-రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ వాళ్లు రాష్ట్రాల ఏర్పాటును సాధ్యమైనంతవరకు భాషాప్రాతిపదికనే చేశారు. కానీ నూతనంగా ఏర్పడుతున్న ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల తలెత్తే సమస్యలపై రాజకీయ కోణంలో అధ్యయనం చేసినట్లు కనిపించలేదన్నది అంబేద్కర్ అభిప్రాయం. ఎందుకంటే కమిషన్ సిఫారసు చేసిన మొత్తం ఉత్తరాది రాష్ట్రాల జనాభా 16.10 కోట్లు అయితే దక్షిణాది రాష్ట్రాల జనాభా 9.48 కోట్లు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల జనాభా మొత్తం దక్షిణాది రాష్ట్రాల జనాభా కన్నా అధికం. ఉత్తరాది రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష హిందీ అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో రాష్ర్టంలో ఒక్కో భాష మాట్లాడేవారు ఉన్నారు. ఉదాహరణకు కర్ణాటకలో కన్నడం, తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం, ఆంధ్రలో తెలుగు. అందుకే ఉత్తరాది ప్రాంతాలు హిందీ ప్రాంతాలుగా, దక్షిణాది ప్రాంతాలు బహుభాషా ప్రాంతాలుగా పరిగణించబడుతున్నాయి. దేశ జనాభాలో 48 శాతం ప్రజలు మాట్లాడే భాష హిందీ. ఉత్తరాది రాష్ట్రాలన్నీ జనాభాతోపాటు విస్తీర్ణంలో కూడా పెద్దవి. దక్షిణాది రాష్ట్రాలన్నీ చిన్నవి. దీంతోపాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య కొన్ని వ్యత్యాసాలు, వైషమ్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఉత్తరాది రాష్ట్రాల భాష అయినటువంటి హిందీ అంటే గిట్టదు. ఉత్తరాది రాష్ర్ట ప్రజల్లో అక్షరాస్యత తక్కువ. సనాతనవాదులు, వారిలో మూఢనమ్మకాలు అధికం. దక్షిణాది రాష్ర్ట ప్రజల్లో అక్షరాస్యత ఆశించిన స్థాయిలో ఉండటంతోపాటు వాళ్లు హేతుబద్ధంగా ఆలోచించే లౌకిక అభ్యుదయవాదులు. భాషా ప్రాతిపదికన ఏర్పడబోతున్న ఈ రాష్ట్రాల ద్వారా భవిష్యత్తులో తలెత్తబోయే ప్రమాదం ఏమిటంటే ప్రతి భాషకి దేశంలో ఒకే రాష్ర్టం ఉంటే ఆ రాష్ర్టంలో ఉండే ప్రజలకు వారి భాష, సంస్కృతి, ప్రాంతం పట్ల అభిమానం పెరిగి అది ఒక దురభిమానంగా మారి, వారిలో తమదొక ప్రత్యేక జాతికి చెందిన వారమన్న భావనను కల్పిస్తుంది. దాంతో వారు తామొక ప్రత్యేక జాతిగా గుర్తించబడాలన్న కోరిక బలపడి చివరికి అది దేశ విచ్ఛిత్తికి దారితీయవచ్చు. అందువల్ల రాష్ట్రాల ఏర్పాటుకు భాషతో పాటు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబనను పరిగణనలోకి తీసుకోవాలనేది అంబేద్కర్ అభిప్రాయం.
