Constitutional Disputes-Comments | రాజ్యాంగ వివాదాలు-వ్యాఖ్యలు
రాజ్యసభ
– ఒక విధమైన ప్రశాంత వాతావరణంలో చట్టాన్ని పునఃపరిశీలించే అవకాశం కల్పించడం కోసం ఎగువ సభలు ఉంటాయి.
– రెండో సభకు మద్దతుగా పేర్కొనే వాదనలు: సంప్రదాయం, సంపన్నవర్గాలు, ఇతర స్వప్రయోజనాపరులు తమను తాము మెజారిటీ నుంచి కాపాడుకోవడం, తొందరపాటుతో చేసే చట్టాలను తనిఖీ చేసేందుకు ఒక వ్యవస్థ ఉండాలని ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారు నిజాయితీగా భావించడం, దిగువ సభలో సాధ్యంకాని అంశాలకు రెండోసభలో ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆకాంక్ష.
– రెండో సభకు వ్యతిరేకంగా వినిపించే వాదనలు: ఎగువ సభలు అప్రజాస్వామికమైనవని, ప్రజాస్వామిక ప్రక్రియలకు అనవసరంగా అడ్డుపడుతూ నెమ్మదిగా సాగేట్టు చేస్తాయనేవి ముఖ్యమైనవి.
– రెండో సభ కీలక అంశాలపై హుందాగా చర్చలు జరుపాలని, భావోద్వేగాలతో హడావిడిగా చేసిన చట్టాల వేగాన్ని తగ్గించాలని మాత్రమే మనం ఆశించవచ్చని ఎన్జీ అయ్యంగార్ పేర్కొన్నారు.
– దిగువసభ హడావిడిగా చట్టాలు చేయడాన్ని నిరోధించేందుకు ఎగువసభ అవసరం లేదనీ, ఆధునిక శాసన ప్రక్రియ నెమ్మదిగానే పనిచేస్తోందని కే సంతానం పేర్కొన్నారు.
– బీఆర్ అంబేద్కర్ ఎగువ సభలకు వ్యతిరేకంగా మాట్లాడారు.
– రాజ్యసభ అధికారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ ఇటీవల అభిప్రాయపడ్డారు. చట్ట నిర్మాణ ప్రక్రియకు రాజ్యసభ అడ్డంకి కలిగిస్తుందన్న ఆయన మాటల్ని తేలిగ్గా తీసుకోలేం.
– రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా రాజ్యసభ సమాఖ్య స్వరూపాన్ని పటిష్టపరిచే విధంగా కాకుండా, దాన్ని మరింత నీరుగార్చే దిశలోనే ఆ మార్పులు చోటు చేసుకున్నాయి. రాజ్యసభ సభ్యులు సంబంధిత రాష్ర్టానికి అక్కడి నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగలిగారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన పవన్ వర్మను బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపారు.
– ఎన్నిక కాని, కాలేని నాయకులకు పునరావాస శిబిరంగా రాజ్యసభ మారిపోయింది.
– ప్రజలతోకానీ, ప్రజాభిమతంతోకానీ రాజ్యసభకు ఎలాంటి సంబంధంలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కోరుకుంటున్న రీతిలో పనిచేయాలనే స్పృహ లోపించింది.
– ప్రజాభిప్రాయం రాజ్యసభలో సైతం వ్యక్తం కావాలి.
– రాజ్యసభ పాత్రపై పునఃపరిశీలన చేయాలని అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు.
– రాజ్యసభ నేడు లోక్‌సభకు పక్కలో బల్లెంగా మారిందనడంలో సందేహం లేదు.
– రాజ్యాంగ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ప్రజాభిప్రాయాలను సేకరించాలి.
– రాజ్యాంగ నిర్మాతలు రాజ్యసభను ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రజలచేత ఎన్నికైన లోక్‌సభ శాసన నిర్మాణ విధులు నిర్వర్తించకుండానా? అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతుంది.
– రాష్ట్రపతి ప్రసంగంలో అవినీతి, నల్లధనం అంశాలపై విపక్షం పెట్టిన సవరణ ఆమోదం పొందడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏకి 57 ఓట్లురాగా, విపక్షాలకు 118 ఓట్లు రావడంతో సవరణ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో విపక్షాల తీర్మానం ఆమోదం పొందడం పార్లమెంటు చరిత్రలో ఇది నాలుగోసారి. గతంలో మొదటిసారి 1980, జనవరి 30న జనతాపార్టీ పాలనలో, రెండోసారి 1989, డిసెంబర్ 29న నేషనల్ ఫ్రంట్ పాలనలో, మూడోసారి 2001, మార్చి 12న ఎన్డీఏ పాలనలో, నాలుగోసారి 2015, మార్చి 3న నరేంద్ర మోదీ పాలనలో జరిగింది. ఇది రాజ్యసభలో అధికార పార్టీకి మెజారిటీ లేదని తెలుపుతుంది.
