Getting a job | ఉద్యోగంలో చేరుతున్నారా?
స్టూడెంట్ కెరీర్ అనగానే ఎన్నో ఆనందాలు, భావోద్వేగాలు, ఆటపాటలు గుర్తుకొస్తుంటాయి. అదే జాబ్ విషయానికి వస్తే అలాంటివేమీ ఉండవు. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. లక్ష్యాలు నిర్దేషించుకోవడం, అంచనాలను అందుకోవడం, బాధ్యతాయుతమైన పనులవంటివి ముందుంటాయి. కొత్తగా ఉద్యోగం అంటేనే ఎన్నో అంచనాలు ఉంటాయని ఒకింత భయాందోళనకు గురవుతుంటారు చాలామంది. సరైన అవగాహన, ప్లానింగ్‌తో ఉద్యోగాన్ని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా.. సమర్థవంతంగా పనిచేసుకుంటూ ముందుకువెళ్లవచ్చు. కొత్తగా జాబ్ కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. అవేంటో మీరూ తెలుసుకోండి!
ప్లానింగ్ ముఖ్యం
ఉద్యోగ ప్రారంభంలో కొద్దిరోజుల పాటు ఓ పది నిమిషాల ముందే ఆఫీస్‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆఫీస్‌కు ఆలస్యంగా వెళ్తే సమయం విలువ తెలియదని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఉద్యోగంలో చేరిన వెంటనే అన్ని ఒకేసారి తెలుసుకోవాలని రూల్ ఏం లేదు. ప్రతి పనిని నెమ్మదిగా నేర్చుకోవాలి. మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే దానిని ధైర్యంగా అంగీకరించాలి. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన కొత్తలో పొరపాట్లు జరగడం, కొన్ని రోజులు గందరగోళంగా ఉండటం సహజమే. ఓ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తే సంస్థ లక్ష్యాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవచ్చు.
వెనుకాడవద్దు
చాలామంది ఉద్యోగంలో చేరిన కొత్తలో తమకు వచ్చిన సందేహాలను అడగటానికి భయపడుతుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా తమకు తెలియవనుకుంటారని మొహమాటంకొద్దీ అడగటం మానేస్తారు. దీంతో ఆ ప్రభావం చేస్తున్న పనిమీద పడుతుంది. కాబట్టి వచ్చిన సందేహాలను అడగటానికి ఏమాత్రం వెనుకాడవద్దు. మీరు ప్రశ్నలు వేసినప్పుడే మీకు సంబంధిత అంశంపై అవగాహన ఉందనేది అవతలి వారికి తెలుస్తుంది. ఆఫీస్ అసైన్‌మెంట్‌లో భాగంగా వచ్చే సందేహాలను ఇతరులతో చర్చించి నిర్ణయం తీసుకోవడమనేది వర్క్కల్చర్లో భాగమేనని గుర్తించడం మంచిది.
చేయగలిగితేనే ..
ఏ పనయినా చేయగలమని నిరూపించుకోవాలనుకుంటారు కొందరు. కానీ ఉద్యోగంలో చేరిన కొత్తలోనే అలాంటి పనిని అప్పగిస్తే చేయగలిగే సామర్థ్యం ఉంటేనే స్వీకరించడం మంచిది. లేదంటే మీకున్న భయాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేయండి. మీరు మీలా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త వాతావరణంలో ఇమడటానికి కాస్త సమయం పడుతుందనేది వాస్తవం కాబట్టి అన్నిటిని అర్థం చేసుకుంటూ పనికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ముందకు వెళ్లాలి.
అంచనా వేసుకోండి
ఒక పనిని ప్రారంభించేముందు ఆ పనిని చేయగలమా..! లేదా..? అనేది అంచనా వేసుకోవడం ముఖ్యం. మీ శక్తి సామర్థ్యాలపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతిగా ఊహించుకోవడంవల్ల ఆ పనిని చేయలేక రేసులో వెనుకబడిపోవచ్చు. పనిని ప్రారంభించే ముందు బలాలు, శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
సానుకూలతే బలం
కొత్తగా బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలి, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని వెనక్కి లాగుతుంటారు. అలాంటి విషయాలు పక్కన పెట్టి ముందుకువెళ్లాలి. ప్రతికూల ఆలోచనలవల్ల పనిపై ప్రభావం పడటంతో అనుకున్నంతమేర ఫలితాలు సాధించలేరు. కాబట్టి ప్రతికూల వ్యక్తుల దగ్గరకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఎప్పుడయితే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటారో.. అప్పుడు మీరు అనుకున్న ఫలితాలు సాధించగలరు. ప్రతి అపజయం మీకు పాఠం నేర్పుతుందని, వేస్తున్న ప్రతి అడుగూ మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుందని నమ్మండి. ఆ సానుకూలతే బలం అవుతుంది.
