిలలతో ఏర్పడిన ఈ పీఠభూమి త్రిభుజాకారంలో ఉంది. దీనికి తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, ఉత్తరం దిక్కున వింధ్య, సాత్పుర, అజంతా, ఆరావళి పర్వాతాలు సరిహద్దులుగా ఉన్నాయి.
-ఈ పీఠభూమిలో నర్మద, తపతి నదులు, చంబల్, బనాస్ నదులు ప్రవహిస్తున్నాయి.
-వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్న నర్మద, సాత్పురా, తపతి నదులు పశ్చిమవైపు, పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణా, మహానది, కావేరీ నదులు తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి.
-ఈ పీఠభూమి ఎక్కువగా భ్రంశాలకు గురవడం వల్ల పగులు లోయలు (Rift Valleys) ఏర్పడ్డాయి. దక్కన్ పీఠభూమి చిన్న చిన్న ఖండాలుగా ఏర్పడటానికి ఈ భ్రంశాలు కారణం.
పశ్చిమ కనుమలు
-ఈ పీఠభూమి పశ్చిమ అంచున ఎక్కువ వాలు కలిగి ఉండటంతో పశ్చిమ కనుమలు ఏర్పడ్డాయి. ఇవి అరేబియా సముద్ర తీరం వెంబడి ఉత్తర దక్షిణాలుగా తపతి నది నుంచి కన్యాకుమారి అగ్రం వరకు కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో వ్యాపించి ఉన్నాయి.
-ఇవి లావా శిలలు, దక్కన్ ట్రాప్ శిలలతో నిర్మితమై ఉన్నాయి.
-పీఠభూమి వైపు తక్కువ వాలు కలిగి ఉండి, అరేబియా సముద్రం నుంచి చూస్తే ఎత్తయిన పర్వతాలుగా కనిపిస్తాయి. ఈ పర్వత శ్రేణిలోకి తాల్‌ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్ వంటి కొన్ని కనుమల నుంచి మాత్రమే ప్రవేశించవచ్చు. ఈ కనుమల నుంచే రైలు మార్గాలు పశ్చిమతీరం నుంచి లోతట్టు ప్రాంతాలకు ఉన్నాయి.
-ఈ కనుమల్లో పుట్టిన నదులు కొన్ని తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో, మరికొన్ని నదులు ఈ పర్వతాల గుండా అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. పశ్చిమంగా ప్రవహించే నదులు చాలా తక్కువ దూరం వడిగా ప్రవహిస్తుండటంతో వీటి ముఖద్వారం వద్ద ఒండలి వీవనాలు (Alluvial fans) ఏర్పడ్డాయి.
-పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణా, కావేరి, మహానది దక్కన్ పీఠభూమి గుండా తూర్పు వైపు ప్రవహించి తుర్పు కనుమగుండా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటి ముఖద్వారం వద్ద డెల్టాలు ఏర్పడ్డాయి.
-పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో సహ్యాద్రి అని, తమిళనాడులో నీలగిరులు, కేరళలో అన్నామలై, కార్డమమ్ (ఏలకుల) కొండలు అని పిలుస్తున్నారు. ఈ కనుమలు తూర్పు దిక్కున ఎక్కువ ఎత్తు కలిగి ఉంటాయి.
-వీటిలో అన్నాముడై శిఖరం (2,695 మీ.) అతి ఎత్తయినది కాగా, దొడబెట్ట (2,637 మీ.) రెండో ఎత్తయిన శిఖరం.
-ఈ కనుమల్లో ఉన్న ప్రముఖ పర్యాటక కొండ ప్రాంతం ఉదక మండలం.
-ఇవి గూడలూరు వద్ద నీలగిరి పర్వతాలను కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే దొడబెట్ట శిఖరం ఉన్నది.
-పశ్చిమ కనుమల్లో ఉన్న అగ్రశేణి భాగం దక్కన్ పీఠభూమిలో ముఖ్యమైన జలవిభాజిక క్షేత్రం (Water dividing range).
తూర్పు కనుమలు
-దక్కన్ పీఠభూమి తూర్పు సరిహద్దున ఉత్తర దక్షిణాలుగా తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. పురాతన పరిశిష్ట పర్వతాలైన ఇవి పశ్చిమకనుమల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు 750 మీ. అయితే వాలు చాలా తక్కువ.
-ఈ కనుమలు చోటా నాగపూర్ కొండల్లో ఉత్తరంగా, నీలగిరి కొండల్లో దక్షిణాన కలుస్తున్నాయి.
-సముద్ర తీరానికి కొంత దూరంగా ఉండటం వల్ల విశాలమైన తీరమైదానం ఏర్పడింది.
-ఈ కనుమల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల్లో నదులు ప్రవహించి డెల్టాలు ఏర్పడ్డాయి.
