British administrative system | బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ
భారతదేశ చరిత్ర
చార్టర్ చట్టం – 1793
– ఈ చట్టం ప్రకారం గవర్నర్లకు, గవర్నర్ జనరల్‌కు తమ సలహాసంఘ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం దక్కింది.
చార్టర్ చట్టం – 1813
– ఈ చట్టం మొదటిసారిగా భారత్‌లో ఆధునిక విద్యాభివృద్ధికై ప్రతి ఏడాది ఒక లక్ష రూపాయలను కేటాయించింది.
– ఈ చట్టం ఎలిజబెత్ రాణి కంపెనీకి ప్రసాదించిన వ్యాపార గుత్తాధికారాన్ని రద్దుచేసింది. అంటే దేశంలో ఈస్టిండియా కంపెనీనేగాక, ఏ బ్రిటిష్ కంపెనీ అయినా వ్యాపారం చేసుకోవచ్చు.
– బ్రిటిష్ పౌరులందరికీ దేశంలో వ్యాపారం చేసుకునేందుకు సమానహక్కు, అవకాశం కల్పించారు. అయితే తేయాకు వర్తకంలోనూ, చైనాతో చేసే వ్యాపారంలోనూ కంపెనీ గుత్తాధికారం కొనసాగించింది.
– మతపరంగా మొదటిసారిగా క్రైస్తవ మత ప్రచారానికి అనుమతి ఇవ్వబడింది. దీనికోసం ఒక బ్రిటిష్, ముగ్గురు మతాధికారులను నియమించారు.
చార్టర్ చట్టం – 1833
– బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో ఈ చట్టం చివరి దశ.
లక్షణాలు
1. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఈ చట్టం ప్రకటించింది. ఈవిధంగా లార్డ్ విలియం బెంటిక్ మొదటి భారత గవర్నర్ జనరల్ అయ్యాడు.
2. బాంబే, మద్రాస్ గవర్నర్ల శాసనాధికారాలను ఇది తీసివేసింది. మొత్తం బ్రిటిష్ ఇండియాలోని అన్ని శాసనాధికారాలు భారత గవర్నర్ జనరల్‌కే సంక్రమించాయి. అంతకుముందు చట్టాల కింది శాసనాలను రెగ్యులేషన్స్ అనేవారు. ఈ చట్టం కింద ఏర్పడిన శాసనాలను యాక్ట్స్ అని వ్యవహరించారు.
3. వాణిజ్య సమితిగా తూర్పు ఇండియా కంపెనీ కార్యక్రమాలకు ఈ చట్టం చరమగీతం పాడింది. అది కేవలం పరిపాలనా సమితిగా మిగిలింది. దేశంలోని కంపెనీ భూభాగాలన్నీ రాజుకు, అతని వారసులకు ఉన్నతాధికారులకు చెందిన ట్రస్ట్ అని ఈ చట్టం పేర్కొన్నది.
4. సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం బహిరంగ పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ చట్టం ప్రయత్నించింది. కంపెనీ కింది భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రతిబంధాలు ఉండరాదని సూచించింది. అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని వ్యతిరేకించడంతో ఈ చట్టాన్ని నిరాకరించారు.
1857 వరకు పరిపాలించిన గవర్నర్ జనరల్స్
వారెన్ హేస్టింగ్స్ (1773-86)
– 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్‌గా నియమితుడయ్యాడు.
– మొదట ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీలో రైటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. పర్షియన్, బెంగాలీ భాషలు తెలిసిన ఏకైక గవర్నర్ జనరల్.
– జిల్లాస్థాయిలో దివానీ, ఫౌజ్దార్ అదాలత్‌లను ఏర్పాటుచేశాడు. కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటుచేశాడు.
– ఇతని కాలంలో మొదటి మహారాష్ట్ర యుద్ధం జరిగింది. యుద్ధంలో బ్రిటిష్‌వారికి అనుకూల ఫలితాలు రాలేదు. ఈ యుద్ధం 1782 సాల్బే సంధితో ముగిసింది.
– ఇతని కాలంలో రెండో మైసూరు యుద్ధం జరిగింది. 1774లో రోహిల్లా యుద్ధం జరిపి రోహిల్‌ఖండ్‌ను ఆక్రమించాడు. సొంత భూభాగాలను రక్షించుకోడానికి ఇరుగుపొరుగు సరిహద్దుల వారితో రింగ్ఫెన్స్ పాలసీని అనుసరించాడు.
– ఇతను ప్రాశ్చ్య సంస్కృతి పట్ల అభిమానం కలిగినవాడు. 1784లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను విలియం జోన్స్ అధ్యక్షుడిగా స్థాపించారు.
