Cultural revolutions | సాంస్కృతిక విప్లవాలు
యూరప్‌లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు (1300-1800)
-క్రీ.శ. 1300-1600ల మధ్య ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మార్పులకు ఒక ప్రత్యేకత ఉంది. మొదటిది వివిధ దేశాల ప్రజలు ఇతర దేశాల నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి కనబర్చారు. రెండోది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడో మరిచిపోయిన సాహిత్యాన్ని మళ్లీ పరిశీలించసాగారు. అంతేకాకుండా ప్రతివ్యక్తి ముఖ్యమని, ప్రత్యేకమని, ప్రపంచంలో ఆ ప్రకారంగా వాళ్లని జీవించనివ్వాలని అర్థం చేసుకోసాగారు. కళల రంగంలో చిత్రకళ, శిల్పకళలో ఒక కొత్త శైలి ఏర్పడింది. అది వ్యక్తులను, ప్రకృతిని, పరిసరాలను వాస్తవికంగా, వాళ్ల క్షణిక అనుభూతులు హావభావాలు చిత్రీకరించడానికి ప్రయత్నించింది. ఈ కొత్త సంస్కృతి ప్రజలకు కొత్త విధానాల్లో ఆలోచించడానికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
కాబట్టి ఈ మార్పులు ఎంతో ముఖ్యమైనవి. క్రీ.శ. 400 వరకు రోమన్ సామ్రాజ్యం పెత్తనంలో యూరప్ ఉంది. సుదీర్ఘకాలం పాటు యూరప్, టర్కీ, ఈజిప్టులను రోమన్ సామ్రాజ్యం నియంత్రించింది. ఆ కాలంలో రోమ్, అలెగ్జాండ్రియా వంటి అనేక మహానగరాలు ఉండేవి. గ్రీకులు అభివృద్ధి చేసిన సంస్కృతిని వాళ్లు ముందుకు తీసుకెళ్లారు. గ్రీస్, రోమ్ల శిల్పకళ, చిత్రకళ, భవనాలే కాకుండా సాహిత్యం, తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం వంటివి ఎంతో సుసంపన్నంగా ఉండేవి. గ్రీస్‌కి చెందిన గొప్ప తాత్వికులైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, గణిత శాస్త్రవేత్తలైన యూక్లిడ్, పైథాగరస్ వంటివారు తమ చుట్టూ ఉన్న మనుషులను, సమాజాన్ని, ప్రపంచాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటిని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
-భారతదేశం వంటి దూరదేశాలతో రోమన్లు వాణిజ్యం నిర్వహించేవాళ్లు. దేశంలోని అనేక పురాతన నగరాల్లో రోమన్ నాణేలు పెద్ద సంఖ్యలో కనుగొన్నారు. ఉదాహరణకు శాతవాహనుల కాలం నాటి రోమన్ నాణేలు అరికమేడు వద్ద వేలాదిగా దొరికాయి. రోమన్లు మన కళని కూడా ప్రత్యేకించి వాయవ్య ప్రాంతంలో గణనీయంగా ప్రభావితం చేశారు. గ్రీకు, రోమన్ సమాజాలు బానిసల దోపిడీపై ఆధారపడ్డాయి. యుద్ధంలో పట్టుబడిన బందీలను బానిసలుగా అమ్మేవారు. ఈ బానిసలు వ్యవసాయ భూములు, గనులు, కర్మాగారాలు, ఇళ్లల్లో పనిచేసేవాళ్లు, రోమన్ సామ్రాజ్యంలోని స్వేచ్ఛాయుత పౌరులు ఓటు ద్వారా సెనేట్ను ఎన్నుకొనేవాళ్లు. ఈ సెనేట్‌కి గణనీయమైన అధికారాలు ఉండేవి. క్రీ.శ. 400 తర్వాత రోమన్ సామ్రాజ్యం పతనమైంది. క్రీ.శ. 400 నుంచి 1300 వరకు మధ్యయుగ కాలం.