-ఇవి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో రెండు భాగాలుగా విస్తరించి ఉన్నాయి.
-ఒడిశాలో వీటిని మహేంద్రగిరులు అని పిలిచేవారు. ఖోండలైట్, చార్న్లైట్ శిలలతో ఏర్పడిన ఈ ఈ శిఖరం ఎత్తు 1,500 మీ. ఈ కొండలు నైరుతి నుంచి ఈశాన్య దిశగా వ్యాపించి ఉన్నాయి.
-ఈ కొండల్లో లాంగుల్యా, సీలేరు, వంశధార, మాచ్‌ఖండ్ నదులు జన్మిస్తున్నాయి. లాంగుల్యా, సీలేరు నదులు పశ్చిమంవైపు, వంశధార, మాచ్‌ఖండ్ నదులు తూర్పు దిశగా ప్రవహిస్తున్నాయి.
-ఈ కనుమలు ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, కడప జిల్లాల్లో తక్కువ ఎత్తులో వ్యాపించి ఉన్నాయి. వీటికి అడ్డంగా ప్రవహిస్తున్న కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉన్న కొండలను నల్లమల కొండలు అంటారు.
-నల్లమల కొండలకు దక్షిణాన పాలకొండలు ఉన్నాయి. షేల్, క్వార్ట్ శిలలతో ఏర్పడిన ఇవి 460 కి.మీ. పొడవు, 3 కి.మీ. వెడల్పు,900-1100 మీ.ల ఎత్తు ఉన్నాయి.
-తూర్పుకనుమల్లో ఎత్తయిన శిఖరం జిందగడ (సుమారు 1700 మీ.), ఇది విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలో ఉంది. అరకులోని పాడేరు వద్ద ఉన్న అరోమా లేదా పాడేరు శిఖరం (1600 మీ.) రెండో ఎత్తయినది. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్న మహేంద్రగిరి (1501 మీ.) మూడో ఎత్తయిన శిఖరం.
-తూర్పు కనుమలు పశ్చిమ కనుమల్లా అవిభాజ్య శ్రేణులు కావు. అవి దక్షిణానికి పోయేకొద్ది సన్నబడుతూ ఉన్నాయి. ఇలా సన్నబడిన తూర్పు, పశ్చిమ కనుమలు మైసూరుకు దక్షిణంగా నీలగిరి కొండల్లో కలుస్తున్నాయి.
నీలగిరి కొండలు
-అన్నామలై కొండలకు దక్షిణంగా నీలగిరి కొండలు ఉన్నాయి. ఈ కొండల్లో ఎత్తయిన శిఖరం దొడబెట్ట (2,652 మీ.)
-అన్నామలై, నీలగిరి కొండల మధ్య ఉన్న 32 కి.మీ. ఖాళీప్రాంతాన్ని పాల్ఘాట్ కనుమ (కేరళ) అంటారు. ఈ కనుమ ప్రాంతం మీదుగానే తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి రహదారులు ఏర్పడ్డాయి.
-అన్నామలై కొండల్లో ఈశాన్య దిశన ఉన్న శాఖను పళిని అంటారు. దక్షిణ దిశన ఉన్న శాఖను పలక లేదా కార్డమమ్ కొండలు అని పిలుస్తారు. ఈ కొండలు కన్యాకుమారి అగ్రం వరకు వ్యాపించి ఉన్నాయి.
ఆరావళి పర్వతాలు
-ఇవి ద్వీపకల్ప పీఠభూమికి వాయవ్య సరిహద్దుగా ఉన్నాయి.
-ఈ పర్వతాలు ఉత్తర గుజరాత్ నుంచి రాజస్థాన్ మీదుగా దక్షిణ ఢిల్లీ వరకు సుమారు 800 కి.మీ. విస్తరించి ఉన్నాయి.
-ప్రపంచంలోనే అతిపురాతనమైన ఈ పర్వతాలు ఏర్పడినప్పుడు చాలా ఎత్తుగా ఉండేవి. కాలక్రమంలో జల, వాయు క్రమక్షయంతో తరిగిపోయి అవశిష్టపర్వతాలుగా మిగిలిపోయాయి. ఈ భూభాగం రూపాంతర ప్రాప్తి శిలలతో ఏర్పడింది.
-ఈ కొండల్లో ప్రవహించే నదుల్లో శీతాకాలంలో మాత్రమే నీరు ఉంటుంది. వీటిలో బనాస్, మహీ, లూనీ నదులు ముఖ్యమైనవి. ఇవి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.
-ఈ కొండల్లో ఎత్తయిన ప్రాంతం మౌంట్ అబూ. ఇంది రాజస్థాన్‌లోని ఏకైక వేసవి విడిది.
-ఈ పర్వతాలు రాజస్థాన్‌లో చిన్న చిన్న గుట్టలుగా కనిపిస్తాయి.