– ఈ తీర్మానం ఆమోదం పొందడంవల్ల ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.
భారత సమాఖ్య, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
– 1950-67 వరకు కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఎలాంటి వివాదాలు ఏర్పడలేదు. కేంద్ర, రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటమే దీనికి కారణం.
– 1967-72 వరకు కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికారాల విషయాల్లో వనరుల పంపిణీ వరకు తరుచు వివాదాలు తలెత్తాయి. 1967 సాధారణ ఎన్నికల్లో అనేక రాష్ర్టాల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఇందుకు కారణం.
– 1972-77 మధ్యకాలంలో కేంద్ర, రాష్ర్టాల మధ్య ఎలాంటి వివాదాలు ఏర్పడలేదు. 1967లో ఓడిపోయిన కాంగ్రెస్‌పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఇందుకు కారణం.
– 1977-80 మధ్య కాలంలో మరోసారి దేశ రాజకీయాల్లో నూతన పరిణామాలు ఏర్పడ్డాయి. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయింది. జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది.
– 1983 తరువాత అనేక రాష్ర్టాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడటంతో కేంద్ర, రాష్ర్టాల మధ్య ఆర్థిక వనరుల విషయంలో రాష్ర్టాల అంతరంగిక విషయాల్లో కేంద్ర జోక్యం, గవర్నర్లు తమ బాధ్యతలను నిర్వహించడంలో వివాదాలు ఏర్పడ్డాయి.
– బలహీనమైన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. దేశంలో శాంతిని కాపాడటంలో, కీలకమైన విషయాలను సమన్వయ పరచడంలో విఫలమవుతుంది. అంతర్జాతీయ వేదికలమీద దేశం తరపున సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించలేకపోతుంది. మన రాజ్యాంగానికి పటిష్టమైన కేంద్రంతో కూడిన సమాఖ్య విధానమే అత్యంత ఆరోగ్యవంతమైన పద్ధతి అని రాజ్యాగ పరిషత్ భావించింది.
– కేంద్రం, రాష్ట్రం పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడటంలోనే ఈ వ్యవస్థ మనుగడ కొనసాగుతుంది. ఒకవేళ రాష్ర్టాలు తమ అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర శాసనానికి సహకరించాల్సిందే అని ఆశిస్తే మాత్రం అది నెరవేరదు అని పంత్ పేర్కొన్నారు.
– అమ్మకం పన్ను సమస్య ఇంకా ఇప్పటికీ దేశ వాణిజ్యాన్నీ, పరిశ్రమలను పీడిస్తూనే ఉంది. రాజ్యాంగ నిర్ణయ సభ స్వల్ప వైఫల్యాలలోఅధికరణం 286 కూడా ఒకటి.
– 1964లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు, ఆ రాష్ట్ర హైకోర్టుకు మధ్య వివాదం ఏర్పడింది. శాసన ధిక్కారానికి పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తిని హెబియస్ కార్పస్ పిటిషన్‌కు ప్రతిస్పందనగా విడుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య తలెత్తిన ఈ అధికారాల వివాదం ఎంతో ఉద్రిక్తతని, ఆసక్తిని కలిగించింది. న్యాయ సలహా కోసం రాష్ట్రపతి ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు పంపించారు. అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకున్న చర్య సరైనదే అని నిర్ధారించింది. ఆ విధంగా రాజ్యాంగమే ఈ సమస్యకు పరిష్కారం చూపింది.
నదీజలాల వివాదాలు
– రాష్ర్టాల మధ్య నదీ జలాల వివాదాలు సమాఖ్య స్ఫూర్తికి, సవాళ్లుగా మారాయి. కృష్ణా-గోదావరి నదీ జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య, వంశధార ప్రాజెక్టు విషయంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య, పోలవరం ప్రాజెక్టు విషయంపై తెలంగాణ, ఛత్తీగఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది రాజ్యాంగానికి సవాలుగా మారింది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి
– ప్రకరణ 370 ప్రకారం జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి రాజ్యాంగానికి సవాలుగా మారింది.
పార్లమెంటరీ కార్యదర్శులు
– పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం తెలంగాణతోపాటు, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లోనూ వివాదాస్పదమైంది. ఇది ప్రకరణ 164 (1ఏ)కు విరుద్ధమంటూ కోల్‌కతా హైకోర్టు పేర్కొన్నది.
– కేంద్ర రాష్ర్టాల్లో మంత్రుల సంఖ్యపై రాజ్యాంగం పరిమితి విధించింది. దాన్ని నేరుగా అధిగమించలేని ప్రభుత్వాలు, పదవులు దక్కని నేతలను సంతృప్తి పరచడానికి దొడ్డి దోవను అనుసరిస్తున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడం ద్వారా వారిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాయి.