ఈ కాలంలో పశ్చిమ యూరప్‌లో పెద్ద సామ్రాజ్యాలేమీ లేవు. నగరాలు క్షీణించడంతో అధిక శాతం ప్రజలు గ్రామాల్లో నివసించసాగారు. వాణిజ్యం చాలా తక్కువగా ఉండేది. ఈ కాలంలో యూరప్‌లో ఫ్యూడలిజం అనే సామాజిక వ్యవస్థ ఆధిపత్యంలో ఉండేది. ఫ్యూడలిజం అనే వ్యవస్థలో యుద్ధ ప్రభువులైన భూస్వాములకు రాజకీయ అధికారం ఉండేది. గ్రామాలను, రైతాంగాన్ని నియంత్రించేవాళ్లు. రైతులకు స్వేచ్ఛ ఉండేది కాదు. వీరిని బానిసలుగా చూసేవాళ్లు. ప్రతిదానికి రైతులు తమ భూస్వాములపై ఆధారపడేవారు. వాళ్ల భూములను సాగు చేసేవాళ్లు. వాళ్ల కర్మాగారాల్లో పనిచేసేవాళ్లు, వాళ్ల కోసం యుద్ధాల్లో పోరాడేవాళ్లు. వాళ్లకి తమ సొంత భూములు కూడా ఉండేవి. తమ కుటుంబ పోషణకు వీటిని సాగు చేసేవాళ్లు. ప్రభువులు నిరంతరం ఒకరితో ఒకరు యుద్ధాలు చేస్తుండేవాళ్లు.
ఈ కారణంగా రైతాంగం తీవ్ర అభద్రతకు లోనయ్యేది. రక్షణ కోసం వాళ్లు తమ ప్రభువులపై ఆధారపడేవాళ్లు. చిన్న ప్రభువులు పెద్ద ప్రభువులకు పనులు చేయాల్సి వచ్చేది. మొదటి శతాబ్దంలో ఏర్పడిన క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యంలో పాటించిన ఇతర మతాల స్థానాన్ని ఆక్రమించి యూరప్‌లో అతి పెద్దదిగా పరిణమించింది. ప్రజల మతం, సంస్కృతుల మీద రోమన్ క్యాథలిక్ చర్చి ఆధిపత్యం వహిస్తూ రోమన్ సామ్రాజ్యపు సంస్కృతి నుంచి ప్రజలను మళ్లించడానికి కృషి చేసింది. ప్రజలు స్వయంగా ఆలోచించడాన్ని చర్చి ప్రోత్సహించలేదు. అందుకు బదులు మత గురువులు చెప్పింది నమ్మమని చెప్పింది. యూరప్‌లో ఫ్యూడలిజం బలపడటంతో పురాతన కాలంలో సాధించిన సాంస్కృతికాంశాలన్ని కోల్పోయారు, మరిచిపోయారు. ఎటువంటి ప్రశ్నలు లేకుండా ప్రజలు క్రైస్తవ భావనలను విశ్వసించసాగారు. భౌతిక ప్రపంచం, మానవుల గురించి ఆలోచించడాన్ని చర్చి నిరుత్సాహపర్చింది. అందుకు బదులుగా స్వర్గం, దేవుడు, సాధువుల గురించి ఆలోచించమని ప్రోత్సహించింది.
మానవతావాదం
-1300 దానికంటే కొంత ముందుకాలం నుంచి యూరప్‌కు చెందిన పండితులలో ప్రాచీన లాటిన్, గ్రీకు సాహిత్యం చదివే కొత్త అధ్యాయం మొదలైంది. వాణిజ్యం, పట్టణీకరణ, కొత్త దేశాలు ఏర్పడటం, కొత్త ఉపాధి అవకాశాలు వంటి వాటితో తలెత్తిన కొత్త సవాళ్లతో ఈ పండితులు స్ఫూర్తి పొందారు. వాళ్లు పురాతన లాటిన్ సాహిత్యం చదివారు. భాషను సరిగా, సమర్థంగా ఉపయోగించడంలో, క్రమపద్ధతిలో ఆలోచించడానికి ఇది దోహదం చేసిందని వాళ్లు భావించారు. వ్యాకరణం, తర్కం, కవిత్వం, తత్వశాస్త్రం, చరిత్రకి సంబంధించిన ఈ పురాతన పుస్తకాలను చదవడాన్ని మానవతావాదం లేదా మానవతా అధ్యయనాలుగా పేర్కొన్నారు. ఇటలీలో పెట్రార్చ్ని తొలి మానవతావాదులలో ఒకరిగా పరిగణించేవారు. తమ దేశ ప్రజలు భాషను సరిగా ఉపయోగించడం లేదని అతడు అసంతృప్తిగా ఉండేవాడు.