పక్కా ప్రణాళికతోనే
కాలంతో పాటు మనం పోటీపడాలంటే ప్రతి పని పక్కాగా ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఆచరణాత్మకంగా ఉండాలి. రేపేం చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇలా వారానికి, నెలకు ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే.. క్రమంగా మీ వ్యక్తిగత లక్ష్యాలు ఒక్కొక్కటి అధిగమిస్తూ కెరీర్లో ముందడుగు వేయడానికి చాలా అవకాశాలు మీ ముందుంటాయి.
స్నేహపూర్వకంగా
ఓ ఉద్యోగిగా ఇంట్లో కంటే ఆఫీస్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్‌లో ఉండటం మసులుకోవడం మంచిదికాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నియమ, నిబంధనలతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మర్యాదగా నడుచుకోవాలి. కొన్ని సమయాల్లో తోటి ఉద్యోగులతో విభేదాలు రావచ్చు. అలాంటి సమయంలో ఆవేశంగా ప్రవర్తించకుండా స్నేహపూర్వకంగా మసులుకోవాలి. కోపాన్ని ఇతరులపై ప్రదర్శించడం వల్ల పనులకు అంతరాయం కలగడంతో పాటు మీపై దురభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఫ్రెండ్లీ వాతావరణంలోనే మంచి ఫలితాలు సాధించగలరనే విషయం కూడా గుర్తుంచుకోవాలి.
ఆ సమయం కీలకం
ఏ ఉద్యోగమైనా సరే ఉద్యోగికి మొదటి మూడు నెలలు కీలకమవుతాయి. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో సహజంగానే కొంతమేరకు ఒత్తిడి ఏర్పడుతుంది. పూర్తిగా తెలియని కొత్త వాతావరణం కూడా ఆందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో మరింత ఒత్తిడికి లోనై చాలామంది కొత్తగా బాధ్యతలు నిర్వర్తించలేక, కొత్త వాతావరణంలో ఇమడలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మొదటి మూడు నెలలు చాలెంజింగ్‌గా పనిచేసినవారికి కెరీర్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయని నిపుణుల అభిప్రాయం.
త్వరగా… ఆలస్యంగా..
కొత్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఆఫీస్‌కు త్వరగా రావడం, ఆలస్యంగా వెళ్లడం నేర్చుకోవాలి. దీనివల్ల సమయపాలనతో పాటు వర్క్‌పై మీకున్న బాధ్యతలు మేనేజ్మెంట్కు తెలుస్తాయి. వర్క్ ప్రాసెస్‌లో భాగంగా మీ పని పూర్తయినట్లయితే మీ కొలీగ్స్ పనిలోనూ నిమగ్నంకండి. దీనివల్ల మీకు, కొలీగ్స్ మధ్య స్నేహభావం ఏర్పడుతుంది. మీరు కూడా ఒత్తిడిగా ఫీలవుతున్నప్పుడు మీ కొలీగ్స్ సహకారం అందుతుంది.
చురుగ్గా, ఆరోగ్యంగా
ఓ ఉద్యోగిగా పనికే పరిమితం కాకుండా ఫిట్‌నెస్‌కూ ప్రాధాన్యం ఇవ్వాలి. చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వర్క్‌ను మరింత ఈజీగా, ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఫిట్‌గా ఉండటంవల్ల ప్రతికూల భావనలు, ఒత్తిడిని జయించవచ్చు. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుండాలి. హెల్దీగా ఉన్నప్పుడే పాజిటివ్ ఆలోచనలు తడుతాయి. దీనివల్ల సక్సెస్‌ఫుల్‌గా జాబ్ కెరీర్‌ను కంటిన్యూ చేయవచ్చు.