-దేశంలో ఒకే భాష మాట్లాడేవారికి ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలుండాలి. ఈ నేపథ్యంలోనే చిన్న రాష్ట్రాల భావనను అంబేద్కర్ వివరించింది. ఒక భాషకు ఒకే రాష్ర్టం అనే సూత్రం ఎంత ప్రమాదకరమో కూడా వివరించారు. ఒకవేళ హిందీ మాట్లాడే ప్రజలందరికీ ఒకే రాష్ర్టం ఉంటే ఉత్తర భారతదేశంలో ఉండే రాష్ర్ట ప్రజలకు దేశ రాజకీయాలపై ఆధిపత్యం పెరిగి దేశ ఆర్థిక వ్యవహారాలతోపాటు అన్ని అంశాలను శాసించే స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అనేక భాషలు మాట్లాడే వారున్నారు. కావున అక్కడ అనేక చిన్న రాష్ట్రాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ చిన్న రాష్ట్రాలపై పెద్ద రాష్ట్రాల ఆధిపత్యం కొనసాగి దేశ ప్రధాని, రాష్ర్టపతి లాంటి ఉన్నత పదవులు వాళ్లకే దక్కే అవకాశం ఉంటుంది. దీంతో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు పెరిగి ఘర్షణలకు దారితీసి దేశసమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా సంభవించవచ్చు. గతంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న వైరుధ్యాలు అంతిమంగా ఏవిధంగా సివిల్ వార్‌కు దారితీశాయో ఈ సందర్భంగా అంబేద్కర్ పేర్కొనడం గమనార్హం. దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని విచారిస్తే అతిపెద్ద రాష్ట్రాలు ఉండటం శ్రేయస్కరం కాదనేది అతని నిశ్చిత అభిప్రాయం. ఈ కారణంగానే ఉత్తరప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా ఒకదానికి మీరట్ రాజధానిగా, రెండో దానికి కాన్పూర్ రాజధానిగా, మూడో దానికి అలహాబాద్ రాజధానిగా విభజించాలని సూచించారు. అదే విధంగా బీహార్‌ను రెండు రాష్ట్రాలుగా ఒకదానికి పాట్నా, రెండో దానికి రాంచి రాజధానులుగా విభజించాలని సూచించారు.
మధ్యప్రదేశ్‌ను రెండుగా విభజించి ఒకదాన్ని ఇండోర్ కేంద్రంగా, రెండో దాన్ని వింద్యాప్రదేశ్గా ఏర్పాటుచేయాలనేది అతని అభిప్రాయం. దీనికి ప్రాతిపదిక ఒక రాష్ట్రానికి ఒకే భాషనే కానీ.. ఒక భాషకు ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చు. అందులో తప్పులేదు. ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ర్టంతో పోల్చినప్పుడే అది పెద్దదో, చిన్నదో అర్థం కాదు. దేశంలో ఇప్పుడున్న రాష్ట్రాల్లో అన్నిటికన్నా చిన్న రాష్ర్టం సిక్కిం. అన్నిటికన్నా పెద్ద రాష్ర్టం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్‌తో పోల్చినప్పుడు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ చిన్నవే. ఉత్తరప్రదేశ్ ప్రపంచంలోని అనేక దేశాలకంటే పెద్దది. అందుకే రాష్ట్రాల స్వరూప స్వభావాల్లో సమతుల్యం ఉండాలనేది అంబేద్కర్ అభిప్రాయం. దీనికాయన జనాభా ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. జనాభా భౌగోళిక విస్తీర్ణం గురించి పేర్కొంటూ ఆనాటి జనాభా ప్రాతిపదికగా రెండు కోట్లకు దరిదాపుల్లో జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక రాష్ర్టంగా చేయాలని సూచించారు. పాలనా సౌలభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలంటే రెండు కోట్ల జనాభాకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం శ్రేయస్కరమని అతని విశ్వాసం. దాంతోపాటు రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు అవి ఆర్థిక స్వావలంబన గల రాష్ట్రాలుగా భవిష్యత్తులో మనుగడ సాధించగలవా లేదా అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నది అతని అభిప్రాయం. అంబేద్కర్ భావాల ప్రకారం దేశం పలు రాష్ట్రాల కూడలి. అది రాష్ట్రాల సమాఖ్య. ఈ సమాఖ్య వ్యవస్థలో ఏ ఒక్క రాష్ర్టం కూడా పెద్దదిగా ఉండి దేశంలోని ఇతర రాష్ట్రాలపై తన ఆధిపత్యాన్ని చూపగలిగే స్థాయిలో ఉండకూడదనేది అతని అభిప్రాయం. ఆరోగ్యవంతమైన ఫెడరల్ వ్యవస్థ చిన్న రాష్ట్రాల ద్వారానే సాధ్యమనేది అతని విశ్వాసం.