సరిగా రాసే విధానాన్ని తెలుసుకోవడానికి అతడు పురాతన గ్రంథాలను అధ్యయనం చెయ్యసాగాడు. భాషను సరిగా ఉపయోగించడానికి కాకుండా ఆలోచించడానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికే మెదడుకి శిక్షణ ఇవ్వడంతో కూడా ఇవి దోహదపడుతాయన్న భావన అతడిలో క్రమేపీ బలపడసాగింది. 1453లో కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఒట్టోమాన్ సుల్తాన్ మహ్మద్-II జయించాడు. ఆ నగరంలో పెద్ద సంఖ్యలో పురాతన గ్రీకు పుస్తకాలు, వాటిని చదివిన పండితులు ఉన్నారు. వాటిని, అరబ్బీ, టర్కీ భాషలలోకి తురుష్కులు అనువదింపజేశారు.
వాళ్లలో చాలా మంది తమ పుస్తకాలతో ఇటలీకి ప్రయాణించారు. ప్లేటో, అరిస్టాటిల్ వంటి రచయితల పురాతన గ్రీకు పుస్తకాలను చదవడం మానవతావాద అధ్యయనాల్లో ముఖ్యమైన అంశంగా మారింది. ఈ అధ్యయనం వల్ల యువతలో ఆలోచనా శక్తే కాకుండా అనువాదం, ఉత్తరాలు రాయడం, ఉపన్యాసం ఇవ్వడం, న్యాయస్థానంలో వాదించడం, వాణిజ్యం లేదా దౌత్యంలో సంప్రదింపులు నిర్వహించడం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని మానవతావదులు నమ్మారు.
ఆసియాలో మధ్యయుగం
-ఆసియా అధిక భాగంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అరేబియా, పర్షియా, ఇరాక్, ఉత్తరాఫ్రికాలలో కొత్త మతం ఇస్లాం వ్యాప్తి చెందుతున్నది. కొత్త రాజకీయ శక్తులు ఆవిర్భవిస్తున్నాయి. భారతదేశంలో అనేక నగరాలతోపాటు చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. 13వ శతాబ్దం ఆరంభంలో ఉత్తర భారతదేశంలో తురుష్కుల పాలన ఏర్పడింది. దీని అర్థం రాజులు, సైనికులు, వ్యాపారులు, పండితులు, మతపరమైన వ్యక్తులు, కళాకారులు, చేతివృత్తుల వాళ్లు ఒక చోట నుంచి మరో చోటుకు ప్రయాణాలు చేశారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ కొత్త వస్తువులు తయారుచేయసాగారు. ఇది నేర్చుకోవడానికి, సృజనాత్మకతకు ఆసియాలో ఒక మహత్తర కాలం. చైనా, భారతదేశం, ఇరాన్, ఆఫ్రికా, యూరప్ వంటి మహోన్నత సంస్కృతుల సంగమ ప్రాంతంలో అరబ్బులు తమ సామ్రాజ్యాన్ని ఏర్పర్చారు.వీళ్లు తమతోపాటు ఈ అన్ని ప్రాంతాల నుంచి పుస్తకాలు, కొత్త ఆలోచనలు తెచ్చుకున్నారు. వీటిని అరబ్బీ భాషలోకి అనువదించారు. వాటికి కొత్త అంశాలను చేర్చారు. ఇటలీ, భారతదేశం, చైనా వంటి దూరదేశాలతో వ్యాపారం చేశారు. సరుకుల ఖండాంతర రవాణాకు వ్యవస్థ ఏర్పర్చారు. చాలా విశాల ప్రాంతాలపై వాళ్లు ఆధిపత్యం సాధించి కేంద్రీకృత రాజకీయ, పరిపాలన వ్యవస్థలను ఏర్పరిచారు. భారతదేశం, చైనా, యూరప్‌లకు చెందిన పురాతన పుస్తకాలను ఉపయోగించి అరబ్బు పండితులు విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం, గణితశాస్త్రం, మతం వంటి వాటిని అధ్యయనం చేశారు. 1550కి ముందు టర్కీ, ఇరాన్, భారతదేశాలలో మూడు పెద్ద సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. టర్కీలో ఒట్టోమాన్, ఇరాన్లో సఫావిద్‌లు, భారతదేశంలో మొగల్ సామ్రాజ్యం. ఈ నేపథ్యంలోనే యూరప్‌లో కూడా సాంస్కృతిక మార్పులు చోటుచేసుకున్నాయి.