– హేస్టింగ్స్ చార్లెస్ విల్కిన్స్ ఆంగ్లంలోకి అనువదించిన భగవద్గీతకు ముందు మాట రాశాడు.
– హేస్టింగ్స్ బ్రిటిష్ పార్లమెంట్లో 20 కేసుల్లో అభిశంసన ఎదుర్కొన్నాడు. ఇందులో నందకుమార్ కేసు, చైత్సింగ్ కేసు, ఔధ్ రాణితో అనుసరించిన కేసులు ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి సేవలు చేశాడని, కేసుల నుంచి విముక్తి ప్రసాదించారు.
కారన్ వాలీస్ (1786-93)
– ఇతను భారత్‌లో సివిల్ సర్వీసుల పితామహుడిగా పేరుపొందాడు.
– ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ద్వారానేవారిలో నిజాయితీని, నైపుణ్యాన్ని పెంచవచ్చునని గుర్తించిన మొదటి గవర్నర్ జనరల్.
– వారెన్ హేస్టింగ్స్ పరిచయం చేసిన న్యాయ విధానాన్ని స్థిరపరిచాడు. బెంగాల్ ప్రెసిడెన్సీని 4 డివిజన్లుగా విభజించాడు.
– జమీందారులను పోలీస్ విధుల నుంచి తప్పించాడు. పోలీస్ స్టేషన్లను ఆధునీకరించి డీఎస్పీ పోస్టును ఏర్పరిచాడు.
– జిల్లా అధికార విధులను జిల్లా కలెక్టర్‌కు అప్పగించాడు. 1793లో జిల్లా కలెక్టర్ పదవి నుంచి సివిల్ జడ్జి పదవిని వేరుచేశాడు.
– కారన్ వాలీస్ లౌకిక చట్టాన్ని క్రోడీకరించి 1793లో నూతన న్యాయకోడ్ను ఏర్పాటు చేశాడు. అది సమానత్వ అంశాలతో కూడుకుని ఉంది. ఇది కారన్ వాలీస్ కోడ్‌గా ప్రసిద్ధిచెందింది. ఇది న్యాయపాలన నుంచి రెవెన్యూ పాలనను వేరుపరిచినది.
– పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్‌లలో 4 ప్రావిన్షియల్ కోర్టులను స్థాపించాడు. ఈ కాలంలో జీవితఖైదు లేక మరణశిక్షలను విధించే కోర్టులు ప్రావిన్షియల్ కోర్టులు.
– కారన్‌వాలీస్ న్యాయ సంస్కరణల ప్రకారం న్యాయపాలనలో దిగువస్థాయి గలది మున్సిఫ్ కోర్టు. ఇది రూ. 50ల లోపు వివాదాలను పరిష్కరించే అధికారం కలిగి ఉండేది.
– కారన్‌వాలీస్ అభిప్రాయం ప్రకారం భారతీయులందరూ అవినీతిపరులే. ఇతడి పాలనలో ఉన్నత పదవులన్నింటినీ ఇంగ్లిష్వారికే కేటాయించాడు.
– భారత్‌లో 1/3వ వంతు భాగం క్రూరమృగాలు సంచరించే అడవి అని పేర్కొన్నాడు.
– ఇతని కాలంలో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఇందులో టిప్పు సుల్తాన్ ఓడిపోయి శ్రీరంగపట్టణం (1792) సంధి చేసుకున్నాడు.
– మన మిత్రులను మరింత బలపడకుండానే విజయవంతంగా మన శత్రువును బలహీనపరిచామని ప్రకటించిన గవర్నర్ జనరల్ కారన్‌వాలీస్.
– ఇతడు 1793లో బెంగాల్లో శాశ్వత శిస్తు విధానం ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రముఖ పాత్ర పోషించిన అధికారి సర్ జాన్‌షోర్.
వెల్లస్లీ (1798-1805)
– ఇతడు 1798లో సైన్య సహకార ఒప్పందాన్ని ప్రవేశపెట్టి విస్తృత భారత భూభాగాలను బ్రిటిష్ సార్వభౌమాధికార పరిధిలోకి తీసుకువచ్చాడు.
– సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి స్వదేశీ రాజు నిజాం రాజు.
– తంజావూరు, కర్ణాటకలను ఆక్రమించి మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు.
– యువ సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చేందుకుగాను 1800లో ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపించాడు.
– ఇతని బిరుదు బెంగాల్ టైగర్.
లార్డ్ మింటో (1807-13)
– ఇతడి కాలంలో 1809లో రంజిత్‌సింగ్‌తో అమృత్సర్ సంధి జరిగింది.