-ఆరావళి పర్వతాల్లో గురుశిఖర్ (1722 మీ. ఎత్తు) అత్యంత ఎత్తయిన శిఖరం. ఇక్కడ బార్, పిప్లిఘాట్, దేవైర్, దేసురి కనుమలు విస్తరించి ఉన్నాయి.
వింధ్య పర్వతాలు
-ఈ పర్వతాలు నర్మదా నదీలోయకు కుడివైపున ఎత్తుగా ఉన్నాయి. ఇవి హోషంగాబాద్ సమీపంలో నర్మదానదిని ఆనుకుని ఉన్నాయి.
-గుజరాత్‌లోని జోబార్ నుంచి బీహార్‌లోని ససారాం వరకు తూర్పు-పడమరలుగా విస్తరించి ఉన్నాయి. వీటి తూర్పు భాగాన్ని కైమూర్ శ్రేణులు అని పిలుస్తారు.
-ఈ పర్వతాలు ఖండ పర్వత రకానికి చెందినవి.
-వీటిని నర్మదా పగులు లోయకు ఎస్కార్ప్మెంట్ (Escarpment)గా పిలుస్తారు. ఈ శ్రేణుల్లో ఇసుకరాయి, సున్నపురాయి శాతం అధికంగా ఉంది.
సాత్పుర పర్వతాలు
-ఇవి దక్కన్ పీఠభూమికి ఉత్తరాన నర్మద, తపతి నదుల మధ్య విస్తరించి ఉన్నాయి.
-ఖండ పర్వత రకానికి చెందిన వీటి పశ్చిమ (మహారాష్ట్ర) భాగాన్ని రాజ్‌పిప్ల కొండలని, దక్షిణ (ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్) భాగాన్ని గవిలిఘర్ కొండలని, తూర్పు భాగాన్ని మైకాల్ కొండలు అని, ఉత్తర భాగాన్ని మమాదేవ్ కొండలని పిలుస్తారు. ఈ కొండల్లో ఎత్తయిన శిఖరం దూప్ఘర్. ఇది మహదేవ్ కొండల్లో ఉంది.
-ఈ పర్వతాలకు దక్షిణాన తపతి, ఉత్తరాన నర్మదానదులు ప్రవహిస్తున్నాయి. వీటితోపాటు సోన్, వార్ధా, పెన్‌గంగా, బ్రహ్మణ నదులు ఇక్కడ జన్మించాయి.
రాష్ర్టాల్లో ఉన్న కొండలు
-జార్ఖండ్- రాజ్‌మహల్ కొండలు
-మధ్యప్రదేశ్- పన్నా కొండలు (వజ్రాలకు ప్రసిద్ధి)
-గుజరాత్- గిర్ కొండలు
-మహారాష్ట్ర- అజంతా, బాల్ఘాట్ శ్రేణులు
-ఒడిశా- బొనాయ్, కియోంజర్, మయూర్భంజ్ కొండలు
-మల్నాడ్ శ్రేణులు- కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి
మహారాష్ట్రలోని శిఖరాలు
-కల్సూబాయ్- 1646 మీ.
-సాల్వేర్- 1567 మీ.
-మహాబలేశ్వర్- 1439 మీ.
-హరిశ్చంద్రఘడ్- 1424 మీ.
తూర్పు కనుమలు వివిధ పేర్లు
ఆమ్రాబాద్ గుట్టలు – రంగారెడ్డి,మహబూబ్ నగర్
నల్లమల కొండలు – నల్లగొండ, మహబూబ్‌నగర్, కర్నూలు
పాలకొండలు – కడప, చిత్తూరు
ఎర్రమల కొండలు – నంద్యాల, కడప
వెలికొండలు – కడప, నెల్లూరు సరిహద్దుల్లో
యారాడ, అనంతగిరి, సింహాచలం కొండలు- విశాఖపట్నం
పీఠభూములు-రాష్ర్టాలు
-బుందేల్‌ఖండ్ పీఠభూమి- మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉంది
-బాగల్ఖండ్ పీఠభూమి- మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఉంది
-షిల్లాంగ్ పీఠభూమి- మేఘాలయాలో
-చోటానాగపూర్ పీఠభూమి- జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో
-దేశంలో అత్యధికంగా ఖనిజ వనరులు ఈ పీఠభూమిలో విస్తరించి ఉన్నాయి. దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
-మాల్వా పీఠభూమి- మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉంది
-ఈ పీఠభూమిలో చంబల్ నదీలోయ ప్రాంతంలో చంబల్ నదీ క్రమక్షయం వల్ల కందర భూములు ఏర్పడ్డాయి.
కథియవార్ పీఠభూమి- గుజరాత్
అధికంగా కోతకు గురైన ప్రాంతాలను కందర భూములు (Ravine Lands) అంటారు. ఈ భూములు చంబల్, బనాస్ నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?