-1300 తర్వాత ఈ పరిస్థితి మారసాగింది. కట్టుబానిసత్వాన్ని వ్యతిరేకించిన రైతాంగం భూస్వాములు, చర్చి నియంత్రణను వ్యతిరేకించ సాగింది. ఉదాహరణకు 1381లో రైతాంగం తిరుగుబాటుతో ఇంగ్లండ్‌లో కట్టుబానిసత్వం అంతమైంది. ఇతర దేశాలలో కూడా ఇలాంటి ఉద్యమాలే చోటుచేసుకున్నాయి. భూస్వాములు, చర్చి ఆధిపత్యం తగ్గి ప్రజలు మరింత స్వేచ్ఛను అనుభవించసాగారు. యూరప్ దేశాలకు చైనా, అరేబియా, భారతదేశం, ఈజిప్టు వంటి వాటితో దూరప్రాంత వాణిజ్యం పునరుద్ధరింపబడింది. ఐరోపా దేశాలలో పట్టణీకరణ, వాణిజ్యాల వల్ల అనేక కొత్త పట్టణాలు, నగరాలు ఏర్పడ్డాయి. వాటిలో వ్యాపారులు, చేతివృత్తి కళాకారులు నివసించసాగారు.
ఈ నగరాలలో అనేకం రాజకీయంగా స్వతంత్రంగా ఉంటూ నగరపాలికల ద్వారా పాలన సాగేది. వాటిల్లో ఫ్లోరెన్స్, వెనిస్ అనే రెండు నగరాలు గణతంత్రాలు. ఇతర అనేక నగరాలను యువరాజులు పాలించేవాళ్లు. ఇటలీలో అత్యంత సజీవమైన నగరాలలో వెనిస్ ఒకటి. జెనీవా మరొకటి. యూరప్‌లోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉండేది. ఇక్కడ చర్చి, శక్తిమంతులైన ఫ్యూడల్ ప్రభువులు రాజకీయ ఆధిపత్యం కలిగి ఉండేవాళ్లు కాదు. నగరపాలనలో ధనిక వ్యాపారస్తులు, బ్యాంకర్లు క్రియాశీలకపాత్ర పోషించే వాళ్లు. దాంతో పౌరసత్వం అనే భావన ఏర్పడింది. ఇలాంటి నగర దేశాలలో పౌరులుగా ఉండటం ప్రజలకు గర్వకారణంగా ఉండేది.
పండితులు, కళాకారులు, చేతివృత్తుల వాళ్లు ఉపాధి కోసం ధనికుల ప్రాపకం ఆశించి కొత్తగా ఏర్పడుతున్న ఈ నగరాలకు పెద్ద సంఖ్యలో రాసాగారు. ఈ నగరాలలోని కొత్త ధనికవర్గం కళా పోషకులుగా, భవన నిర్మాతలుగా పేరు ప్రఖ్యాతలు పొందడానికి ప్రయత్నించారు. తమ కోసం పనిచేయమని వాళ్లు కళాకారులను, వాస్తు శిల్పులను, పండితులను ఆహ్వానించేవాళ్లు. ఈ పోషకులలో ముఖ్యమైన వాళ్లు చర్చిలో ప్రధాన స్థానాలైన పోప్, కార్డినల్, బిషప్‌లుగా ఉండటం ఆసక్తికరమైన విషయం. వ్యాపారులు, చేతివృత్తిదార్లు, పండితులు, కళాకారులు ఎంతో దూరం ప్రయాణించేవాళ్లు. వాళ్లల్లో చాలామంది ఈజిప్ట్, టర్కీ, పర్షియా వంటి దూర ప్రాంతాలను సందర్శించారు. అక్కడే స్థిరపడ్డారు. వాళ్లతో సరుకులు మార్చుకోవడం, ఆలోచనలు పంచుకోవడంతో ఆ సంస్కృతుల నుంచి ఎంతో నేర్చుకున్నారు. ఈ విధంగా వాళ్లు అన్ని దేశాలకు కొత్త ఆలోచనలను అందించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?