– ఇతడి కాలంలో 1813 చార్టర్ చట్టం వచ్చింది. దీనిపరంగా విద్య కోసం రూ. లక్ష కేటాయించాడు.
లార్డ్ హేస్టింగ్స్ (1813-23)
– ఇతడి కాలంలో బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పడింది.
– ఇతడు పిండారీలను తీవ్రంగా అణచివేశాడు. ఇందుకుగాను సర్ థామస్ హిప్లాన్ అనే సైన్యాధికారిని ఉపయోగించుకున్నాడు.
– ఇతడు భారత్‌లో 28 యుద్ధాల్లో పాల్గొన్నాడు. దేశంలో 128 కోటలను జయించాడు.
– ఇతడి కాలంలో మూడో మహారాష్ట్ర యుద్ధం జరిగింది. ఇందులో పీష్వాలు పూర్తిగా ఓడిపోయి మహారాష్ట్ర నుంచి వెళ్లిపోయారు.
– రాజపుత్రులను బ్రిటిష్‌వారికి సహజ మిత్రులుగాను, మరాఠాలను సహజ శత్రువులుగాను భావించిన ఏకైక గవర్నర్ జనరల్.
– హేస్టింగ్స్ కాలంలోనే దేశంలో మొదటి వెర్నాక్యులమ్ న్యూస్ పేపర్ అయిన సమాచార్ దర్పన్ ప్రారంభమైంది.
– ఇతడి కాలంలో మద్రాస్ రాష్ట్రంలో సర్ థామస్ మన్రో రైత్వారీ విధానం ఏర్పాటు చేశారు.
చార్టర్ చట్టం – 1853
– గవర్నర్ జనరల్ కౌన్సిల్ శాసనాధికారాలను, కార్యనిర్వహణ అధికారాలను ఇది మొదటిసారిగా వేరుచేసింది. ఈ కౌన్సిల్లో ఆరుగురు కొత్త సభ్యులను చేర్చారు. వారిని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అంటారు. ఇంకోరకంగా చెప్పాలంటే ఈ చట్టం ఒక ప్రత్యేక గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేసింది. దీన్ని ఇండియన్ (సెంట్రల్) లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ఈ కౌన్సిల్‌లోని శాసనపరమైన విభాగం ఒక మినీ పార్లమెంట్‌గా పనిచేసింది. బ్రిటిష్ పార్లమెంట్ ప్రక్రియలను ఇది అనుసరించింది. ఈవిధంగా ప్రభుత్వంలో శాసన నిర్మాణాన్ని ప్రత్యేకంగా పరిగణించారు.
– సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసుకోవడానికి బహిరంగ పోటీవ్యవస్థను ఇది ఏర్పర్చింది. ఈ ఉన్నతమైన సివిల్ సర్వీస్‌లో భారతీయులకు కూడా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌పై మెకాలే కమిటీని 1854లో నియమించారు. ఈవిధంగా చట్టం ప్రకారం ఉద్యోగాల్లో నియమించేందుకు మొదటిసారిగా పోటీపరీక్షలను నిర్వహించడం ప్రారంభించారు.
– బ్రిటిష్ రాజవంశం పేరుపై కంపెనీ పొందిన భారత భూభాగ ప్రాంతాలపై కంపెనీ పాలనకుగల అనుమతిని ఇది పొడిగించింది. అయితే ఇంతకుముందు చట్టాల్లో మాదిరిగా ఏవిధమైన నిర్దిష్ట గడువును సూచించలేదు. అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడైనా తన ఇష్టానుసారం కంపెనీ పాలనను రద్దు చేయగలదని భావించవచ్చు.
– మొదటిసారిగా ఈ చట్టం భారత (కేంద్ర) లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని ఆరుగురు కొత్త శాసనసభ్యుల్లో నలుగురు సభ్యులను మద్రాస్, బాంబే, బెంగాల్, ఆగ్రా ప్రావిన్సుల నుంచి నియమించారు.
– ఈ విధంగా 1853 వరకు బ్రిటిష్ పార్లమెంట్ చేసిన అనేక చట్టాలు కంపెనీని, దేశంలో కంపెనీ పాలనను బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం కిందకు తెచ్చాయి. ఇలా 1853 నాటికి దేశానికి సంబంధించి మూడు అధికార స్థాయిలు వెలిశాయి.
1. కంపెనీ డైరెక్టర్ల సంఘం (కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్)
2. బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే బోర్డ్ ఆఫ్ కంట్రోల్
3. గవర్నర్ జనరల్
– ఈ మూడు అధికార స్థాయిల్లోనూ భారతీయుడనే వాడికి ఏ రూపంలోనూ చోటు లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం జాగ్రత్తపడింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?