మోటివేషన్
ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి మోటివేషన్ కూడా కీలకమే. వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో సక్సెస్ కావడానికి మోటివేషన్ ముఖ్యం. కొందరి ప్రోత్సాహం ద్వారా మోటివేషన్ పొందవచ్చు. మంచి నైపుణ్యాలతో పాటు మంచి మోటివేషన్ పొందగలిగితే లెక్కలేనన్ని విజయాలు సాధించవచ్చు.
ఇతరులకు భిన్నంగా
ప్రతిభావంతులకు ఎప్పుడూ అవకాశాలు ముందుంటూనే ఉంటాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వేలల్లో ఒకరిగా కాకుండా, ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలి. నిత్యం తమ తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం వల్ల విజేతగా నిలువగలుగుతారు. కాబట్టి భిన్నంగా, ప్రత్యేకంగా పనిచేసే దృక్పథం అలవర్చుకోవాలి.
ఇవి పాటించండి..
-పాజిటివ్ ఆటిట్యూడ్ కలిగి ఉండాలి.
-హుందాగా ఉండటం అలవర్చుకోవాలి
-డ్రెస్ అప్పియరెన్స్
-టీమ్ స్పిరిట్
-తోటి ఉద్యోగులతో స్నేహభావంతో మెలగడం
-డౌట్స్‌ను క్లారిఫై చేసుకోవడం
-ఓరియంటేషన్
-చొరవ తీసుకోవడం
-ప్రతి అంశాన్ని నేర్చుకునే దృక్పథం
-సమయపాలన పాటించడం
-గుడ్ అటెండెన్స్
-గాసిప్స్‌కు దూరంగా ఉండటం
-నిర్దేషించిన లక్ష్యాలను చేరుకోవడం
-మాట్లాడటం కన్నా ఎక్కువగా వినడం
-ఫలితం పొందడం
-ఇతరుల విజయాల్లో పాలుపంచుకోవడం
-మెంటార్‌ను గుర్తించడం
-లక్ష్యాలను నిర్దేషించుకోవడం
-సత్సంబంధాలు కొనసాగించడం
-బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం
-వ్యక్తిగతంగా కాకుండా ఒక బృందంగా ఏర్పడి కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని చాలామంది నిపుణుల అభిప్రాయం. బృందంగా పనిచేయడంవల్ల సంస్థ లక్ష్యాలను సులభంగా ప్రభావితం చేయవచ్చు.
-పనిలో భాగంగా సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఇలాంటి విషయాలు కూడా పనిపై ప్రభావం చూపుతాయి. వాటిని అధిగమిస్తూ పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సంస్థ లక్ష్యాలను సకాలంలో చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత అభిరుచులు, అలవాట్లను స్వాగతించేవారు ఒకరు ఉంటారు. అలాంటివారితో కమ్యూనికేట్ అవుతుండ టంవల్ల మీ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు మీ వ్యక్తిగత ఉన్నతికి దోహదపడే అవకాశాలు చాలా ఉంటాయి.
-ఓ ఉద్యోగిగా వర్క్‌కే పరిమితం కాకుండా సహోద్యోగులతో కలిసి మెలగడం అనేది చాలా అవసరం. ఇతరులతో ఫ్రెండ్లీగా మూవ్ కావడంవల్ల స్నేహపూరిత వాతావరణం ఏర్పడి చక్కగా పనిచేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
-ఆఫీస్‌లోనే కాకుండా బయటకు కూడా కంపెనీ కొలీగ్స్‌తో కనెక్ట్ అవుతుండాలి. హాలీడేస్లోనో, స్పెషల్ డేస్లోనో కోలీగ్స్‌ను డిన్నర్ లేదా లంచ్‌కు ఆహ్వానించడంవల్ల కూడా రిలేషన్షిప్ మరింత బలపడుతుంది.
-మేనేజ్మెంట్ సమావేశాలు కూడా ఉద్యోగిపై ప్రభావం చూపుతాయి. సమావేశాల సమయంలో సైలెంట్‌గా ఉండకుండా మీదైన అభిప్రాయాలను పంచుకోవడానికి ప్రయత్నించాలి. వివిధ అంశాలను చర్చించాల్సి వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా మాట్లాడగలిగే నేర్పు కూడా ఉండాలి. అలాంటివారి అభిప్రాయాలను మేనేజ్మెంట్ స్వీకరించడానికి ముందుంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?