– బహుశా రాజ్యాంగానికి మరొక సవరణ చేసి మంత్రివర్గంలో ఏ శాఖలు ఉండాలో, వారికి సహాయకులుగా ఏ అర్హతలు ఉన్న నిపుణులను నియమించాలో స్పష్టంగా నిర్దేశిస్తే బాగుంటుంది.
గవర్నర్ పదవి- రాష్ట్రపతి పాలన
– గవర్నర్ పదవి, రాష్ట్రపతి పాలన దుర్వినియోగం జరిగిందనడానికి ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల ప్రభుత్వాలు పార్టీలు మారడమే ప్రత్యక్ష ఉదాహరణలు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
– ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానిస్తూ.. జనం ఎండ, వాన, చలి, మంచును లెక్కచేయకుండా ఓటు చీటి పట్టుకొని పోలింగ్ బూత్ ముందు నిల్చొని ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఆ బలహీనుడి నమ్మకాన్ని చంపేస్తారా? రాష్ట్ర ప్రభుత్వాలను వదిలించుకోవడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాటిని కూకటివేళ్లతో పెకిలించడం, భయాందోళనలు సృష్టించడం.. మీ ఆంతర్యం ఇదేనా? ప్రభుత్వాన్ని రద్దు చేయడం లేక తాత్కాలికంగా సస్పెండ్ చేయడం ఏదైనా సరే మా ఉద్దేశం ప్రకారం ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడమే అని కేంద్ర ప్రభుత్వ చర్యను తప్పుపట్టింది.
– గవర్నర్ పదవి రాజకీయ పునరావాసమైంది.
– గవర్నర్‌కు ఉన్న కొన్ని విచక్షణ అధికారాలు కూడా కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమౌతున్నాయి.
– గవర్నర్ విచక్షణ అధికారాలపై స్పష్టమైన రాజకీయ సంప్రదాయాలను, నియమాలను రూపొందించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు సూచించారు.
– గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు డిమాండ్ చేయడం రాజ్యాంగ సవాలును తెలుపుతుంది.
– రాజ్యాంగ రచయితలు ఊహించలేకపోయిన పరిణామాల్లో ముఖ్యమైనవి రాష్ట్రపతి పాలన దుర్వినియోగం కావడం.
– గత 69 ఏండ్లుగా 356 ప్రకరణ సద్వినియోగం కంటే ఎక్కువగా దుర్వినియోగం అయింది.
– 1977లో జనతా ప్రభుత్వం 9 కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలను రద్దు చేసింది.
– 1980లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 9 కాంగ్రెసేతర పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలను రద్దు చేసింది.
– 1994లో బొమ్మై కేసులో సుప్రీంకోర్టు.. కేంద్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని రాష్ట్రపతికి ఇచ్చే సలహాను న్యాయసమీక్ష పరిధిలో విచారించలేనప్పటికీ, ఆ సలహాకు ప్రాతిపదిక అయిన కారణాలను న్యాయసమీక్ష జరిపే అధికారం కోర్టుకు ఉంటుందని పేర్కొంది.
– రాష్ట్రపతి పాలనను తెలిపే ప్రకరణ 356ను తొలగించాలని రాజమన్నార్ కమిటీ పేర్కొంది.
– గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ కాదు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన రాష్ర్టాధినేత అని భగవాన్ సహాయ్ కమిటీ పేర్కొన్నది.
– ఎలాంటి ఉపయోగంలేని గవర్నర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని పశ్చిమబెంగాల్ మెమోరాండమ్ పేర్కొన్నది.
– రాష్ట్రపతి పాలనను చివరి అస్త్రంగా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని సర్కారియా కమిషన్ అభిప్రాయపడింది.
– రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మాన పద్ధతిని గవర్నర్‌కు కూడా వర్తింపచేసి అతన్ని ఈ ప్రక్రియ ద్వారా తొలగించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉండాలని రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ పేర్కొంది.
– గవర్నర్ల వ్యవస్థను రాజకీయ ఫుట్‌బాల్‌గా ఉపయోగించుకోవడం తక్షణం ఆపాలని మదన్ మోహన్ పూంచీ కమిషన్ పేర్కొన్నది.
– 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు గవర్నర్ పాత్రపై చారిత్రాత్మకమైన తీర్పును ఇస్తూ ఒక మంత్రివర్గం విశ్వాసాన్ని శాసనసభలోనే పరీక్షించాలి. అంతేకానీ అది గవర్నర్ లేదా రాష్ట్రపతి వ్యక్తిగత అభిప్రాయం కారాదు అని పేర్కొంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?